Sunday, December 26, 2010

అధిష్ఠానం

2జీ....3జీ లూ....ఇతర కబుర్లూ

ఇన్నాళ్లూ, అందరికీ తెలుస్తున్న విషయమేకదా, మనం ప్రత్యేకంగా వ్రాసేది యేముందిలే అని నేను 2జీ కుంభకోణం మీద టపా వ్రాయలేదు.

మొన్న వెంకయ్యనాయుడన్నాడు 'కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వమూ ఇప్పుడు 3జీ మీద నడుస్తోంది' అని. అదేమైనా కొత్త స్కామా అని అడిగిన పాత్రికేయులకి, '3జీ అంటే....., సోనియా జీ, మన్మోహన్ జీ, రాహుల్ జీ' అని చమత్కరించాడు--రామాయణాన్ని మూడు ముక్కల్లో 'కట్టె, కొట్టె, తెచ్చె ' అని చెప్పినట్టు!.

శీతాకాల సమావేశాలని స్థంభింపచేశాయి విపక్షాలన్నీ--జేపీసీ వెయ్యాల్సిందే అంటూ. ప్రభుత్వం ససేమిరా అంటే, బడ్జెట్ సమావేశాలనికూడా....అని హెచ్చరించాయి. 

సమావేశాలు జరిగే రోజుల్లో, ఎంపీలకి రోజుకి రూ.2,000/- ఇస్తారట--భత్యంగా--అవి జరిగినా, జరగకపోయినా, వాళ్లు వెళ్లినా, వెళ్లకపోయినా! (ఇది వాళ్ల జీతాలకీ, ఇతర 'వుచిత' ఫోన్లూ, కార్లూ, విమాన, మొదటి తరగతి ఏసీ ప్రయాణాలు...ఇంకా చాలా లిస్టు వుంది లెండి....అన్నిటికీ అతిరిక్తంగా.)

సమావేశాలు జరగడంలేదు కాబట్టి, తమ పార్టీ ఎంపీలెవరూ ఆ భత్యాన్ని తీసుకోవద్దు అని ఆర్డరేసిందట--మహా త్యాగమయి--ఇటాలియమ్మ--మహా అయితే, రోజుకి ఓ ఐదు లక్షలో యెంతో మిగిలేను ప్రభుత్వానికి!! (యెంతమంది అది పాటించారో యెవరూ చెప్పలేదు.)

అసలు విషయానికొస్తే, రూ.1,76,000/- కోట్లు అంటే, గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లనీ, నిజంగా జరిగిన ఖర్చు ఓ 80 వేల కోట్లనీ అనుకున్నా, రెండు సంవత్సరాల మన రాష్ట్ర బడ్జెట్ కి సమానం!

ఈ కుంభకోణం జరిగిన విధానంబెట్టిదనిన....అని మొదలెట్టడం అనవసరం....అందరికీ తెలుసు.

ఇప్పుడు జరుగుతున్న చర్చేమిటంటే, జేపీసీ వెయ్యడానికి వాళ్లకేమిటీ అభ్యంతరం? అని. 

మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. మన్మోహన్, తనకి పీయేసీ ముందు హాజరవడానికి అభ్యంతరం లేదు అని ప్రకటించడం, పీయేసీ ఛెయిర్మన్ ఎం ఎం జోషీ 'బ్లాక్ షీప్' గా మారి, లోపాయకారీ అంగీకారానికి వచ్చాడు అనీ.....ఇలా..... (తన రాజకీయాలు తనకి వుండొచ్చుగానీ, పార్టీకీ, దేశానికీ అంత ద్రోహం చేస్తాడు మురళీ మనోహర్....అంటే నమ్మేవాళ్లెవరు?!) 

ఇంకా, ప్రథాని యేమిటీ.....జేపీసి ప్రశ్నించడం యేమిటీ...? అని ఓకటీ!

యేం? ఇతర దేశాల్లో అధ్యక్షులూ, ప్రథానులూ, కమిటీల ముందు నిలబడి, జైలు శిక్షలు అనుభవించగాలేనిది, మన ప్రథాని యెక్కడనించో దిగి వచ్చాడా?

అసలు రహస్యం 4జీ ల వెనక్కాల వుంది. 

ఈ 4జీ లెవరు? 

ఓ ఎంపీకో, రోశయ్య సహా, సీనియర్ నాయకుడికో (మూడు కోతులు--ముగ్గురు మూర్ఖులు--కేకే, వీహెచ్, జీవీ (కాకా)ల సహితంగా) సోనియాతో అపాయింట్మెంట్ కావాలి అంటే, వెంఠనే యేర్పాటు చెయ్యగల అతి కొద్ది మందిలో ఒకడు 'సురారె' అనేవాడు మన రాష్ట్రం లోనే వున్నాడు. 

తన అనుచరులందరూ మొత్తం గుడిని ఆక్రమించుకోగా, స్వయంగా తిరుపతి వెంకన్న గర్భగుడిలోకి అపాయింట్మెంట్ లేకుండా, జొరబడిపోయి, అక్కడి వాళ్లని బయటికి తగిలేసి, తన 'ధ్యానం' పూర్తయ్యేవరకూ యెవరూ లోపలికి రావడాని వీల్లేదని తలుపులు మూసుకొని, భక్త కన్నప్పలో రావుగోపాలరావు లెవెల్లో, స్వామితో యేకాంతంగా మాట్లాడి, సరైన సమాధానం వచ్చాకే బయటికి వచ్చేవాడికి, సోనియా ఓ లెఖ్ఖా?

2004 నించీ ఇలా 'కోట్లతో కొట్టే' వైయెస్, 'ఆదర్శ్' చవాన్, ఆండిముత్తు రాజా, మధు కోడాల్లాంటివాళ్లని ఇబ్బడిముబ్బడిగా పెంచి పోషిస్తూ, వేల కోట్లు దండుకొంటూ, నా చేతులు 'క్లీన్‌గా వున్నాయి' అని మన్మోహన్ని చూపించమంటూ, వెనుక నాటకమాడుతున్న ఇటాలియమ్మ నాటకం బయటపడిపోదూ--జేపీసీ వేస్తే?! అసలే బీహార్లోనూ అక్కడా తల బొప్పికట్టిందాయే!

అదీ అసలు సంగతి!

ఇక, రేపణ్నుంచీ మన తెలంగాణా ఎంపీలందరూ 'ఆమరణ' నిరాహర దీక్షలు చెయ్యాలనుకుంటున్నారట. దీన్ని కాస్త విస్తరించి, "యూపీయే" ఎంపీలందరూ 'జేపీసీ వెయ్యడానికి వీల్లేదు' అని ఆమరణాలు చేసి, ఢిల్లీలో పీవీ నరసింహారావుకి మొదట్లో యెన్నెకరాలు కేటాయించాలనుకున్నారో (అసలు ఢిల్లీ పేరే 'శ్మశానాల నగరం') అన్నిటిల్లోనూ సామూహిక అంత్యక్రియలు జరిపించుకుంటే, దేశానికి దరిద్రం వదిలిపోను!

జగన్ ఓ పదిహేనుకోట్లో యెంతో ఖర్చుపెట్టి, రీసెర్చిలు చేయిస్తున్నాడట--సీ ఎం కావడానికి. దీన్నే అంటారు....స్వర్గానికెగరగలిగుండీ, వుట్టితో సరిపెట్టుకోవడం అని. 

కాబట్టి, నా మాట విని, హస్తినాపురి దారిబట్టి, మీ నాన్న మేట్లయిన కేవీపీ, సురారె, లరాగో లవాంటివాళ్ల ఇంటర్వ్యూ సంపాదించి, మన 'ఇటలీ దరిద్రాన్ని' వదిలించమని ప్రార్థించవయ్యా! అని సలహాకృతుడవుతున్నాడు!.

ఇవాళ మన రాష్ట్రం లోని ప్రతీవాడు అంటున్నాడు, "ఇవాళేమి చూశావు....డిసెంబరు 31 నాడు చూడాలి నా......." అని. 

నా 'శృంగార...' లోని 'ఓ పొడవు జోకు' కీ, వీళ్ల మాటలకీ యేమైనా తేడా వుందా?

ఆలోచించండి!

Wednesday, December 22, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ.....

(ఈ మధ్య నా వుద్యోగానికి రాజీనామా సమర్పించాక, బ్యాంకుకీ నాకూ మధ్య వ్యవహారాలు తీర్మానం అయి, నా పింఛను తో సహా అన్నీ చక్కబడడం ఇప్పటికి పూర్తయింది. ఇంకా చిన్నచిన్నవి కాలక్రమం లో పూర్తవుతాయి. ఈ సమయం లో నేను క్రమానుగతంగా నా "....కబుర్లు" వ్రాయలేకపోయాను. 

వాడెవడో "అసలు జీవితం రిటైర్ అయ్యాకే/60 యేళ్ల తరవాతే మొదలవుతుంది" అన్నట్టు, ఇన్నాళ్లూ స్కూటరుమీద వెళ్లి, వెన్ను వంగేలా, మెడనరాలు పట్టేసేలా ఓ కుర్చీలో కూర్చొని, మళ్లీ రాత్రికి స్కూటరుమీదే ఇంటికి వచ్చి, తిన్నాననిపించుకొని, ప్రక్కమీద వాలుతూ, షెడ్డులో వున్నకారుని యే వారానికొక్కసారో, లేకపోతే వరసగా రెండురోజులు సెలవలు వచ్చేలా చేసుకొని, దూరప్రయాణాలు చేసేటప్పుడో బయటికి తీస్తూ గడిపిన నాకు, ఇప్పుడు కావలసినంత స్వేచ్చ! లేడికి లేచిందే పరుగు అన్నట్టు, యెప్పుడు యేసమయంలో యెక్కడికి వెళ్ళాలన్నా, స్కూటర్ మీద జాలీగానో, వర్షమూ గట్రా వస్తే కారులోనో, ఒంటరిగానో, జంటగానో అక్కడవాలిపోయి, మళ్లీ తిరిగి రావడం.....ఓహ్! భలే బాగుంది. ఇంకా సౌకర్యం కోసం నా పాతకారు ఇచ్చేసి, సరికొత్తది.....ఇంకా విశాలంగా, అనేక 'ఇంప్రూవ్ మెంట్ల'తోటీ....కొనుక్కోవడం, దానికి అవసరమైన హంగులు అమర్చుకోవడం, తదుపరి జీవితం కోసం ప్రణాళికలు వేసుకోవడం....ఇలాంటివాటితో "చా....లా" బిజీగా గడుస్తోంది. ఇదిగో.....ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తున్నాను.)

ఇవాళ్టి తాజా వార్త.....ఢిల్లీలో పేలిన....వుల్లిపాయ బాంబు!....అదీ, ప్రథానిగారి కుర్చీ క్రింద! దెబ్బతో ఆయన, "తన" ప్రభుత్వాన్ని, 'వుల్లిపాయల ధర తగ్గించండొరే! కనీసం ఇంక పెరగకుండా చూడండి ' అని ఆర్డరేశారట!

మరో "మూడు"వారాల్లో--అవే "తగ్గుతాయి" అని శరద్ పవారూ, "ఈ పెరుగుదల దురదృష్టకరం....ప్రభుత్వ శాఖలతో చర్చిస్తా.....నియంత్రించే విషయం 'పైవాడి ' చేతుల్లోనే వుంది.....మన ప్రయత్నం మనం చేద్దాం....!" అని ప్రణబ్ ముఖర్జీ, అన్నారట.

1977 లో వుల్లిపాయలు కిలో ఒక రూపాయి నించి అమాంతం 2 రూపాయలకి పెరిగిపోతే, ఇందిరాగాంధీని మట్టి కరిపించాడు "ఆమ్ అద్మీ!" ఇప్పటికి మళ్లీ, వుల్లి ధర రెట్టింపయింది కాబట్టి, తమ '....ల క్రిందకి ' నీళ్లు రాకుండా చూసుకోవాలని కాంగీలకి ఙ్ఞానోదయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది!

వోటర్లూ....రాబోయే......ల్లో యేం చేస్తారు? ఇప్పుడే తేల్చుకోండి మరి....ఇంకెంతో సమయం లేదు!

Saturday, December 11, 2010

....కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ!

ఏటీయెం లో 1500/- డ్రా చెయ్యడానికి వెళితే, డబ్బురాకుండానే, యెకవుంట్లో ఖర్చు వ్రాయబడిందట ఒకాయనకి ఆంధ్రా బ్యాంకు ఖాతాలో. ఆయన లబో దిబో మన్నా, జవాబు రాలేదట.

చివరికి బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ ఆ 1500 తోపాటు, రోజుకి 100 చొప్పున పరిహారం కూడా చెల్లించమని ఆదేశిస్తే, సంఘటన జరిగిన 322 రోజుల తరవాత, అలాగే 32,200 కూడా 'పువ్వుల్లో పెట్టి' ఖాతాలో జమ చేశారట!

దీనికి "సహకరించిన" వినియోగదారుల సంఘం జిల్లా వుపాధ్యక్షుడుకీ, బ్యాంకు వున్నతాధికారులకీ (తోక కోసి సున్నం పెట్టి?!) కృతఙ్ఞతలు చెప్పారట సదరు బాధితుడు!

భళా వి సం లూ & ఆంబుడ్స్ మన్!

ఇదొక "అదనపు" సంపాదనా మార్గమా!? వచ్చే రెండేళ్లపాటు "రిలయన్స్" సంస్థ మానవ వనరుల అవసరాలకోసం, రామ చంద్రా ఇంజనీరింగ్ కళాశాల (ఏలూరు) క్యాంపస్ లోనే, వారి విద్యార్థులనే ఇంటర్వ్యూ చేసి, నియమించుకొంటామని ఆ రెండు సంస్థల మధ్యా "అవగాహనా ఒప్పందం" జరిగిందట! 

బాగుంది కదూ? సీట్లమ్ముకొని సంపాదిస్తున్న సంస్థలకి ఇంకా యెంత వెసులుబాటు!

సింపుల్! ఎం పీ 3 లేదు; అప్లికేషన్లు లేవు; ఇంటర్నెట్ సంగతి తెలీదు; కనీసం సంక్షిప్త సందేశాలు పంపుకొనే వెసులుబాటు కూడా లేదు! కేవలం ఫోన్లు చేసుకోడానికీ, వస్తే వినడానికి మాత్రమే వుపయోగించే సెల్ ఫోన్ తయారు చేసిందటో కంపెనీ! బ్రిటన్ కు చెందిన ఆ సంస్థ పేరు 'జాన్స్ ఫోన్' ట! (సరిగ్గా, అబ్దుల్ కలాం లెవెల్లో నేను కలలు కన్నది అలాంటి ఫోన్ కోసమే! కానీ నేను వాడుతున్న దాంట్లో ఎసెమ్మెస్ వుండి, "8946 రూపాయల వాచీని కేవలం 894 చెల్లించి సొంతం చేసుకోండి" లాంటి సందేశాలతో ఛస్తున్నాను--డిలీట్ చెయ్యలేక!)

ఇలాంటి ఫోన్లు యే 100 రూపాయలకొకటో అమ్మేస్తే, 1929 నాటి ఆర్థిక సంక్షోభం మళ్లీ వచ్చి, "అంగళ్ల సెల్ ఫోన్లు అమ్ముకున్నారిచట" అని పాడుకొనే అవకాశం నోకియా, శామ్‌సంగ్ వగైరాలకొస్తుందేమో! (నాకు భలే సంతోషం!)

