Saturday, March 24, 2012

కబుర్లు - 88అవీ, ఇవీ, అన్నీ

బుధ్ధిలేని పోలీసు డిపార్ట్ మెంట్ లో భాగం చేసేశారనుకుంటా హోం గార్డులని. మొన్న జిల్లాలో మొత్తం వున్న 32 పోస్టులకి, 3500 మంది అభ్యర్థులు, అర్థరాత్రివరకూ క్యూలలో నిలబడి దరఖాస్తు చేసుకున్నారట! వీళ్లకి గురువారం నుంచీ "అర్హత" పరుగులూ, పరీక్షలూ మమూలే! ఇదేమి నియామక ప్రక్రియో? యెవరూ కలగజేసుకోవడం లేదు--పాపం!

రాష్ట్ర హైకోర్టు ప్రథాన న్యాయమూర్తి, సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి (వీళ్లు కోర్టులకి యెప్పుడు వెళుతున్నారో అని ఇదివరకే వ్రాశాను), ఇంకా పరిశ్రమలశాఖ సహాయ మంత్రీ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తరించారట మొన్న 18 వ తేదీన. మామూలుగానే దర్శనం, తీర్థ ప్రసాదాలు యేర్పాటు చేశారట అధికార్లు. ఈ గవర్నరొకడు--అస్తమానూ పట్టుపంచ కట్టుకొని తయారైపోతున్నాడు. అదేరోజు ఓ గంటపాటు ఆయన ఆలయంలో వుండిపోతే, క్యూ లైన్లు అపేసినందుకు "భక్తులు" అందోళన చేసి, నినాదాలు చేశారట! వీళ్లకి వేరేపనులు లేనట్లు యెందుకో షటిలింగ్ హైదరాబాదు నుంచి! (ఈయన్ని చూస్తే శంకర్ దయాళ్ శర్మ గుర్తొస్తున్నాడు--ఖాళీ కల్పించుకొని మరీ పొర్లు దండాలు పెట్టేసేవాడు!)

అప్పటి కలెక్టరుగారు "సంపూర్ణ పారిశుధ్యం" గురించి గ్రామీణ విద్యార్థులు, ప్రజలకు అవగాహన పరిచేందుకు 4 లక్షల నిధులతో, ఓ జడ్పీ పార్కుని "శానిటరీ" పార్కుగా మార్పించేశారట. 30-09-2010 న అప్పటి మంత్రి రఘువీరారెడ్డి దాన్ని "ఘనంగా" ప్రారంభించారట. కానీ, ఇప్పటివరకూ ఒక్క విద్యార్థి కూడా ఆ పార్కుని సందర్శించిన పాపాన పోలేదట. మహిళా సంఘాలు అసలే రాలేదట. ఇంతకీ ఆ పార్కులో యేమి పెట్టారు? మూడడుగుల దిమ్మలపై, రకరకాల లెట్రిన్ బేసిన్లూ, సింకులూ వగైరాలు. నాటిన మొక్కల సంగతి యెవరూ పట్టించుకోకపోగా, చెత్తనంతా గోడల ప్రక్కగా పోసేస్తున్నారట! యెంతబాగుందో చూశారా--"శానిటేషన్?"

యర్రంశెట్టి శాయి లాంటివాళ్లు రైల్వే నేపధ్యంతో వ్రాసిన నవలలవల్ల కొన్ని విషయాలు తెలిశాయి మనకి--జనరల్ మేనేజర్ కోసం ఓ ప్రత్యేక రైలు వుంటుందనీ, అందులో ఆయన ఆఫీసూ, బెడ్ రూమూ, కిచెనూ, సిబ్బంది కోసం--ఇలా ఓ నాలుగైదు కంపార్ట్ మెంట్లు వుంటాయనీ వగైరా. ఇప్పుడు ఆ రేంజి పెరిగిపోయినట్టుంది. మొన్న జనరల్ మేనేజరుగారు "తనిఖీల" కోసం యేకంగా ఓ 17 బోగీల రైలుతో, ఔరంగాబాద్ స్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ ఆక్రమించి, ముఖ్యమైన రైళ్లని యెక్కడో దూరంగా వున్న ప్లాట్ ఫారాలమీద ఆపి, ప్రయాణీకులని నానా హింసా పెట్టారట. దీని విషయంలో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలై, కోర్టు నోటీసులు కూడా ఇచ్చిందట! అసలే బోగీల కొరత వల్ల రైళ్లు నడపడమే ఇబ్బంది, కొత్తరైళ్లు అసలే లేవు, మరి ఆ పటాటోపం తో రైల్వేలకి నష్టాలు వస్తున్నాయంటే రావూ? అయినా "ఇన్స్ పెక్షన్" కి వెళ్లే వాళ్లు హటాత్తుగా వెళ్లి, యేమూలో పొంచి వుండి తనిఖీ చేస్తారంటారు. మరి ఇలాంటి తనిఖీల మర్మమేమిటో?

