Thursday, August 27, 2009

నేరస్థులు

ప్రఖ్యాతులు

మొన్న ఆదివారం సోనీ టీవీలో ననుకుంటా ఓ కొత్త ‘షో’ మొదలయ్యింది—10 కా దం—అని.
యాంఖర్ ‘సల్మాన్ ఖాన్’! పోటీ ‘కపిల్ దేవ్’, 'నవజోత్ సింగ్ సిద్ధూ’ మధ్య! వినూత్నం గా వుంది—బాగుంది!
ముందు ఇద్దరికీ పోటీ పెట్టి, దాంట్లో యెవరు నెగ్గితే వారిని ‘హాట్ సీట్’ కి రప్పించి, వాళ్ళని ప్రశ్నలడిగి, ఆఖరి ప్రశ్నకి కూడా సరైన సమాధానం చెపితే, ‘పదికోట్లు’ బహుమతీ, ఆ బహుమతి ‘అనాధ పిల్లలకి’ చెందుతుందనీ—మంచి కాన్సెప్ట్ మరి!
ఇంతకీ సరైన సమాధానలంటే, ఆ చానెల్ నిర్వహించిన ‘సర్వే’ లో వచ్చిన సమాధానాలు (ట!).
కపిల్ వోడిపోయి, ఒక లక్ష మాత్రమే నెగ్గాడనుకోండి.
నాకు నచ్చిందేమిటంటే—యెంత % మంది ‘నన్ను నమ్ముతావా?’ అని ఒక్కసారైనా అంటారు? అని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేలోపల, సల్మాన్ కపిల్ ని ‘మీరు ఆ మధ్య మీడియా లో చాలా బాధగా కనిపించిన సందర్భం గురించి చెప్పండి’ అంటే, కపిల్ “నా జీవితమంతా ‘క్రికెట్’ కి అంకితం చేస్తే, మన దేశం తరఫున అన్ని విజయాలు నమోదు చేసినా, నన్ను ‘మాచ్ ఫిక్సింగ్’ చేశానని నిందిస్తుంటే……’ అని వాపోయాడు! (డాలరు శేషాద్రి ఙ్ఞాపకం రావడం లేదూ?)
ఇంకోటి—“యెంత % మంది ‘సామాన్యులకి’ వర్తించినంతగా ‘ప్రఖ్యాతులకి’ చట్టం వర్తించదు అనుకుంటారు?” అన్న ప్రశ్నకి, కపిల్ అక్కడున్న ప్రఖ్యాతులిద్దరినీ ఉదాహరణగా చెప్పి, పదిహేను నించి, 30 శాతమో యెంతో చెప్పినట్టున్నాడు. కరెక్టు సమాధానం 43% అని వచ్చినట్టు గుర్తు.
నేను చెప్పేది ఇది ఇంకా చాలా యెక్కువ అని.
యెందుకంటే, సల్మాన్ చేసిన నేరం యేమిటి? ‘సరదాగా తన ఆడ, మగ స్నేహితులతో కలిసి వన్య మృగాలని వేటాడడం!’ మరి అవేం పాపం చేశాయో!
సిద్ధూ మీద కేసు ఇంకా వేరు—ఓ హత్యకి జరిగిన కుట్రలో తనుకూడా భాగస్వామి అని. కానీ ‘మీడియా నన్ను వదల్లేదు’ అని వాపోయాడు. (అప్పటికి అతను బీజేపీ లో వున్నట్టున్నాడు).
మరి సల్మాన్ నేరానికీ, ఇతనికీ పోలికా?
చిన్న చిన్న నేరాలకి ‘అండర్ ట్రయల్స్’ గా దశాబ్దానికి పైగా శిక్షలు అనుభవిస్తున్నవాళ్ళెక్కడ? (వీళ్ళకి ఇంకా శిక్ష పడలేదు కాబట్టి, సత్ప్రవర్తనకో మరెందుకో వీళ్ళు తొందరగా విడుదలయ్యే చాన్స్ కూడా లేదు పాపం! ఈ అవకాశం శిక్షపడ్డ టెర్రరిష్టులక్కూడా వుంది మరి!)
నీచమైన నేరం చేసినా ఇంకా కోట్లు సంపాదించుకుంటున్న సల్మాన్ యెక్కడ?
ఈ మధ్య ఇంకో వార్త వచ్చింది—సంజయ్ దత్ కి ‘టా డా కోర్టు’ శిక్ష విధించకపోయినా, వాడు విడుదలైన వెంటనే సమాజ్ వాదీ పార్టీ లో జేరినందుకు, ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తుందట!
వాడి నేరం యేమిటో గుర్తుందా? లైసెన్స్ లేకుండా ‘ఏ కే 47’ తుపాకిని దాచి వుంచడం!
ఎలెక్షన్లలో పోటీ చేసి నెగ్గితే, కేసు మూసెయ్యవచ్చు అని భావించిన కాంగ్రెస్ పార్టీకి కోర్టు మొట్టికాయ వేసి, వాడు పోటీ కి అనర్హుడు అని చెప్పింది!
మరిప్పుడు?
అదీ సంగతి!