అరుణ్ దుగ్గల్ అనే ఆయన 18-11-2010 న ఈనాడు దినపత్రిక యెనిమిదో పేజీలో "అర్థిక సంఘటితం" మీద ఓ వ్యాసం వ్రాశాడు. చదవండి. దానిపై నేను వీలువెంబడి ఓ టపా వ్రాస్తాను. అదీ చదవండి.

"వ్యతిరేక వాది" మణిశంకర్ అయ్యర్ తనను తాను "పిలూ మోడీ" కంటే అధికుడిననుకుంటాడు.....కానీ.....ఆయనకి వస్తున్న "సమాచారం" దేశం లోని అత్యధిక వున్నతాధికారులైన "తమిళ" బుర్రోవాదులనించే అని అందరికీ తెలుసు!

ఈ మధ్య ఆయన భారత్ యెప్పటికీ ఓ ప్రపంచ శక్తి గా యెదగలేదు--అది ఓ భ్రమ--కల్పిస్తున్నవాడు ఒబామా! అని ఓ చిన్నసైజు టపాకాయ పేల్చాడు! (ఆయన కవి హృదయం--ఈ కాంగీల పాలనలో అని అయి వుండవచ్చు!)

నేను చెపుతున్నాను--సరైన దీశానిర్దేశం వుంటే, 2020 కల్లా మనదేశం చీనాను కూడా (అమెరికా జపాన్లతోసహా) అధిగమించగలదు! యెదురులేని మిలిటరీ శక్తిగాకూడా! (అబ్దుల్ కలాం పంథాలోనో, ప్రతిభా పాటిల్ పంథాలోనో కాదండోయ్! నెపోలియన్ పంథాలో!)

యేమంటారు?

తృటిలో తప్పిన......లు

06-12-2010 న, విశాఖపట్నం నుంచి సికిందరాబాదు వెళ్లే జన్మభూమి (2805) కి చాగల్లు వచ్చేసరికి ఫైబర్ బ్రేక్ స్థంభించడంతో, స్టేషన్లో సుమారు 8 నిమిషాలు నిలిపేసి.......(అట!)

డ్రైవర్ అప్రమత్తంతో, పెను ప్రమాదం తప్పిందని స్టేషన్ సిబ్బంది చెప్పారట!
(లేకపోతే.....అని వారు చెప్పఖ్ఖర్లేదుగా?)

Tuesday, December 7, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ!

ఇప్పటివరకూ మన ముక్కు--సారీ, ముఖ్యమంత్రి యేమేమి నిర్ణయాలు తీసుకున్నాడో గానీ, ఒకటిమాత్రం నాకు బాగా నచ్చేసింది. తనకి దండలూ, బొకేలూ, శాలువాలూ ఇవ్వడం మానేసి, అందుకు అయ్యే ఖర్చుని 'ముఖ్యమంత్రి సహాయనిధి' కి చెక్కుల రూపం లో ఇమ్మన్నాడట.

మొన్న ప్రభుత్వోద్యోగులు ఓ పాతికవేల చెక్కునిచ్చారట. ఒకాయన వినకుండా శాలువా కప్పబోతే, సున్నితంగా తిరస్కరించారట. బాగుంది కదూ!

మరి మొన్న 04-12-2010 నాడు, ఏపీజెన్‌కో వారు ఓ 25 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధికి యిచ్చారట! యే ఖాతాలోంచి, యెందుకు, యిప్పుడే యిచ్చారో యెవరికైనా తెలుసా?

అన్నట్టు, యోగా గురు బాబా రాందేవ్ ఓ రెండేళ్లలో ఓ కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ప్రకటించాడు. అంటే......యెంత, యెలా సంపాదించాడో సంబంధితులు ఓ లుక్కేస్తే యెలా వుంటుందంటారు? అయినా మనకెందుకులెండి రాజకీయాలు.

మొన్న 03-10-2010 న భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కుమారుడి వివాహ రిసెప్షన్ యెంత వైభవంగా జరిగిందంటే, రాజకీయ, సినీరంగ ప్రముఖులు వేసుకొచ్చిన "ప్రత్యేక విమానాలతో" ఆరోజు రాత్రి నుంచి మరునాడు మధ్యాహ్నం వరకూ, గగనతలంలో ట్రాఫిక్ జామ్ ఐపోయి, సాధారణ విమానాలూ, ప్రయాణీకులూ ఇబ్బందులు పడ్డారట--ఆలస్యాలు అయిపోయి!

ఇక 04-10-2010 న సాయంత్రం యేర్పాటు చేసిన 'సాధారణ విందు' కు 2 లక్షల మందికి మాత్రమే యేర్పాట్లు చేశారట!

వాళ్ల పార్టీ మీటింగుని ఖరీదైన డేరాల్లో, పెద్దవాళ్లకి పెద్దవీ, చిన్నవాళ్లకి చిన్నవీ, ఏసీలతోనూ, లేకుండాను--ఇలా నిర్వహించి, ఇండీపాప్ సింగర్లా పాటలు పాడుతూ గెంతుతుంటే యేమిటో అనుకున్నాను! నిజంగా అసాధ్యుడే!

ఇక మొన్న 04-12-2010 న దుబాయి నుంచి పుణె వస్తున్న ఎయిరిండియా విమానం గాల్లో ఒక్కసారిగా 7 వేల అడుగుల మేర క్రిదకు పడిపోయిందట!

కారణం యేమిటనుకున్నారు? పైలెట్ స్నానాలగది లోకి వెళ్లినప్పుడు, కో-పైలెట్ 'తన సీటును ముందుకు జరిపే ప్రయత్నంలో' చెయ్యి ఓ మీటకి తగిలి, విమానం 26 డిగ్రీల కోణం లో వంగి క్రిందకి పడిపోతుంటే, పైలెట్ కాక్ పిట్లోకి వచ్చి దాన్ని నియంత్రించాడట!

ఇది అధికారికంగా డి జీ సీ యే చెప్పిన మాటే! ఆవిమానం లో 113 మంది ప్రయాణీకులు వున్నారట.

మరి ఆ కో-పైలెట్ కి ఇంతకు ముందు ఓ గాడిదనైనా నడిపిన అనుభవం వుందో లేదో! విమానంలో ముఖ్యమైన 'కంట్రోల్స్' అలా యేడుస్తున్నాయేమో!  

Thursday, December 2, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ....

"అజీమ్ ప్రేమ్‌జీ".....భారతరత్న ఇవ్వదగ్గ ఇంకో 'కర్ణుడు'!

"నా పిల్లలు రోడ్డున పడవలసిన అవసరం రాకుండా మాత్రమే వాళ్లకిస్తాను" అంటూ తన ఆస్థి లో 99% దానం చేసిన వారెన్ బఫెట్ మాటలని ఇంకోరకం గా చెపుతూ......

 "(నా)పిల్లలకు నా ఆస్థుల్లో చాలా కొద్దిభాగమే ఇచ్చినా.....తిని అరిగించుకొనేందుకు అది వారికి తరతరాలకు జన్మజన్మలకు సరిపోతుంది. అందుకే నా ఆస్థుల్లో అధిక మొత్తాన్ని దాతృత్వానికి, సమాజ సంక్షేమానికి ఇవ్వాలనుకుంటున్నా!" అంటూ రూ.8,846 కోట్లు వితరణ చేశాడు--అదీ--విద్య నిమిత్తం!

మహాత్ముడి సూచనని అక్షరాలా పాటిస్తున్న గాంధేయుడిగా చెప్పుకోవాలి ఈయనని.

తన 'నటనకి' కొన్ని కోట్లూ, తన కొడుకూ, కోడలూ తమ తమ 'నటనలకి' కొన్ని కోట్లూ సంపాదించుకుంటున్న ఓ పెద్దాయనకి ఈ మాటలు వినిపిస్తున్నాయో లేదో?

(అయినా అది వారి స్వవిషయం అనుకోండి....!)

చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకుంటున్న ఓ ఇటాలియమ్మ ప్రాపకం తో, తానెప్పుడో ఉత్తర ప్రదేశ్ లో కొన్న భూమి ద్వారా 'రైతు' అని ముద్ర వేయించుకొని, ఒక రాష్ట్రం లో రైతు అని ముద్ర పడితే, దేశావ్యాప్తం గా ఇంకే రాష్ట్రం లోనైనా రైతే అవుతాడు అనే నిబంధన లొసుగుని వుపయోగించుకొని, మహారాష్ట్ర లో కొన్న కొన్ని యెకరాలలో వ్యవసాయం కోసం ట్రాక్టరు దున్నుతున్నట్టు పేపర్లలో ఫోటోలు వేయించుకొని, నేను రైతునే సుమా అని స్వడబ్బా కొట్టుకొంటున్నాడీయన!

ప్రథాని లా ఆయన కూడా "ఆదరణీయుడే" మరి!

యేమంటారు?


ఇక, అజ్మల్ కసబ్ అనేవాడు "సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో పాకిస్తాన్ నుంచి ఢిల్లీవచ్చి.....కేవలం 'హిందీ సినిమాలు చూడడానికి మాత్రమే' ముంబాయికి వస్తే, వుగ్రవాదులతో సముద్రం మీద పడవలో వచ్చాడని తప్పుడు కేసు పెట్టారు" అనీ, వాడు "వుగ్రవాదులతో పడవలో వచ్చాడు అనడానికి ఆథారాలు లేవు" అనీ, వాడి తరఫు వాదిస్తున్నారట న్యాయవాదులు అమిన్ సోల్కార్, ఫర్హానా షా అనేవాళ్లు!

నేనిదివరకే చెప్పినట్టు, వాడికి నేచెప్పిన శిక్ష విధించి, వాడి మద్దతుదారులకి కూడా ఆ ప్రక్కనే అలాంటి శిక్షే వేస్తేగానీ ఇలాంటి దేశ ద్రోహులకి బుధ్ధి రాదంటాను.

అవునా?

Wednesday, December 1, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ.....

పాపం--మన వయసుమీరిన (ఆ సంగతి ఇప్పుడే తెలుసుకొని) చవటగుండు ముఖ్యమంత్రిని సుతిమెత్తగా తొలగించి, "ముక్కు మంత్రి"ని ఆ స్థానం లో కూచోబెట్టింది అధిష్టానం.

(ఈయన ముక్కే ప్రముఖంగా కనబడుతుండటం తో, కార్టూన్లో అలాగే చిత్రిస్తున్నారు మరి! 26-11-2010 నాటి 'ఇదీ సంగతి ' లోనూ, మొదటిపేజీ టాప్ లోనూ వేసిన శ్రీధర్ చక్కటి కార్టూనులు చూడండి.)

దాని ప్రభావం మన లక్షలకోట్ల యువనేతమీద భారంగా పడి, యేకంగా పార్లమెంటుకీ, పార్టీకీ రాం రాం చెప్పి, తల్లితోకూడా చెప్పించాడు. 

అదిగో--ఇప్పుడే మంత్రివర్గం యేర్పడడం, అసమ్మతిగళాలు విచ్చుకోవడం--కాంగీ సంస్కృతి ప్రతిబింబించబడడం--మమూలే!

"బిఫోర్ దేరీజ్ క్రొకోడైల్ ఫెస్టివల్!" అన్న శంకర్ దాదా, అవసరమైతే మంత్రివర్గం లో ప్రవేశిస్తామన్నాడు--నాలుగో యెన్నో పోస్టులు రిజర్వు చేశారని చెప్పుకొంటున్నారు!

ఇక ఇతర విషయాలకొస్తే, ప్రపంచ దేశాలన్నిటి గురించీ అమెరికా చేసిన రహస్య ఆలోచనలని, ఆ ప్రభుత్వం బతిమాలినా వినకుండా, 2 లక్షల 50 వేలకి పైగా రహస్య పత్రాలని బయటపెట్టింది 'వికీలీక్స్ ' మన అఙ్ఞాతలు వాళ్లని ఆదర్శంగా తీసుకొని, ప్రపంచానికి పనికొచ్చే రహస్యాలని బయట పెడితే బాగుంటుంది. 

ఈ సందర్భం లో, 'జనసంఘం ' (ఇప్పటి బీజేపీ పూర్వ రూపం) నాయకుడు 'పిలూ మోడీ' అని వుండేవాడు. 1972 ప్రత్యేక ఆంధ్రోద్యమం లో ఆయన మా వూరు వచ్చినప్పుడు ఆయన పరిచయ భాగ్యం లభించింది. చెట్టంత మనిషి, తగ్గ లావుతో, తెల్ల భల్లూకం (ధృవపు యెలుగుబంటి) అనేవాళ్లం సరదాగా. వుధృతంగా వుద్యమంలో పాల్గొంటున్న మా నిరుద్యోగుల సంఘాన్ని "ఆంధ్ర రాష్ట్రం వస్తే, మీ సంఘాలు రద్దయి పోతాయి" అని దీవించాడు. 

దేశం లో యెక్కడ యేమి జరిగినా, క్షణాల్లో ఆయనకి సమాచారం చేరేది--వెంటనే ఓ బాంబు పేల్చినట్టు దాన్ని ప్రకటించి, ఇందిరాగాంధీని పరుగులు పెట్టించేవాడు! అలాంటి నెట్ వర్క్ ఆయనది! అలాంటి నాయకుల అవసరం యెంతైనా వుందిప్పుడు.

మిగిలినవన్నీ మరోసారి.

Monday, October 25, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

చూశారా మన డీజీపీ యెంత గొప్ప డిఫెక్టివో--సారీ--డిటెక్టివో?

తూ ర క (తూటా రక్షణ కవచాలు) లని ప్రైవేటు గా అమ్ముకొనే ఆలోచన తోనే 'యెవరో' తరలించారు అని కనిపెట్టేశారు.

మనలాంటి వెర్రివాళ్లు ఇన్నాళ్లూ అవేవో "గొరక "ల్లాంటి చేపలేమో, కూరొండుకు తినేద్దామని యెవరో తరలించారేమో అనుకుంటున్నాము!

ఇప్పుడు వాటిని యెక్కడికి తరలించారో ఆ భవనం చిరునామా డోరు నెంబరు తో సహా కనిపెట్టేసి, అవి తరలించిన ఆటో డ్రైవరునీ, వాచ్ మన్ నీ అరెస్ట్ కూడా చేశారట.

ఇంకెవరినో సస్పెండు కూడా చేశారట. మరి అవి యెవరికి అమ్మడానికి తరలించారో అని 'విచారిస్తూనే' వుంటార్లెండి--మనకి చెప్పరు.

ట్వీటర్లూ--ఇదేదో బావుందని అస్తమానూ, కీబోర్డు చేతిలో వుందికదా అని, బోరవిరుచుకుని "ట్వీట్"లు వ్రాస్తే........?

ఒకాయన ఓ రాత్రి తన కారు స్వయంగా నడుపుకుంటూ వెళుతుంటే, ఘోర ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జయిపోయింది. తేరుకొని, దెబ్బలూ గట్రాల సంగతి చూసుకొని, ఆనక బీమా కంపెనీకి సమాచారమిచ్చాడట. పోలీసుల దగ్గరనించి ఎఫ్ ఐ ఆర్ వచ్చాక, కంపెనీకి క్లెయిమ్ పంపించాడట, పరిహారం కోరుతూ.

3 రోజులు తిరక్కుండా, క్లెయిముని తిరస్కరించారట. కారణమేమిటీ అనడిగితే, "మద్యం మత్తులో కారు డ్రైవు చేశావు" అన్నారట. ఇదేమిటీ.....పోలీసు నివేదికల్లోగానీ, క్లెయిం దరఖాస్తులోగాని దీని ప్రస్తావన లేదే....అని ఆశ్చర్యపడి, లేచి, "మీకీ సమాచారం యెక్కడిది?" అంటూ నిలదీశాడట బీమా కంపెనీని.

వాళ్లు.....ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఆయన ట్విట్టర్ లో "పార్టీ బాగా జరిగింది. చాలా మత్తుగా వుంది. కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్తున్నాను" అని వ్రాసిన "కొక్కిరింత" ఆయన ముఖాన కొట్టారట!

ఓ 75 వేలకి కాళ్లొచ్చాయట!

నిర్లక్ష్యంగా మోటారు సైకిల్ నడుపుతూ, ఇద్దరిని ఢీకొట్టినందుకు, సెలెబ్రిటీ జాన్ అబ్రహాం కి 15 రోజుల సాధారణ జైలూ, 1500 జరిమానా విధించారట! బెయిలు మీద విడుదలయ్యాడుటలెండి.

12-10-10 : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, బిజాపూర్ జిల్లా పామేడు లో మార్కెట్ నుంచి తిరిగివస్తున్న కానిస్టేబుళ్లమీద పొంచివున్న మావిస్టులు కాల్పులు జరిపి, ఒకడు అక్కడే మరణించగా, రెండో అతన్ని వెంబడించి, కాల్చి, గొడ్డలితో నరికి చంపేశారట. ఇది పోలీసు స్టేషన్ సమీపం లోనేట. ఇందులో 15 మంది మావిస్టులు పాల్గొన్నారట.

14-10-2010 న పాకిస్థాన్ లో వుత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో 11 మంది తాలిబాన్లు హతమయ్యారట.  

Friday, October 22, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ


మొన్నెప్పుడో తమిళనాడులో దొంగలబడి గురించి విన్నాం.

ఇప్పుడు "వుగ్రవాదులకి" అల్ ఖైదా "ఆన్ లైన్" లో పాఠాలు మొదలెట్టిందట. 74 పేజీల "ఇన్స్ పైర్" అనే ఇంగ్లీష్ పత్రికని నిర్వహిస్తోందట. దీనికి ముందుమాట--ఇంకెవరు--ఒసామా బిన్ లాడెన్ వ్రాస్తూ, "అమెరికన్లనీ, పాశ్చాత్యులనీ చంపడానికి 'వ్యక్తిగత జిహాద్ ' చేపట్టాలి" అని పిలుపునిచ్చాడట!

"అల్టిమేట్ మౌవింగ్ మెషీన్" పేరుతో చిట్కాలు బోధిస్తున్నారట. ట్రక్కులతో విధ్వంసం యెలా? మొదలైన పాఠాలు నేర్పుతున్నారట. వీటికన్నా, భోజనవేళ, రద్దీగా వున్న రెస్టారెంట్లలో జొరబడి, తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరపడం వుత్తమమైనది అని కూడా చెపుతున్నారట!

ఇలాంటి రాక్షసులకి ఇంకా ఈ భూమిమీద నూకలు యెన్నాళ్లు వున్నాయో కదా!

==> హైదరాబాదు ఔటర్ రింగురోడ్డుకి సంబంధించిన కార్యాలయంలోని భూసేకరణకి సంబంధించిన దస్త్ రాలు మాత్రమే ఓ అగ్ని ప్రమాదం లో "దగ్ధమయ్యాయట!"

వింతేమితంటే, పది ఇనుప బీరువాలు దస్త్ రాలతోసహా మసైపోతే, ప్రక్కనే చెక్కబల్లలపై వున్న దస్త్ రాలు భద్రంగా వున్నాయట. ఇంకా, కోర్టులలో కేసులు నడుస్తున్న భూముల గురించిన దస్త్రాలు మాత్రమే కాలిపోయాయట. 

కార్యాలయం లో యేడు విభాగాలు ఒకే హాలులో వుండి, అన్నింటికీ విద్యుత్ ఒకే బోర్డులోంచి వెళుతున్నా, ఒక ప్రాంతానికే మంటలు పరిమితమయ్యాయట. బోర్డులోని ఎం సీ బీ లు "ట్రిప్" అయి వున్నాయట!

వాటిలో చాలామటుకు "పని అయిపోయినవే" అనీ, ఇంకా పని కావలసినవి ఓ నలభై, యాభై వుండచ్చనీ, వాటిని పునర్నిర్మించడం, కలెక్టరేట్లలో వుండే కాపీల ఆధారం గా పునరుధ్ధరించడం తేలికే అని వుప కలెక్టరు సెలవిచ్చారట!

==>ఆ మధ్య తూ గో జి పర్యటనలో చంద్రబాబు వంతాడ గ్రామం లోని లీజుల వ్యవహారం గురించి వెళితే, అక్కడకి ముందే సాక్షి టీ వీ వ్యాన్ వెళ్లి, కొంతమందిని రెచ్చగొట్టి, పంపించడం, "వాళ్లలో" అని చెప్పి, లక్ష్మి అనే గిరిజన మహిళమీద ఆయన చేయి చేసుకున్నాడనీ, దౌర్జన్యం చేశాడనీ, ఓ చిన్న విజువల్ ని పదే పదే చూపించి గోల చేసింది.

దాంతో కాంగీ లు, ఛీఫ్ విప్ శైలజానాధ్ లాంటివాళ్లూ "ఆయన మానసిక వ్యాధితో వున్నాడు" అనేంతవరకూ వెళ్లారు. 

మరి తరవాత ఆ మహిళే జరిగింది చెప్పి, ప్రెస్ కౌన్సిల్ లో కూడా సాక్షి మీద ఫిర్యాదు చేసింది!

మరి మానసిక వ్యాధి గ్రస్తులెవరో?

==> తూ గో జి, కాట్రేని కోన లో, సాకా పాపారావు అనే వ్యక్తి, గల్ఫ్ లో పెద్ద వుద్యోగాలిప్పిస్తానని, నిరుద్యోగుల నించి 6.5 లక్షలు నొక్కేశాడట. అతన్నించి 37 మంది పాస్పోర్టులు స్వాధీనం చేసుకొని, పోలీసులు కోర్టులో హాజరుపరిచారట.

Tuesday, October 19, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

వుత్తమ చిత్రం గా నంది అవార్డు తెచ్చుకున్న "సొంత ఊరు", వుత్తమ నటి తీర్థ, వుత్తమ సహయనటుడూ వుత్తమ మాటల రచయితా ఎల్ బీ శ్రీరాం--చదువుతుంటే ఈ సినిమా యెప్పుడు చూస్తానో అనిపించింది. తీర్థ కొత్త అమ్మాయి, ఎల్ బీ శ్రీరాం పాతవాడే అయినా, గెటప్ బాగుంది--పాత్రే కనబడేలా--వుచ్చారణా పధ్ధతి మార్చాడో లేదో. ప్రక్కనే తనికెళ్ల భరణిని చూస్తే మాత్రం, ఇలాంటి గుర్తు పట్టే ముఖాలని ఇలాంటి చిత్రాల్లో కూడా యెందుకు నటింపచేస్తున్నారో? అనిపించింది. అందరూ కొత్తవారితో తీస్తేనే ఇలాంటి చిత్రాలు బాగుంటాయి. తగిన నటులు దొరక్కపోరు....డబ్బులు యెలాగూ రావు అని ముందే తెలుసుగా? అదృష్టం కొద్దీ వస్తే ఇంకా మంచిది కదా?

దేశం లోని యేడు మెట్రో నగరాల్లో ఫ్లాట్ల అమ్మకాల్లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలం లో 40% క్షీణత కలిగినట్టు ఆసోచాం సర్వే నివేదిక చెప్పిందట. దీనిక్కారణం వుక్కూ, సిమెంటూ వగైరాల పెరుగుదల వల్ల రెండు పడకగదుల ఫ్లాట్లు 30 నించి 45 లక్షల 'మేర' పెరగడమేనట.

వీళ్లు బయటపెట్టిన ఇంకో రహస్యం యేమిటంటే, స్పెక్యులేటర్లు భవిష్యత్ లాభార్జన వుద్దేశ్యం తో ముందస్తుగా వీటిని కొనేసి (బ్యాంకు అప్పులతోనేకదా!), కృత్రిమ కొరతలు సృష్టించి, రేట్లు పెంచి అమ్ముకుంటున్నారట!

స్థిరాస్థి రంగం లో అదే కాలం లో పెట్టుబడులు 37% పెరిగాయట. బ్యాంకులు 'టీజర్ రేట్లు ' కొనసాగించడం తో విక్రయాలు జోరందుకోవచ్చని ఆశాభావం వ్యక్త పరచిందట ఆ నివేదిక!

రాష్ట్రం లో 450 కోట్ల ఆథార్ వ్యవహారం లో "కుక్కతోక" ప్రజా పంపిణీ విభాగం లో ఓ పౌర సరఫరా అధికారి ఇష్టా రాజ్యం నడుస్తోందనీ, అప్పుడే కళ్లు బైర్లు కమ్మే అవినీతి జాడలు బయటపడుతున్నాయి అనీ వార్తలొచ్చాయి.

1993 ముంబాయి బాంబు ప్రేలుళ్ల కేసులో నిందితుడు ఇమ్రాన్ అనబడే సయ్యద్ ముసద్దీన్ ఖాద్రీ "యేడేళ్ల క్రితమే తాను హత్యచెయ్యబడ్డాను" అని పోలీసులని నమ్మిoచి, 2003 నించీ హైదరాబాదులోనే మకాం చేసి అనేక రకాల అత్తరు వ్యాపారాలు చేస్తున్నాడట! మళ్లీ ముంబాయి వుగ్రవాద నిరోధక దళం పోలీసులు వచ్చి సోదాలు చేసి, పట్టుకుంటే గానీ దొరకలేదుట! మన నిఘా వ్యవస్త యెంత బాగుందో!

తృటిలో తప్పిన......లు (రైళ్లు) :

13-10-2010 న కొచ్చి వ్యాలీ నుంచి హైదరాబాదు వెళ్తున్న 'శబరి' ఎక్స్ ప్రెస్ గుంటూరు జిల్లా బాపట్ల స్టేషను కి కిలో మీటరు ముందు "రెడ్" సిగ్నలు వేసివున్నప్పటికీ, డ్రైవర్లు పట్టించుకోకుండా బండిని స్టేషన్లోకి విజయవంతంగా తీసుకొచ్చేశారట! ఈ డ్రైవర్లని అక్కడ దింపేసి, తెనాలినుంచి వేరే డ్రైవర్లని రప్పించి, యెప్పుడో తీరికగా బండిని పంపించారట. ఈ డ్రైవర్లకి వైద్యపరీక్షలు నిర్వహింపచేసి, మద్యం మత్తులో వున్నారని తెలుసుకొని, సస్పెండు చేసి, అనంతరం "విచారిస్తున్నారు"ట.

18-10-2010 న విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ సూపార్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఏ సీ బోగీ క్రింద మంటలు వ్యాపిస్తే, తాడేపల్లిగూడెం లో 3 గంటలపాటు ఆపేసి, ఈ బోగీకి ప్రక్కనే వున్న సాధారణ బోగీలోంచి జనాలు దూకేసి, తొక్కిసలాడి, ఒకరు స్వల్పంగా గాయపడి, రైలు ఆగడం తో మంటలు ఆరిపోగా, యాక్సిల్ బాక్స్ పూర్తిగా కాలిపోయి, యేదో తంటాలు పడి, మళ్లీ ఆ.........లస్యంగా రైలుని పంపించారట. 

Friday, October 15, 2010

కబుర్లు

అవీ, ఇవీ.........!


కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. మనవాళ్లు పతకాలు శతకం దాటించి, రెండో స్థానం లోకి రావడం అత్యంత ముదావహం!

సమాప్తి వుత్సవాలు కూడా చాలా బాగున్నాయి. కానీ నాకు 2010 మంది పిల్లల చేత విన్యాసాలు చేయించి, వాళ్ల నెత్తిమీదనించి రంగులు గుమ్మరించి, మధ్యలో అశోక చక్రాన్ని వుంచి, దాని చుట్టూ "అక్కడక్కడా" కాషాయ, ఆకుపచ్చ రంగులని చల్లించడం--నచ్చలేదు.

వీటిని ఇంత విజయవంతం చెయ్యడానికి శ్రమించిన వారందరికీ "హ్యాట్స్ ఆఫ్!"

1986 లో, ఓ పోర్టబుల్ బ్లాక్ & వైట్ టీవీ కొనుక్కున్న తరవాత, ఒలింపిక్సేననుకుంటా--బ్యాంకుకి సెలవుపెట్టి మరీ చూశాను. మళ్లీ ఇన్నేళ్ల తరవాత (వుద్యోగం వదిలెయ్యడం వల్ల) అప్పట్లో లేని కొత్త కొత్త క్రీడలతోసహా చాలా వాటిని చూడగలిగాను. 

1982 లో రంగులతో ఆవిర్భవించిన మన దూరదర్శన్, అప్పటి నించీ పరిణతి చెందుతూ, ఇప్పుడు చక్కగా క్రీడలని 
చూపించగలగడం కూడా--చెప్పుకోతగ్గది. వారికి కూడా నా జోహార్లు! 

జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (JNNURM) క్రింద గుజరాత్ కి 7,998 కోట్లు ఇస్తే, ఆ రాష్త్రం కేంద్రప్రభుత్వం (అంటే.....తన) పేరు తలుచుకోడం గానీ, కనీసం ఆ పథకం గుర్తునైనా కనపడనివ్వడం లేదు అని భోరుమన్నాడట--ఓ యెలక్షను మీటింగులో మన జైపాల్ రెడ్డి!

అంటే--కృతఙ్ఞతా పూర్వకం గా యే రాష్ ట్రమైనా, 'కాంగ్రెస్ ని గెలిపించండి ' అని చెప్పాలా? అలా చెపుతారని ఆశించే నిధులిస్తోందా కేంద్రం? యేమో!

ఈ సంగతి విన్నారా

మన కలకత్తా హైకోర్టు ఇప్పటికీ "బ్రిటిష్ రాణి" అధీనం లోనే వుందట!

నిజమా?.......మనకు స్వతంత్రం వచ్చి.......? అని అడగకండి.

ఈ హైకోర్టుని--భారత ప్రభుత్వం యేర్పాటు చెయ్యలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం కూడా యేర్పడలేదు.....బ్రిటిష్ రాణి వ్రాసిన "అధికారిక లేఖ" ప్రకారమే యేర్పడింది!

అందుకని, తాము కేంద్రీయ సమాచార సంఘం పరిధిలోకి రాము--అని ఆ కోర్టు ప్రజా సమాచార అధికరి ఇమ్రాన్ హఫీజ్ అనే ఆయన ఓ గొప్ప "లా పాయింటు" లేవనెత్తాడట.

అప్పటి ప్రథాన సమచార కమీషనర్ వజహత్ హబీబుల్లా, "మరి మీకు జీతాలు ఆ రాణి ఇవ్వడంలేదు కదా? భారత సంచిత నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది కదా?" అంటే, చచ్చినట్టు అంగీకరించారుట!

రైళ్లు--

09-10-2010 న ఈస్టుకోస్టు డివిజన్ నించి కొండపల్లి కి బొగ్గును తీసుకెళుతున్న గూడ్స్ రైలు యేలూరులో ఆగి వుండగా, బ్రేకు నించి 6వ వ్యాగన్ లో పొగలు వచ్చాయట. గమనించకుండా రైలు వెళ్లిపోయి వుంటే, గాలికి మంటలు చెలరేగి, బొగ్గు అంతా దగ్ధం అయ్యేదేమో అని గార్డు చెప్పారట.