పటాటోపం విషయానికొస్తే, మన విజయనగరం మహారాజావారు గుర్రప్పందాలకో, గోల్ఫ్ కో లండన్ వెళితే, అక్కడి స్టార్ హోటెళ్లవాళ్లు తలలుపట్టుకు కూర్చునేవారట! వారి మర్యాదల గురించి కాదు--బెల్ బాయ్స్ దగ్గరనుంచీ వజ్రాల రూపంలో బాగానే ముట్టచెప్పేవారట. మరి తలనెప్పి యెందుకంటే, ఆయన వెంట కనీసం ఓ పాతిక యేనుగులని తీసుకెళ్ళేవాడట--వాటికి "ప్రత్యేక పార్కింగ్" సదుపాయం యెక్కడ యేర్పాటుచెయ్యలా అని! (అవి తమ పేడతో అద్దంలాంటి రోడ్లని పాడు చేస్తాయని భయం!)

కొత్తగా బొగ్గు కుంభకోణం--2జీ కన్నా చాలా పెద్దది అంటున్నారు. వాటిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాభపడినందువల్ల, ప్రభుత్వానికేమీ ఢోకా వుండదంటున్నారు. కానీ అన్ని పార్టీలూ దేశంలోనూ, మనరాష్ట్రంలోనూ "మధ్యంతర" యెన్నికలకి సిధ్ధపడితే మంచిదని నా పంచాంగం చెపుతోంది. (నేను ఇదివరకు నించీ వ్రాస్తూనే వున్నాను--ఈ ప్రభుత్వాలు 2014 వరకూ వుంటే గింటే అని.)

Sunday, March 18, 2012

కబుర్లు - 87అవీ, ఇవీ, అన్నీ

గోరోజనం అంటే--మామూలుగా "పొగరు" లేదా "గర్వం" అనే అర్థంలో వాడతారు. మరి అసలు ఆ పొగరు యెక్కడ వుంటుంది? కోడె గిత్తల మూపురాల్లో యేర్పడుతుందది. దానివల్లే వాటికంత పొగరు. 

ఆ పదార్థానికి వైద్యంతో సహా అనేక వుపయోగాలున్నాయట. ఓ కేజీ కొన్ని లక్షల ఖరీదుట.

దానికోసం ఓ 24 గిత్తలనీ, 100 మేలుజాతి యెడ్లనీ పెద్ద సీల్డ్ కంటెయినర్లలో రాష్ట్ర బోర్డరు దాటిస్తుంటే విశాఖ దగ్గర నక్కపల్లి వద్ద పోలీసుల సాయంతో పట్టుకొని, పెదతాడేపల్లి తరలిస్తే, గోసేవా సమితివారు సం రక్షిస్తున్నారు. చుట్టుప్రక్కల రైతులు వాటి మేత, పోషణ విషయం చూసుకొంటున్నారు.

ఆ తరవాత ఇంకో 160 పశువులనికూడా అక్కడికి తరలించారుట.

మొన్న, కొంతమంది యెలమంచిలి కోర్టులో 124 పశువుల యజమానులు మేమే అనీ, వాటిని అప్పగించాలి అనీ కేసు నెగ్గి, వాటిని తరలించుకుపోయారట. అదేమి లోపాయకారీ వ్యవహారమో!

