Saturday, January 29, 2011

కబుర్లు - 27

అవీ, ఇవీ, అన్నీ

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్--"Last resort for Government/Management scoundrels!"

ఓ వుద్యోగి, నీతిగా, నిజాయితీగా తన పని చేసుకొంటూ, పైవాడు అవినీతికో, ఇంకదేనికో వొడిగడుతున్నప్పుడు వాడికి అడ్డం పడుతూంటే, పైవాడు వీడిమీద ఓ చిన్న కేసేదో నమోదు చేసి, సీవీసీ కి రిఫర్ చేస్తాడు! 

అక్కడున్నదీ విజిలెన్స్ ఇన్స్ పెక్టర్లూ, కమీషనర్లూ అందరూ వెధవలే! "నా చేతికొచ్చిన యేకేసులోనూ ముద్దాయి శిక్ష పడకుండా తప్పించుకొన్నది లేదు" అని బోరవిరుచుకొని తిరుగుతూంటారు వాళ్లు.

వీళ్లందరూ గురివెందలైతే, వాళ్ల ఛీఫ్ థామస్ సగానికి పైగా నలుపు వున్న పెద్ద గురివెంద!

వాడిని కాపాడుతున్నవాళ్లు పూర్తి నల్లగా వుండి, పైనెక్కడో కాస్త యెర్ర రంగున్న అతి పెద్ద గురివెందలు!

మొన్న, తన పదవికి రాజీనామా చేస్తానన్నాడట--థామస్. 

మళ్లీ ఇవాళ, అబ్బే...అంటున్నాడు.

సీవీసీని నియమించడానికి యేర్పాటు చేసిన కమిటీలో, ప్రథాని, హోం మంత్రి, ప్రతిపక్ష నాయకుడు (రాలు) సభ్యులట. థామస్ అప్పటికే కేరళలో పామోలిన్ నూనె కుంభకోణం లో నిందితుడు, ముద్దాయి. తరవాత కేంద్ర టెలికాం కార్యదర్శిగా, 176000 కోట్ల కుంభకోణాన్ని మూసిపెట్టి, రాజాకి బాగా సహకరించాడు. 

ఆయన 'నిష్కళంకుడూ, నిజాయితీపరుడూ' అంటూ సుప్రీం కోర్టులో కితాబిచ్చింది ప్రభుత్వం. 

(సీవీసీ నియామకానికి 'నిష్కళంకుడూ, నిజాయితీపరుడూ' కావడం ఓ అర్హత కానేకాదు అన్నాడో వెధవ!)

ఆ సమయంలో ఆయన మీద కేసులు వున్న సంగతే మాకు తెలియదు అన్నారు సుప్రీం కోర్టులో! కేరళ ప్రభుత్వం ఆయనమీద విచారణకి అనుమతి ఇచ్చిన విషయమే తమకు తెలియదు అన్నారు. 

క్రితం సెప్టెంబరులోనే, చిదంబరం, ఆయన ఆ అవినీతికేసులోంచి బయట పడ్డాడు అని సిగ్గులేకుండా అబధ్ధం యెందుకు ఆడాడో మరి?

2002 లోనే ఛార్జిషీటు నమోదైవున్న థామస్ ని, త్రిసభ్య సంఘంలో సభ్యురాలైన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ 'కూడదు' అంటున్నా, మిగిలిన ఇద్దరూ యెందుకు నియమించారో?

తనమీద కేసులనీ, టెలికాం కేసులనీ, తనే 'పర్యవేక్షించే' దుస్థితి ఆయనకి యెందుకు ప్రాప్తించిందో మరి!

అజీం ప్రేమ్‌జీ లాంటి వాళ్లో పధ్నాలుగు మంది ఇప్పుడు గొంతు చించుకుంటున్నారు--ఈ కాంగీలని రూపు మాపండి అని!

చూద్దాం!

"Power corrupts....and absolute power currupts absolutely" అని, అంత అధికారం కోసం ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ! (రాశ్శేఖర్రెడ్డి కూడా అనుభవించాడు అబ్సల్యూట్ పవర్!). సోనియా కూడా ప్రయత్నిస్తూంది......కానీ.....అప్పుడు ఒక్కడే హెచ్ ఆర్ ఖన్నా! ఇప్పుడనేకమంది!

అప్పట్లో, జాతీయ పత్రికల్ని కంట్రోలు చేస్తే సరిపోయేది! ఇప్పుడు అనేక మీడియాలు!

శ్రీకృష్ణదేవరాయలు భార్య, ఆపుకోలేక, తలుపు చెక్క ఆడిస్తే, తెనాలి రామలింగడు "కిర్రూ, పుర్రూ బాగానే కలిసిపోయాయి" అని వ్యాఖ్యానించి, మొగుడూ పెళ్లాలమధ్య తంపు పెట్టి, తిమ్మన చేత పారిజాతాపహరణం వ్రాయింపచేశాడు.

ఇప్పుడు అనేకమంది తెనాలి రామలింగళ్లు! కాంగీల వ్యవహారాలని లౌడ్ స్పీకర్లలో మరీ వినిపిస్తున్నారు!    

అందుకే అంటున్నారు--"రాజ్యాంగాన్ని కాంగీ బారినుంచి కాపాడవలసిన అవసరం వచ్చింది! కాంగీలు తమ పార్టీని ఆ పార్టీనుంచి రక్షించుకొనే అవసరం వచ్చింది!" అని. 

చూద్దాం, యేమి వెలగబెడతారో!

ఓ ఐదారేళ్లక్రితం, వుల్లిపాయలు నిలవ చెయ్యడానికి ప్రభుత్వం గోదాములు నిర్మించింది--కొన్ని కోట్లతో. అందులో వుల్లిపాయలు మాత్రమే పట్టే అరలు నిర్మించారట! ఇప్పుడు దాచడానికి వుల్లిపాయలు లేక, ఆ గోదాములు వెలతెల పోతున్నాయట!

