Wednesday, March 30, 2011

కబుర్లు - 36

అవీ, ఇవీ, అన్నీ

ఓ ప్రక్క సభాసంఘాలూ అవీ అంటూ పిసుక్కుచస్తున్నట్టు నటిస్తూనే, సందట్లో సడేమియాగా వాళ్ల జీత భత్యాలు రెట్టింపు కన్నా యెక్కువచేసుకొంటూ ఓ బిల్లుని చప్పుడుకాకుండా ఆమోదించేసుకున్నారట మన శాసన సభ్యులు.

అంతే కాకుండా, ప్రభుత్వం వారు ఓ ల్యాప్ టాప్ నీ, ఇంకోళ్లెవరో టాబ్లెట్ పీసీ నీ, ఇలా లక్షల విలువ చేసే బహుమతులని కూడా చదివించారట వాళ్లకి!

వాళ్లవి యెంత లాభసాటి క్రీడలో కదా!

ఆథార్ గురించి తాజా వార్త--రాష్ట్రంలో 39 లక్షలమంది కార్డుకోసం నమోదు చేసుకొంటే, 13 లక్షలమందికే ఇవ్వగలిగారట ఇప్పటివరకూ! అథార్ కేంద్రాలకి జనాలు కుటుంబసమేతంగా యెగబడుతుంటే, వాళ్లు "ఓ స్త్రీ! రేపురా" అంటున్నారట. అందుకని దళారులు అవకాశాన్ని 'సొమ్ము' కూడా చేసుకొంటున్నారట!

ఇది పని కాదని, మళ్లీ నమోదుని "ఆన్ లైన్" చెయ్యడానికి సాఫ్ట్ వేర్ తయారు చేస్తున్నారట. జనాలు ముందు సమాచారమంతా నమోదుచేసుకొంటే, అప్పుడు వాళ్లు తేదీ ఖరారు చేస్తారట. (మళ్లీ ఈ ఆన్ లైన్ నమోదుని దళారుల ద్వారానే చెయ్యాలేమో!) వాళ్లు చెప్పిన తేదీని వాళ్లు చెప్పిన చోటుకి, వాళ్లు చెప్పిన టైముకి కుటుంబమంతా పొలోమని పోతే ఫోటో, ఐరిస్, వ్రేలి ముద్రలూ వగైరా సేకరిస్తారట. ఆ తరవాతెప్పుడో కార్డు ఇస్తారట!

అసలు ప్రతీ పౌరుడికీ ఇవ్వవలసిన ఆథార్ సంఖ్యని కుటుంబమంతటికీ ఒకే కార్డు మీద ఒకే సంఖ్య ఇవ్వడమేమిటో మరి.

వ్యవహారమంతా చూస్తుంటే, వెర్రి ముదిరింది, తలకి రోకలి చుట్టమన్నట్టూ, నీముక్కెక్కడ వుంది అంటే.......అన్నట్టూ లేదూ? 

మన బుర్రోవాదులు ట్యూబ్ లైట్లు కూడా కాదు మరీ పెట్రోమాక్స్ లైట్లు అయిపోతున్నారేమో అనిపిస్తూంది! 

నందన్ నీలేకనీ నిద్రలో కూడా వులిక్కిపడుతున్నాడేమో--తన పేరు నాశనం అవుతోందని.

మొన్న మావూళ్లో కొంతమంది పెద్దలు స్థానిక ఆర్డీవో ఆఫీసుముందు ధర్నా చేశారు. వాళ్ల డిమాండ్లలో ఒకటి--మద్యం దుకాణాలవాళ్లు ఎం ఆర్ పీ కన్నా చాలా యెక్కువకి, వాళ్ల ఇష్టం వచ్చిన రేటుకి మద్యం విక్రయిస్తున్నారు అనీ, వాళ్ల మీద చర్యలు తీసుకోవాలి అనీ!

ఇక్కడ "మద్యం చాలా మందికి నిత్యావసరం కాదు కదా?" అన్నది కాదు క్వశ్చను. "దోపిడీ యేరూపం లో యెక్కడవున్నా దాన్ని అరికట్టాలి" అన్నదే పాయింటు! 