Sunday, August 16, 2009

‘ముఖ్యమంత్రీ…..

తత్వం...
‘మాది కృష్ణ తత్వం—వారిది శకుని మార్గం. ఎన్నికల ముందు మమ్మల్ని కౌరవులని, తామే పాండవులమని ప్రధాన ప్రతిపక్షం గొప్పలు చెప్పుకుంది. చివరకు పాండవులు ఎవరో ప్రజలే తేల్చారు’ అన్నారట ముఖ్యమంత్రి!

ఇంకా ‘ధరల సంక్షోభాన్ని ముందుగానే ఊహించాం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, ఆశలు పెట్టే అలవాటు లేదు. అందుకే 90 శాతం మంది ప్రజలకు తెల్ల కార్డు అవకాశం కల్పించి, రెండు రూపాయలకే కిలో బియ్యం, రూ.103 కే నిత్యావసరాలు (కందిపప్పు, నూనెలు) సరఫరా చేశాం’ అన్నారట.

‘ధరల బెడద ప్రపంచ వ్యాప్తం గా ఉందని మేధావులు ఊరడిస్తున్నా…ఊరుకోకుండా ధరలపై యుద్ధం ప్రకటించాము’ అని, ‘కృష్ణుడు చెప్పినట్టు కర్తవ్య పాలనలో జాప్యం వుండకూడదు అనే కృష్ణ బోధనే తనకు శిరోధార్యం’ అని కూడా అన్నారట!

‘కోటివరాలతో దేవుడి అవతారం ఎత్తాలని ప్రధాన ప్రతిపక్ష నేత అనుకున్నారు. 1999 లో ఆడపిల్ల పుడితే మేనమామలా ఐదువేలు ఇస్తానని చెప్పిన ఆ మేనమామ ఇప్పుడెక్కడున్నారు? బోగస్ ఏటీఎం కార్డులతో కనికట్టుకు పాల్పడ్డారు. ప్రజలని పావులుగా వాడుకోవాలని చూశారు.’ అని విమర్శించారట.

తరవాత ముఖ్యమంత్రికి ‘వైద్య పరీక్షలు’ చేయించారట!

(ఇప్పటిదాకా యేదేదో మాట్లాడాడనా?!—యేమో)


Monday, August 10, 2009

దుర్భిక్షం

కరవు
మనిషిని వణికించే భయంకరమైన మాట ఇది!

మొన్న 08-08-2009 న మన ప్రథాని రాష్ట్రాల మీద ‘ఉరిమారు’!

కరువుపై కదలరేం? అని రాష్ట్ర ప్రథాన కార్యదర్శుల సమావేశం లో ప్రశ్నించి, ఇకనైనా తగిన చర్యలు తీసుకోమన్నారు!

అంతేకాదు—కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు!

ఇంకా, దేశవ్యాప్తం గా 141 జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించామనీ, అయినా యే ఒక్క రాష్టృఅం నించీ తమకు నివేదికలు పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు! రాష్ట్రాలు అక్రమ నిల్వలని వెలికితీసే చర్యలు వెంటనే చేపట్టాలన్నారట! మిగిలిన విసహయాల గురించికూడా మామూలుగానే హెచ్చరించారట!

శరద్ పవార్ గారు—కేవలం సరఫరా-గిరాకీల కారణం గానే పప్పుల ధరలు ఇలా పెరిగాయనడం లో అర్థం లేదు. మార్కెట్ వూహా గానాలే ధరల పెరుగదలలో కీలక పాత్ర పోషిస్తాయి! అక్రమ నిల్వలను, నల్లబజారును అరికట్టేందుకు (రాష్ట్రాలు) గట్టి చర్యలు తీసుకోనంతకాలం ధరలను నియంత్రించలేం!—అన్నారట.

బుధ్ధున్నవాడెవడైనా చెప్పే మాటలే కదా ప్రథానీ, వ్యవసాయ మంత్రీ చెప్పినవి!

మన బుద్ధిలేని రాష్ట్ర ప్రభుత్వం యేమి చేస్తోంది?