ఇప్పుడు, జిల్లాకు 15 క్లస్టర్లు (ఒక్కో క్లస్టర్ లోనూ 10 యెకరాలతో) చొప్పున, నాలుగు జిల్లాల్లో, ఒక్కో క్లస్టర్ కీ 1.36 కోట్లతో--పందిళ్లూ, షేడ్ నెట్ లూ, విత్తనాలూ సరఫరా చేసి, టమోటా, వంకాయ, మిరపకాయ, క్యాప్సికం, క్యాబేజీ, కాకర, సొరకాయ, పొట్ల, బీరకాయలు ప్రథానంగా పండించేందుకు యేర్పాట్లు చేస్తున్నారట!

మొత్తం వ్యయం 82.99 కోట్లయితే, అందులో ప్రభుత్వం 42.48 కోట్లు సబ్సిడీ ఇస్తుందట. ఇప్పుడే 10.68 కోట్లు విడుదల చేసిందట.

అసలు ఈ కూరగాయలన్నీ ఇప్పుడు మన రాష్ట్రంలో పండడం లేదుకదా? అందుకే ఈ బృహత్ప్రణాళిక! బాగుంది కదూ?!

నాకర్థం కాని విషయం, యెప్పుడూ కొంతమంది వెధవలే యెందుకు ప్రణాళికలని రచిస్తారా? అని.

బెజవాడ కనకదుర్గ కొండమీద, ఓ ఐదంతస్తుల 'మల్లికార్జున మహా మండపం' నిర్మించాలనీ, ఆ మండపం పైన 'కార్ పార్కింగ్' యేర్పాటు చెయ్యాలనీ, ఇందుకు ఓ 20.50 కోట్లు ఖర్చు పెట్టాలనీ, 2008 లోనే నిర్ణయించారట! కొండ క్రిందనుంచి సరాసరి భవనం పైకే కార్లూ, స్కూటర్లూ వెళ్లిపోవాలట. ఇందుకోసం 'ర్యాంపుల' నిర్మాణానికి 11.4 కోట్లు కేటాయించారట. టెండర్లు కూడా ఖరారు అయ్యాయట! 

కొత్త కమీషనరు రావడంతో, ఇవన్నీ ఆపెయ్యండి, తరవాత చూద్దాం అంటే, ఆపేశారట. 

ఆలయం యెదురుగా రాజగోపురం లేకపోవడం ఓ పెద్ద లోటుగా భావించి, 92 అడుగుల యెత్తూ, 9 అంతస్థులూ తో గోపుర నిర్మాణానికి 9.8 కోట్లతో అంచనావేసి, టెండర్లు ఖరారు చేశారట. 

చిత్రమేమిటంటే, మహా మండపం మధ్యనించీ గోపుర నిర్మాణం జరగాలట! (దాని చుట్టూ పార్కింగులన్నమాట!) ఒక్కో అంతస్థూ అమ్మవారి ఒక్కో రూపానికి ప్రతీకగా నిర్మించాలట. మండపం యెత్తుతోకలిపి, గోపురం యెత్తు చూస్తే, 155 అడుగులు వుంటుందట. (నగరం చుట్టుప్రక్కల యెక్కడనించి చూసినా గోపురం కనిపించాలనేది సెంటిమెంటుట!)

మళ్లీ, గోపురం యెత్తు 82, 72 అడుగులకి తగ్గించి, ప్రస్తుతం 55 అడుగులకి పరిమితం చెయ్యాలని కొంతమంది నిపుణుల సూచన ప్రకారం డిజైన్లు మారుస్తున్నారట. అంగట్లో అన్నీ వున్నా.....అన్నట్టు, "కమీషనరు నుంచి డిజైన్లకు ఆమోదం లభిస్తే, ఇంకెంత పని?" అంటున్నారట గుత్తేదారులు!

ప్రతీ సంవత్సరం కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డు కే అంతరాయం కలుగుతుంటే, కొండనాలుక్కి మందేస్తే....అన్నట్టు....అసలు కొండనే నాశనం చెయ్యరుకదా?!

చూద్దాం!

ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగి, 15.57 శాతానికి చేరిందట. క్రితం యేడాదితో పోలిస్తే, కూరగాయలు 67.07 శాతం పెరిగితే, వుల్లిపాయలొక్కటీ 111.58 శాతం పెరిగాయట. పళ్లూ, పాలూ, ఇతర ప్రొటీన్ ఆహారాలూ.....అన్నీ పెరిగాయట. 

వచ్చే మార్చికి అన్నీ నేలబారుకి వొచ్చేస్తాయటలెండి! అప్పటిదాక, యేదో చూస్తూ, నేలనాకుతూ వుండండి మరి.

.....సోనావాణె.....బలైపోయిన ఓ ఐ యే యెస్ అధికారి! కిరసనాయిలు కల్తీ చేస్తున్నవాళ్లని సెల్ ఫోన్ లో చిత్రించి, వెళుతుంటే, కిరసనాయిలే పోసి తగులబెట్టారట వాళ్లు ఆయన్ని!

మా మొవ్వ తిరుమల కృష్ణబాబు కూడా, అప్పుడెప్పుడో, కన్ను లొట్టబోగొట్టుకున్నాడలాగే!

లూధియానాలో, ఎక్సైజ్ పన్నుల విభాగం వారు, నకిలీ బిల్లులతో 30 ఆటోల్లో సరుకుల్ని తరలిస్తూండగా, అధికారి డీ ఎస్ గర్చా మొ. వారు వారిని ప్రశ్నించడంతో, వాళ్లు కర్రలూ, కత్తులతో వీళ్లపై దాడి చేసి, పాపం దొరికిన వాహన డ్రైవర్ని రైలు క్రిందకి తోసేశారట. పాపం అయన తృటిలో తప్పించుకున్నాట్టలెండి!