యేలూరు ప్రభుత్వాసుపత్రిలో "ఆత్మలు" ఘోషిస్తున్నాయట. అక్కడ శవాలు భద్రపరచే గదిలో యేర్పాటు చేసిన 8 ఫ్రీజర్లలో 6 పనిచెయ్యడం మానేసి, మృతదేహాలు కుళ్లిపోతున్నాయట. 6 ఫ్రీజర్లలో దాదాపు 8 లక్షల విలువచేసే శీతల యంత్రాలని పట్టుకుపోయి, ఇళ్లలో వాడుకుంటున్నారట--సిబ్బంది! పైగా వాటి మరమ్మతులకి ఒక్కోసారీ 30 వేలవరకూ బిల్లులు చేసుకొంటున్నారట! ఇంకో విషయం యేమిటంటే, ఆ ఆసుపత్రికి కలెక్టరే ఛైర్మన్ ట.
ఆవిడ మాతృ హృదయం యేమంటుందో?

నిర్మాణకార్యక్రమలు జోరుగా సాగుతూండడంతో, వాగులూ, వంకలూ, కాలవల్లోనేకాకుండా, పోరంబోకుల్లో కూడా మట్టిని తవ్వేసి బంగారం సంపాదించేస్తున్నారు!

కానీ నిబంధనలే గాలికి యెగిరిపోతున్నాయి.

జిరాయితీ భూముల్లో భూమి స్వరూపాన్ని మార్చాలంటే తహసీల్దారునుంచి తప్పక అనుమతి తీసుకోవాలట. దరఖాస్తులో వివరాలన్నీ ఖచ్చితంగా నమోదు చెయ్యాలట. తహసీల్దారు ఆ భూమిని పరిశీలించి, కట్టిన ఫీజూ, యెన్ని ట్రాక్టరుల్లో తరలిస్తారు వగైరాలమీద ఆథారపడి అనుమతి ఇవ్వాలట. చూట్టూ ప్రభుత్వ భూములుంటే ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలోనే జరగాలట. లోతుగా తవ్వితే, మైనింగ్ శాఖ అనుమతి వుండాలట. అనుమతుల్లేకుండా ఏదశలోనూ మట్టి తవ్వకాలు జరగకూడదట.

మరి అందరూ లక్షల్లో యెలా సంపాదించేస్తున్నారో?

నందననామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించాలని డీ ఆర్వో అధికారులను ఆదేశించారట. వేదపాఠశాల విద్యార్థులచే వేదపాఠనం, అనంతరం ఉగాది స్వాగత నృత్యం, పంచాంగ శ్రవణం యేర్పాటు చేశారట. ఈ లోపల అధికారులందరితో "సమీక్షలు" నిర్వహిస్తున్నారట--యేర్పాట్ల విషయమై!

మహిళా దినోత్సవం సందర్భంగా మొన్న మొగల్తూరు లో "ఘనం"గా నిర్వహించి, అంగన్ వాడీ సిబ్బందికి పరుగు; లెమన్-స్పూన్; మ్యూజికల్ ఛెయిర్స్; ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకి బహుమతులిచ్చారట. ఆ సందర్భంగా ఎంపీడీవో మహిళలను అన్నిరంగాలలో (మరిన్ని ముగ్గులూ అవీ వేసేలా) చైతన్యవంతులని చేసేందుకు తగిన కృషి చెయ్యాలని పిలుపిచ్చారట (యెవరికో?)!  


    

Monday, March 12, 2012

కబుర్లు - 86

అవీ, ఇవీ, అన్నీ

మరో విషాదం--కాకతాళీయంగా, మన ఆంధ్రా బిర్లా ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ విగ్రహాన్ని, ఆంధ్రా షుగర్స్, తాడిపర్రు వద్ద ఆవిష్కరించారు 10-03-2012న. ఆయన భార్య చంద్రమతీదేవి అదేరోజు రాత్రి తమ స్వగృహంలో మరణించారు. ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక!

మొన్న మనం అనుకున్న వైద్య నిధి ట్రస్ట్ (పేరు అభిలాష ట) కి గౌరవ ఎంపీ దాసరి నారాయణరావు ఓ రెండు అంబులెన్స్ లని తన లాడ్స్ నుంచి అనుగ్రహించారట. ఒకటి పోలవరం, ఇంకోటి బుట్టాయగూడెం క్లస్టర్లకి కేటాయించామని కలెక్టరుగారు (ట్రస్ట్ నిర్మాత) సెలవిచ్చారట. బాగుంది. దానికి సిబ్బందీ, డిజెల్ ఖర్చులకి యేర్పాటు యెలా చేశారో?

