Thursday, July 29, 2010

'మెమరీ' అనే ఙ్ఞాపక శక్తి


"గూ......'గుల్ల'యితే"

..........అవుతుందా? యేమో! ఈ ప్రపంచం లో యేదైనా జరగవచ్చు!

ఓ పన్నెండేళ్ళ క్రితం, ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం అక్షరాలా మూడువేల రూపాయలు చెల్లించి, నెలకి ఐదో, యెనిమిదో వందలు వాడికి చదివించుకుంటూ, 256 కే బీ పీ ఎస్ మోడెం తో, (వర్షాలు వచ్చి చెన్నై ములిగి పోయింది కదండీ--ఇంకో వారం దాకా నెట్ కనెక్ట్ అవక పోవచ్చు--మా ఇంజనీర్లు పాపం ఆ వానలోనే ప్రయత్నిస్తున్నారు--లాంటి క్లారిఫికేషన్లతో) "కనెక్ట్" అన్న తరవాత ఓ పావు గంటకి--అయితే--అయ్యే కనెక్షన్లతో, నెట్ బ్రౌజింగ్--ఓ తప్పనిసరి తద్దినం!

అప్పుడే, "నెట్ స్కేప్" బ్రౌజర్ వాడు, 0.5 కే బీ నో, 5.0 కేబీనో "ఫ్రీ డిస్క్ మెమరీ" అని అనౌన్స్ చేస్తే, ఓ రాత్రి తెల్లవార్లూ, "దీన్నెలాగైనా సాధించాలి--అంత మెమరీ అంటే మాటలా!?" అనుకొంటూ, చివరికి సాధించిన రోజు నాకు బాగా గుర్తు.

మరి ఇప్పుడు?

ఒక్క గూగుల్ వాడే, 7,481.558803 మెగాబైట్స్ (అండ్ కౌంటింగ్) ఫ్రీ అంటూ సెకెనుకి 4 మెగాబైట్ల చొప్పున పెంచుకుంటూ పోతున్నాడు (మెగా బైట్లు కాదేమో--బిట్లో, బైట్లో అయి వుంటాయి.)!

ఇప్పుడు, మనం మెయిల్స్ గానీ, ఇంకేమైనా సమాచారం గానీ, "డిలీట్" చెయ్యడమే మానేశాం. కాకుండా, కొన్నెవేల బ్లాగులూ, వాటి మీద లక్షలకొలదీ కామెంట్లూ!

పోనీ బ్లాగుల్లో విషయం చూస్తే, ఆశమ్మ, బూశమ్మ పోచుకోలు కబుర్లూ, వంటలూ, దేవుళ్ళూ, చెట్లూ, పుట్టలూ, పువ్వులూ, కాయలూ--ఇంకా ఒకళ్ళమీద ఒకళ్ళు పడి యేడవడం! ఇంకా కాలక్షేపం లేకపోతే, వుండనే వున్నాయి, వేదాలూ, పురాణాలూ, ఉపనిషత్తులూ, ఇతిహాసాలూ, వైద్యాలూ--ఇంకా చాలా!

మొన్నామధ్య పసిఫిక్ లోనో, అట్లాంటిక్ లోనో--కాదు మధ్యధరా లో, అదేదో ఓడకి తగిలి కేబుల్స్ తెగిపోతే, ఓ వారం పాటు కొన్ని దేశాల్లో నెట్ సంథానం తెగిపోయింది. మిగిలిన దేశాల్లో వేగం తగ్గిపోయింది. పాపం ఆ ఇంజనీర్లు కష్టపడి, సముద్రం క్రింద 24 గంటలూ పని చేసి, మళ్లీ నార్మల్ కి తెచ్చారు.

మరి రేపేమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో, వున్న మెమరీ ని కాస్త "నిర్మాణాత్మకం"గా వుపయోగించుకోలేమా?

ఆలోచించండి!

Wednesday, July 28, 2010

ధూమ(రహిత)శకటాలు


లజ్జారహిత మంత్రిణి

  • 150 మంది మృతి చెందిన ఙ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం "సర్కారు అంటే గిట్టనివారు పన్నిన కుట్ర"ట.

  • 63 మంది అశువులుబాసిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక రైల్వేలని "బదనామ్ చెయ్యాలనుకుంటున్న వర్గాల ప్రమేయం వుందని" అనుమానం ట.

  • ఢిల్లీ స్టేషన్ లో, రైలు వస్తూందనగా, ప్లాట్ ఫామ్ మార్చామని ప్రకటించి, అందరూ మెట్లెక్కుతుండగా, మళ్లీ అది తప్పు అనీ, ఇదివరకు అనౌన్స్ చేసిన ప్లాట్ ఫామ్ మీదకే వస్తుందనీ చెప్పడం తో, తొక్కిసలాటలో అనేక మంది గాయ పడ్డారు, ఇద్దరు మరణించారు. "తప్పంతా జనాలదే! బుధ్ధిలేకుండా అలా పరుగులు పెట్టడం యేమిటి" అని ఈసడించారట.

ఇవన్నీ యెవరు అన్నారు? ఇంకెవరు--మమతాదీ నే!

రైల్వేలలో 89,000 వుద్యోగాలు కొన్ని యేళ్ళుగా ఖాళీగా వున్నాయట.

అందులో 20,000 వుద్యోగాలు "రైల్వే భద్రత, రక్షణ"లకి సంబంధించినవేనట.

26,000 డ్రైవర్ పోస్టులు ఖాళీగా వున్నాయట. 7 గంటలు మాత్రమే పనిచెయ్యవలసిన డ్రైవర్లు, పది పదిహేను గంటలు
పనిచేస్తున్నారట!

రైలు మొత్తానికి ఒకే టీ టీ ఈ తో నడుస్తున్న రైళ్ళు చాలా వున్నాయట.

బ్రిటీష్ వాళ్ళు నిర్మించిన రైలు మార్గం 52,000 కి. మీ. లైతే, స్వతంత్రం వచ్చాక 63 యేళ్ళలో కొత్తగా నిర్మించింది కేవలం 12,000 కి. మీ. కూడా లేదట.

ఇక "తృటిలో" తప్పిన ప్రమాదాల గురించి, రోజుకి రెండో మూడో వింటూనే వున్నాము.

ఇక ఇప్పుడు, ముఖ్యమైన స్టేషన్లలో ఒక్కోటీ 70 లక్షలు ఖర్చయ్యే "ఎస్కలేటర్లు" నిర్మిస్తారట! (మెట్లెక్కుతూనే
తోసుకొనే ప్రయాణీకులు ఎస్కలేటర్లు యెక్కడం లో యెన్ని ప్రమాదాలకి గురవుతారో!)

ఆ మాత్రం ఖర్చుతో ఒక్కో ప్లాట్ ఫామ్ మీదా అటు రెండూ, ఇటు రెండూ లిఫ్టులే యేర్పాటు చెయ్యవచ్చు! పైగా సురక్షితం గా వుంటాయి.

(తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో వున్నాయి ఇలా లిఫ్ట్ లు. అక్కడ అనేక అంతస్తులు వున్నాయి. మరి ప్లాట్ ఫామ్ మీదైతే, ఒక్క అంతస్తే కదా?)

మరి ఈ స్కీమే యెందుకంటే, వేరే అడగాలా--కోట్లు నొక్కెయ్యడానికని తెలియడం లేదూ!

రైల్వే శాఖ వెబ్ సైట్ లో కూడా, ఈ-టిక్కెట్లని అమ్ముతారట--ఐ ఆర్ సీ టీ సీ గుత్తాధిపత్యాన్ని నివారించడానికి! (ఇక రెంటికీ చెడ్డ రేవళ్లవుతారేమో అమాయక ప్రయాణీకులు!)

ఇదివరకే ఓసారి వ్రాశాను--ఇంకా రైళ్లలో గమ్యం చేరగలుగుతున్నారంటే, నిబధ్ధతతో వుద్యోగాలు చేస్తున్న
కొన్నివేల--గ్యాంగ్ మెన్ లూ, పాయింట్ మెన్ లూ, సిగ్నల్ మెన్ లూ వగైరాల వల్లే గానీ, ఇలాంటి 'మమత 'ల వల్ల కాదు అని.

ఇలాంటివాళ్ళని మంత్రివర్గం లో వుంచి, మేపుతున్న ఖర్మ మన కేంద్ర సర్కారుది!

హేపీ జర్నీ!


Sunday, July 18, 2010

ఐ ఆర్ సీ టీ సీ


ఇంకో బ్లాగర్ల విజయం

మామూలు రిజర్వేషనులూ, తత్కాల్ రిజర్వేషనులూ వుదయం 8.00 గంటలకే ప్రారంభించడం తో, ట్రాఫిక్ యెక్కువై, ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ శాఖ విజిలెన్సు తదితర అధికారులు (బహుశా ఐ ఆర్ సీ టీ సీ వాళ్ళతో చర్చించి) నిర్ధారణ చేసుకున్నారట.