సర్వేజనాస్సుఖినోభవంతు....ఇంకేమంటాం?

Friday, January 21, 2011

కబుర్లు - 26

అవీ, ఇవీ, అన్నీ

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐఏఎస్ దంపతులు అరవింద్ జోషి, టినూ జోషి లు ఓ 360 కోట్లు మాత్రమే అక్రమంగా సంపాదించారని తేలిందట!

గత యేడాది ఫిబ్రవరిలో వారి నుంచి రూ.3 కోట్లు జప్తు చేసి, సస్పెండు చేశారట. అది కేవలం "టిప్ ఆఫ్ ది ఐస్ బెర్గ్" కూడా కాదనీ, ఆ ఆస్థుల చిట్టా 7000 పేజీల నివేదిక వ్రాయవలసి వచ్చిందట.

యేదో అనుకున్నాము--మన రానాలూ, వాళ్ల కొడుకులే కాదు ఐఏఎస్ లు కూడానన్నమాట!

"వెధవ డబ్బుదేముంది--కుక్కని కొడితే, కోట్లు రాలుతాయి" అని యెవరో అంటే, అలాగా! మరి మనకి రాలవేమిటి అనుకున్నాము. బహుశా సరైన కుక్కనీ, సరైన రాయినీ, సరైన సమయాన్నీ యెన్నుకోవడం వాళ్లకి తెలిసినట్టు మనకి తెలీదేమో?!

అందుకే అధిష్టానం, వాళ్ల తైనాతీలూ "సరైన సమయం లో సరైన నిర్ణయం" అంటూ వుంటారేమో?!

కానివ్వండి.

స్విస్ బ్యాంకుల్లో మన వాళ్లు దాచిన దాదాపు 70 లక్షల కోట్ల గురించీ ఇంకా వికీ లీక్స్ వాడు ప్రకటించలేదు. అదేదో జర్మన్ బ్యాంకులో దాచినవాళ్ల వివరాలు తెలుసుగానీ, వాటిని సుప్రీం కోర్టుకి కూడా సమర్పించలేము అంటూ, ఓ చిన్న అధికారి చేత సంతకం చేయించి సమర్పించారట మన కేంద్ర ప్రభుత్వం వారు. ఆ దేశంతో వొప్పందం ప్రకారం వాళ్ల దగ్గరనుంచి పన్నువసూలు చేసుకోడానికి మాత్రమే ఆ వివరాలు వాడుకోవాలట! ఆ డబ్బుని వెనక్కి రప్పించడం కూడా తన తరం కాదని మన్మోహన్ వాపోతున్నాడు! యెంత చక్కటి వొప్పందాలో కదా?!

ఈ లోపల ఆ రహస్యాలు బయటపెట్టిన మాజీ స్విస్ బ్యాంకు అధికారి పై చర్యలు మొదలుపెట్టారట. ఇప్పటివరకూ "ఆసాంజ్"ని యేమి పీకారో, ఇప్పుడు ఈయన్ని యేమి పీకుతారో? అయినా, అరచేతులు అడ్డుపెట్టి, సూర్యుణ్ని ఆపలేరు(ట).......కదా....??!!

గోతికాడ నక్కల్లా కూర్చున్న మన 33 మంది ఎంపీలూ "ఇంకా చొంగలు కారుస్తూనే వుండండి" అని తమ అధిష్టానం ఆదేశించడంతో, తోకలు ముడుచుకొని, అదేపని చేస్తున్నారట. మంత్రి వర్గ విస్తరణో, పునర్వ్యవస్థీకరణో వుంటుంది అంటే, "పదవులు తీసుకోడానికి మేం సిధ్ధం--మిగిలిన విషయాలతో దానికి సంబంధం లేదు" అని సిగ్గువిడిచి ప్రకటించినా, బిస్కట్లు వెయ్యవలసిన ఇంకా పెద్ద కుక్కలు వున్నాయి, వాటి తరవాత, వచ్చే యెలక్షన్లలో ఫలితాలు చూశాక, అప్పుడు మీ దగ్గరికి వస్తాం.....అన్నారట.

చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత మహాదేవా! అంటారు.....అందుకేనేమో!

Tuesday, January 18, 2011

కబుర్లు - 25

అవీ, ఇవీ, అన్నీ

నిన్న ఎన్ టీ ఆర్ వర్థంతి సందర్భంగా, అనేక కార్యక్రమాలూ, పురస్కార, బహుమతి ప్రదానాలూ, నివాళులు అర్పించడాలూ బాగానే జరిగాయి.

ఇంకా కొంతమంది వర్థంతులు కూడా జరిగాయి. 

ఈ సందర్భంలో, చంద్రబాబు "ఎన్ టీ ఆర్" కి భారత రత్న ప్రకటించవలసిందే అన్నాడు. మొహమాట పడకుండా, తిక్కవరపు సు రా రె కి ఓ ఫోను కొడితే, రేపు 26 కే వచ్చేస్తుంది. ఆయనకి ఇలాంటి విషయాల్లో తర, తమ భేదాల్లేవు. ఇప్పటికే మంగళంపల్లి కి ఆ "రత్న" కోసం ప్రయత్నాలు చేస్తున్నానని ప్రకటించాడు కదా? ఈయన చెప్పవలసిందల్లా, 'ఆయనకి అంత అర్జెంటు లేదు, ముందు దివంగత ఎన్ టీ ఆర్ కి ఇప్పించు'--అని అడగడమే!

ఇవేమి పూలో (నా 'నేచర్ లవర్' లైబ్రరీ నుంచి) చెప్పగలరా? నాకూ వాటిని చూడడం ఇది మొదటిసారే! కాలవ గట్లమీద పెరిగే 'తిప్ప తీగి' పువ్వులు అలా, ఇంకొంచెం పెద్ద సైజులో వుండేవి! (ఆయుర్వేద ఔషధ గుణాలున్న తిప్పతీగి ఇప్పుడు కనుమరుగయింది!)