అదే రోజున--బీహారులోని ఖతియార్ జిల్లలో ఖైరా లో ఓ ఆటో రైల్వేగేటు దాటుతూండగా, 100 కి మీ స్పీడులో వస్తున్న గౌహతి-న్యూ ఢిల్లీ రాజధాని ఢీకొట్టడం తో, ఓ చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెంది, దేహాలు చెల్లా చెదరుగా ట్రాక్ పై పడ్డాయట. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయట. మమతాదీ బాధిత 'కుటుంబాలకి ' 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారట! 

Wednesday, October 13, 2010

కబుర్లు
అవీ, ఇవీ, అన్నీ


"మమతాదీ చెప్పిందీ......"--యెదురెదురుగా వస్తున్న రైళ్లు 'ఒకే పట్టాలపై' రాకుండా నిరోధించే పరికరం 'సిధ్ధం' అయిందనీ, దీంతోపాటు 'అత్యాధునిక ' సిగ్నలింగ్ వ్యవస్థని త్వరలో ప్రవేశ పెట్టబోతున్నాము అనీ!

(ఇంతకు ముందు మంత్రులు వీటి పై దృష్టి పెట్టక పోవడం వల్లనే పాత 'మౌలిక వసతులతో' అయినా 'సమర్థవంతం గా' నెట్టుకు వస్తున్నాము--అని కూడా అందట! ఇంకా, వచ్చే రెండేళ్లలో రైల్వేలు 'స్వయం సమృధ్ధిని ' సాధిస్తాయట! ఈ లోపల యెలక్షన్లేమీ లేవే?)

ఓ ముఫై మూడేళ్ల క్రితం, మధు దండావతే గారు 'సామాన్యుల సీట్లకి ' కూడా, కుషన్లు వేయించి పుణ్యం కట్టుకున్న తరవాత, రైల్వేలలో యేమైనా 'అభివృధ్ధి ' జరిగిందా? అప్పటినించీ యెన్ని "యాంటీ కోలిజన్ డివైసెస్" గురించీ, "అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థల" గురించీ యెన్ని ప్రకటనలు వెలువడలేదు? యెన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 

అంతకు ముందు క్రిందికి వాలే సిగ్నల్ "రెక్కలని" దుండగులు బలవంతం గా క్రిందికి వాల్చేస్తున్నారనీ, అందుకని రెక్కలని "పైకి" లేపే వ్యవస్థని ప్రవేశపెట్టామనీ, సిబ్బంది అందరికీ "వాకీ టాకీ" లని ఇచ్చామనీ, ఓ లైన్లో యేదైనా రైలు ఆగి వుంటే, వచ్చే రైలు "ఆటోమేటిగ్గా" లూపు లైన్లోకి వెళ్ళే వ్యవస్థని ప్రవేశపెట్టామనీ--ఇలా యెన్ని చూడలేదు?
  
ఇదివరకు, విజయవాడ స్టేషన్ లో 5, 6 & 7 ప్లాట్ ఫారాలమీదకే ముఖ్యమైన "పెద్ద" రైళ్లన్నీ వచ్చేవి--20 నిమిషాల నుంచీ 30 నిమిషాల వరకూ ఆగేవి! ఇంక 1, 2, 3, 4 ప్లాట్ ఫారారాలమీద ఆగే చిన్నా చితకా ఎక్స్ ప్రెస్ లూ, ప్యాసింజరులూ ఆగే టైము దైవాధీనం! 

అందరూ 5, 6 ప్లాట్ ఫారాలమీదున్న క్యాంటీన్ కి వెళ్ళి, పొగలు కక్కుతున్న ఇడ్లీ, వడా, దోశా, వుప్మా, వెజిటబుల్ పలావ్ వగైరా లని తృప్తి తీరా తిని, పార్సెళ్లు కట్టించుకొని తమవాళ్లకి తీసుకెళ్లే వారు! ప్రయాణం ఆలస్యమయ్యిందని యెవరూ యేడిచేవారు కాదు! (నాన్-వెజ్ రెస్టారెంటు కూడా వుండేది)

ఇప్పుడు 5, 6 ల్లో ఆ క్యాంటీను వుందో లేదో గానీ, తినడానికీ, పార్సెళ్లకీ అంత టైము వుండటం లేదు--'దురంతో' లు వగైరా పుణ్యమా అని. ఇక 1 నుంచి 4 లో, అర్థ రాత్రి కూడా, యెప్పుడో మధ్యాహ్నం వేసిన ఇడ్లీలూ, దోశలూ, వడలతో సరిపెట్టుకోవలసి వస్తోంది--అది కూడా తక్కువ టైములో 'సాహసం' చెయ్యగల వాళ్లకే!

మమతాదీ! మరింకేం? 22వ శతాబ్దం లోకి వెళ్లిపోదామా?

"మన దేశం.......విప్లవంలో.....ముందడుగు....! (ట)"

రాష్ట్రం లో 6 వేల పంచాయితీలు వచ్చే 6 నెలల్లో "ఈ-పంచాయితీ"లుగా మారబోతున్నాయట! ప్రతీ పంచాయతీనీ "ఆన్ లైన్" చేసి, "ఇంటర్ నెట్" సౌకర్యం కల్పిస్తారట! కేంద్రం ఇందుకు ముందుకు వచ్చిందట!

మరింకేం? ప్రభుత్వమూ--గుత్తేదారులూ--సలహాదారులూ--టెండర్లూ--కోట్ల కోట్లూ--మమూలే!

ఇంతకీ "బొచ్చె" వారూ--మనకేటి?

రాష్ట్రం లో మొత్తం 3800 జూనియర్ కళాశాలలు వుంటే, అందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల (ప్ర జూ క) లు 804 ట. వీటికి బోధనా సిబ్బంది 12 వేల మంది వుండాల్సి వస్తే, వున్నది 5,700 మందేనుట.

అందుకేనేమో--వాటిల్లో ఈ యేడాది "ఒక్క విద్యార్థీ చేరని" సెక్షన్లు 321 అయితే, పది మంది లోపు చేరినవి 100 సెక్షన్లట!

మరి లెఖ్ఖలెలా సరిపెడతారో!

Monday, October 11, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

విన్నారా?

చిలుకూరు బాలాజీని "సాఫ్ట్ వేర్" బాలాజీ అనీ, "వీసా" బాలాజీ అని అంటున్నారు.

ఈ ఆలయ ధర్మకర్త దీన్ని దేవాదాయ శాఖకి ఛస్తే అప్పగించనని కచ్చేరీ (కోర్ట్) లలో దెబ్బలాడుతున్నాడు. యెందుకివ్వాలి? డాలర్ల పంట పండుతుంటే--అని కొంతమంది అంటారు.

ఒకవేళ అప్పగిస్తే, స్వామి మహిమలన్నీ గల్లంతవుతాయని ఆయన నమ్మకమేమో--అని కొంతమంది అంటారు.

చెన్నైలో అన్నానగర్ లో "క్రికెట్ " గణేశుడి గుడి వుందట. క్రికెట్ పాడ్లూ గట్రా కట్టుకున్న 10 తలల వినాయకుడి విగ్రహానికి చెరో వైపూ, బౌలర్ వినాయకుడూ, బ్యాటర్ వినాయకుడూ వున్న విగ్రహాన్ని పూజిస్తారట--క్రికెట్ లో భారత్ విజయం కోసం!

కర్ణాటక లోని వుత్తర కన్నడ జిల్లాలో రెండు వందలేళ్లనాటి "ఖప్రీ " ఆలయం లో అదే పేరుతో వున్న దేవుడికి, 'నాలుగు పెగ్గుల నాటు సారా, సిగరెట్లూ' నైవేద్యం పెడితే చాలు--అంతా ఆయనే చూసుకుంటాడట.

జం షెడ్ పూర్ లోని కల్లూ బాగన్ లో ఓ దర్గాలో "మిస్కిన్ షా" కి ఓ దరఖాస్తిచ్చేస్తే, అంతా ఆయనే చూసుకుంటాడని 1930 నించీ నమ్మకమట. అక్కడున్న రావి, మర్రి చెట్లకి అర్జీలు వ్రేళ్లాడుతుంటాయట.

అరుణాచల్ ప్రదేశ్ లోని సేల పాస్ దగ్గర ఒకప్పటి సైనికుడూ, 1962 చైనా యుధ్ధం లో వీరోచితం గా పోరాడిన "జస్వంత్ సింగ్ రావత్" కి జస్వంత్ బాబా పేరుతో గుడి కట్టారట. ఈ బాబాకి "సమోసా" నైవేద్యం పెట్టి, యుధ్ధానికి వెళితే విజయం వరిస్తుందట!

(పైవన్నీ ఈనాడు ఆదివారం లో వచ్చినవే!--అన్నట్టు ఈనాడు వారు తమ నమూనా ప్రకటన--5వ వివాహ....నుంచి "5వ" ని తొలగించారు! సంతోషం)

మొన్న 03-10-2010 న యేలూరులో నిర్వహించిన ఎస్ కే డీ ఆర్ అర్థ శహస్రాబ్ది పట్టాభిషేకాల్లో, ఆచార్య కొలకలూరి ఇనాక్ "తెలుగంటే, తేనెజల్లులు కురిపించే మేఘం" అన్నారట.

సహస్రావధాని కడిమెళ్లవారు మాట్లాడుతూ--రాజ రాజ నరేంద్రుడి పట్టాభిషేకమై 1000 యేళ్లు అయిన సందర్భం లో ప్రభుత్వం మహోత్సవాలు నిర్వహించాలి--అన్నారట!

గీతా రెడ్డి కి వినిపించిందో, లేదో?

నేనిదివరకే అన్నాను--ఇక్ష్వాకుల దగ్గరనించీ, శాతవాహనుల దగ్గరనించీ, చేర, చోళ, పాండ్య, పల్లవ రాజులందరికీ ఇలాంటి (చివర సున్నాలు వచ్చే 'అబ్దుల ') వుత్సవాలు నిర్వహిస్తారా? అని.

చేస్తే మంచిదే కదా--జనాలకి కోట్లే కోట్లు!

"తృటిలో తప్పిన"......లు

రైళ్లు :

మొన్న 05-10-2010 న సికింద్రాబాద్-గుంటూరుల మధ్య నడిచే "గోల్కొండ" ఎక్స్ ప్రెస్ లో, బ్రేక్ బైండింగ్ జామ్ కావడం వల్ల పొగలొచ్చి, వరంగల్-చింతపల్లి ల మధ్య కాసేపు ఆగిపోతే, భీతిల్లిన ప్రయాణీకులు దిగిపోయి, పరుగులు పెట్టారట. మరమ్మత్తులయ్యాక, ఓ పావుగంట తరవాత మళ్లీ బయలుదేరిందట.

చింతపల్లి స్టేషన్ ఇంకా రాకుండానే, యే సీ బోగీ క్రింద వుండే డైనమో బెల్ట్ తెగిపోవడం తో, మరోసారి నిలిచిపోయిందట. మరెప్పుడు బయలుదేరిందో తెలీదు.

విమానాలు :

మొన్న 02-10-2010 న ఎయిరిండియా కి చెందిన కొచ్చి-కొజికోడ్-రియాధ్ విమానం కొజికోడ్ నించి బయలుదేరిన అరగంట తరవాత కేబిన్ లోంచి పొగరావడం గమనించిన పైలట్ అప్రమత్తమై, కొచ్చిలో దింపి, అందులో వున్న 197 మంది ప్రయాణికులనీ, 12 మంది సిబ్బందినీ క్షేమం గా ఖాళీ చేయించి, మరో విమానం లో వాళ్లని రియాధ్ పంపించారట.


Saturday, October 9, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

ఎల్ టీ టీ ఈ పోయిన్నప్పటినించీ చిదంబరం నోరు బాగా పెగులుతోంది.

వుగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఈస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (SIMI), ఆర్ ఎస్ ఎస్ "ఒక్కలాంటివే" అన్నాడట.

(ఈయన వివిధ శాఖల మంత్రి గా యెన్ని కోట్లు సంపాదించాడో యెవరైనా ఓ కమీషను వేసి, బయటపెడితే బాగుండును!)

తందాన తాన అంటూ దిగ్విజయ్ సింగ్, అందులో తప్పేమీ లేదు అన్నాడట.

మరి ఆర్ ఎస్ ఎస్ వాళ్లు యెక్కడ టిఫిన్ బాక్స్ బాంబులూ, ప్రెషర్ కుక్కర్ బాంబులూ పెట్టారో, యెక్కడ ఆత్మాహుతి దాడులు చేశారో వివరిస్తే బాగుండేది వీళ్లు.

ఆర్ ఎస్ ఎస్ చాలా గొప్పది కాకపోవచ్చు, కానీ అనేముందు మనం యేమంటున్నామో అలోచించాలా వద్దా?

రాష్ట్ర ప్రభుత్వ వున్నత పాఠశాలల్లో కంప్యూటర్ విధ్య 2008 లో 5000, ఈ యేడాది జూలై లో 1300 పాఠ శాలల్లో సుమారు 500 కోట్ల తో శ్రీకారం చుట్టారట. ఇందులో 25% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, మిగతా కేంద్రం భరిస్తాయట. ఒక్కో జిల్లాలో 180 నించి 300 లోపు పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోందట.

ఇక పాత ప్రభుత్వం--గుత్తేదారులూ కథ మామూలే. దాదాపు అన్ని జిల్లాలలో ఈ పథకం 'పడకేసిందట '.

శ్రీకాకుళం జిల్లాలో 175 పాఠశాలల్లో వొక్కోదాంట్లో కనీసం వుండవలసిన 11 కంప్యూటర్లలో వొక్కటీ లేదట.

నెల్లూరు జిల్లలో 34 పాఠశాలల్లో కంప్యూటర్లు యెప్పుడో మొరాయించాయట.

6300 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య కొనసాగుతుండగా, 5253 పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు సమకూర్చామనీ, వీటిలో 4564 స్కూళ్లలో మాత్రమే "ఇంటర్నెట్" సదుపాయాన్నీ కల్పించినట్టూ డీ యీ వో లు చెపుతున్నారట--కానీ వాస్తవ పరిస్థితి వేరట!

కొన్ని చోట్ల కంప్యూటర్లని స్థానికులు సొంత అవసరాలకి వాడుకుంటున్నట్టు ఆకస్మిక తనిఖీల్లో బయట పడిందట.

కొసమెరుపేమిటంటే, విద్యార్థులు యెంత పరిఙ్ఞానం సంపాదించారో సంవత్సరాంతం లో 'అంచనా వేసే' వ్యవస్థే విద్యా శాఖలో లేదట!

కంప్యూటర్ పథకాలూ--వర్థిల్లండి.

'వుపాధి ' పథకం ప్రారంభించినప్పటి నించీ ఇప్పటికి 13000 కోట్లు ఖర్చు చేశారట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో 7.80 లక్షల కుటుంబాలకి 100 రోజుల పని కల్పించారట.

డిసెంబరు నుంచి బయోమెట్రిక్ విధానం లో కోటి మందికి "స్మార్ట్ కార్డులు" జారీ చేసి, అక్రమాలు 'పూర్తి స్థాయిలో' అరికడతారట.

UNESCO వారు మన హైదరబాదులోని "చౌమొహల్లా పేలస్" కి 'ఆసియా పసిఫిక్ హెరిటేజ్ మెరిట్ అవార్డ్' ఇచ్చారట.

