Friday, March 2, 2012

కబుర్లు - 84



అవీ, ఇవీ, అన్నీ

ఏలూరు దగ్గర పోణంగి గ్రామంలోని ప్రాచీన వైనతేయేశ్వర లింగం పగుళ్లుతీస్తూండడంతో, సహజసిధ్ధంగా వున్న "నాగేటి చాలు" అలాగే వుంచి, విడిపోతున్న మిగతాభాగాలని సం రక్షిస్తామన్నారట ఆలయ ఛైర్మన్ వగైరాలు. ఈవోగారు, సత్వర చర్యలు తీసుకొంటామనీ, ప్రస్తుతానికి నేరుగా అభిషేకాలు చేయకుండా, స్వచ్చమైన ఆవుపాలతో పానవట్టం వద్ద అభిషేకాలు చెయ్యమని సూచించారట. యెవరైనా దాతలు ముందుకు వస్తే, లింగానికి "వెండి తొడుగు" వేయిస్తామన్నారట! ఈ లోపల ఆ రుద్రుడి తల మాటేమిటో?

ఓ వారం క్రితం, ఏలూరు డీఎస్పీ "యెవరైనా అర్థరాత్రి మద్యం తాగి కనిపిస్తే, వారితోపాటు ఆ మద్యం అమ్మినవాళ్లని కూడా అదుపులోకి తీసుకోవాల"నీ, "రాత్రి 11 గంటల తరవాత బార్లు తెరిచి వుంటే, విక్రయదారులతోపాటు, మద్యం సేవించేవాళ్లని కూడా అదుపులోకి తీసుకోవాల"నీ  ఆదేశించారట. ఈ తాటాకు చప్పుళ్లకా తోడేళ్లు బెదిరేవి? (ఇంతవరకూ అలాంటి "అదుపు" ఒక్కటీ పేపర్లకి యెక్కలేదు మరి!)

మొన్నోరోజు కంచికామకోటి పీఠాధిపతి శిష్యులు పరమహంస శ్రీనారాయణేంద్ర సరస్వతి స్వామీజీ, "వెయ్యి కాళ్లమండపాన్ని కూలగొట్టి, తితిదే ఘోర తప్పిదం చేసిందనీ, దాని పునర్నిర్మాణం ఆగమ సమ్మతం" అనీ సెలవిచ్చారట. యేగూటి చిలక ఆ పలుకే పలుకుతుంది కదా? అసలు వెయ్యి కాళ్లే లేవనీ, అది కేవలం 35 కుటుంబాలు వంటలు చేసుకొని, భుజించి, నిద్రించడానికి వసతి కోసం యేర్పరచిన భవనమేననీ (అప్పట్లో వంటచెరకూ, పాత్రలూ వగైరాలు వుచితంగా వారే ఇచ్చేవారు), మరోసారి అందరికీ మనవి చేస్తున్నా.

ఓ పదిరోజులక్రితం, "అద్భుతం, సస్పెన్స్, థ్రిల్లు" అయిన ఓ వార్త వచ్చింది. ఓ ప్రముఖ సినీనటి ఇటీవల పలుదఫాలు భీమవరం వచ్చి వెళుతున్నారు అనీ, అత్యంత గోప్యంగా, మధ్యవర్తుల ద్వారా ఈ రాకపోకలు సాగుతున్నాయనీ, ఓ సంచలన కేసుకి సంబంధించిన నిందితునికి ఆమె దగ్గరగా వుండేవారనీ. తరవాత కూడా ఈ గుట్టు రట్టైనట్టు లేదు!

బహుళ అంతస్థుల భవనాల్లో లిఫ్టుల యేర్పాటుకి "జిల్లా అగ్నిమాపక అధికారి"కి దరఖాస్తు చేసుకోవాలని యెరరికైనా తెలుసా? పది మీటర్ల యెత్తు దాటిన భవనాలకి లిఫ్టు కంపల్సరీ అని తెలుసా? లిఫ్ట్ లో అవసరమైతే సైరన్ మోగే యేర్పాట్లూ, "చార్జింగ్ ఏ ఆర్ డీ" సిస్టం--అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోతే, సమీప అంతస్తుకి వచ్చి మరీ ఆగిపోయే విధానం, జనరేటర్, సహాయకులూ, సంబంధిత శాఖల ఫోను నెంబర్లూ, ఛార్జింగ్ బేటరీలూ, సర్వీస్ సంస్థల ఫోను నెంబర్లూ--ఇవన్నీ యేర్పాటు చెయ్యాలని తెలుసా? మనకీ లిఫ్టుల గోల లేదు. సంతోషం. మరి వున్నవాళ్ల మాటేమిటి?

మా జిల్లా కలెక్టరు గారి మాతృమూర్తి, ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా నిర్వహించిన "పరుగు, నడక" పోటీల్లో, ఆవిడా, ఆవిడ "తనయుడూ" "కోడలూ" పాల్గొని, "మూడు బంగారు, మూడు రజత, మూడు కాంస్య" పతకాలు "సాధించార"ట! 60 సంవత్సరాలు పైబడ్డా, 5 కీ మీ నడకా, 200 మీ, 100 మీ పరుగు పందెంలో కూడా బంగారు పతకాలు సాధించడం పట్ల అందరూ ఆవిడని అభినందించారట. 

వీటన్నింటికీ సందర్భం? కలెక్టరుగారి జన్మదినోత్సవం! దానికి అనేకమంది ఐ యే ఎస్ లూ, ఐ పీ ఎస్ లూ, ఇతర వుద్యోగులూ--హాజరు! (ఆ వుత్సవ ఖర్చులు యెవరు పెట్టుకొన్నారో?)

ఆవిడకి "అన్ని పొగడ్తల" అవసరం వుందా? యేమో మరి!

No comments: