Sunday, April 13, 2014

కబుర్లు - 116


అవీ, ఇవీ, అన్నీ


జైరామ్‌ రమేష్ అంటాడూ......యెన్నికల్లో ప్రజలు ఎం పీ లని మాత్రమే యెన్నుకుంటారు...ప్రథానిని కాదు అని. అవును కదా? ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎం పీ లు మాత్రం యే అభిప్రాయం ప్రకటించకుండా సీల్డు కవర్లో వచ్చిన పేరు గల వ్యక్తిని ప్రథానిగా యెన్నేసుకుంటారు!

రాహువు అయితే, కాంగ్రెస్ ఒక పార్టీనే కాదు....అది పెద్దల ఆలోచనా విధానం....దాన్నెవరూ తుడిచెయ్యలేరు. అంటాడు. అంటే అది వాళ్ల పెద్దల ఆలోచనా విధానం అయితే, దాన్ని యెవరూ తుడిచెయ్యలేరు అన్నది కరెక్టే కదా? (యెంత పెద్ద చీపురుతో అయినా, పార్టీ తుడిచిపెట్టుకు పోయినా ఫర్వాలేదు.)

వీరప్ప "టేపుల" మొయిలీ కూడా కాంగ్రెస్ ని యెవరూ చెరిపెయ్యలేరు అంటున్నాడు. అంత పెద్ద రబ్బరులు యెవరూ వుపయోగించలేరు అని భావమనుకుంటా. 

ఇప్పుడు వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు అంటే, యేదో మూల అది తుడిచిపెట్టుకు పోతుంది అనీ, చెరిగి పోతుంది అనీ భయం కలగడం వల్లే కదా?

మునిసిపల్ యెన్నికల ఫలితాల ప్రకటన వాయిదా పడడంతో, అభ్యర్థులు టెన్‌షన్‌, బీపీ, తలనెప్పీ వగైరాలతో హాస్పిటళ్లలో జేరుతున్నారట. పదిలక్షలవరకూ తెచ్చి, నెలకి లక్షకి ఇరవైవేలు వడ్డీలు యెలా కట్టాల్రా భగవంతుడా అనిట అసలు టెన్‌షన్‌!

ఇంక పందాలు కట్టిన వాళ్లు కూడా, మధ్యవర్తుల దగ్గర డబ్బు బ్లాక్ అయిపోవడంతో, తరువాత పందాలకి పెట్టుబళ్లు యెలాగా అని తలలు పట్టుకుంటున్నారట. 

చండీగఢ్ మున్‌సిపల్ కార్పొరేషన్ లో 319 స్వీపర్ పోస్టులకి 14 వేలమంది దరఖాస్తు చేసుకున్నారట. వాళ్లలో....జీతం 14,000/- వచ్చే ఈ వుద్యోగానికి 210 మంది పట్టభద్రులూ, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లూ, నలుగురు బీ టెక్ లూ, 70 మంది డిప్లొమా వున్నవాళ్లూ, వున్నారట. 

2011 లో బరేలీలో, ఇండో టిబెటన్‌ బోర్డర్ పోలీసులో, ఖాళీ ప్రకటించిన 416 క్షురక, ధోబీ  వుద్యోగాలకోసం రెండు లక్షలమంది పోగు పడ్డారట. ఆ పోస్టుకి జీతం రూ. 5,200/-. రైళ్లలో క్రిక్కిరిసి, టాపుమీదకూడా ప్రయాణాలు చే్సిన అభ్యర్థులు, ఓ పొట్టి బ్రిడ్జ్ క్రింద నుంచి వెళుతూండగా, 18 మంది అక్కడికక్కడే మరణించి, అనేకమంది తీవ్ర గాయాలపాలైన విషయం మరచిపోలేము

వచ్చే ఐదేళ్లలో ఇన్ని కోట్ల వుద్యోగాలు అంటూ ప్రకటించి, అది మరచిపోయి, మళ్లీ ఇప్పుడు అదే ప్రకటిస్తున్న పార్టీని భూస్థాపితం చెయ్యద్దూ?

మొన్న ఏప్రిల్ 9 న, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ బాంబు పేలి, 23 మంది దుర్మరణం, ఓ వందమంది కి పైగా తీవ్రంగా క్షతగాత్రులూ అయ్యారట. ప్రభుత్వం, నిషేధిత తాలిబన్‌ ఉగ్రవాదులతో, శాంతి చర్చలు జరుగుతున్నప్పుడు ఈ పేలుడు జరిగిందట. ఈ విధ్వంసాన్ని పాక్ తెహ్రిక్-ఇ-తాలిబన్‌ అధికార ప్రతినిథి తీవ్రంగా ఖండించారట! మరి తాము అలాంటివి చేసి, అనేకచోట్ల అనేకమందిని పొట్టనపెట్టుకొన్నప్పుడో?