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డ కట్టడాలని బాగా సం రక్షించిన సందర్భం లో ఈ అవార్డు ఇస్తారట.

ఈ భవనం క్రమం గా పాడయిపోతే, నిజాం ప్రతినిధి బర్కత్ ఆలీ ఖాన్ ముకర్రం జా కుటుంబీకులు ఐదేళ్లపాటు మరమ్మతులు నిర్వహింపచేసి, ప్రజల సందర్శనకి యేర్పాట్లు చేశారట.

ఇక్కడి ప్రథాన ద్వారం పై కనిపించే "కిల్వత్ క్లాక్" అనే గడియారం 250 యెళ్లనించీ టిక్ టిక్ అంటూనే వుందట!

ఇలాంటివి--నిజమైన పురాతత్వ సంపదలంటే!

Saturday, October 2, 2010

పాత (తాజా) కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ


మణి శంకర్ అయ్యరొకడు--కేంద్ర ప్రభుత్వానికీ, కాంగ్రెస్ కీ విలన్ అయిపోయాడు. (ఇదివరకు సుబ్రహ్మణ్యం స్వామి అని ఓ ఐరన్ లెగ్గుండేవాడు--ఇప్పుడూ వున్నాడేమో తెలీదు--ఈయన కూడా అలాంటి ప్రణాళికలేమైనా వేసుకున్నాడేమో తెలియదు).

"స్టాక్ మార్కెట్లు బాగుంటే, అంతా బాగున్నట్టేనా?" అని ప్రశ్నించాడు మొన్న. ఇంకా, వీటికి ప్రభుత్వ సంపూర్ణ మద్దతు లభిస్తోందనీ, వాటి బాగే సామాన్యుడి బాగు అన్నట్టు ప్రవర్తిస్తోంది అనీ, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం లేని సొమ్ముని మార్కెట్లో పెట్టేందుకు అనుమతిస్తున్నారనీ, మన స్టాక్ మార్కెట్లో 44 శాతం ఇలా "మారిషస్" నించి వచ్చినవే అని కూడా అన్నారు.

సత్వర వృధ్ధి ఫలాలన్నీ "ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చెయ్యడానికే" అనీ, వీటివల్ల ఆదాయం పెరగబోవడం లేదు అని కూడా అన్నారు.

మరి ప్రభుత్వమేమీ మాట్లాడడం లేదు--సెన్సెక్స్ 20 వేల పాయింట్ల చుట్టూనే తిరుగుతోంది!

నమ్ముతారా? మన 77 మంది కేంద్ర మంత్రుల్లో 26 మందికి స్వంత వాహనాలే లేవుట!

స.హ. దరఖాస్తుతో, సుభాష్ చంద్ర అగర్వాల్ అనే ఆయన ప్రథాని కార్యాలయం నించి ఈ వివరాలు రాబట్టాడట.

కార్లు వున్నవారిలో కూడా కొంతమందివి పాత డొక్కు కార్లేనట!

సుశీల్ షిండే 37 యేళ్ల వయసున్న పాత ఫియెట్ లోనే తిరుగుతున్నారట! (15 యేళ్లు దాటితే మళ్లీ లైఫ్ టాక్స్ కట్టాలనీ, 20 యేళ్లు దాటిన కార్లు ఇక తిరగకూడదు అనీ వినిపిస్తున్న రూల్స్ ఈయనకి వర్తించవేమో).

ఎం ఎస్ గిల్ పాతికేళ్ల నాటి ఓక్స్ వాగన్ జెట్టానీ; కమల్ నాథ్ పాత అంబాసిడర్నీ; సీ పీ జోషీ పదిహేనేళ్ల పాతదైన ప్రీమియర్ పద్మిని నీ; వయలార్ రవి 18 యేళ్ల వయసున్న ఫియట్ నీ; ప్రకాశ్ జైస్వాల్ 14 యేళ్లనాటి మారుతీ ఎస్టీం నీ మాత్రమే వాడుతున్నారట. నమోనారాయణ్ మీనా పేరున ఒక్క ద్విచక్ర వాహనం మాత్రమే వుందట.

కోటీశ్వరులూ, రాజకీయాల్లో చక్రాలూ, మలుపులూ తిప్పేవాళ్లూ, శరద్ పవార్, ఆనంద్ శర్మ, ఎ రాజా, విలాస్ రావ్ దేశ్ముఖ్ లకి అసలు వాహనాలే లేవట!

పాపం మన వోట్లమీదే బతుకుతున్నారుగా మరి!

మొన్ననే రోశయ్య రాష్ట్ర కొత్త పర్యాటక విధానాన్ని ప్రకటించారట.

సాగర్ వద్ద "అతి పెద్దదయిన" ఆధునిక వుద్యాన వనాన్ని నిర్మిస్తారట! ఇది మైసూరులోని బృందావన్ గార్డెన్స్, బెంగళూరు లాల్ బాగ్ తరహాలో వుంటుందట!

అయ్యా! యెవరైనా ఆ రెండు గార్డెన్లనీ ఒక్కసారైనా పూర్తిగా చూశారా? రెండోసారి యెప్పుడైనా వెళ్లారా? 

భార్యా, పిల్లలూ, బంధువులతో అంతదూరాలు నడవలేక, అవన్నీ చూడకుండా వుండలేక, ఒకవేళ యెవరికైనా చూపించాల్సి వస్తే, మీరు అలా వెళ్లి రండి, మేమిక్కడే వుంటాము అని గేటు ప్రక్కనే సెటిలయ్యే లోకల్ వాళ్లలా, మీరెప్పుడూ అనుభవించలేదా?

పర్యాటకానికి అవసరమనుకుంటే, ఇప్పుడు వున్నవాటికి పరిసరాలు కాస్త శుభ్రం గా వుంచి, మూత్రశాలలూ అవీ కట్టిస్తే చాలు--పర్యాటకం వర్థిల్లుతుంది! యెందుకీ అనవసర ఖర్చులు? (రోశయ్యగారూ....చక్రం అడ్డు వెయ్యండి మరి)

మంగళంపల్లి బాలమురళీ కృష్ణకి  "  భారత రత్న" ఇవ్వాలి అనీ, దాని కోసం తాను ఇప్పటికే మాట్లాడుతున్నాను అనీ సుబ్బురామి రెడ్డి ప్రకటించాడు మొన్నో సభలో! నేనే మంగళంపల్లి అయితే......థూ!

అన్నట్టు, మొన్న రాష్ట్రపతి విమానం 3 నిమిషాలపాటు రాడార్ లో కనపడలేదనుకున్నాం కదా--'సంబంధాలు తెగిపోలేదు ' అని విమానయాన శాఖ ప్రకటించింది ఆ మర్నాడే. ఒక మానిటర్ పనిచెయ్యకుండా ఆగిపోవడంతో వేరే మానిటర్ కి అనుసంధానం చేశాము అనీ, 3 నిమిషాల్లో మొదటి మానిటర్ బాగుకూడా అయ్యింది అనీ వెల్లడించారు! (వూహించుకోండి యేమి జరిగిందో)

24-09-2010 న ప.బెంగాల్, మిడ్నపూర్ జిల్లాలో ఓ మిగ్ 27 విమానం మంటల్లో చిక్కుకొని కూలిపోయిందట. పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడట. 1962 చైనా యుధ్ధం సమయంలో మనం అడిగితే, 1965 పాకిస్థాన్ యుధ్ధం నాటికనుకుంటా, రష్యా మనకి సరఫరా చేసిందీ మిగ్ లని. పాక్ వాళ్ల అమెరికన్ Gnat లకీ, మన మిగ్ లకీ ఘోర యుధ్ధాలు జరిగాయి 1965 లో.

మనం ఇప్పటికీ ఆ మిగ్ లని శిక్షణ వగైరాలకోసం వాడుతున్నాము. కొన్ని విధిలిఖితాలు తప్పవు మరి--ప్రస్తుత ముసలి బ్రహ్మని వదిలించుకొని, కొత్తవాణ్ని తెచ్చుకొనేవరకూ!

యేమంటారు?

Friday, October 1, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

ఆలస్యం అయితే అయ్యిందిగానీ, బంగారం లాంటి తీర్పు వచ్చింది అలహాబాదు హైకోర్టు ధర్మాసనం నించి! ఇంతకన్నా యెవరూ గొప్పగా తీర్పు చెప్పలేరు--అనవసర రాధ్ధాంతాలకి తావులేకుండా!

ముస్లిం సున్నీ వక్ఫ్ బోర్డ్ మాత్రం, దాదాపు వాళ్లు లేవనెత్తిన ప్రతీ విషయాన్నీ, ముగ్గురు న్యాయమూర్తులూ
కొట్టేసినా, "  అంతా నాకే కావాలి "   అని సుప్రీం కోర్టుకి వెళ్లడానికి ఆలోచిస్తామంటోంది!

వీళ్లని చూసి, హిందూ మహాసభ కూడా, అదే ఆలోచనని వెళ్లగక్కింది!

సుప్రీం కోర్టు వీళ్ల అప్పీళ్లని మొదట్లోనే కొట్టేస్తుందని ఆశిద్దాం!

తీర్పు ముఖ్యాంశాలని చదవాలంటే.......www.rjbm.nic.in కి వెళ్లండి.

సెప్టెంబర్ 18 నాటికి ఆహార ద్రవ్యోల్బణం 16.44 శాతానికి చేరిందట. ఇంకా అసలు పండగలు దసరా, దీపావళీ ముందే వున్నాయి! అప్పటికి 30 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు!

బియ్యం రేట్లు తగ్గిపోతున్నాయని, మిల్లర్లు మళ్లీ మంత్రాంగం చేస్తున్నారట--సంబంధిత శాఖ ద్వారా సిఫార్సు చేయించుకొని, ముఖ్యమంత్రిని కలవడానికి సిధ్ధం గా వున్నారట--బియ్యాన్ని యేజిల్లాలో అయినా ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు--అనే ప్రతిపాదన తో! (ఆ వంకన ఇతర రాష్ట్రాలకీ, దేశాలకీ ముసుగుల్లో అమ్మేసుకోవచ్చు అని వాళ్లల్లోనే కొంతమంది సంబరపడుతున్నారు! రోశయ్యా......వులకొద్దు, పలకొద్దు!)

ఆరు బ్యాంకులు తమ బేస్ రేటుని పెంచాయట--ఓ అర శాతం! మిగిలిన బ్యాంకులూ పెంచడానికి సిధ్ధం గా వున్నాయి. 

వాటితోపాటే ప్రత్యేక స్కీముల కింద డిపాజిట్ల మీద వడ్డీ రేట్లూ పెరుగుతాయి! ఋణాలమీద "టీజర్" రేట్లు డిసెంబరు నెలాఖరు దాకా కొనసాగవచ్చంటున్నారు. ఇదంతా యెంతసేపు--మళ్లీ రిజర్వ్ బ్యాంకు 'తగ్గించండి, తగ్గించండి ' అనేంతవరకూ!

"  తృటిలో.........."--రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలం, మంతట్టి రైల్వే స్టేషన్ లో, గురువారం (30-09-2010) న రాత్రి 7-30 కి గోరఖ్ పూర్ నించి సికిందరాబాదు వెళ్తున్న ఎక్స్ ప్రెస్సూ, హైదరాబాదు నించి వాడీ వెళ్తున్న ప్యాసింజరూ, ఒకే పట్టాలపై, యెదురెదురుగా వచ్చేశాయట! పాపం ఆ డ్రైవర్లే జాగ్రత్తపడి, గుద్దుకోకుండా ఆపేశారట! రెండు రైళ్లలోనూ కొన్ని వందలమంది ప్రయాణిస్తున్నారట! 

ఒకవేళ డ్రైవర్లకి సాధ్యం కాకపోయి వుంటే!!!???...............గాడ్ ఓన్లీ హెల్ప్డ్ డ్! రైల్వే అధికారులు "విచారించడం" మొదలెట్టారట. మమతాదీ--యెన్నికోట్లు కేటాయించిందో--రైల్వే భద్రతకి!--అవేమౌతున్నాయో!

అవండీ సంగతులు.

Monday, September 27, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

వోక్స్ వేగన్ కుంభకోణంలో మంత్రుల, అధికారుల ప్రమేయం యేమీ లేదట--అలా అని సీబీఐ కేసు దాఖలు చేసిందట.

మన బొచ్చె చేపలోడు 11.87 కోట్లని పట్టుకెళ్లి వశిష్టవాహన్ ఖాతాకి చెల్లించి, తరవాత "సొమ్ములు పోనాయి....యేటి సేత్తాం!" అన్నాడు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి వోక్స్ వేగన్ తో గానీ, వశిష్టవాహన్ తో గానీ వొప్పందమేమీ లేదు.

దీనికి ముందే మరో పన్నెండు మంది తో జర్మనీ వెళ్లి వచ్చాడు. అప్పటికే కంపెనీ నించి తొలగించబడిన షూష్టర్ గురించి వీళ్లకి తెలీదుట!

ప్రత్యేకాధికారి రాఘవేందర్, ఏపీఐఐసీ ఎండీ ఎల్వీ సుబ్రహమణ్యం లని ప్రాసిక్యూట్ చెయ్యడానికి సిబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరితే, ఇవ్వకపోగా కనీసం జరిమానా విధించడానిక్కూడా నిరాకరించింది--వై ఎస్ సర్కారు! కానీసం శాఖాపరమైన విచారణకి కూడా అంగీకరించలేదు మరి!

ఇంకెందుకీ దర్యాప్తులూ, కేసులూ?

బ్యాంకింగు సంస్థలు వెర్రితలలు యెలావేస్తున్నాయి అనడానికి ఓ వుదాహరణ, హైదరాబాదులో ఎస్ బీ ఐ స్థాపించిన "కుబేరుల శాఖ"!

అంటే యేమీ లేదు--కనీసం కోటి రూపాయలతోనే అక్కడ ఖాతా మొదలు పెట్టాలట యెవరైనా. అది కూడా మనం వెళితే చెయ్యరు.....బ్యాంకువాళ్లే మనదగ్గరకి రావాలట.

ఖాతాదారులు వేచి వుండేందుకు రాచరిక హోదా వుట్టిపడేలా సోఫాలూ, ఫ్రిజ్, కూల్ డ్రింకులు, పళ్ల రసాలు, నీటి సీసాలు, టీ, కాఫీ, అన్నీ వుంటాయట. ప్రముఖ వాణిజ్య పత్రికలూ వుంటాయట. ఇంకా సెమినార్ హాలూ, ఇంటర్నెట్, ఫాక్స్, ఫోను, విడియో కాన్‌ఫరెన్స్ హాలూ, వున్నాయట.

ఇంకా, పదిహేను కాబిన్లలో లాకర్లు వుంటాయట--యేదైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే, లాకర్లలోని ఆభరణాలు తీసుకొని, ముస్తాబవ్వడానికి డ్రెస్సింగ్ రూములు కూడా వుంటాయట!

........ఇంకా చాలా చాలా వున్నాయట.

బుధ్ధున్న కోటీశ్వరుడెవరైనా ఆ శాఖకి స్వయం గా వెళ్లి ఈ సౌకర్యాలన్నీ అనుభవిస్తాడా?

మామూలుగా యే బ్యాంకు శాఖలోనైనా, యెంత పెద్ద కంపెనీ ఖాతా వున్నా, లావాదేవీలకోసం తమ సంస్థ లోని అతి చిన్న గుమాస్తానే పంపిస్తాయి. వాడినే ఈ బ్యాంకులు ఆ సంస్థ జనరల్ మేనేజరో, సీ ఈ వో నో అన్న లెవల్లో ట్రీట్ చేస్తాయి. మరి ఈ భేషజాలెందుకు?