శుభవార్తేమిటంటే, తత్కాల్ రిజర్వేషనులని వుదయం 10.00 గంటలకి మాత్రమే ప్రారంభించి, మామూలు రిజర్వేషనులని 8.00 గంటలకే ప్రారంభిస్తారుట.

ఇది నిశ్చయం గా మన బ్లాగర్ల విజయమే!

కానీ అప్పుడే చంకలు గుద్దేసుకోకండి. ఇది పాక్షిక విజయం మాత్రమే. యెందుకంటే ఇందులో పెద్ద మతలబు వుంది.

అదేమిటంటే, నెలా రెండునెలలు ముందుగా రిజర్వు చేసుకోవాలనుకొనేవాళ్ళకి, వుదయం 8.00 గంటలకే పరుగెత్తాల్సిన అవసరం వుండదు గా? రోజుకి ఓ మూడు నాలుగు గంటలు కంప్యూటర్ రిజర్వేషను అనుమతించినా, అది అర్థరాత్రి ప్రారంభించినా, ఇలాంటివాళ్ళకి యేమీ నష్టం లేదు.

అర్జెంటుగా బయలుదేరవలసి, ఓ రెండురోజుల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించే తత్కాల్ వాళ్ళకి దీనివల్ల యేమి వొరిగింది?

అంతేకాదు. మీరు గత యేడాదిలో యెప్పుడైనా పట్టణాల్లో రిజర్వేషన్ కౌంటర్ ల ముందు నిలుచున్నారా, చేతిలో పూర్తి చేసిన ఫారాలతో? అయితే గమనించే వుంటారు.

సహజం గా మనం లైను ఆఖర్లో నుంచుంటాం--మన ముందు ఓ పదిహేను నించీ ఇరవై మంది నించుని వుంటారు. మనం రెండు మూడు గంటలు నిరీక్షించినా, మనం కౌంటరు దగ్గరకి చేరం. మనముందున్న క్యూ తరగదు. ముందున్నవాళ్ళ మధ్యలో కొంతమంది చేరిపోతూ వుంటారు. మనం యేమైనా అంటే, 'మావాడేనండి--ఇందాకే బయటికి వెళ్లాడు.' అంటారు. ఇంకా మనమేమైనా మాట్లాడితే, అందరూ మూకుమ్మడిగా మనమీద తిట్ల దాడి చేస్తారు.

మనం వాళ్ళనేమీ అనఖ్ఖర్లేదు. యెందుకంటే, వాళ్ళు తమ పొట్టకూటికోసం ప్రముఖ ట్రావెల్ యేజంట్లదగ్గర పనిచేసేవాళ్లు. క్రితం రాత్రే, ఫారాలు పూర్తి చేసుకొని, దానికి తగిన చిల్లర నోట్లతోసహా స్టేపుల్ చేసుకొని, జిప్ బ్యాగుల్లో సర్దుకొని, బయలుదేరతారు. 7.00 గంటలకే, వీలైతే ఇంకా ముందే క్యూలో చేరతారు. మొదటివాడు తన బ్యాగు లోని ఒక ఫారం తాలూకు టిక్కెట్లు చేతికందగానే, పక్కకు వెళ్ళిపోతాడు. ఓ బెంచీలో కూర్చొని, జిప్ బేగ్ తెరిచి, ఓ అరలో ఆ టిక్కెట్లని వుంచి, ఇంకో జిప్ తెరిచి, ఇంకో ఫారం తీసుకొని, మళ్లీ క్యూలో చేరతాడు--ఒక్కడే అయితే మన వెనుక, వాళ్ళ మనిషి యెవరైనా మనముందున్నవాళ్ళలో వుంటే, వాడి వెనక!

(ఇలాంటి ప్రక్రియకే రాయల సీమలో "సైక్లింగ్" అనే పేరు పెట్టారు. ఇది వీలవడం లేదనే, "ఏ వీ ఎం లు వద్దు--బ్యాలెట్ పేపరే కావాలి" అని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నది!)

ఇలాంటివాళ్ళకి యెంత సుఖం? రాత్రి పొద్దుపోయేవరకూ ఫారాలు నింపి, నోట్లు పిన్ను కొట్టుకోనక్కరలేదు. పొద్దున్న 7.00 కి మొదలు పెట్టినా, భోజనాలు చేసి మరీ క్యూల్లో నించోవచ్చు!

బాగుంది కదా! మన ప్రజా రవాణా వారు మన చెవుల్లో క్యాబేజీలూ, క్యాలీ ఫ్లవర్లేకాదు--అవసరమైతే టోకున బ్రహ్మకమలాలని కొని, పెట్టగలరని అర్థమవుతోందా?