పంచాయతీల్లో పన్నులూ, ఖర్చులూ వగైరాలు "యెవరైనా" ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకొనే విధంగా, "ప్రియ" అనే సాఫ్ట్ వేర్ ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారట. (ఇది పూర్తిగా 'అక్రమాలకి' చెక్ పెట్టడానికేనట!) చకచకా కంప్యూటరీకరణ జరిగి, నెలాఖరు లోగా ఈ సౌకర్యం అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుందట. అలాగని మీ కంప్యూటర్లముందు కూర్చోకండి.....కరెంటు వుండదు. మీకు యూపీఎస్ లూ, బ్యాటరీలూ వున్నాయి ఫరవాలేదంటారా? హ్హహ్హహ్హ! ఆ సర్వర్లకి కరెంటు వుండొద్దూ? వుట్టికెక్కలేని ప్రతీ అమ్మనీ స్వర్గానికెక్కించెయ్యాలని ప్రయత్నాలు ప్రారంబించారు కొందరు. పనిలోపనిగా తమ బ్రతుకులని స్వర్గధామాలు గా మార్చుకొంటున్నారు! యేం చేస్తాం???!!!

పంచముఖ ఆంజనేయస్వామి "గంధమానస" పర్వతాల్లో నివాసమున్నట్టు పురాణాలు ఘోషిస్తున్నాయట. (గంధమాదన పర్వతం గురించి చదువుకున్నాముగానీ, ఈ పర్వతం యెక్కడుందో మరి). "మానవునికి సహజస్థితి" కలిగించేందుకు భూమిపైకి "చివరిగా" వచ్చిన అవతారం పంచముఖ ఆంజనేయస్వామిట. "నీటిను పట్టుకొని" అధ్యాత్మిక జపం చేస్తే, ఆ నీటిలో మనస్సులోని రూపం ప్రతిబింబిస్తుందట. హోలీ పండుగ, తెలుగు సంవత్సరం ఆఖరి పౌర్ణమి రోజున రావడం ముదావహమట. ఉత్తరభారతం లో ఎక్కువగా జరిగే పండుగ, ప్రస్తుతం దక్షిణ భారతం లో కూడా "సంప్రదాయంగా" వస్తూందట. ఈ వువాచలు ఫలనా శ్రీదత్తపీఠ ఉత్తరాధికారి శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ గారివట. ఇంకా హోలీ ఆడుకోవడానికి పసుపు వాడతారనీ, దానికి ఔషధగుణాలు వున్నాయనీ, రాత్రిపూట పాలల్లో పసుపుకలుపుకొని తాగాలనీ....ఇలా చాలా చెప్పారట. (ఈయన యే స్కూల్లో చదువుకున్నారో తెలిస్తే బాగుండును!)

థాయ్ లాండ్ రాజధాని బ్యాంగ్ కాక్ పూర్తి పేరు : ఖ్రుంగ్థెప్మహనఖొన్ ఆమొర్న్రత్తనకొసిన్ అహింథరయుత్థయ ంఅహదిలొక్ఫొప్ ణొప్ఫరత్ ఋఅత్చథనిబురిరొం ఊదొమ్రత్చనివె త్మహసథన్ ఆమొరంఫిమన్ ఆవ తర్న్సత్థిత్ శక్కథత్త్ ఇయవిత్సనుకంప్రసిత్ (ట!). (Krungthepmahanakhon Amornrattanakosin ahintharayutthaya Mahadilokphop Noppharat Ratchathaniburirom Udomratchaniwe tmahasathan Amornphiman Awa tarnsatthit Sakkathatt iyawitsanukamprasit) అంటే యేమిటో?   

"గోరోజనం" అంటే యేమిటో మీకు తెలుసా? అదెక్కడ వుంటుందో, యెలా లభిస్తుందో తెలుసా?

మరోసారి!      
   