అమెరికాలో బ్యాంకు శాఖలకి వెళ్లేవాళ్లే తక్కువ. వెళ్లేవాళ్ల కోసం అక్కడ చక్కని యేర్పాట్లు వుంటాయి. పిల్లలకి ఫ్రీ గా చాక్లెట్లూ, వేఫర్లూ వగైరా వుంచుతారు!

మన బ్యాంకులు కూడా, తమ శాఖలనన్నింటినీ కనీసం ఏసీ చేయించి, పెన్షనర్ల/గంటలతరబడి వేచి వుండే వాళ్ల  కోసం కాస్త టీ నీళ్లు పొయ్యగలిగితే, యెంతబాగుంటుంది? 

బోగస్ సంస్థలు వెర్రి జనాలని మోసాలు చేస్తూనే వున్నాయి.

యేలూరు, నరసిం హారావుపేటలో, యేడాది క్రితం "తేజ మార్కెటింగ్ అండ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్" పేరుతో సంస్థ స్థాపించి, ప్రతీ వ్యక్తి దగ్గరా రూ.549/- వసూలు చేసి, సంవత్సరం తరవాత మీకు యేకం గా "లక్ష" రూపాయలు ఇస్తాము అనీ, ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే తక్షణం లక్ష చెల్లిస్తామనీ చెపితే, జనం యెగబడ్డారట.

దాదాపు 3 వేల మంది నించి వసూళ్లు చేసి, 20 నించి 30 లక్షలదాకా అందరినీ ముంచి, బోర్డు తిప్పేశాడట నిర్వాహకుడు!

అసలు ఈ సంస్థ యే నిబంధనల క్రింద, యే లైసెన్సులతో వ్యాపారం ప్రారంభించింది అని పట్టించుకోని అధికారులూ, పోలీసులూ, ఇప్పుడు తీరిగ్గా, ఛీటింగ్ కేసు తో పాటు డిపాజిటర్స్ ఆక్ట్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారట!

సామాన్య వ్యక్తి యెవరైనా బంగారం తాకట్టు పెట్టుకొని, తెలుసున్నవాళ్లకి అప్పిస్తే, "పాన్ బ్రోకర్ లైసెన్స్" లేదు అని కేసులు పెట్టిన వుదంతాలు నాకు తెలుసు.

అలాంటిది, ముథూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ సంస్థలు గత రెండేళ్లుగా తమ వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా యెలా పెంచుకోగలుగుతున్నాయి? వాటి నిర్వహణ మాటేమిటి? అవి బోర్డు తిప్పేస్తే జరిగే పరిణామాలేమిటి? అని యెవరైనా ఆలోచిస్తున్నారా?

Saturday, September 25, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ


MGF.....EMAAR.....APIIC.....కొన్ని వేల యెకరాలు.....కొన్నివేల కోట్ల కుంభకోణం.....ఇవన్నీ అందరూ రోజూ చదువుతున్న, వింటున్న మాటలే.

తాజాగా, భారత సొలిసిటర్ జనరల్ నుంచి, ఏపీఐఐసీ నియమించిన నిపుణుల కమిటీ వరకూ--ఇది నిజం గా దోపిడీయే అని ముక్తకంఠం తో చెపుతున్నారట. అయినా మన ప్రభుత్వం మీనమేషాలు యెందుకు లెక్కిస్తోందో--అంటున్నారు.

మన రాజకీయులు, "సభా సంఘాన్ని వేయాలి", "సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి", "సిటింగ్ జడ్జ్ చేత విచారణ" వగైరా అంటారు.

ఇంకా విచారణలెందుకో! ప్రభుత్వం ఇప్పుడు కేసులు పెట్టకుండా, ఆనక తీరిగ్గా 'విచారిస్తూ' కూచుంటుందేమో! అదేకావాలి దోపిడి దొంగలకీ, వాళ్ల తైనాతీలకీ!

వై ఎస్ ఆర్, చంద్రబాబు, ఐశ్వర్యరాయ్, ఎన్ టీ ఆర్--వీళ్లంతా రెండేళ్ల క్రితం గ్రూప్-4 వుద్యోగాలకోసం ఆన్ లైన్ లో మన ఏపీపీఎస్సీకి దరఖాస్తు చేశారట!

ఇంకా అనేకమంది సినీతారలూ, రాజకీయ నాయకులూ, కొన్ని పువ్వులూ, ప్రకృతి దృశ్యాలూ కూడా దరఖాస్తు చేశారట. ఫీజు యెంత కట్టారు? అని అడిగిన చోట, "నీకూ బే....బే, నీ ఫీజుకీ బే....బే...." అని వ్రాశారట!

మొత్తం వచ్చిన 12 లక్షల దరఖాస్తుల్లో, 1,60,000 ఇలాంటి దరఖాస్తులేనట!

ఇంతకీ, యెవడో సాఫ్ట్ వేర్ అమ్మితే, మన పిచ్చి పుల్లయ్య-వేమవరం అధికారులు, దాన్ని పరిశీలించకుండానే కొనేసి, వాడేశారట! (అంతేనో--వాళ్లకి ముట్టాల్సింది ముట్టి, మనం పిచ్చి పుల్లయ్యలమో!)

దరఖాస్తులన్నీ సరిగ్గా క్రోడీకరించడానికి పాపం సిబ్బంది నిజంగా చమటోడ్చారట.

ఇప్పుడు, ఫీజుకి సంబంధించిన చలానా నెంబరు వుంటేనేగానీ, దరఖాస్తు సమర్పణ అవకుండా మార్చారుటలెండి. ఇక చూద్దాం.

మొన్న బిల్ గేట్స్ యేమన్నాడో విన్నారా?

ఇప్పటికే తమ ఫౌండేషన్ కి ఇచ్చిన 1,26,000 కోట్లు పోగా, మిగిలిన 2,38,000 కోట్ల ఆస్థిని కూడా నా పిల్లలకి ఇవ్వను--అన్నాట్ట. కొంచెం మొత్తం మాత్రమే ఇస్తాను--నా ఆస్థి అంతా ప్రజాసేవకే అనికూడా అన్నాట్ట.

అన్నట్టు, ఖైరతాబాద్ వినాయకుడి వెరయిటీ చూశారా? అసలు తలకి చెవుల వెనుక ఓ రెండుతలలూ, కిరీటం లోంచి చెరోప్రక్కా రెండుతలలూ మొలిచి, పంచ ముఖుడు అయ్యాడు!

నిడదవోలు, సమిశ్రగూడెం కాలువలో నిమజ్జనం సమయంలో గల్లంతయిన ఓ కుర్రాడి మృతదేహం 21-09-2010 న లభించిందట. స్కోరు ఒకటి పెరిగింది.

మన జిల్లాల్లో ఆథార్, రాజధాని లో ఆథార్--యేమయ్యాయో గానీ, తొలి ఆథార్ సంఖ్యని 29 న మహారాష్ట్రలోని నందూర్ బార్ జిల్లా, షహడా గ్రామ గిరిజనులకి కేటాయిస్తారట మన్మోహన్ సింగ్. సోనియా కూడా ఈ కార్యక్రమం లో పాల్గొంటారట. ఆ గ్రామ ప్రజలందరికీ ఆ రోజున 12 అంకెల గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులు అందజేస్తారట.
....................................................................................................................................................................
23-09-2010 న హైదరాబాదు ఎక్స్ ప్రెస్ కి తప్పిన ముప్పు--చెన్నై హైదరాబాదు ఎక్స్ ప్రెస్ నాయుడుపేట చేరేసరికి, ఇంజన్ వెనుక రెండో బోగీ చక్రం బ్రేకు పట్టేసి మంటలు లేచాయట. చైన్ లాగి ఆపేస్తే, తరవాత గూడూరులో మరమ్మత్తులు చేసి పంపించారట. (ఆ మధ్యలో యేమిచేశారో పేపర్లో వ్రాయలేదు)
....................................................................................................................................................................
23-09-2010 నే, రాష్ట్రపతి కోల్కత్తా నించి ఐజ్వాల్ ప్రయాణిస్తున్న విమానం మూడు నిమిషాలపాటు యే రాడార్ లోనూ కనిపించలేదట. ప్రత్యామ్నాయ యేర్పాట్లు చేస్తూండగా తిరిగి కనిపించి, అధికారులు ఊపిరి పీల్చుకున్నారట!

Thursday, September 23, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

సంగతి విన్నారా?

అరవ్వాళ్లెంతకైనా తగుదురు. 

మనం సినిమాల్లో, పిల్లల్ని యెత్తుకుపోయి, వాళ్ల కాళ్లనీ, చేతుల్నీ విరగ్గొట్టి, కళ్లు పొడిచేసి, వాళ్లని అడుక్కొనేవాళ్లలా తయారుచేసి, ఆ డబ్బులతో బాగుపడే విలన్లని చూశాం.

హాస్య సన్నివేశాల్లో, రక రకాల దొంగతనాలు చెయ్యడం లో శిక్షణ ఇచ్చే "దొంగల బడి" లని కూడా చూశాం.

సాక్షాత్తూ అలాంటి దొంగల బడే, తమిళనాడు లోని తిరుచ్చి సమీపం లో, రాంజీనగర్ ప్రాంతం లో నడపబడుతూందట! అందులో సీనియర్లు, కొత్తవాళ్లకి దొంగతనాలు చెయ్యడం లో మెళుకువలు నేర్పిస్తున్నారట! దాని ఫలితమే, మొన్న వైజాగ్ ఏక్సిస్ బ్యాంకు వద్ద 13.10 లక్షల చోరీ జరిగిందట!

వాళ్లు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే దొంగతనాలు చేసి, రాంజీనగర్ ప్రాంతంలో మాత్రం, పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారట.

సాక్షాత్తూ, విశాఖ పోలీసు కమీషనర్ పూర్ణ చందర్రావు దర్యాప్తులో ఈ విషయం బయటపడి, విస్మయం చెందారట!

అందానికి నేనూ, రాగానికి మాయప్పా అన్నట్టు, మళయాళ సోదరులేమీ తక్కువ తినలేదు.

ముథూట్ ఫైనాన్స్, మణుప్పురం గోల్డ్ పేర్లతో, గత సంవత్సరమున్నరగా, మన రాష్ట్రం లోని బంగారాన్ని దోచుకొంటున్నారు. ఈ కుంభకోణం యెప్పుడు "భడేల్" మంటుందో.....రిజర్వ్ బ్యాంకూ, ప్రభుత్వాలేమంటాయో......పైవాడికే యెరుక!

"తెలంగాణా వుద్యమంలో నేనూ, మా ముసల్దీ (భార్య) మాత్రమే పాల్గొంటామని, తనకేమీ రాజకీయ వాంఛలు లేవని, కే సీ ఆర్ పదేళ్ల క్రితం చెప్పాడు. ఇప్పుడు యెక్కడ చూసినా, వాళ్ల కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారు--అని విమర్శించిందట--తెలుగుదేశం!

మొన్న, కర్ణాటక సంగీత విద్వాంసుడు అమ్మనమంచి బలరామ శాస్త్రి ని కంచి పీఠం ఆస్థాన విద్వాంసుడిగా నియమించిందట. ఈయన ఇంతవరకూ 1045 గాత్ర కచేరీలు చేశారట. తాడేపల్లి గూడెం లో అమ్మనమంచి సోదరులు నలుగురూ ప్రఖ్యాత విద్వాంసులే.

గొప్పగా చెప్పుకోవడమే గానీ, నాకు ఆయన తో యే చుట్టరికం వుందో ఆయనకీ తెలీదు, నాకూ తెలీదు. యెప్పుడో తీరిక దొరికినప్పుడు పరిశోధన ప్రారంభించాలి.

పీనాసైనా రోశయ్య గట్టోడని వొప్పుకుంటారా?

ఇప్పుడు మార్కెట్లో బియ్యం ధరలు బాగా తగ్గుతున్నాయట. ఇన్నాళ్లూ మిల్లర్లు, తమదగ్గర ధాన్యం, బియ్యం నిలవలు వుండిపోయాయనీ, వాటిని ఇతర రాష్ట్రాలకీ, దేశాలకీ, యెగుమతి చెయ్యడానికి అనుమతి ఇవ్వకపోతే, వచ్చే ఖరీఫ్ లో ధాన్యం యెలాగ కొంటాము అనీ బెదిరించీ, మొత్తుకొనీ, చివరికి కాళ్లా వేళ్లా పడ్డా, రోశయ్య "మీరు అరిచి గీపెట్టినా....ససేమిరా" అన్న లెవెల్లో, నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయాడు.

ఇప్పుడు చచ్చినట్టు ఈ మిల్లర్లు ఆ బియ్యాన్ని, ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు--అందుకే ధరలు తగ్గుతున్నాయట!

కూడోస్ టూ రోశయ్య!

Monday, September 20, 2010

కబుర్లుఅవీ, ఇవీ, అన్నీ

మన దేశ అత్యున్నత న్యాయ స్థానం, బోధన ఫీజుల చెల్లింపుల వ్యవహారం లో వెసులుబాటు బాగానే ఇచ్చిందిట. బోధనఫీజుల పథకం వర్తించే విద్యార్థులు ఫీజులు చెల్లించనక్కరలేదని విద్యార్థులకీ వూరట కలిగించిందట. ప్రభుత్వం ఈ ఫీజులని మూడు విడతల్లో కళాశాలలకి చెల్లించవచ్చట. బాగానే వుంది.

గొడవేమిటంటే--బీ సీ సంక్షేమ శాఖలో తగిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులూ లేవట. ఒక్కో క్షేత్ర స్థాయి అధికారీ 300 నించి 1000 కళాశాలల దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారట. అందిన 15 రోజుల్లో దరఖాస్తుని పరిష్కరించాలని నిబంధనట.

మరోవైపు, జిల్లా, మండల స్థాయిలో కంప్యూటర్లూ, ఇంటర్నెట్ లేకపోవడం తో, కాలేజీలు దరఖాస్తులన్నీ స్కాన్ చేయించి, ఆన్ లైన్ లో పంపించాల్సి వస్తోందట. ప్రభుత్వ కళాశాలలైతే యెప్పుడూ కంప్యూటర్ మొహమైనా చూడలేదట!

అదండీ సంగతి. వచ్చే ఒలింపిక్స్ లో "కంప్యూటర్ బాల్ గేము" (కంప్యూటర్లని సరఫరా చెయ్యడం, మూల పారెయ్యడం, మళ్లీ సరఫరా చెయ్యడం ఇలా) అని ఒకటి పెడితే, మనదేశానికి బంగారమేం ఖర్మ, యేకం గా ప్లాటినం పతకమే వచ్చేస్తుంది.

అన్నట్టు, ఈ మధ్య మా జిల్లాలో ఓ వూళ్లో ఓ రాజుగారు, "గో మూత్రం" తో నడిచే గడియారాన్ని కనిపెట్టి, ప్రదర్శించారు. చాలా బాగుంది. కానీ, ఈ గడియారాల్ని టేబులుమీదో, గోడమీదో తగిలించుకోడం చాలా కష్టం. పైగా ఈ రోజుల్లో ఆభరణం గా కూడా చాలామంది గడియారాలని ధరించడం లేదు.

