Sunday, March 14, 2010

కరెంటు కష్టాలు


కోతలు--పరిష్కారాలు

ప్రతీ సంవత్సరం (సుబ్బారాయుడు మంత్రిగా వున్నా, మరో డబ్బా రాయుడు మంత్రి అయినా) తప్పని తద్దినాలే--ఈ కరెంటు కోతలు.

అయినా ప్రతీ యేడూ కొత్త కొత్తగా, మన ఉగాదిలా అలరిస్తూ వుంటాయి మన ప్రజలని.

ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన టైములో, పగలూ రాత్రీ అనక కరెంటు తీసేస్తారు--ప్రతీ యేడూ!

మళ్ళీ ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలూ, రాస్తా రోకోలూ, సిబ్బందిని వాళ్ళ కార్యాలయాల్లో బంధించి తాళం వెయ్యడాలూ, కొంతమందిని నడ్డి విరగదన్నడాలూ, మామూలుగా జరిగితే, అప్పుడు రాత్రి పూట కోతలు వుండవు! ఓ క్రమం ప్రకారం జరుగుతాయి ఈ కోతలు!

మరి ప్రతీ సంవత్సరం ఇలా నిర్దిష్టం గా ఓ పధ్ధతి ప్రకారం యెందుకు చెయ్యదు ప్రభుత్వం?

అదంతే! దాని చర్మం చాలా మందం!

పైగా ఓ ప్రైవేటు సంస్థ తను వుత్పత్తి చేస్తున్న 'కరెంటుని తమిళనాడుకి యెందుకు అమ్ముకోవాలి? వొప్పందం రద్దు చేసుకోవాలి' అంటారు కాంగీరేసు ప్రజా ప్రతినిధులు. (వాళ్ళవి నాలుకలో--తాటి పట్టెలో తెలీదు నాకు!)

'నేనెప్పుడో ఆ సంస్థనించి వైదొలిగాను. సామాన్య షేర్ హోల్డర్ని మాత్రమే' అంటాడు రాజగోపాల్. (నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే, ఓ ప్రజా ప్రతినిధిగా యెన్నికయ్యే అర్హతే లేదు వీడికి.)

మరి ఓ ప్రైవేటు సంస్థ తన వొప్పందాన్ని రద్దుచేసుకోవాలని డిమాండ్ చేసే తాటి పట్టెలు--తమ ప్రభుత్వం జల యఙ్ఞానికి, గాలి గాళ్ళకి కోట్లకి కోట్లు దొబ్బబెడుతున్న వొప్పందాలని యెందుకు రద్దు చేసుకోదు--అని ప్రశ్నించవేం?

మీరేం యేడ్చినా, కరెంటు కోతల్ని నివారించండి చాలు!

Tuesday, March 9, 2010

రచయితలు



సినిమా పాటలు

'ఆహా! యేం వ్రాశాడండీ.....ఫలానా ఆయన!' అంటారు సినిమాపాటలో సాహిత్యం నచ్చితే.

'ఉరుముకు జడిసే నెచ్చెలి, అడుగక ఇచ్చెను కౌగిలీ' అన్నా, 'క్షణం ఆగనంటూంది వోణీ' అన్నా--ఇదే మాట.

మరి సినిమా పాటలు ఆడ కవయిత్రులు యెందుకు వ్రాయరో?

('ఆడ' అని ప్రత్యేకం గా అంటున్నానని కోప్పడకండి. ఇప్పుడున్నారో లేదో గానీ, ఇదివరకు మగ రచయిత్రులూ, కవయిత్రులూ కూడా వుండేవారు.)

సమాధానం 'చింపులూ'!--నిర్మాతా, దర్శకుడూ, సంగీత దర్శకుడూ వగైరాలతో పాటల 'డిస్కషన్' లో రాత్రి తెల్లవార్లూ కూచోవాలి--స్టార్ హోటళ్ళలో--అందుకని.

ఆడ రచయిత్రుల్లో బొమ్మదేవర నాగకుమారి అని (ఈపాటికి అమ్మా, అమ్మమ్మా అయిపోయి వుంటుంది) శృంగారాన్ని కూడా సిగ్గుపడకుండా వర్ణించేది తన నవలలూ, కథల్లో. ఆవిడకి ఆంధ్ర భూమి వీక్లీ సంపాదకుడు 'సికరాజు' మంచి ప్రోత్సాహం ఇచ్చేవాడు.

అలా అవకాశమొస్తే మహిళా దర్శకురాళ్ళు వచ్చినట్టే, ఈ రచయిత్రులూ, కవయిత్రులూ కూడా వస్తారు. స్టోరీ డిస్కషన్లూ వగైరా రాత్రుళ్ళు హోటళ్ళలో కాకుండా, ప్రొడక్షన్ ఆఫీసుల్లోనే జరుగుతాయి.

రెండు, మూడు రోజుల్లోనే డిస్కషన్లు ముగిసిపోవడం, సినిమా రీళ్ళు గబగబా చుట్టేసి, ఆనక సీడీలు చేసి అమ్ముకునే బాధ తప్పుతుంది.

ఆకాశం లో సగం నీవు--అంటాడు మగాడు. యెక్కడ సమానత్వం సినీరంగం లో?


Sunday, March 7, 2010

నిపుణులు


నైపుణ్యం

మన సీ పీ ఐ నారాయణ అరెస్టయి వ్యానులో విసిరేస్తే నడ్డి విరక్కొట్టించుకోడం లోనే కాకుండా ఇంకో విషయం లో కూడా ఎక్స్ పర్ట్ అని నిరూపించుకున్నాడు!

మొన్న హైదరాబాదులో 'అరటి ఆకు' అనే (ఇంగ్లీషు) పేరుతో ఒక రెష్టారెంటు ప్రారంభించి, కోడి, పీతలపులుసు ఆరగించారట. ఆయన కోడి తొడననుకుంటా కొరుకుతూ ఫోటో కూడా వేయించుకున్నారు పేపర్లో!
"ఇంట్లో మామూలుగా చెట్నీతో రెండు ఇడ్లీ, సాంబారుతో నాలుగు ఇడ్లీ లాగిస్తాను. అదే కోడికూరతో, డజను ఇడ్లీ లాగిస్తాను!" అని వ్యాఖ్యానించారు కూడా!

మనలో మనమాట--ఇడ్లీ పచ్చడిలోనో, సాంబారులోనో ముంచుకు తింటే, అది 'అల్పాహారం' అవుతుంది. కోడిని నములుతూ, డజను ఇడ్లీలని మధ్యమధ్యలో నంజుకుంటే--దాన్నేమంటారు?

ఆ పని పూర్తి చేస్తూ, 'బాబూ! పిట్ట మాంసం కూడా యేర్పాటు చేశారా?' అని క్రొశ్నించారట!

మరి ఆయన వుద్దేశ్యం ఏ పిట్ట అనో?

యే పిట్టనైనా చంపడం పర్యావరణానికి హాని కలిగిస్తుందేమో కదా!

తరవాత, గవర్నరుగారి శాకాహార విందులోననుకుంటా--చిరంజీవి 'పాపం నారాయణగారికి చికెన్ లేదు!' అని జోక్ కూడా వేశారట.

బాగుంది కదూ?