ఆరు నెలలనించీ బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి అని, మూడు నెలలుగా పప్పులు పెరిగిపోతున్నాయి అనీ గగ్గోలు పెడుతున్న ప్రజలనీ పత్రికలనీ కేరేజాట్ అని, పక్కరాష్ట్రాల కన్నా మన రాష్ట్రం లో అన్నీ తక్కువ రేట్లే అని తప్పుడు ప్రకటనలు ఇస్తోంది!

(మనవాళ్ళెవరూ పక్క రాష్ట్రాల్లో లేరా—ఒక్క ఫోను కొడితే, అక్కడ రేట్లెలా వున్నాయో చెప్పరా? కర్ణాటకలో బిజినెస్ లు చేస్తూ ఆస్థులు సంపాదించుకుంటూ దాదాపు అక్కడే కాపరం వుంటున్న వీర జగన్ ని అడిగినా వాళ్ళ బాబుకి చెపుతాడే!)

ఇవన్నీ యెవర్ని వంచించడానికి? బియ్యమూ, పప్పుల నిల్వల్ని స్వాధీనం చేసుకొని, అక్రమ నిల్వ చేసినవాళ్ళకే, మళ్ళీ వేలం లో అవి తక్కువ రేటుకే అప్పచెపుతున్నారంటే—ఇది అక్రమార్కుల కొమ్ముకాస్తున్న దగాకోరు ప్రభుత్వం కాదా?

ఒకప్పుడు డైనమిక్ ఐ యే యస్ అనిపించుకున్న మన ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి యేమంటున్నాడు?

మొత్తం 1186 మండలాల్లో, కనీసం 900 మండలాల్లో కరవు ‘లాంటి’ పరిస్థితే వుందట! ఇన్ని జిల్లాలు కరవు తో అల్లల్లాడుతున్నాయని యెలాంటి నివేదికా ఇంతవరకూ రూపొందించనేలేదట—కేంద్రానికి పంపడం సంగతి దేవుడెరుగు! పరిస్థితి తీవ్రం గా వున్నప్పటికీ, తదుపరి చర్యలు తీసుకోవడానికి ఇంకో 4, 5 రోజులు వేచి చూడాలని నిర్ణయించాము! ఆని. యెందుకూ? జెరూసలేము దేవుడేమైనా ఆ రెడ్డిగారికి కల్లో కనబడి మంత్ర దండమేమైనా ఇస్తాడేమోననా? దాన్నాయన ఈ రెడ్డిగారికిచ్చి, ‘హాం ఫట్’ అనమంటాడేమోననా? ఇంకా, అధికార యంత్రాంగం కరవు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందనీ, వివిధ జిల్లాల నించి సమాచారం సేకరిస్తోందనీ, ఇప్పటివరకూ అందిన సమాచారం అందోళన చెందాల్సినంత తీవ్ర పసిస్థితే వుందనీ, అతి త్వరలో ఉన్నత యంత్రాంగం సమావేశమై, ఒక విధాన నిర్ణయం తీసుకుంటారనీ, క్షేత్ర పరిస్థితిని బట్టి కేంద్రానికి నివేదిక పంపి, కేంద్ర బృందాన్ని ఆహ్వానించే అవకాశం వుందనీ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల ఇంతకన్నా యేమీ మాట్లాడలేననీ—తాపీగా, పదినిమిషాలకో మాట సెలవిచ్చారు!

కడుపుకి అన్నం తింటున్నాడా—గడ్డి తింటున్నాడా?

యెవరి చెవుల్లో పువ్వులు పెడతారు?

వీడియో కాన్ ఫరెన్సులూ, యేరియల్ సర్వేలూ వున్నది చంక నాకడానికా!

అత్యవసరమైనప్పుడైనా యంత్రాంగాన్ని పరిగెత్తించగలిగే సత్తా మీకుందా?

యెందుకు నాటకాలు?

శ్రీ శ్రీ ప్రబోధాల స్ఫూర్తితో పీడిత జనాలు తిరగబడితే, మీ డీ జీ పీ లూ, వాళ్ళ దగ్గర ‘ఆర్డర్లీలు’ గా బతికే రక్షక భటులూ యెవరూ మిమ్మల్ని కాపాడలేరు!

ఇప్పటికైనా మేలుకోండి మరి.


Saturday, August 8, 2009

ముష్కరుడి అంతం
తెహరిక్ ఎ తాలిబాన్ ‘బైతుల్లా మెహసూద్’ చివరికి అమెరికా వేసిన మిస్సైల్ తో హరీ అన్నాడు!

అతనితోపాటు అతని రెండో భార్య, మరో యేడుగురు హతమయ్యారట!

అగ్నినాశ్రయించినందుకు ఇనుముకు కూడా సమ్మెట పోట్లు తప్పవు కదా! (లేకపోతే ఇనుమునాశ్రయించినందుకు అగ్నికి కూడానా?)