ఇంకొంచెం పరిశోధన చేసి, ఓ యాభైవేల లీటర్లో యెంతో మూత్రం తో వాళ్ల ఇంటికీ, వీధికీ కరెంటు వుత్పత్తి చెయ్యగలిగితే చాలా బాగుంటుంది. పరిశోధనలకి కావాలంటే, ప్రభుత్వ సహాయాన్ని అర్థించవచ్చు.

మన తెలుగు బ్లాగర్లు తమ బ్లాగుల ద్వారా "అందరికీ" వినాయకచవితి, రంజాన్ శుభాకాంక్షలు అందించే స్థాయికి యెదిగారు కానీ, మొన్న మన స్వాతంత్ర్య దినోత్సవాల్లో, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన--రోశయ్యగారు తిలకించిన, వేడుకల్లో, పిల్లల చేత "శుక్లాంబరధరం", "శాంతాకారం, గగన సదృశం", "మహా గణపితిం మనసా స్మరామి" అంటూ నృత్యాలు చేయించారు! (జాతీయ పండుగలకీ, ఇతర మతాలవారికీ సంబంధం లేదు అని సందేశమా?)

మన రా నా లు గానీ, బ్లాగర్లు గానీ పట్టించుకోలేదు! నేనైతే, ఆ నిర్వాహకుల్ని శంకరగిరి మాన్యాలు పట్టించేవాణ్ని.

ఓ స్కూల్లో, మన అబ్దుల్ కలాం లాంటి పెద్దాయన, విద్యార్థులందర్నీ మీరు పెద్దయ్యాక యేమి అవదలుచుకున్నారో చెప్పమంటే, ఒక్కొక్కళ్లూ--నేను ఇంజనీర్ని కావాలనుకుంటున్నాను, అవగలను; నేను డాక్టరుని కావాలనుకుంటున్నాను, అవగలను; నేను దేశానికి అధ్యక్షుణ్ని కావాలనుకుంటున్నాను, అవగలను--ఇలా చెపుతున్నారట.

ఓ అమ్మయి నేను పెళ్లిచేసుకొని, ఓ నలుగురు పిల్లలకి తల్లయి, మంచి గృహిణి అవగలను అందట.

తరవాత అబ్బాయి, నా ప్రక్క అమ్మాయికి నా సాధ్యమైనంత సహాయం చేస్తాను, చెయ్యగలను--అన్నాడట.

ఇలా వుంటాయి కాబోయే యువతరం వూహలు!


Sunday, September 19, 2010

కబుర్లు


అవీ, ఇవీ, అన్నీ

శ్రావణ భాద్రపద మాసములు వర్షర్తువు--వర్షములు (వానలు) బాగుగా కురియును..........

యెక్కాలపుస్తకం లో యే ఋతువులో యేమిజరుగుతుందో వివరించే భాగంలోది ఇది.

ఈ కాలం లో బుధ్ధున్నవాడెవడూ ఇల్లు కట్టడం మొదలు పెట్టడు.

ఓ ప్రక్కన సిమెంటు కంపనీలు వారం క్రితం బస్తాకి ఓ ముఫ్ఫై రూపాయలూ, ఇప్పుడు మళ్లీ ఓ నలభై రూపాయలూ పెంచి, 200 దాటించాయి.

మన సోకాల్డ్ బ్యాంకింగ్ నిపుణులు మాత్రం, మొన్న రిజర్వ్ బ్యాంక్ రెపో/రివర్స్ రేట్లు ఓ పావలా, అర్థ పెంచగానే, "నెలాఖరు దాకా ఋణాలమీద వడ్డీలు పెరిగే ఛాన్స్ లేదు--ఇప్పుడే ఇళ్లు కట్టేసుకోండి!" అని సలహా ఇస్తున్నారు.

అసలు ఇళ్లు కట్టాలనుకొనేవాళ్లు (కొనుక్కునేవాళ్ళు) యెన్ని చూసుకోవాలి?

వీళ్ల దృష్టిలో వాళ్లందరూ అన్నీ సిధ్ధం చేసేసుకొని, బ్యాంకులు వడ్డీ రేట్లు ఓ పావలా యెప్పుడు తగ్గిస్తాయా అని గోతికాడ నక్కల్లా యెదురుచూస్తూ వుంటరన్నమాట. (ఈ లోపల పుణ్యకాలం కాస్తా కుక్కెత్తుకుపోదూ!)

దటీజ్ అవర్ ఎక్స్ పర్ టైజ్!

ఇక బ్యాంకులు, ఈ పండగల సీజన్ పూర్తయ్యేవరకూ, గృహ వగైరా ఋణాలమీద "టీజర్" రేట్లు కొనసాగుతాయంటున్నారు. (అంటే సామాన్యులందరూ పండగలు మానేసుకొని బ్యాంకుల చుట్టూ, కడుతున్న ఇళ్ల చుట్టూ తిరగాలనా?)

నిజానికి ఈ విధానాలవల్ల బాగుపడుతున్నది రియల్ ఎస్టేట్ వాళ్లు మాత్రమే!

ఇక ప్రణబ్ ముఖర్జీగారు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి 'యెలాంటి చర్యలైనా సరే' తీసుకోవాలని సలహా ఇస్తే, మన దువ్వూరివారు, పెంచింది ఓ పావలా, అర్థా!

అయినా ద్రవ్యోల్బణం దిగొస్తున్న దాఖలాల్లేవు. అహార ద్రవ్యోల్బణం 11-12 నించి దిగడం లేదు. ఇక ఇప్పుడు ఈ పండుగల రూపం లో కాయగూరలూ, పప్పులూ, నూనెలూ, బియ్యం మొదలైనవాటిలో జరిగే వృధా వల్లా, ఈ వర్షాల వల్లా, ఇప్పుడప్పుడే పెరగడం మానుతుందనుకోవఖ్ఖర్లేదు.

వృధ్ధి రేటు మాత్రం, 9 వరకూ, 8.5 వరకూ, కనీసం 7.50 వరకూ వుంటుందని అంచనాలు!

పండగరోజుల్లో, రైళ్లలో, బస్సుల్లో రద్దీ గురించి చెప్పఖ్ఖర్లేదు. 295/- రూపాయల స్లీపర్ టిక్కెట్టుని 900/- కీ, 499/- రూపాయల థర్డ్ ఏ సీ టిక్కెట్ కి 1800/- నించి 2000/- రూపాయలూ పెట్టి తీసుకొన్నారట--మొన్న పండగకి.

వోల్వో బస్సుల్లో 800/- నించి 850/- టిక్కెట్టుకి 1200/- నించి 1500/- వరకూ చెల్లించారట.

ఈ-టిక్కెట్లని సరిగ్గా చెక్ చెయ్యకపోవడం తో, దళారులు ఒకే టిక్కెట్టు మీద ఆరుగురికి బుక్ చేసి, అందరికీ జిరాక్సులు ఇచ్చి, తమకు తోచిన ధర వసూలు చేస్తున్నారట!

ప్రత్యేక రైళ్లలోకూడా, ప్రకటించిన గంటలోపే అన్ని టిక్కెట్లూ 'హూష్....కాకీ' అయిపోతున్నాయట!

వచ్చే పండగల్లో యెలా వుంటుందో?

మన రైల్వేలు ఇక బాగుపడతాయంటారా?

రజనీకాంత్ సినిమాకి తమిళ పేరు వుంటే గానీ కుదరదు అని "యందిరన్" అనే పేరుతో విడుదల చేస్తున్నారట. తెలుగులో "రోబో" పేరుతోనే విడుదల అవుతుందట.

కమ్ముల శేఖర్ మాత్రం, "నాకు తెలుగు పేరు తట్టలేదు అందుకనే నా సినిమా పేరు ఇంగ్లీషులో పెట్టాను" అంటున్నాడు.

యెంత భాషాభిమానమో (వాడికీ మనకీ కూడా)!

Wednesday, September 8, 2010

దండుమారాజులు


ఆధునికీకరణ

గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల్ని 'బలోపేతం' చెయ్యడానికి, గ్రామ సమాఖ్యలకి 'అంకోపరులు' (లేప్ టాప్ లు) అందజేస్తారట--ప్రభుత్వం వారు.

(ప గో) జిల్లాలో మొత్తం 1,728 గ్రామ సమాఖ్యలుండగా, పైలెట్ ప్రాజక్టుగా వీటిలో ఓ 100 సమాఖ్యలకి ప్రస్తుతం ఇవి అందజేస్తారట. (ఒక్కోదాని ఖరీదెంతో తెలీదు. బహుశా యే రూ.35,000/- లో అయ్యుండవచ్చు.)

ఓ మండలం లో వుండే కొన్ని వేల స్వయం సహాయక సంఘాలకి ఓ సమాఖ్య వుంటుంది. సంఘాల సంఖ్య యెక్కువైతే, రెండు మూడు సమాఖ్యలు కూడా వుండచ్చేమో.

ఈ స్వయం సహాయక సంఘాలగురించి అందరికీ తెలిసున్నదే! కొన్నింటిని మినహాయిస్తే, చాలా వాటిలో సభ్యులూ, నాయకురాళ్లూ అందరూ నిరక్షరాస్యులే!

బ్యాంకుల బలవంతమ్మీద, నాయకురాళ్లు మాత్రం తమ పేరు (కనీసం అక్షరాలు తెలిసేలా) వ్రాయడం నేర్చుకొన్నారు. దేనికీ సరైన రికార్డులు వుండవు.

వాళ్లకి ఋణాలు మంజూరు చెయ్యడానికీ, నవీకరించడానికీ, బ్యాంకర్లు పడుతున్న పాట్లు యెవరికీ తెలియదు. (వెలుగు పధకం వాళ్ల వల్ల కొంత బాధ తగ్గింది--కనీసం బ్యాంకులకోసం వాళ్లచేత పుస్తకాలు నిర్వహింపచేసి, సంతకాలు పెట్టిస్తున్నారు.)

మరి వీళ్లు ఈ లేప్ టాప్ లు--అదీ ఈ-బుక్ కీపింగ్ సాఫ్ట్ వేర్ తో--యెలా వుపయోగిస్తారో? పైగా, హైదరాబాదు నించే వీటిని పర్యవేక్షిస్తూ వుంటారట!

2000 వ సంవత్సరం నించీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ నించీ, మిగిలిన ప్రభుత్వ శాఖలన్నిటికీ--ఆధునికీకరణ, అనుసంధానం పేరుతో, యెన్ని కంప్యూటర్లకి యెంత ఖర్చు పెట్టారో, ఇప్పటిక్కూడా యే శాఖలోనూ పూర్తిస్థాయిలో ఇవి యెందుకు పని చెయ్యడం లేదో యెవరైనా అరా తీస్తే బాగుండును!


Saturday, August 28, 2010

కల్మాడీ.....


........కామన్వెల్తూ

వేలకోట్ల రూపాయలతో ముడివడిన కామన్వెల్తు క్రీడల నిర్వహణ వ్యవహారం లో, ఆ కమిటీ చైర్మన్ కల్మాడీనే పాపాల భైరవుణ్ని చేస్తున్నారందరూ.

కానీ, అసలు వాస్తవాలు వేరే వున్నాయట.

కల్మాడీ చేతిలో కేవలం 670 కోట్లు మాత్రమే వున్నాయట.

ఢిల్లీ ముఖ్యమంత్రిణి చేతిలో అక్షరాలా 16,560 కోట్లు పెట్టారట. జైపాల్ రెడ్డి చేతిలో మరిన్ని కోట్లు వున్నాయట.

షీలా సర్కారు పూలు, పూల కుండీల పైనే రూ.135 కోట్లు వెచ్చిస్తోందట!

కేంద్ర క్రీడల మంత్రి మనోహర్ సింగ్ గిల్ స్వయం గా--క్రీడా గ్రామాన్ని ముఖ్య క్రీడా ప్రాంగణం నెహ్రూ స్టేడియం సమీపం లో కాకుండా, తూర్పు ఢిల్లీ ప్రాంతం లో యమునా నది ఒడ్డున నిర్మించడం అంత బుధ్ధితక్కువ తనం లేదు--అన్నాడట!

దీనివల్ల--క్రీడా బృందాలకి రక్షణ కల్పించడానికే చాలా ఖర్చూ, కష్టం అవుతాయని భద్రతా బలగాలే వ్యాఖ్యానించాయట!

అసలు ఇది యెందుకు? అంటే, యమునానదికి అవతలివైపు ప్రాంతానికి ఎం పీ గా ఆవిడ కొడుకు సందీప్ దీక్షిత్ ప్రతినిధి కావడం వల్ల, ఆయన డబ్బాకొట్టుకోడానికి వుపయోగిస్తుందనిట!

ఈ నిర్మాణాలకి తనతో వొప్పందం చేసుకున్న నిధులు సరిపోవని చేతులెత్తేసి వైదొలగిన గుత్తేదారు స్థానం లో మరొకణ్ని వెతుక్కోకుండా, వాడికే మరిన్ని వందల కోట్లిస్తాం, బాబ్బాబూ, పని పూర్తి చెయ్యి అని బ్రతిమాలుకున్నారట! యెందుకో మరి?

క్రీడలు అయిపోయాక, ఈ ఫ్లాట్లని చదరపు గజం రూ.1,20,000/- కి అమ్మాలని ఆలోచనట--కానీ, చిన్నపాటి గాలి వీచినా, వర్షం వచ్చినా కదలబారిపోయే విధం గా నిర్మాణమవుతున్న వీటికి--యెంత వస్తుందో యెవరైనా ఆలోచించవచ్చు.

వీటి నిర్మాణం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆధ్వర్యం లోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ చేస్తోందట!

క్రీడలకి కేటాయించబడిన మొత్తం బడ్జెట్ రూ.28,054/- కోట్లు అయితే, ఇంకా చాలా యెక్కువే ఖర్చు పెడుతున్నారట!

ఇంతకీ, కల్మాడీ ముసుగులో యెందరో అవినీతిపరులు!

విచారణ మాత్రం--తీరికగా--క్రీడలు అయిపోయాకేనట.

దేశ గౌరవం ముఖ్యం కాదూ!


Monday, August 23, 2010

భాగ్యమా--బంగారమా


స్పెన్సర్ రేట్లు

అప్పుడెప్పుడో, పోచారం వారి అల్లుడనుకుంటా ఆయన పనిచేసే ప్రభుత్వ శాఖకి--పిన్ కుషన్లూ, పేపర్ వెయిట్లూ లాంటివి కూడా బంగారం తో తయారైతే యెంత రేటు వుంటాయో అంత పెట్టి కొనేశాడట.

దానిపై గొడవ జరిగితే, పోచారం "మా అల్లుడు బంగారం" అన్నట్టు గుర్తు.

ఇక ఇప్పుడు--

మన కామన్వెల్త్ కమిటీ, ఈఎస్ గ్రూప్ అనే ఓ బ్రిటిష్ కంపెనీనించి క్రీడా వేదికల వద్ద వాడకానికని కొన్ని వస్తువులు, అవి ప్లాటినం తో తయారయితే యెంత రేటు వుంటాయో, అంతరేటు కి కొనేసిందట!

ఈ విషయం "గార్డియన్" పత్రిక ప్రచురించిందట.

ఆ రేట్లు ఇలా వున్నాయి :

360 కాగితం రుమాళ్ల (టిష్యూ పేపర్) డబ్బాలు ఒక్కోటీ రూ.4,631/-

176 చెత్త కుండీలు (వేస్ట్ బేస్కెట్స్) ఒక్కొక్కటీ రూ.7,256/-

20 సింకులు ఒక్కోటీ రూ.36,259/-

480 ద్రవ సబ్బు సీసాలు (లిక్విడ్ సోప్) ఒక్కోటీ రూ.9,336/-

ఇంకా మూడు స్టేడియాలూ, ఒక తాత్కాలిక స్టేడియం, 18 శిక్షణా కేంద్రాల దగ్గరా సేవలు అందించడానికి ఈ సంస్థ భారీ కాంట్రాక్టునే పొందిందట!

