శ్రథ్థాంజలులు
ఓ నాయకుడో ప్రతినాయకుడో మరణిస్తే, నివాళులు అర్పించడం ఓ వెర్రి అయిపోయింది జనాలకి.
రాశ్శేఖర్రెడ్డి పోయినప్పుడు, మంత్రులే ఇడుపులపాయకి వెళ్ళలేనంతగా జనాలు యెగబడ్డారంటే, యేమనుకోవాలి?
ఆయన పోయి యేడాది అవుతున్నా, ప్రతిరోజూ యెక్కడో అక్కడ యెవరో ఒకళ్ళో, కొంతమందో నివాళులు అర్పిస్తూనే వున్నారు.
మొన్న 'అజాద్' అనే మావోయిస్ట్ ఎంకౌంటర్ అయిపోతే, నివాళులు అర్పించడానికి యెగబడ్డ జనాలనీ, లైవ్ కవరేజ్ ఇచ్చిన టీవీ వాళ్ళనీ యేమనుకోవాలో!
వీళ్ళ దృష్టిలో కాసిని గులాబీ రేకులో యేవో శవం మీదో, ఫోటో మీదో జల్లితే, నివాళులు అర్పించినట్టే!
నా కొండెగాళ్ళు నన్ను 'ఒరే! నువ్వుపోతే, నీమీద సిగరెట్లు జల్లి నివాళులు అర్పిస్తామేం?' అనో, 'చందాలు వేసుకొని సిగరెట్లతోనే నిన్ను తగలబెడతాం!' అనో జోకేవారు. (నాకున్న బలహీనత ఈ సిగరెట్టే! చాలాసార్లు మానేశాను గానీ.............)
ఇంకో రకం నివాళి--యెప్పుడో పోయిన గాంధీ, పట్టాభి లాంటి వాళ్ళ ఫోటోలముందు పెద్ద పెద్ద దీపెం సెమ్మెలుంచి (అంటించేవాడు--ఆత్రేయ అన్నట్టు అది వెలిగించడమా? అంటించడమా?--వొంగక్కర్లేకుండా) కొవ్వొత్తులతో దాంట్లో వొత్తుల్ని వెలిగించడం! (గమనించారా--ఓ 'సెల్ఫ్ ఇంపార్టెన్సు' ఫీలయ్యే వాడు గబగబా నూనెలో తడిసిన వత్తుల చివరల్ని నలపుతూండడం, యెడం చెయ్యి పనికిరాదని కుడిచేత్తో వెలిగిస్తూ, యెడం చేతిని కుడి చేతికి మోచేయి పైన తాకిస్తూ వెలిగించడాన్నీ!)
ఇదేమిరకం నివాళో!
కొన్ని సినిమాల్లో చూపించినట్టు, ప్రారంభోత్సవానికి ఓ దూలాన్ని రంపంతో కోయమనో--ఇలా, వీళ్ళకి కూడా 'ఆరణి' లో నిప్పుచేసి, దీపాల్ని వెలిగించమంటే వీళ్ళేమి చేస్తారో!
(ఆరణి అంటే యఙ్ఞాలు చెయ్యడానికి అగ్నిహోత్రం రగిలించడానికి వుపయోగిస్తారు. ఇంకా వివరాలు కావాలంటే ఇంకో టపా వ్రాస్తాను.)
కొణిజేటోరబ్బాయి పుట్టిన్రోజుకి రాష్ట్రపతే కేకుని పట్టుకొచ్చి కోయించడం, ఆయన ఫ్లెక్సీలు వీధి వీధినా పెట్టడం, పేపర్లలో నిలువెత్తు ప్రకటనలూ--ఇవన్నీ అవసరమా?
రాయలవారి 500వ పట్టాభిషేకోత్సవమట! అలాగే, కుతుబ్ షాలకీ, రాజరాజు కీ, శాతవాహనుల నించి ఇక్ష్వాకుల వరకూ యెన్నో వందలవ పట్టాభిషేకోత్సవాలు నిర్వహిస్తావా గీతారెడ్డీ?
ఈ గోలంతా చూస్తూ వుంటే, జనాలు ప్రతీరోజూ--ఇవాళ యెవరికి దండేసి దణ్ణవెఁట్టేద్దామా అని యెదురు చూస్తున్నట్టు లేదూ?
నివాళులూ వర్థిల్లండి!
No comments:
Post a Comment