అవీ, ఇవీ, అన్నీ
గోరోజనం అంటే--మామూలుగా "పొగరు" లేదా "గర్వం" అనే అర్థంలో వాడతారు. మరి అసలు ఆ పొగరు యెక్కడ వుంటుంది? కోడె గిత్తల మూపురాల్లో యేర్పడుతుందది. దానివల్లే వాటికంత పొగరు.
ఆ పదార్థానికి వైద్యంతో సహా అనేక వుపయోగాలున్నాయట. ఓ కేజీ కొన్ని లక్షల ఖరీదుట.
దానికోసం ఓ 24 గిత్తలనీ, 100 మేలుజాతి యెడ్లనీ పెద్ద సీల్డ్ కంటెయినర్లలో రాష్ట్ర బోర్డరు దాటిస్తుంటే విశాఖ దగ్గర నక్కపల్లి వద్ద పోలీసుల సాయంతో పట్టుకొని, పెదతాడేపల్లి తరలిస్తే, గోసేవా సమితివారు సం రక్షిస్తున్నారు. చుట్టుప్రక్కల రైతులు వాటి మేత, పోషణ విషయం చూసుకొంటున్నారు.
ఆ తరవాత ఇంకో 160 పశువులనికూడా అక్కడికి తరలించారుట.
మొన్న, కొంతమంది యెలమంచిలి కోర్టులో 124 పశువుల యజమానులు మేమే అనీ, వాటిని అప్పగించాలి అనీ కేసు నెగ్గి, వాటిని తరలించుకుపోయారట. అదేమి లోపాయకారీ వ్యవహారమో!
యేలూరు ప్రభుత్వాసుపత్రిలో "ఆత్మలు" ఘోషిస్తున్నాయట. అక్కడ శవాలు భద్రపరచే గదిలో యేర్పాటు చేసిన 8 ఫ్రీజర్లలో 6 పనిచెయ్యడం మానేసి, మృతదేహాలు కుళ్లిపోతున్నాయట. 6 ఫ్రీజర్లలో దాదాపు 8 లక్షల విలువచేసే శీతల యంత్రాలని పట్టుకుపోయి, ఇళ్లలో వాడుకుంటున్నారట--సిబ్బంది! పైగా వాటి మరమ్మతులకి ఒక్కోసారీ 30 వేలవరకూ బిల్లులు చేసుకొంటున్నారట! ఇంకో విషయం యేమిటంటే, ఆ ఆసుపత్రికి కలెక్టరే ఛైర్మన్ ట.
ఆవిడ మాతృ హృదయం యేమంటుందో?
నిర్మాణకార్యక్రమలు జోరుగా సాగుతూండడంతో, వాగులూ, వంకలూ, కాలవల్లోనేకాకుండా, పోరంబోకుల్లో కూడా మట్టిని తవ్వేసి బంగారం సంపాదించేస్తున్నారు!
కానీ నిబంధనలే గాలికి యెగిరిపోతున్నాయి.
జిరాయితీ భూముల్లో భూమి స్వరూపాన్ని మార్చాలంటే తహసీల్దారునుంచి తప్పక అనుమతి తీసుకోవాలట. దరఖాస్తులో వివరాలన్నీ ఖచ్చితంగా నమోదు చెయ్యాలట. తహసీల్దారు ఆ భూమిని పరిశీలించి, కట్టిన ఫీజూ, యెన్ని ట్రాక్టరుల్లో తరలిస్తారు వగైరాలమీద ఆథారపడి అనుమతి ఇవ్వాలట. చూట్టూ ప్రభుత్వ భూములుంటే ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలోనే జరగాలట. లోతుగా తవ్వితే, మైనింగ్ శాఖ అనుమతి వుండాలట. అనుమతుల్లేకుండా ఏదశలోనూ మట్టి తవ్వకాలు జరగకూడదట.
మరి అందరూ లక్షల్లో యెలా సంపాదించేస్తున్నారో?
నందననామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించాలని డీ ఆర్వో అధికారులను ఆదేశించారట. వేదపాఠశాల విద్యార్థులచే వేదపాఠనం, అనంతరం ఉగాది స్వాగత నృత్యం, పంచాంగ శ్రవణం యేర్పాటు చేశారట. ఈ లోపల అధికారులందరితో "సమీక్షలు" నిర్వహిస్తున్నారట--యేర్పాట్ల విషయమై!
మహిళా దినోత్సవం సందర్భంగా మొన్న మొగల్తూరు లో "ఘనం"గా నిర్వహించి, అంగన్ వాడీ సిబ్బందికి పరుగు; లెమన్-స్పూన్; మ్యూజికల్ ఛెయిర్స్; ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకి బహుమతులిచ్చారట. ఆ సందర్భంగా ఎంపీడీవో మహిళలను అన్నిరంగాలలో (మరిన్ని ముగ్గులూ అవీ వేసేలా) చైతన్యవంతులని చేసేందుకు తగిన కృషి చెయ్యాలని పిలుపిచ్చారట (యెవరికో?)!
No comments:
Post a Comment