నాకు నచ్చింది మరి!

Tuesday, March 29, 2011

కబుర్లు - 35

అవీ, ఇవీ, అన్నీ

ఇవాళ (29-03-11) "ఈనాడు" మొదటిపేజీ కార్టూన్ "అవేకానంద"; "కిరణ్"; "ముద్దు" ల హావభావాలని చక్కగా ప్రకటించింది. "ఇదీ సంగతి" కార్టూన్ కూడా బాగుంది.

అన్నిటికన్నా అద్భుతం--కిరణ్ వగైరాలు "అసెంబ్లీ మీద ప్రజలకి నమ్మకం పోయేలా వుంది" అని వాక్రుచ్చడం! అక్కడికేదో ప్రజలకి నమ్మకం వొలికిపోతున్నట్టు!

అసెంబ్లీ అనేది ప్రజా ప్రతినిధులు ఆడుకునే క్రీడా స్థలం అనీ, డబ్బులు తీసుకుని మరీ ఆడుకుంటారనీ, జనాలెప్పటినించో నవ్వుకుంటున్నారు! (పైగా యేడాదికోసారో యెప్పుడో మళ్లీ క్రీడా మైదానాల్లో క్రికెట్ వగైరా కూడా ఆడతారు--వాళ్ల ఆటవిడుపుకోసం!)

రాశ్శేఖర్రెడ్డి "నాలో కోపం నరం యెప్పుడో తెగిపోయింది" అనీ, "వానదేవుడు మా పార్టీలో చేరాడు" అనీ, "ఇడుపులపాయకి బస్సుల్లో వెళ్లి, నెమళ్ల క్రేంకారాలు వినండి" అనీ అంటున్నప్పుడుకూడా, చంద్రబాబు వగైరాలు "వెకిలిగా నవ్వుతున్నాడు" అన్నారు తప్పితే, మీదపడి బాదెయ్యలేదు కదా! నిజంగా వాళ్లు చాలా గొప్పవాళ్లు కదూ!

మధ్యాహ్న భోజనం తరవాత నిద్రలో నాకో కల వచ్చింది. గొల్లపూడి వారు దశాబ్దాలక్రితం యెప్పుడో జీవనకాలం లో వ్రాసిన "ప్లాస్టిక్ బొమ్మల వ్యాపారం" ప్రభావమేమో మరి.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఓ రోజు ముందు బీయేసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరుగుతుంటే, అన్నిపక్షాలవాళ్లూ యేకగ్రీవంగా చెప్పారట--మామూలు వాయిదా తీర్మానాలని తిరస్కరించడం, ప్రభుత్వం ప్రకటనలు చెయ్యడం, ప్రశ్నోత్తరాల కార్యక్రమం లాంటివి రద్దు చెయ్యాలి. వాటి బదులు "(మీ కోపాన్ని)......వదిలెయ్యండి" అనే కార్యక్రమం సరిపోయినంతసేపు ప్రవేశపెట్టాలి--అని.

మర్నాడు సమావేశం మొదలవగానే, "వదిలెయ్యండి" మొదలన్నమాట. స్పీకర్ ప్రక్కనే ఓ పెద్ద అలమారు వుంటుంది. ముందు యెవరు చెయ్యెత్తితే వాళ్లకి స్పీకర్ ఆ అలమారులోంచి ఓ రబ్బరు కర్ర (సినిమా కుర్ర హీరోలు విలన్ అనుచరులని బాదడానికి వుపయోగించే ఇంతలావు సర్వీ కర్రలలాంటివి--అవి బాదుతున్నప్పుడు వంగిపోవడం కూడా సినిమాల్లో బాగానే చూపిస్తారు!) అందిస్తాడు. దాంతో సభలో తాను యెవరి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాడో వాడిని ఇష్టం వచ్చినట్టు బాదెయ్యచ్చు!