   

Saturday, March 10, 2012

కబుర్లు - 85అవీ, ఇవీ, అన్నీ

ఒబామా మళ్లీ పేలాడు--విన్నారా?

ఇంతకు ముందు ఇండియా లాంటి చోట్ల జనాలు యెక్కువ తినేస్తున్నారు--అందుకే ద్రవ్యోల్బణం, ప్రపంచ వ్యాప్త ఆహార కొరత, ఆర్థిక సంక్షోభాలు వగైరా అంటూ పేలాడు.

ఇప్పుడు, భారత్, చైనా, బ్రెజిల్ దేశాల్లో అందరూ కార్లు కొనేస్తున్నారు కాబట్టే చమురు ధరలు పెరుగుతున్నాయి అని పేలుతున్నాడు! చైనాలో 2010లో కొత్తగా కోటి కార్లు రోడ్లపైకి వచ్చాయి అనీ, అలాగే భారత్, బ్రెజిల్ లలో కూడా ఇంధన అవసరాలు బాగా పెరిగిపోయాయి అనీ అన్నాడు.

అంటే వాడి వుద్దేశ్యం, అమెరికావాళ్లు మాత్రమే తినాలి, వాళ్లే కారుల్లో తిరగాలి, వాళ్లే వున్నత జీవన ప్రమాణాలతో వుండాలి అనా? 

వాళ్ల పెద్ద పెద్ద లిమోసిన్లూ అవీ అంతవేగంగా ప్రయాణించడానికి, వాళ్ల పోలీసులు వుపయోగించే వాహనాలకీ, యెంత "గ్యాసోలిన్" (మన పెట్రోలు కూడా కాదు) తాగేస్తున్నారో వూహించండి! మన లీటర్లు కాక వాళ్లు గేలన్లలో కొలుస్తారు పైగా! ఇంక విమానాలు చెప్పనే అఖ్ఖర్లేదు.

వాళ్లు మనని వెక్కిరిస్తూ బాధపడిపోవడం యేమిటో?

మన వందరూపాయలనోట్ల వెనుకవైపు, సరిగ్గా మధ్య, క్రిందుగా ఆనోటు చెలామణీలోకి విడుదలైన సంవత్సరం ముద్రించి వుంటుంది. 

ఇప్పుడు అలా సంవత్సరం అసలు ముద్రించకుండా వున్న నోట్లు 1996 లో విడుదల అయ్యాయనీ, ఆ నోట్లు ఇక చెల్లవు అనీ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించి, వాటిని బ్యాంకులలో మార్చేసుకోమని అదేశాలు ఇచ్చిందట. 

2005 లోని ఎం జి సిరీస్ నోట్లు కూడా చెల్లవు ట.

ఓ సారి జాగ్రత్తగా చూసుకోండి. యేరోజు వరకూ మార్చుకోవచ్చో స్పష్టం కాలేదు.

రావి కొండలరావు అమెరికా వెళ్లలేకపోవడంతో, ఆయన స్థానంలో అక్కిరాజు రమాపతిరావుగారికి జీవితకాల సాఫల్య పురస్కారం అందిస్తారట. ఆయనకి అభినందనలు.

మన గవర్నరుగారు వుదయం 9 గంటలకే అన్నీ యేర్పాటు చేసుకొని, న్యాయమూర్తి లోకూర్, ఇంకా ఆయన్ని దర్శించుకోడానికి వచ్చిన చాలామంది తో "హోలీ" ఆడేసుకున్నారట. అలాగే ముఖ్యమంత్రి కూడా. బాగుంది. వాటి కోసం, సహజ రంగులూ, పర్యావరణ హితమైనవీ అంటూ ఇంకో గోల. ఇంకెక్కడో కొన్ని వందలమంది చిన్నారులు హానికారక రంగుల కారణంగా ఆసుపత్రుల పాలు!

అంత అవసరమా?

అన్నట్టు, లోకూర్ గారూ, జాస్తి చెలమేశ్వర్ గారూ రోజూ పేపర్లో వస్తున్నారు--అక్కడ మీటింగ్, ఇక్కడ సెమినార్, ఇంకోచోట సన్మానం వగైరాలతో. మరి కోర్టులకి యెప్పుడు వెళుతున్నారో?