అమెరికావాళ్ళు మరీ అంత జాగ్రత్తగా వాడొక్కడి ఇంటిమీదే మిస్సైల్ వెయ్యడం యేమీ బాగోలేదంటారా!

ప్రస్తుతానికి సరిపెట్టుకోండి—పాపం బాగా పండితే మరోసారి అఫ్ఘనిస్తాన్ ని నేల మట్టం చేస్తారేమో చూద్దాం!


Tuesday, August 4, 2009

మూర్ఖత్వం

పెళ్ళీ—పెటాకులూ!
నిన్నకాక మొన్న హర్యానాలో అదేదో వూళ్ళో ఇద్దరు ప్రేమికులు పెళ్ళి చేసుకున్నారట!

తీరా చేసి, తన పెళ్ళాన్ని తనతో పంపమని అడగడానికొచ్చిన పెళ్ళికొడుకుని—రాళ్ళతో కొట్టి చంపేశారట ఆ గ్రామస్తులు!

యెందుకంటారా—వాళ్ళిద్దరిదీ ‘ఒకే గోత్రం’ అట!

పోలీసులుగానీ, మత పెద్దలుగానీ యేమీ చెయ్యలేకపోయారట!

స్వలింగ సంపర్కాన్నే కోర్టులు గుర్తించిన ఈ రోజుల్లో, పాశ్చాత్య దేశాల్లో ‘ఇన్ సెస్ట్’ కూడా ప్రబలిన ఈ రోజుల్లో, ఈ స్వగోత్రాలూ, రాళ్ళతో కొట్టి చంపడాలూ యేమిటో!

నిజానికి మన హిందూ సమాజం యెంత దగ్గరవాళ్ళయినా, ఆడా మగా మధ్య ‘యేకాంతం’ కుదరనివ్వదు! వరసైన వాళ్ళయినా సరే—వేయి కళ్ళతో వాళ్ళని పరిశీలిస్తూ వుంటారు! ఇది మంచి పధ్ధతి. అందుకనే మనకి ‘ఇన్ సెస్ట్’ కేసులు చాలా తక్కువ! (ఒకటీ అరా వుండవని కూడా చెప్పలేమనుకోండి).

ఇక ఈ గోత్రాలూ అవీ యెందుకు? అసలు మానవ సంతతి అంతా ఒక అమ్మకీ అబ్బకీ పుట్టిందే కదా? అప్పటి సామాజిక అవసరాలకోసం కొన్ని నిబంధనలు యేర్పరచారు—కానీ, ఇప్పటి సామాజిక పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా?

‘వంశ వృక్షం’ సినిమాలో చూపించిందేమిటి?

మనకు చరిత్రలో పేరున్న ‘చంద్రగుప్త మౌర్యుడు’, ‘విక్రమాదిత్యుడు’. ‘శ్రీ కృష్ణదేవరాయలు’ వీళ్ళంతా ‘దాసీ పుత్రులు’ కాదా?

మరేమిటి కులాలూ, శాఖలూ, గోత్రాలూ……..!

న్యూక్లియర్ సబ్-మెరైన్ కి కూడా ‘అధర్వణ వేదం’ చదివి, ఓ సిక్కుమతస్థురాలిచేత ‘కొబ్బరికాయ’ కొట్టించి, జలప్రవేశం చేయిస్తాము!

ఇదేమి చోద్యం? ఇవన్నీ యెవరికోసం?

అసలు ఆ అధికార మదాంధురాలు ‘ఇందిరా నెహ్రూ గాంధీ’ రాజ్యాంగం లో ‘సెక్యులర్’ అన్నపదాన్ని తీసేసి, ‘సర్వమత సమభావనగల లౌకిక’ అని చొప్పించకుండా వుంటే, ఈపాటికి ఈ దరిద్రాలన్నీ రూపుమాసిపోయేవి!

అలా అయితే మా వోటు బ్యాంకులేమయిపోవాలంటారా? ఈ వోటు బ్యాంకులు శాశ్వతం కావని తెలిసిపోయిందిగా!

అయినా వీళ్ళు మారరు—కులాల మధ్యా, మతాల మధ్యా, రాష్ట్రాల మధ్యా, ప్రాంతాల మధ్యా, భాషల మధ్యా—ఇలా యెన్ని వీలైతే అన్ని ‘విభజించి పాలించు’లు చేసేసి, మన పబ్బం గడిచిపోయిందికదా అని సంబరపడతారు!

కానీ, ఓ మూర్ఖులారా—ఇవన్నీ భస్మాసుర హస్తాలే అని తెలుసుకోండి!