ఇంతకీ ఇవి "యెర్ర చిలగడ దుంప" పూలు! మా మేడమీద 6' X 2' మడిలో, దుంప ఓ చివర ఓ అంగుళం ముక్క కోసి పాతితే, 4 నెలల్లో ఓ రెండున్నర కేజీల దుంపలు వచ్చాయి!  

ఇంక ఓ 'దుంపల సప్తాహం' నిర్వహించి, దుంపల కూరా, పచ్చడీ, పులుసూ, బెల్లం పాకం పట్టిన దుంపలూ, కాల్చిన దుంపలూ--ఇలా "కందమూల కౌద్దాళికులై" ఆహార ద్రవ్యోల్బణాన్ని తట్టుకున్నాము!

మీరు కూడా ప్రయత్నించండి.

Monday, January 10, 2011

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

"కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును పరిశీలిస్తే....కేవలం సాంకేతిక అంశాలే కాకుండా రాజకీయాలు కూడా పనిచేశాయా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై రైతులు, ప్రజలు ఉద్యమించకపోతే వచ్చే నలభై యేళ్లదాకా రాష్ ట్రానికి విముక్తి వుండదు."

-- చెరుకూరి వీరయ్య

ఈ మధ్య విజయవాడ పోలీసు కమీషనర్ పి. సీతారామాంజనేయులు, తగిన సాక్ష్యాధారాలతో మీడియా తనమీద ఆరోపణలు చేస్తే, తనకి కొంతమంది స్త్రీలతో పరిచయం వున్న మాట నిజమేగానీ, తన క్యారెక్టర్ బ్లెమిష్ లెస్ అనీ, కావాలంటే తాను ఇంతకు ముందు పనిచేసిన ఐదారు జిల్లాల్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు అనీ కుప్పిగంతులు వేయడం చూస్తుంటే, ఇన్నాళ్లూ ఆ వుద్యోగం యెలా వెలగబెట్టాడా అని అనుమానం వస్తూంది. పైగా ఇటీవలే పదోన్నతి కూడా ఇచ్చారట! ఇంకా బదిలీయే చెయ్యలేదట. ఇప్పుడు సస్పెండు అయినట్టున్నారు.

మావిష్టులు :

"......ఏ వో బీ (ఆంధ్రా ఒడిసా బోర్డర్) లో మాత్రం చెలరేగిపోతున్నారట. అక్కడ 'బహిరంగ కార్యక్రమాలు ' నిర్వహిస్తున్నారట. ప్రభుత్వ ఆస్థుల దహనం, ఇన్‌ఫార్మర్ల హత్య, మారుమూల అటవీ ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలూ నిర్వహిస్తున్నారట. ఫలితంగా, పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో, మొన్న అన్నవరం పరిధిలో జరిగిన ఎన్‌కవుంటర్లో 5 గురు మావిష్టులు మరణించారట. తరవాత విజయనగరం పరిధిలో ఒక మావిష్టు మరణించాడట. కొంతమంది పట్టుబడ్డారట".

ఇలా పోలీసులు తమ ఆధిపత్యం నిరూపించుకుంటున్నారట.

Sunday, January 9, 2011

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

ఖత్రోచీ (బోఫోర్స్) విషయం లో మొన్న 4వ తేదీన, సీబీఐ తరఫున--ఐటీ ట్రిబ్యునల్ చెప్పినదాంట్లో కొత్త విషయం యేమీ లేదు అనీ, అందుకని ఆయన పై కేసు వుపసం హరణకి అనుమతి ఇవ్వాలనీ, నిస్సిగ్గుగా, ఢిల్లీలో చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు వాదించాడట--అదనపు సొలిసిటర్ జనరల్ మల్హోత్రా!

ఇంకోవైపు, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, టెలికాం విధానాలపై 2001 నించీ ఇప్పటివరకూ యేదైనా నేరం జరిగిందా అన్నకోణం లో విచారణ జరుపుతుందట--అదే సీబీఐ. గుర్తు తెలియని వ్యక్తులని ఇందుకు బాధ్యులుగా పేర్కొని, విచారించడం మొదలెట్టిందట. కొండనే తవ్వుతుందో, యెలకనే పడుతుందో, వాజపేయీనే పట్టుకుంటుందో....చూద్దాం!

మన సుప్రీం కోర్టు మాజీ ప్రథాన న్యాయమూర్తి, మానవహక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ మరిన్ని వివాదాల్లో చిక్కుకొన్నారట. ఆయన తమ్ముడూ, మరో అల్లుడూ ఆదాయానికి మించిన ఆస్థులున్నాయని ఆరోపణలు యెదుర్కోవడంతో, భాస్కరన్ ను తన కేరళ 'ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ' పదవిని వదులుకొని, సెలవులో వెళ్లవలసి వచ్చిందట. రెండో అల్లుడు ఎంజే బిన్నీ రెండేళ్లలో, కోచి శివార్లలో విలువైన ప్లాట్ల కొనుగోలు చేశారట.

ఆయన అల్లుడు పీవీ శ్రీనిజన్ అక్రమాస్థుల వ్యవహారంలో  విచారణ విషయం పై సీఎం సిఫార్సులు, మళ్లీ 'హోం శాఖ కార్యదర్శి ' పరిశీలనలో వున్నాయట.

ఓ ప్రక్కన యూపీలోనూ, ఇతర హై కోర్టుల్లోనూ, "అంకుల్ జడ్జ్" వ్యవహారాలు శృతి మించుతున్నాయని గోలొకటి! శాంతి భూషణ్ ఆయన కొడుకూ ఓ డజను మంది సుప్రీం కోర్టు ప్రథాన న్యాయమూర్తులందరూ అవినీతిపరులేనని ఢంకా బజాయించి, కోర్టు ధిక్కరణ చర్యలు మీకు దమ్ముంటే తీసుకోండి అని సవాలు విసిరారు. 