ఇంక మన తెలుగు వీరాభిమానులు, తెలుగు భాషకోసం అంటూ మొసలి కన్నీళ్లు ఇంగ్లీషులో కార్చేవాళ్లు, మనమీడియావాళ్లూ--ఇలా, "ఫలనా స్కూల్లో ఫలానా మేష్టారు ఓ విద్యార్థిని 'తెలుగులో మాట్లాడినందుకు' తీవ్రంగా శిక్షించిన వైనం" అంటూ తెగ వాపోతున్నారు!

ఇక్కడ విషయం, తెలుగు మాట్లాడినందుకు కాదు--పాఠశాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలి అనే నిబంధన వుల్లంఘించినందుకు--అని కన్వీనియెంట్ గా మరచిపోతారు.

ఆంగ్లం మాతృభాష కానివాళ్లెవరైనా ఇంగ్లీషు మాట్లాడినా, వ్రాసినా తప్పులు దొర్లుతాయి. కానీ, మనదేశంలో అనేకమంది మహామహులు, వాళ్లకన్నా చక్కగా ఇంగ్లీషులో కథలూ, కావ్యాలూ, నాటకాలూ, కవితలూ వగైరాలు వ్రాసేవారు! (ఇప్పుడూ చిన్నపిల్లలు సైతం వ్రాస్తున్నారు!)

ఇప్పుడు కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ, ఇతర వున్నతోద్యోగులూ, బుర్రోవాదులూ, ఆఖరికి జర్నలిస్టులూ కూడా వ్రాస్తున్న ఇంగ్లీషు చూస్తుంటే, వికారం వస్తూంటుంది!

అలాంటి పరిస్థితుల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నిబంధన విధించి, అమలు చేస్తున్నవాళ్లని తప్పు పట్టగలమా?

ఇంటర్ వరకూ యెలాగో నెట్టుకొచ్చి, (ఇప్పుడు ఎంసెట్ రాంకు బాధ కూడా లేదు), ఇంజనీరింగు కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులనీ, వాళ్లకిపాఠాలు చెప్పే వుపాధ్యాయులనీ, వాళ్లకు తెలియకుండా సూపర్వైజర్లచే నిఘా వేయించి, తెలుగు వినబడితే జరిమానాలూ, జీతాల్లో కోతలూ విధిస్తున్న విషయం యెవరికి తెలియదు? పాపం వాళ్లెవరికి చెప్పుకోవాలి?

మేష్టర్లని శిక్షిస్తే, తెలుగు వృధ్ధిలోకి వస్తుందా?

ఆలోచించండి.

Friday, March 2, 2012

కబుర్లు - 84అవీ, ఇవీ, అన్నీ

ఏలూరు దగ్గర పోణంగి గ్రామంలోని ప్రాచీన వైనతేయేశ్వర లింగం పగుళ్లుతీస్తూండడంతో, సహజసిధ్ధంగా వున్న "నాగేటి చాలు" అలాగే వుంచి, విడిపోతున్న మిగతాభాగాలని సం రక్షిస్తామన్నారట ఆలయ ఛైర్మన్ వగైరాలు. ఈవోగారు, సత్వర చర్యలు తీసుకొంటామనీ, ప్రస్తుతానికి నేరుగా అభిషేకాలు చేయకుండా, స్వచ్చమైన ఆవుపాలతో పానవట్టం వద్ద అభిషేకాలు చెయ్యమని సూచించారట. యెవరైనా దాతలు ముందుకు వస్తే, లింగానికి "వెండి తొడుగు" వేయిస్తామన్నారట! ఈ లోపల ఆ రుద్రుడి తల మాటేమిటో?

ఓ వారం క్రితం, ఏలూరు డీఎస్పీ "యెవరైనా అర్థరాత్రి మద్యం తాగి కనిపిస్తే, వారితోపాటు ఆ మద్యం అమ్మినవాళ్లని కూడా అదుపులోకి తీసుకోవాల"నీ, "రాత్రి 11 గంటల తరవాత బార్లు తెరిచి వుంటే, విక్రయదారులతోపాటు, మద్యం సేవించేవాళ్లని కూడా అదుపులోకి తీసుకోవాల"నీ  ఆదేశించారట. ఈ తాటాకు చప్పుళ్లకా తోడేళ్లు బెదిరేవి? (ఇంతవరకూ అలాంటి "అదుపు" ఒక్కటీ పేపర్లకి యెక్కలేదు మరి!)