Monday, April 7, 2014

కబుర్లు - 115


అవీ, ఇవీ, అన్నీ

సందట్లో సడేమియా లా వాడెవడో ఓ "శూలశోధన" (యెప్పుడు చేశాడో, శూలం యక్కడ గుచ్చాడో, యెవరు యేమి వాగారో చెప్పలేదు) చేసి, బాబ్రీ మసీదు కూల్చివేత క్షణికావేశాలతో జరిగింది కాదు అనీ, ఖచ్చితంగా కుట్ర పన్ని పడగొట్టారు అని తేలింది అనీ ప్రకటించాడు. పైగా ఇప్పుడు దీన్ని ప్రకటించడానికి యెన్నికలతో యేమీ సంబంధం లేదు అనీ, యెప్పుడో జరిగిన పరిశోధన ఇప్పటికి తెమిలింది అనీ కూడా చెప్పాడు. 

దీన్నిబట్టే తెలుస్తోంది కదా--అందులో నిజమెంతో?

అదేదో కుంభకోణం లో దొరికిన డైరీల వల్ల, ముడుపులు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కి కూడా ముట్టాయి అని తేలిందట. క్రొత్తగా ఆశ్చర్యపోవడానికి యేం వుంది ఇందులో!?

అప్పుడెప్పుడో, ఓ కలెక్టరు బ్యాంకు వుద్యోగులకి కూడా యెన్నికల విధులు అప్పగిస్తే, అలా వీల్లేదని కోర్టుకెళ్ళారు. తదుపరి కోర్టు అలా అప్పగించచ్చు అని తీర్పు ఇచ్చింది. తరువాత మామూలే.....అందరితో పాటూ వీళ్లకీ విధులు అప్పగించడం మామూలైపోయింది. 

బ్యాంకు బ్రాంచి మేనేజర్లకి ఓ శ్రీముఖం అందుతుంది యెన్నికల అధికారి నుంచి ఫలానా సెక్షన్‌ ప్రకారం మీ ఆఫీసులో పనిచేస్తున్న వుద్యోగులందరి పేర్లూ మాకు సమర్పించవల్సింది అంటూ. (ఫలానా సెక్షన్‌ ప్రకారం అంటే, యెన్నికల విధులు అప్పగించడానికి అందుబాటులో వుండే వుద్యోగులు అని. ఆ విషయం 1977 లో చదివి తెలుసుకున్నాను. అప్పుడు మా బ్రాంచి లో ముగ్గురు మాత్రమే వున్న సిబ్బందికి డ్యూటీలు వెయ్యలేదు.) 

2006 లో ఇలాగే మా రాయదుర్గం బ్రాంచి లో తాఖీదు అందుకున్న మేనేజరు, స్వీపరు తో సహా సిబ్బంది అందరి పేర్లూ వ్రాసి పంపించేశాడు. మాకు ఆ విషయం చెప్పలేదు. తీరా చూస్తే అందరికి ఫలనారోజున శిక్షణ తరగతులకి హాజరవండి అని హుకుమ్‌! 

మేనేజరు తలపట్టుకున్నాడు. మరి అందరి పేర్లూ యెందుకిచ్చావు అంటే, "ఇవ్వకపోతే, నాన్‌బెయిలబుల్ వారంటిస్తాడు నాకు" అన్నాడు. "అయితే సరే, బ్యాంకు తాళం వేసెయ్యి, తరగతులకి వెళ్దాం" అంటే "మరి నా వుద్యోగమో?" అన్నవాడికి బాగా తలంటు పోసి, బాధ్యత నానెత్తిన వేసుకొని, మా సబ్‌మేనేజరు తో తరగతులకి హాజరై, నిర్వాహకుడు ఎం ఆర్ వో (ఇప్పటి తాసీల్దారు) కి విషయం వివరిస్తే, "అలా యెందుకిచ్చాడయ్యా మీ మేనేజరు?" అంటూ కోప్పడి, "ఓ ఉత్తరం పంపించండి, కలెక్టరుతో మాట్లాడి చూస్తాను. కనీసం ఇద్దరినైనా పంపాలి తప్పదు" అన్నాడు. హమ్మయ్య అనుకొని, మిగిలిన వాళ్ళందరూ బ్యాంకులో తప్పకుండా చేయవలసిన డ్యూటీలు వ్రాసి, మా మేనేజరు పేరూ, ఉత్సాహం చూపించిన మా కేషియరు పేరూ యెలక్షన్‌ డ్యూటీకి సూచించి, బయటపడ్డాము.