బాగుంది కదూ! మన న్యాయ వ్యవస్థ!

'సీనియర్ ' కాంగీ నేత దిగ్విజయ్ సింగ్--ముంబాయి వుగ్రవాద దాడుల్లో బలైపోయిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారి హేమంత్ కర్కరే చనిపోయేముందు--తనకి ఫోను చేశాడని ప్రకటించిన విషయం తెలుసుగా?

ఇప్పుడు, పిల్లికి యెలక సాక్ష్యంగా, 'ఆరోజున ఏటీఎస్ కార్యాలయం (ల్యాండ్ లైన్) నుంచి తన సెల్ ఫోన్ కి కాల్ వచ్చిందని ', బీ ఎస్ ఎన్ ఎల్-భోపాల్ కార్యాలయం నుంచి సంపాదించిన 'కాల్ రికార్డ్స్ ' చూపిస్తున్నాడట. అంతేకాదు ఇంతవరకూ తనను విమర్శించినవారందరూ తనకి క్షమాపణ చెప్పాలి అని డిమాండు చేశాడట.

(ఆ కాల్ లోనే తనకి 'హిందూ తీవ్రవాదుల ' నుంచి ప్రాణభయం వుందని కర్కరే తనకు చెప్పాడు అని ఇదివరకు ఆయన చేసిన ప్రకటన! దీనికి యెలాంటి ఆథారాలూ లేవని ముంబాయి పోలీసు శాఖ ప్రకటించింది.)

మరి, తన పై అధికారులకీ, తమ రాష్ట్ర హోం మంత్రికీ, ముఖ్యమంత్రికీ--ఇలా యెవరికీ ఆ విషయం చెప్పకుండా, తనకీ, వాడికీ, పాకిస్థాన్ తీవ్రవాదులతో సంబంధాలు వున్నందుకే 'హిందూ తీవ్రవాదుల ' నుంచి తనకి ప్రాణభయం వుంది అని చెప్పాడా? అనే విషయం వాడు బయటపెట్టలేదు మరి! 

అసలు వాడిని మన మావిస్టు వ్యతిరేక పోలీసులకప్పగించి, వాళ్ల పధ్ధతిలో ప్రశ్నించమంటే, ఆ రికార్డు అయిన కాల్ యెవరు, యెందుకు, యేమని, చేశారో బయటపెట్టునేమో! ప్రయత్నించేవాళ్లెవరు

మన రాష్ట్ర ఆశా వర్కర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న తమ కనీస వేతనాలు, పారితోషికాలు వగైరాల కోసం, జడ్పీ సమవేశం లో వున్న చెల్లెమ్మ సబిత బయటికి వచ్చి, తమ సమస్యలు వినాలని బైఠాయించి నినాదాలు చేస్తుంటే, ఆవిడ మెప్పుకోసం "తోటి ఆడ" పోలీసులు వాళ్లని చితక బాదారు. 

అయితేనేం, ఆశా వర్కర్లు అనుకున్నది సాధించారు. జీతాలూ అవీ బాగానే పెరిగాయి అంటున్నారు.

Saturday, January 8, 2011

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

"బోఫోర్స్!"......ఇప్పటికి యెన్నో నిలువుల లోతున పాతిపెట్టినా, అప్పుడప్పుడూ దానిమీద టన్నులకొద్దీ మట్టి పోస్తున్నా, "మమ్మీ రిటరన్స్" లెవెల్లో మళ్లీ పైకొస్తూనే వుంది.

ఈమధ్య ఇన్‌కమ్ టాక్స్ ట్రిబ్యునల్--ఖత్రొచీ, విన్ ఛడ్డాలకి రూ.41 కోట్లు లంచంగా ముట్టాయి అనీ, దాని మీద పన్ను కట్టవలసిందే అనీ--తీర్పు ఇచ్చింది. ఆ సొమ్ము లంచమేననీ, అది వాళ్లకి యెలా చేరిందో కూడా వివరించింది.

అసలు కమీషన్ల ప్రసక్తే లేదని తమ దర్యాప్తులో తేలింది అని అనేకసార్లు చెప్పిన సీబీఐ ఇప్పుడేమంటుందో? కాంగీ వారీసారి దాన్ని యెలా పూడుస్తామంటారో?

వంశధార పై మన ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్తుల వల్ల తమకి నష్టం అని ఒడిసా సుప్రీం కోర్టుకి వెళితే, 2007 లో కోర్టు 'ప్రాజెక్టులని నిలిపివేయాలనీ, జల వివాద ట్రిబ్యునల్ యేర్పాటు చేయాలనీ' తీర్పు ఇచ్చింది.

కేంద్రం ట్రిబ్యునల్ నైతే యేర్పాటు చేసింది గనీ, కార్యాలయం యేర్పాటు చెయ్యలేదట! మొన్న నవంబరు 23 నుంచీ కార్యకలాపాలు ప్రారంభించవలసిన ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ బీయెన్ అగర్వాల్ అందుకు నిరసనగా రాజీనామా ఇచ్చారట!

మరి మన ప్రాజెక్టుల గతేమిటో!

విన్నారా? మొన్న డిసెంబరు 31మద్యం అమ్మకం ద్వారా రూ.135 కోట్లు ఆర్జించిందట మన రాష్ట్ర ప్రభుత్వం. క్రితం సంవత్సరం రు.100 కోట్లేనట. 

ఈసారి రాత్రి 12 వరకూ అమ్మించడం, బార్లు ఒంటిగంటవరకూ తెరవడం వల్ల ఇంకా యెక్కువ వచ్చిందట. 

హైదరబాదు, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే అమ్మకాలు పెద్ద యెత్తున జరిగాయట. అక్కడ క్రితం సారి 45 'ఈవెంట్లు ' మాత్రమే జరిగితే, ఇప్పుడు 86కి పెరిగయట.