మొన్నోరోజు కంచికామకోటి పీఠాధిపతి శిష్యులు పరమహంస శ్రీనారాయణేంద్ర సరస్వతి స్వామీజీ, "వెయ్యి కాళ్లమండపాన్ని కూలగొట్టి, తితిదే ఘోర తప్పిదం చేసిందనీ, దాని పునర్నిర్మాణం ఆగమ సమ్మతం" అనీ సెలవిచ్చారట. యేగూటి చిలక ఆ పలుకే పలుకుతుంది కదా? అసలు వెయ్యి కాళ్లే లేవనీ, అది కేవలం 35 కుటుంబాలు వంటలు చేసుకొని, భుజించి, నిద్రించడానికి వసతి కోసం యేర్పరచిన భవనమేననీ (అప్పట్లో వంటచెరకూ, పాత్రలూ వగైరాలు వుచితంగా వారే ఇచ్చేవారు), మరోసారి అందరికీ మనవి చేస్తున్నా.

ఓ పదిరోజులక్రితం, "అద్భుతం, సస్పెన్స్, థ్రిల్లు" అయిన ఓ వార్త వచ్చింది. ఓ ప్రముఖ సినీనటి ఇటీవల పలుదఫాలు భీమవరం వచ్చి వెళుతున్నారు అనీ, అత్యంత గోప్యంగా, మధ్యవర్తుల ద్వారా ఈ రాకపోకలు సాగుతున్నాయనీ, ఓ సంచలన కేసుకి సంబంధించిన నిందితునికి ఆమె దగ్గరగా వుండేవారనీ. తరవాత కూడా ఈ గుట్టు రట్టైనట్టు లేదు!

బహుళ అంతస్థుల భవనాల్లో లిఫ్టుల యేర్పాటుకి "జిల్లా అగ్నిమాపక అధికారి"కి దరఖాస్తు చేసుకోవాలని యెరరికైనా తెలుసా? పది మీటర్ల యెత్తు దాటిన భవనాలకి లిఫ్టు కంపల్సరీ అని తెలుసా? లిఫ్ట్ లో అవసరమైతే సైరన్ మోగే యేర్పాట్లూ, "చార్జింగ్ ఏ ఆర్ డీ" సిస్టం--అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోతే, సమీప అంతస్తుకి వచ్చి మరీ ఆగిపోయే విధానం, జనరేటర్, సహాయకులూ, సంబంధిత శాఖల ఫోను నెంబర్లూ, ఛార్జింగ్ బేటరీలూ, సర్వీస్ సంస్థల ఫోను నెంబర్లూ--ఇవన్నీ యేర్పాటు చెయ్యాలని తెలుసా? మనకీ లిఫ్టుల గోల లేదు. సంతోషం. మరి వున్నవాళ్ల మాటేమిటి?

మా జిల్లా కలెక్టరు గారి మాతృమూర్తి, ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా నిర్వహించిన "పరుగు, నడక" పోటీల్లో, ఆవిడా, ఆవిడ "తనయుడూ" "కోడలూ" పాల్గొని, "మూడు బంగారు, మూడు రజత, మూడు కాంస్య" పతకాలు "సాధించార"ట! 60 సంవత్సరాలు పైబడ్డా, 5 కీ మీ నడకా, 200 మీ, 100 మీ పరుగు పందెంలో కూడా బంగారు పతకాలు సాధించడం పట్ల అందరూ ఆవిడని అభినందించారట. 

వీటన్నింటికీ సందర్భం? కలెక్టరుగారి జన్మదినోత్సవం! దానికి అనేకమంది ఐ యే ఎస్ లూ, ఐ పీ ఎస్ లూ, ఇతర వుద్యోగులూ--హాజరు! (ఆ వుత్సవ ఖర్చులు యెవరు పెట్టుకొన్నారో?)

ఆవిడకి "అన్ని పొగడ్తల" అవసరం వుందా? యేమో మరి!