యేది యేమైనా, ముందు దేశ గౌరవం ముఖ్యం కాబట్టి, యే అవినీతి కుంభకోణాలమీదా ఆటలు పూర్తయ్యే వరకూ యే చర్యలూ తీసుకొనే ప్రసక్తి లేదని మంత్రులూ, ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసేశారు మరి.

కొసమెరుపేమిటంటే--మణిశంకర్ అయ్యర్, నేను నా యెత్తు ధనం పోసినా ఈ ఆటలు చూడనుగాక చూడను, అందుకోసమే విదేశాలకి వెళ్లిపోతున్నాను--అని ప్రకటించాడు!

మన నీతి ఈ గతి యేడుస్తూంటే, దేశమేగతి బాగుపడునోయ్!


Thursday, August 12, 2010

మావిస్టుల కంచుకోటలో మమత


బాగా యెడం ప్రక్కకి తిరిగిన తృణమూలాలు

ఈ పిచ్చక్కకి చిలకమర్తివారి గణపతి వాళ్లమ్మకి చేయించిన వైద్యం చేయిస్తేనే గానీ కుదరదనుకుంటా!

2004లో రాశ్శేఖర్రెడి యెన్నుకున్న 'పులిమీద స్వారీ'నే తన విజయానికి బాటగా స్వీకరించినట్టుంది ఈవిడ.

యేచూరీ! నారాయణా! మిష్టర్ & మిసెస్ కారత్! బర్ధన్!--వాట్ ఈజ్ యువర్ స్ట్రేటజీ?

దిగ్విజయ్! మొయిలీ! ఆంటొనీ! వయలార్! షీలా! ప్రణబ్! మన్మోహన్! సోనియా! వాట్ ఈజ్ యువర్.......?


Thursday, July 29, 2010

'మెమరీ' అనే ఙ్ఞాపక శక్తి


"గూ......'గుల్ల'యితే"

..........అవుతుందా? యేమో! ఈ ప్రపంచం లో యేదైనా జరగవచ్చు!

ఓ పన్నెండేళ్ళ క్రితం, ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం అక్షరాలా మూడువేల రూపాయలు చెల్లించి, నెలకి ఐదో, యెనిమిదో వందలు వాడికి చదివించుకుంటూ, 256 కే బీ పీ ఎస్ మోడెం తో, (వర్షాలు వచ్చి చెన్నై ములిగి పోయింది కదండీ--ఇంకో వారం దాకా నెట్ కనెక్ట్ అవక పోవచ్చు--మా ఇంజనీర్లు పాపం ఆ వానలోనే ప్రయత్నిస్తున్నారు--లాంటి క్లారిఫికేషన్లతో) "కనెక్ట్" అన్న తరవాత ఓ పావు గంటకి--అయితే--అయ్యే కనెక్షన్లతో, నెట్ బ్రౌజింగ్--ఓ తప్పనిసరి తద్దినం!

అప్పుడే, "నెట్ స్కేప్" బ్రౌజర్ వాడు, 0.5 కే బీ నో, 5.0 కేబీనో "ఫ్రీ డిస్క్ మెమరీ" అని అనౌన్స్ చేస్తే, ఓ రాత్రి తెల్లవార్లూ, "దీన్నెలాగైనా సాధించాలి--అంత మెమరీ అంటే మాటలా!?" అనుకొంటూ, చివరికి సాధించిన రోజు నాకు బాగా గుర్తు.

మరి ఇప్పుడు?

ఒక్క గూగుల్ వాడే, 7,481.558803 మెగాబైట్స్ (అండ్ కౌంటింగ్) ఫ్రీ అంటూ సెకెనుకి 4 మెగాబైట్ల చొప్పున పెంచుకుంటూ పోతున్నాడు (మెగా బైట్లు కాదేమో--బిట్లో, బైట్లో అయి వుంటాయి.)!

ఇప్పుడు, మనం మెయిల్స్ గానీ, ఇంకేమైనా సమాచారం గానీ, "డిలీట్" చెయ్యడమే మానేశాం. కాకుండా, కొన్నెవేల బ్లాగులూ, వాటి మీద లక్షలకొలదీ కామెంట్లూ!

పోనీ బ్లాగుల్లో విషయం చూస్తే, ఆశమ్మ, బూశమ్మ పోచుకోలు కబుర్లూ, వంటలూ, దేవుళ్ళూ, చెట్లూ, పుట్టలూ, పువ్వులూ, కాయలూ--ఇంకా ఒకళ్ళమీద ఒకళ్ళు పడి యేడవడం! ఇంకా కాలక్షేపం లేకపోతే, వుండనే వున్నాయి, వేదాలూ, పురాణాలూ, ఉపనిషత్తులూ, ఇతిహాసాలూ, వైద్యాలూ--ఇంకా చాలా!

మొన్నామధ్య పసిఫిక్ లోనో, అట్లాంటిక్ లోనో--కాదు మధ్యధరా లో, అదేదో ఓడకి తగిలి కేబుల్స్ తెగిపోతే, ఓ వారం పాటు కొన్ని దేశాల్లో నెట్ సంథానం తెగిపోయింది. మిగిలిన దేశాల్లో వేగం తగ్గిపోయింది. పాపం ఆ ఇంజనీర్లు కష్టపడి, సముద్రం క్రింద 24 గంటలూ పని చేసి, మళ్లీ నార్మల్ కి తెచ్చారు.

మరి రేపేమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో, వున్న మెమరీ ని కాస్త "నిర్మాణాత్మకం"గా వుపయోగించుకోలేమా?

ఆలోచించండి!

Wednesday, July 28, 2010

ధూమ(రహిత)శకటాలు


లజ్జారహిత మంత్రిణి

  • 150 మంది మృతి చెందిన ఙ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం "సర్కారు అంటే గిట్టనివారు పన్నిన కుట్ర"ట.

  • 63 మంది అశువులుబాసిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక రైల్వేలని "బదనామ్ చెయ్యాలనుకుంటున్న వర్గాల ప్రమేయం వుందని" అనుమానం ట.

  • ఢిల్లీ స్టేషన్ లో, రైలు వస్తూందనగా, ప్లాట్ ఫామ్ మార్చామని ప్రకటించి, అందరూ మెట్లెక్కుతుండగా, మళ్లీ అది తప్పు అనీ, ఇదివరకు అనౌన్స్ చేసిన ప్లాట్ ఫామ్ మీదకే వస్తుందనీ చెప్పడం తో, తొక్కిసలాటలో అనేక మంది గాయ పడ్డారు, ఇద్దరు మరణించారు. "తప్పంతా జనాలదే! బుధ్ధిలేకుండా అలా పరుగులు పెట్టడం యేమిటి" అని ఈసడించారట.

ఇవన్నీ యెవరు అన్నారు? ఇంకెవరు--మమతాదీ నే!

రైల్వేలలో 89,000 వుద్యోగాలు కొన్ని యేళ్ళుగా ఖాళీగా వున్నాయట.

అందులో 20,000 వుద్యోగాలు "రైల్వే భద్రత, రక్షణ"లకి సంబంధించినవేనట.

26,000 డ్రైవర్ పోస్టులు ఖాళీగా వున్నాయట. 7 గంటలు మాత్రమే పనిచెయ్యవలసిన డ్రైవర్లు, పది పదిహేను గంటలు
పనిచేస్తున్నారట!

రైలు మొత్తానికి ఒకే టీ టీ ఈ తో నడుస్తున్న రైళ్ళు చాలా వున్నాయట.

బ్రిటీష్ వాళ్ళు నిర్మించిన రైలు మార్గం 52,000 కి. మీ. లైతే, స్వతంత్రం వచ్చాక 63 యేళ్ళలో కొత్తగా నిర్మించింది కేవలం 12,000 కి. మీ. కూడా లేదట.

ఇక "తృటిలో" తప్పిన ప్రమాదాల గురించి, రోజుకి రెండో మూడో వింటూనే వున్నాము.

ఇక ఇప్పుడు, ముఖ్యమైన స్టేషన్లలో ఒక్కోటీ 70 లక్షలు ఖర్చయ్యే "ఎస్కలేటర్లు" నిర్మిస్తారట! (మెట్లెక్కుతూనే
తోసుకొనే ప్రయాణీకులు ఎస్కలేటర్లు యెక్కడం లో యెన్ని ప్రమాదాలకి గురవుతారో!)

ఆ మాత్రం ఖర్చుతో ఒక్కో ప్లాట్ ఫామ్ మీదా అటు రెండూ, ఇటు రెండూ లిఫ్టులే యేర్పాటు చెయ్యవచ్చు! పైగా సురక్షితం గా వుంటాయి.

(తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో వున్నాయి ఇలా లిఫ్ట్ లు. అక్కడ అనేక అంతస్తులు వున్నాయి. మరి ప్లాట్ ఫామ్ మీదైతే, ఒక్క అంతస్తే కదా?)

మరి ఈ స్కీమే యెందుకంటే, వేరే అడగాలా--కోట్లు నొక్కెయ్యడానికని తెలియడం లేదూ!

రైల్వే శాఖ వెబ్ సైట్ లో కూడా, ఈ-టిక్కెట్లని అమ్ముతారట--ఐ ఆర్ సీ టీ సీ గుత్తాధిపత్యాన్ని నివారించడానికి! (ఇక రెంటికీ చెడ్డ రేవళ్లవుతారేమో అమాయక ప్రయాణీకులు!)

ఇదివరకే ఓసారి వ్రాశాను--ఇంకా రైళ్లలో గమ్యం చేరగలుగుతున్నారంటే, నిబధ్ధతతో వుద్యోగాలు చేస్తున్న
కొన్నివేల--గ్యాంగ్ మెన్ లూ, పాయింట్ మెన్ లూ, సిగ్నల్ మెన్ లూ వగైరాల వల్లే గానీ, ఇలాంటి 'మమత 'ల వల్ల కాదు అని.

ఇలాంటివాళ్ళని మంత్రివర్గం లో వుంచి, మేపుతున్న ఖర్మ మన కేంద్ర సర్కారుది!

హేపీ జర్నీ!


Sunday, July 18, 2010

ఐ ఆర్ సీ టీ సీ


ఇంకో బ్లాగర్ల విజయం

మామూలు రిజర్వేషనులూ, తత్కాల్ రిజర్వేషనులూ వుదయం 8.00 గంటలకే ప్రారంభించడం తో, ట్రాఫిక్ యెక్కువై, ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ శాఖ విజిలెన్సు తదితర అధికారులు (బహుశా ఐ ఆర్ సీ టీ సీ వాళ్ళతో చర్చించి) నిర్ధారణ చేసుకున్నారట.

శుభవార్తేమిటంటే, తత్కాల్ రిజర్వేషనులని వుదయం 10.00 గంటలకి మాత్రమే ప్రారంభించి, మామూలు రిజర్వేషనులని 8.00 గంటలకే ప్రారంభిస్తారుట.

ఇది నిశ్చయం గా మన బ్లాగర్ల విజయమే!

కానీ అప్పుడే చంకలు గుద్దేసుకోకండి. ఇది పాక్షిక విజయం మాత్రమే. యెందుకంటే ఇందులో పెద్ద మతలబు వుంది.

అదేమిటంటే, నెలా రెండునెలలు ముందుగా రిజర్వు చేసుకోవాలనుకొనేవాళ్ళకి, వుదయం 8.00 గంటలకే పరుగెత్తాల్సిన అవసరం వుండదు గా? రోజుకి ఓ మూడు నాలుగు గంటలు కంప్యూటర్ రిజర్వేషను అనుమతించినా, అది అర్థరాత్రి ప్రారంభించినా, ఇలాంటివాళ్ళకి యేమీ నష్టం లేదు.

అర్జెంటుగా బయలుదేరవలసి, ఓ రెండురోజుల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించే తత్కాల్ వాళ్ళకి దీనివల్ల యేమి వొరిగింది?

అంతేకాదు. మీరు గత యేడాదిలో యెప్పుడైనా పట్టణాల్లో రిజర్వేషన్ కౌంటర్ ల ముందు నిలుచున్నారా, చేతిలో పూర్తి చేసిన ఫారాలతో? అయితే గమనించే వుంటారు.

సహజం గా మనం లైను ఆఖర్లో నుంచుంటాం--మన ముందు ఓ పదిహేను నించీ ఇరవై మంది నించుని వుంటారు. మనం రెండు మూడు గంటలు నిరీక్షించినా, మనం కౌంటరు దగ్గరకి చేరం. మనముందున్న క్యూ తరగదు. ముందున్నవాళ్ళ మధ్యలో కొంతమంది చేరిపోతూ వుంటారు. మనం యేమైనా అంటే, 'మావాడేనండి--ఇందాకే బయటికి వెళ్లాడు.' అంటారు. ఇంకా మనమేమైనా మాట్లాడితే, అందరూ మూకుమ్మడిగా మనమీద తిట్ల దాడి చేస్తారు.

మనం వాళ్ళనేమీ అనఖ్ఖర్లేదు. యెందుకంటే, వాళ్ళు తమ పొట్టకూటికోసం ప్రముఖ ట్రావెల్ యేజంట్లదగ్గర పనిచేసేవాళ్లు. క్రితం రాత్రే, ఫారాలు పూర్తి చేసుకొని, దానికి తగిన చిల్లర నోట్లతోసహా స్టేపుల్ చేసుకొని, జిప్ బ్యాగుల్లో సర్దుకొని, బయలుదేరతారు. 7.00 గంటలకే, వీలైతే ఇంకా ముందే క్యూలో చేరతారు. మొదటివాడు తన బ్యాగు లోని ఒక ఫారం తాలూకు టిక్కెట్లు చేతికందగానే, పక్కకు వెళ్ళిపోతాడు. ఓ బెంచీలో కూర్చొని, జిప్ బేగ్ తెరిచి, ఓ అరలో ఆ టిక్కెట్లని వుంచి, ఇంకో జిప్ తెరిచి, ఇంకో ఫారం తీసుకొని, మళ్లీ క్యూలో చేరతాడు--ఒక్కడే అయితే మన వెనుక, వాళ్ళ మనిషి యెవరైనా మనముందున్నవాళ్ళలో వుంటే, వాడి వెనక!

(ఇలాంటి ప్రక్రియకే రాయల సీమలో "సైక్లింగ్" అనే పేరు పెట్టారు. ఇది వీలవడం లేదనే, "ఏ వీ ఎం లు వద్దు--బ్యాలెట్ పేపరే కావాలి" అని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నది!)

ఇలాంటివాళ్ళకి యెంత సుఖం? రాత్రి పొద్దుపోయేవరకూ ఫారాలు నింపి, నోట్లు పిన్ను కొట్టుకోనక్కరలేదు. పొద్దున్న 7.00 కి మొదలు పెట్టినా, భోజనాలు చేసి మరీ క్యూల్లో నించోవచ్చు!

బాగుంది కదా! మన ప్రజా రవాణా వారు మన చెవుల్లో క్యాబేజీలూ, క్యాలీ ఫ్లవర్లేకాదు--అవసరమైతే టోకున బ్రహ్మకమలాలని కొని, పెట్టగలరని అర్థమవుతోందా?

మరి వుద్యమించండి!