ఇలా అందరు సభ్యులూ చేశాక, జీరో అవరూ వగైరా మామూలే!

మార్షల్స్ కి కూడా ఫైబర్ గ్లాస్ తో తయారు చేసిన నిలువెత్తు షీల్డులూ, పాతకాలం లో సైనికులు ధరించే ఓ పాతిక కేజీలో యెంతో బరువుండే శిరస్త్రాణాలూ, కవచాలూ ఇస్తారన్నమాట. 

మీడియా పాయింటులో మాట్లాడేవాళ్లకి కూడా ఇలాంటివే ఇస్తారు--అక్కడ కూడా రబ్బరుకర్రల అలమారు ఇంకోటి వుంటుంది--వాళ్లని బాదడానికి అనుగుణంగా!

అప్పుడు అసెంబ్లీ పరువు యెంతగా పెరుగుతుందో ప్రభుత్వం వారు ఆలోచించాలి.

క్రికెటానందం లో మనవాళ్లు పాకిస్థాన్ నించి వచ్చే అభిమానులకి వుచితంగా ఆతిథ్యం ఇస్తున్నారట. ప్రభుత్వంవారు కొన్నివేల వీసాలు ఇస్తున్నారట. 

పాక్ నెగ్గితే టపాసులు పేల్చి పండుగచేసుకొనీ పాక్ అభిమానులున్న మనదేశంలో, పాక్ వోడిపోతే షాపులు తగలబెట్టీ, దొరికినవాళ్లని పొడిచీ కక్ష తీర్చుకొనే పాక్ అభిమానులున్న మనదేశంలో--ప్రస్తుత సుహృద్భావ చర్యలు వికటించవనే ఆశిద్దాం!

ఇప్పుడింక కరెంటు డిపార్ట్ మెంట్ వాళ్లు "జీపీయెస్" ఆథారిత, టీసీయెస్ వాళ్లిచ్చే సాఫ్ట్ వేర్ తో క్షణాల్లో యే ఇంట్లో కరెంటు పోయినా, వచ్చేసి బాగు చేసేస్తారట. దీనికోసం వినియోగదారులందరికీ ఓ "తొమ్మిది అంకెల" సంఖ్య కేటాయిస్తారట! (ఇంకానయం--కార్డులిస్తామనడంలేదు!) అలాగే, ఓ ప్రాంతం లో యెన్ని కొత్త కనెక్షన్లు ఇవ్వచ్చు, యెక్కడ యెక్కువ కరెంటు వినియోగం జరుగుతోంది వగైరాలు కూడా, ఆఫీసులో కూర్చొని కనిపెట్టేస్తారట! రాజుల సొమ్ము రాళ్లపాలు, మన ప్రభుత్వాల సొమ్ము కార్డులూ, సంఖ్యలూ, సాఫ్ట్ వేర్ల పాలు అనుకోవాలేమో మనం!

అన్నట్టు, బ్లాక్ బెర్రీలు (వినియోగదారులకి) చాలా సురక్షితం అని, చాలా ప్రభుత్వాలు వాటిని నిషేధించాయట. ఇప్పుడు అమెరికా "వుద్యమకారులకి" ఇంకా సురక్షితమైన కొత్తరకం సెల్ ఫోన్లు కనిపెట్టిందట. వాటిని అరబ్ దేశాల్లో వుద్యమాలు చేస్తున్నవాళ్లకి అందిస్తారట. వాటిని యెలా వాడినా, తరవాత పోలీసులు వాళ్లూ యేమీ పీకలేరట! యెంత బాగుందో కదా!

సుప్రీం కోర్టు హసన్ ఆలీ కేసులో విచారిస్తూ, ఈడీ సమర్పించిన నివేదికలో ఓ బడాస్థాయి దళారి (పవర్ బ్రోకర్) పేరు చదివి, న్యాయ మూర్తులు "దిగ్భ్రాంతి" వ్యక్తం చేశారట! ఆ పేరు యెప్పటికి బయటికి వస్తుందో మరి! 