మరి వుద్యమించండి!


Tuesday, July 6, 2010

నివాళులు


శ్రథ్థాంజలులు

ఓ నాయకుడో ప్రతినాయకుడో మరణిస్తే, నివాళులు అర్పించడం ఓ వెర్రి అయిపోయింది జనాలకి.

రాశ్శేఖర్రెడ్డి పోయినప్పుడు, మంత్రులే ఇడుపులపాయకి వెళ్ళలేనంతగా జనాలు యెగబడ్డారంటే, యేమనుకోవాలి?

ఆయన పోయి యేడాది అవుతున్నా, ప్రతిరోజూ యెక్కడో అక్కడ యెవరో ఒకళ్ళో, కొంతమందో నివాళులు అర్పిస్తూనే వున్నారు.

మొన్న 'అజాద్' అనే మావోయిస్ట్ ఎంకౌంటర్ అయిపోతే, నివాళులు అర్పించడానికి యెగబడ్డ జనాలనీ, లైవ్ కవరేజ్ ఇచ్చిన టీవీ వాళ్ళనీ యేమనుకోవాలో!

వీళ్ళ దృష్టిలో కాసిని గులాబీ రేకులో యేవో శవం మీదో, ఫోటో మీదో జల్లితే, నివాళులు అర్పించినట్టే!

నా కొండెగాళ్ళు నన్ను 'ఒరే! నువ్వుపోతే, నీమీద సిగరెట్లు జల్లి నివాళులు అర్పిస్తామేం?' అనో, 'చందాలు వేసుకొని సిగరెట్లతోనే నిన్ను తగలబెడతాం!' అనో జోకేవారు. (నాకున్న బలహీనత ఈ సిగరెట్టే! చాలాసార్లు మానేశాను గానీ.............)

ఇంకో రకం నివాళి--యెప్పుడో పోయిన గాంధీ, పట్టాభి లాంటి వాళ్ళ ఫోటోలముందు పెద్ద పెద్ద దీపెం సెమ్మెలుంచి (అంటించేవాడు--ఆత్రేయ అన్నట్టు అది వెలిగించడమా? అంటించడమా?--వొంగక్కర్లేకుండా) కొవ్వొత్తులతో దాంట్లో వొత్తుల్ని వెలిగించడం! (గమనించారా--ఓ 'సెల్ఫ్ ఇంపార్టెన్సు' ఫీలయ్యే వాడు గబగబా నూనెలో తడిసిన వత్తుల చివరల్ని నలపుతూండడం, యెడం చెయ్యి పనికిరాదని కుడిచేత్తో వెలిగిస్తూ, యెడం చేతిని కుడి చేతికి మోచేయి పైన తాకిస్తూ వెలిగించడాన్నీ!)

ఇదేమిరకం నివాళో!

కొన్ని సినిమాల్లో చూపించినట్టు, ప్రారంభోత్సవానికి ఓ దూలాన్ని రంపంతో కోయమనో--ఇలా, వీళ్ళకి కూడా 'ఆరణి' లో నిప్పుచేసి, దీపాల్ని వెలిగించమంటే వీళ్ళేమి చేస్తారో!

(ఆరణి అంటే యఙ్ఞాలు చెయ్యడానికి అగ్నిహోత్రం రగిలించడానికి వుపయోగిస్తారు. ఇంకా వివరాలు కావాలంటే ఇంకో టపా వ్రాస్తాను.)

కొణిజేటోరబ్బాయి పుట్టిన్రోజుకి రాష్ట్రపతే కేకుని పట్టుకొచ్చి కోయించడం, ఆయన ఫ్లెక్సీలు వీధి వీధినా పెట్టడం, పేపర్లలో నిలువెత్తు ప్రకటనలూ--ఇవన్నీ అవసరమా?

రాయలవారి 500వ పట్టాభిషేకోత్సవమట! అలాగే, కుతుబ్ షాలకీ, రాజరాజు కీ, శాతవాహనుల నించి ఇక్ష్వాకుల వరకూ యెన్నో వందలవ పట్టాభిషేకోత్సవాలు నిర్వహిస్తావా గీతారెడ్డీ?

ఈ గోలంతా చూస్తూ వుంటే, జనాలు ప్రతీరోజూ--ఇవాళ యెవరికి దండేసి దణ్ణవెఁట్టేద్దామా అని యెదురు చూస్తున్నట్టు లేదూ?

నివాళులూ వర్థిల్లండి!