యేమి ప్రగతి!!!

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1 నుంచి 8వ తరగతి పిల్లలందరికీ ఆప్కో ద్వారా వుచిత దుస్తులు సరఫరా చేయిస్తామని మంత్రి అంటే, ఠాట్! మా మాటేమిటి? అంటున్నారట మిల్లు బట్టలవాళ్లు. 

చూద్దాం యేం జరుగుతుందో!

....................................................................................................................................

ప్రకటన :

శ్రీ దత్త చరితం

తొలి జగద్గురువు, విఙ్ఞానపు కాంతులను విరజిమ్మిన క్రాంతి పుంజం, అత్రి, అనసూయల గర్భ సుక్తి ముక్తాఫలం--శ్రీ దత్తాత్రేయుడు. 

ఆపురూప గురుహారం ఈ శ్రీ దత్త చరితం. 

ఈ డాక్యుమెంటరీ కి నిర్మాత, కెమేరామన్ : చిట్టావఝల కృష్ణ; వ్యాఖ్యనం/దర్శకత్వం : చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ; సంగీతం/గానం : గోగులమండ రాజు & మోహిని కుమారి; సహ నిర్మాత : సవరం కృష్ణానందం. ప్రవచనం : 'భారతీపుత్ర ', కడిమెళ్ల వర ప్రసాద్ 'గురు సహస్రావధాని '. 

(దత్తచరిత్ర యథాతథంగా, కూర్పులూ, చేర్పులూ లేకుండా చెప్పబడింది--అనుచిత వ్యాఖ్యలు లేకుండా! దత్తపీఠలూ, క్షేత్రాలూ వగైరలు కూడా చూడండి.) 

ఈ సీడీలు కొనండి....ఒక్కొక్కటీ రూ.59/- మాత్రమే! ఈ ప్రకటన చూసి, ఆర్డరు ఇచ్చినవారికి రూ.54/- మాత్రమే. 

చిట్టావఝల కృష్ణ పేరున "మాకు అందేలా" కేరాఫ్ నర్సాపూర్ బ్రాహ్మణ సమాఖ్య, నరసాపురం, ప.గో.జిల్లా, 534275 కి (మనియార్డరు/పోస్టల్ ఆర్డరు/డీడీ) యెలాగైనా పంపించండి....ఓ సీడీ సొంతం చేసుకోండి! (ఇందులో వ్యాపారం లేదు.)

మీరు కోరితే, మీ మెయిల్ ఐడీ కి వీడియో పంపించడానికి ప్రయత్నిస్తాము. 

Thursday, January 6, 2011

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

మన రాష్ ట్రపతులు బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధా కృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ లాంటి వుద్దండుల్ని స్మరించుకుంటూనే, ఇందిరాగాంధీ కి వత్తాసు పలికిన వాడెవడో రాష్ ట్రపతి నించీ, "రబ్బరు స్టాంపు" అని పేరు తెచ్చుకొన్నవాళ్లగురించీ, మధ్యలో నీలం సంజీవరెడ్డి, వీ వీ గిరి లాంటి వాళ్ల గురించీ తలుచుకొంటూంటే, ఈ వ్యవస్థ యెలా దిగజారి, రబ్బరు స్టాంపు నించి, "ప్రభుత్వ చిహ్నం" దాకా యెలా భ్రష్టుపట్టిందో అనిపిస్తుంది.

"గంగా కూలంకష....." పద్యం ఙ్ఞాపకం వస్తూంది.

ఎన్ డీ యే హయాములో, ఏ పీ జే అబ్దుల్ కలామ్! ఈయనని 'నాన్ కాంట్రవర్షియల్' క్యాండిడేట్ గా ప్రతిపాదిస్తే, అడ్డుకొనే దమ్ములు యెవరికీ లేకపోయాయి.

(గమనించండి--నేను ఆయన్నీ, ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్నీ కించపరచడం లేదు--ఆయన మీద 'హైప్' క్రియేట్ చేసిన వాళ్లనే అంటున్నాను. ఆ పదవికి అప్పట్లో ఆ క్వాలిఫికేషన్ కి మించి ఆయన కి యేమైనా వుందా?) 

ఇంతకీ ఈయన యెవరు? 'ప్రఖ్యాత శాస్త్రవేత్త?!' ఈయన యేరకం శాస్త్రవేత్తో నాకు తెలియదు. 1940 ల్లో, మద్రాస్ విశ్వవిద్యాలయం నించి "ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగు" లో పట్టా పుచ్చుకున్నాడు. (అప్పటికి మనకి డకోటా విమానాలు కూడా లేవు!).

తరవాత్తరవాత, ఓ బుర్రోవాదిగా, కర్రపెత్తనం చేస్తూ, తన క్రింది వాళ్లని పరుగులు పెట్టించి, లక్ష్య సిధ్ధిని పొందాడాయన--సి సీ ఎం బీ లోనూ, ఇస్రో లోనూ--ఇలా. 

ఇస్రో శాస్త్రవేత్తలు ఓ తేలికపాటి లోహాన్ని కనిపెడితే, (రాకెట్ల సంగతి తరవాత), పోలియో వ్యాధిగ్రస్తులకి కేలిపర్స్ లో ఆ లోహం వాడితే బాగుంటుంది కదా?! అని ప్రశ్నించి, దాన్ని నిజం చేసిన మానవతావాది ఆయన!

ఇక మన ప్రథమ మహిళ దగ్గరకొస్తే, ఆ రోజుల్లో వున్న రాజకీయాలకనుగుణంగా, కేవలం లింగ ప్రాథాన్యంతో (ప్రథమ పౌరుడు--ఆవిడ భర్త మీద కొన్ని ఆరోపణలున్నా) పీఠాన్నెక్కిందీమె!