Monday, March 28, 2011

కబుర్లు - 34

అవీ, ఇవీ, అన్నీ

టేంక్ బండ్ మీద తెలుగు వెలుగుల విగ్రహాలని బ్రద్దలుకొట్టి, అగ్నికి ఆహుతి చేశారు. బాగానే వుంది. సీమాంధ్ర వాళ్లెవరూ యేడవలేదు, ప్రతీకారం తీర్చుకొంటామంటూ ప్రతిఙ్ఞలు చెయ్యలేదు. 

చచ్చిన గుర్రాన్ని కంచీతో కొట్టాలని ప్రయత్నిస్తున్నారు--కొంతమంది మేతావులు.

నిన్న 27-03-2011 న, "సాంస్కృతిక విలేకరుల ఐక్యవేదిక" ఆధ్వర్యంలో జరిగిన సభలో, "మాస్టర్జీ" అనే ఆయన--తెలంగాణా వైతాళికుల విగ్రహాలని సీమాంధ్రలో ప్రతిష్టించాలి--అన్నాడట. యే విజయవాడలోనో, గుంటూరులోనో యెక్కడో ఓ హుస్సేన్ సాగర్ తవ్వి, టేంక్ బండ్ కట్టి, అక్కడ వాళ్ల విగ్రహాలు పెట్టాలనేమో?

వుప్పులూరి మల్లికార్జున శర్మ--టేంక్ బండ్ పై దాశరథి, కొమరం భీం, కాళోజీల విగ్రహాలు పెట్టాలన్నారట! (వాళ్ల విగ్రహాలు పెడతామంటే, నన్నయ్యా వాళ్లూ వద్దన్నారనా వాళ్లని పగలకొట్టారు?)

ఇంకా కొంతమంది, సమతూకం పాటించాలనీ, "అన్ని ప్రాంతాలకీ న్యాయం చెయ్యాలనీ"--ఇలా వాక్రుచ్చారట!

బాగుంది కదూ?

మరి, చిన్నపిల్లల పాటలని తెలుగు నించి తెలంగాణా భాషకి తర్జుమా చేస్తూ, "చుక్ చుక్ రైలు వస్తోంది" లాంటి పాటలని, "చుక్ చుక్ రైలు వస్తాంది భై" అని అనువదిస్తూ "అదే తెలుగు" అనుకుంటున్న మూర్ఖులకి యెవరు ఙ్ఞానోదయం చేస్తారు? (ఓ సినిమాలో కోట "బీముడేమో గద తిప్తా వుంటాడు--" అనడం గుర్తు రావడం లేదూ!)

కోనాపురి అయిలయ్య అనే మాజీ నక్సలైట్ "సాంబశివుడి"ని 40 కత్తిపోట్లు పొడిచి హత్యచేశారట! ఆయన 2009 లో ప్రభుత్వానికి లొంగిపోయి, తరవాత తెరాస లో చేరాడట. దీనివెనక యేమి రాజకీయాలు వున్నాయో?

ఇదివరకోసారి అనుకున్నాం--కర్ణాటక లోని కార్వారలో గల కాప్రి ఆలయం లో దేవుడికి "సిగరెట్లతో హారతి, మద్యం తో అభిషేకం" నిర్వహిస్తారని! సిగరెట్లకి ప్రత్యామ్నాయంగా బీడీలు కూడా వాడతారని. ఆ పండుగ నిన్న (27-03-2011) నిర్వహించారట. ఆచారం గురించి పూజారి ఆనంద్ నాయక్ వివరించారట!

"మారియో వర్గస్ లోసా", "ఖుంకళా బన్‌జడే"--ఇవేమిటో తెలుసా?

మొదటిది--మొన్నీమధ్య నోబెల్ ప్రైజు గెలుచుకున్న స్పానిష్ రచయిత పేరు!

రెండోది--"ఆరుషీ తల్వార్" తో హత్య కాబడిన నేపాలు కు చెందిన హేమరాజ్ భార్య పేరు!

గమ్మత్తుగా వున్నాయా?