ఇప్పుడు మా జిల్లాలో, బ్యాంకుల సిబ్బందిని ఏప్రిల్ 6 న విధులకోసం హాజరవ్వమని తాఖీదులు వచ్చాయి. ఒక మేనేజరూ, ఒక గుమాస్తా మాత్రమే వుండే బ్రాంచిలకికూడా తాఖీదులు రావడంతో బ్యాంకులన్నీ ఓ రెండు మూడు రోజులు మూసెయ్యవలసిన పరిస్థితి. యేవో తిప్పలు పడతారనుకోండి. 

అజ్ఞానం వల్ల వచ్చే తిప్పలు ఇవి.

మొన్న "స్త్రీల సంక్షేమం" కోసం అంటూ కేవలం "అరకేజీ బరువే" తూగే, హేండ్ బ్యాగ్ లో పట్టే "హేండ్ గన్‌" విడుదల చేశారు ఓ కంపెనీ వారు. దాని ధర కేవలం రూ.1,32,000/- మాత్రమేనట! "ధర యెక్కువని ఆలోచించనఖ్ఖర్లేదు..... అందరూ కొనేస్తారు.....ఇప్పటికే ఓ 200 గన్‌ లకి ఆర్డర్లు వున్నాయి" అని కూడా వారు చెప్పారట.

ఒక లోక్ సభ అభ్యర్థి యెన్నికల సభలో ఆయన భార్య మీఅందరి కీ తుపాకీ లైసెన్‌స్ ఇప్పిస్తాం, నాదీ బాధ్యత అందట. స్టేజి పైనున్నవాళ్లే ఆశ్చర్య పోతూంటే, నిజమే, నాదీ బాధ్యత అని మళ్ళీ చెప్పిందట. 

పై రెండిటికీ సంబంధం లేకపోవచ్చు. రెండూ చాలా దూరంగా, వేరు వేరు ప్రదేశాల్లో జరిగివుండొచ్చు. కానీ తేలుతున్నది యేమిటంటే, ప్రభుత్వం గన్‌ లాబీ తో కుమ్మక్కు అయ్యింది అనీ, మళ్ళీ యూపీయే గవర్నమెంట్ వస్తే మటుకు, విచ్చలవిడిగా గన్‌ లైసెన్‌స్ లు ఇచ్చి, గన్‌ సంస్కృతిని ప్రోత్సహిస్తారు అనీ. 

తస్మాత్ జాగ్రత జాగ్రత!.

"ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్‌" అనేది క్రీస్తుని సిలువ వేశాక ఖననం చేసేముందు ఆయనకి చుట్టిన వస్త్రం అని నమ్మేవారు చాలా మంది చాలా దేశాల్లో. దాని మీద అనేక పరిశోధనలు జరిపాయి అనేక సంస్థలు. 

కొంతమంది ఆ చిత్రం ఆకారం లోని మరకలు క్రీస్తువేననీ, మిగిలిన కొలతలన్నీ సరిపోయాయి అనీ...ఇలా ప్రకటించారు. కొంతమంది, ఆ వస్త్రానికీ క్రీస్తుకీ సంబంధమేలేదు అని ప్రకటించారు. కార్బన్‌ డేటింగ్ చేసిన సంస్థ కూడా అలాగే ప్రకటించింది. 

ఇప్పుడు లివర్‌పూల్ లో ఓ విశ్వవిద్యాలయం తాలూకు "బోరినీ" అనే ఆయన, ఆ వస్త్రాన్ని పరిశోధించి, క్రీస్తుని చేతులు రెండు వైపులా చాపి మేకులు కొట్టలేదు అనీ, పైకి పెట్టి రెండిటికీ ఒకే మేకుకొట్టారనీ, నగ్నంగా ఉండే పురుషుడి రూపం ముద్రించినట్టున్న ఆ వస్త్రం పై అంటుకున్న రక్తపు మరకల జాడలని బట్టి, ఆయన్ని సిలువ వేశాక, మరణానంతరం ఆయనని ఆ వస్త్రం లో చుట్టి సమాధి చేసి వుంటారని కూడా ఆయన ప్రకటించాడు.