చక్కగా వుపదేశాలు చేస్తోంది--ఆ పీఠం నించి. వినదగునెవ్వరు చెప్పిన.....కదా!

రేపొచ్చేవాళ్లెవరో మరి!

ఆత్మ హత్య మహా పాపం! చేసుకోకండి!

అని చెప్పాల్సిన ప్రభుత్వం, మన రా నా లూ, ఈ మాట చెప్పడం లేదు. 

చేసుకొన్న వాళ్ల కుటుంబాలకి ప్రభుత్వం ఓ 2.5 లక్షలూ, జగన్ ఓ లక్షా, చిరంజీవి ఓ పాతిక వేలూ, సూ ఋ సంస్థలు బీమా ద్వారా ఓ లక్షా.....ఇలా ఇస్తూ పోతూ, మిగిలినవాళ్లని ప్రోత్సహిస్తున్నారు.

ఒకప్పుడు యెండమూరి వీరేంద్రనాథ్ నవల్లో, సలీం శంకర్ బదులు యెవడో, కొంత మొత్తానికి ఆశపడి, వాడి స్థానం లో వెళుతున్నాడంటే.....ఇలా జరిగే అవకాశం వుందా? అని అలోచించేవాళ్లం. ఇప్పుడు.......యేదైనా జరగొచ్చు! అని నిర్వేదం!!!!

బాబులూ.....ఆత్మహత్యల్ని ప్రోత్సహించకండి! అవి మహా పాపం అనే చెప్పండి!

Wednesday, January 5, 2011

కృష్ణా జలాలు

ట్రిబ్యునల్ తీర్పు

"తాంబూలాలిచ్చేశా, ఇక తన్నుకు చావండి" అని తీర్పు ఇచ్చేసింది--బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.

తీర్పుతో మన రాష్ ట్రానికి జరగబోయేది లాభమా? నష్టమా? యెంతశాతం? అనేది ప్రక్కన పెడితే, ట్రిబ్యునల్ ముందు మన ప్రభుత్వ నిర్వాకాన్ని ఇంకో ప్రక్కన పెడితే--అసలు విషయాన్ని బయటపెట్టడమే చెయ్యడం లేదు యెవరూ--దాన్ని అంగీకరించడం సంగతి తరవాత!

1976 లోనో యెప్పుడో బచావత్ ట్రిబ్యునల్ తన అవార్డ్ ప్రకటించింది. కృష్ణా జలాలని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ల మధ్య కేటాయింపులు చేసి, "మిగులు జలాలని 2000వ సంవత్సరం వరకూ, లేదా ఇంకో ట్రిబ్యునల్ అవార్డ్ వచ్చేవరకూ--ఆంధ్ర స్వేచ్చగా అనుభవించవచ్చు" అని.

అబ్బో! 2000వ సంవత్సరమా! ఇంకా చాలా దూరం వుంది--ఇప్పుడప్పుడే మరేమీ ఫరవాలేదు--అని నిశ్చింతగా వున్నాయి మన ప్రభుత్వాలు. అంతేగానీ, కాల సాగరంలో అది ఓ బిందువుకన్నా చిన్నది అని మరిచిపోయారు.

ఓ పదేళ్ల ముందు అంటే 1990 నించీ మన ప్రభుత్వం తగిన ప్రణాళికతో ప్రారంభిస్తే, ఇప్పుడు ఈ బాధ వుండకపోవును కదా? 

అప్పట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలే వున్నా, మనం చేసిందేమీ లేదు. 
ఆలమట్టి మీద దెబ్బలాడాం, నిలువరించాం--అంటాడు చంద్రబాబు.

మధ్య మధ్యలో "చెరుకూరి వీరయ్య" లాంటివాళ్లు ఆక్రోశిస్తూనే వున్నా, మనవాళ్లు చేసింది హళ్లికి హళ్లి, సున్నకి సున్న!

ఇప్పుడు చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత మహదేవా! అంతేనా?

ఇప్పటికైనా "డ్యామేజి కంట్రోలు" మొదలుపెడతాడా కిరణ్ కుమార్?

చూద్దాం!

Saturday, January 1, 2011

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ.....

జాతక రత్న మిడతంభొట్లు లాగా, దర్శకరత్న దాసరి కూడా, యెవరూ అడగకపోయినా, కొన్ని జోస్యాలు చెపుతూ వుంటాడు.

మొన్నో సభలో, "నర్మగర్భంగా" యేమన్నాడో చూశారా?

".....ఎన్‌టీఆర్ 'నా రాజకీయ జీవితానికి కారణమైన చిత్రాలు--ఆ రెండూ (బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు)' అని పదే పదే చెప్పేవారు...." అనీ,

"బాలకృష్ణతో ఇప్పటివరకూ యెందుకు సినిమా చెయ్యలేదో??!!....ఇది నా 150వ సినిమాతోనే యెందుకు కుదిరిందో.....నాకు ఇప్పుడు అర్థం అవుతోంది!" అనీ వుద్వేగంగా భూత భవిష్యత్తులని మనముందు ఆవిష్కరించారు.

మీకు గుర్తుందో లేదో--ఓ ఫంక్షన్లో, చిరంజీవిని పొగుడుతూ, ".......అనేక అవతారాల్లో చూశారు....త్వరలో...ఇంకో 'కొత్త అవతారంలో' చూస్తారు....అవును! చూస్తారు" అంటూ అంతే వుద్వేగంగా ప్రసంగించి, ఇవాళ అంతటి మెగా స్టార్నీ, పగటివేషగాళ్లా నిలబడే స్థితికి తెచ్చాడు ఈయనే!

బాలకృష్ణ జాగ్రత్తపడితే మంచిది. బుట్టలో పడ్డాడా.....ఇక అంతే!

అసలు వెర్సటైల్ నటుడూ, 'కథా, మాటలూ..........ప్రేక్షకుడూ' వరకూ అన్నీ అయిన శ్రీ దాసరి తన "కింగ్ మేకర్ సిండ్రోమ్" లోంచి బయటికి యెప్పుడు వస్తాడో మరి! 

"ప్రైవేటు" (అంటే 'ప్రభుత్వ కాని ' అని--అవి వాళ్ల స్వంత ఇళ్లయినాసరే) గృహాల్లో వుండే యెమ్మెల్యేలూ, యెమ్మెల్సీలకి నెలసరి 'వసతి భత్యం ' రూ. 3 వేల నించి రూ.10 వేలకి (యెన్ని రెట్లో!) పెంచారట! 

అదే ప్రభుత్వ, ఇతర వుద్యోగులకి--వెయ్యిరూపాయల అద్దెకి తగ్గని చిన్న పట్టణాల్లో ఓ 250/-; పట్టణాల్లో 3,500/- అద్దెకి తగ్గని చోట్ల ఓ 1500 లో యెంతో, నగరాల్లో పదివేలకుపైగా వుంటే, ఓ 3 వేలో యెంతో 'వసతి భత్యం'--(హెచ్ ఆర్ యే అంటారు దీన్ని) ఇవ్వడానికి నానా యేడుపులూ యేడుస్తారు!

రాష్ ట్రంలో 139 చోట్ల "గ్రామ న్యాయాలయాలు" యేర్పాటు చేస్తారట! 

ఇప్పటికే, పది రాష్ట్రాల్లో ఇవి వున్నాయట. వీటి నిర్వహణ ఖర్చులో 70 శాతాన్ని కేంద్రం భరిస్తుందట. 200 కి పైగా కేసులు నమోదవుతున్న గ్రామాలు 139 వున్నాయట. అందుకని అక్కడ ఇవి యేర్పాటు చేస్తారట. 

కేసులు పేరుకుపోతున్నాయి కాబట్టి 'మాత్రమే' ఇవి పెడతారట. దోషులుగా తేలినవారికి గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్షా, రూ.20 వేల వరకూ జరిమానా విధించడానికి వీరికి అధికారం వుంటుందట. 

బాగుంది కదూ?! 

తాము ఆర్టీఐ చట్టానికి 'అతీతులం' అని రాష్త్రపతి భవన్ ఓ పిటిషన్ వేసిందట. పద్మ పురస్కారాల విషయంలో అబ్దుల్ కలాం, వాజపేయీల మధ్య సాగిన సంభాషణలని వెల్లడించాలని గతంలో సీఐసీ ఆదేశించిందట. అయితే, రాజ్యాంగంలో 74వ నిబంధన ప్రకారం వాటిని వెల్లడించాల్సిన అవసరం లేకుండా తమకు 'రక్షణ' వుందని భవన్ వాదిస్తోందట.

ఆ మధ్య మన సురారె, బాలమురళీ కృష్ణకి 'భారతరత్న' ఇప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించానని ప్రకటించాడంటే, ప్రకటించడూ మరి?

ఒక తాత, తన మనవణ్ని--"ఇంట్లో పార్టీలు వద్దురా" అన్నా వినకుండా, తన ఆరుగురు సహ విద్యార్థులతో ఇంట్లో పార్టీ చేసుకొని, విందారగిస్తూండగా, ఆ తాత మొత్తం గదికి పెట్రోలు పోసి, నిప్పంటించగా, ఇద్దరు దుర్మరణం చెంది, మిగిలినవారు తీవ్రంగా గాయ పడ్డారట (ఒడిస్సా లో). మరి ఆ తాత మానసిక స్థితిని యే సైకో అనలిస్ట్ వివరించగలడు? "గివ్ మీ ఫైవ్ బక్స్" అంటూ, ఇవ్వకపోతే కాల్చి చంపేస్తున్నారట తెల్లవాళ్ల (భారతీయుల) ని నల్లవాళ్లు--అమెరికాలో! వాళ్లమీద సైకో అనాలిసిస్ యేమిటి? శ్రీ శ్రీ యో యెవరో అన్నట్టు, "కాకికేమితెలుసు సైకో అనాలిసిస్?"

ఇదివరకోసారి వ్రాశాను--పులిని చూసి నక్క వాత--అని. తిరుపతి, షిర్డీ--భాయ్, భాయ్--అంటూ, వాళ్లూ ఇంకా అనుసరిస్తున్నారట. అంతకు ముందు చక్కగా అయ్యే దర్శనాల స్థానంలో, మన తిరుపతిలోలా 'తోపుళ్లాటలు ' ప్రెవేశపెట్టిన షిర్డీవారు, నూతన సంవత్సరం సందర్భంగా 'ప్రత్యేక చెల్లింపు దర్శనాలు' మొన్న 30 నించి రేపు రెండు వరకూ రద్దు చేశారట. ఫలితంగా, భక్తులందరూ కూడా 6 నుంచి 8 గంటలు నిరీక్షించాల్సి వస్తోందట!

నిర్భాగ్యులు "ఆశా" వర్కర్లు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న తమ సమస్యలకోసం ఆందోళన చేస్తూంటే, చెల్లెమ్మ సబిత వాళ్లమీద ఆడపోలీసులతో చేయించిన 'దౌర్జన్యం' కన్నులపండుగుగా తిలకించారట ప్రభుత్వంవారు! మీరు తిలకించారా--వీడియోలనీ, ఫోటోలనీ?

పుండుమీద కారం చల్లుతూ చెల్లెమ్మ, "వాలంటీర్లుగా వచ్చినవాళ్లు ఇప్పుడు డిమాండ్లు చెయ్యడమేమిటీ" అని కళ్లెర్రజేశారట! "ఆట్టే మాట్లాడితే, సీయెం దృష్టికి టీసుకెళతా" అని కూడా అందట! 

యెవరి ఖర్మ వారిది! అవునా?