Saturday, February 26, 2011

కబుర్లు - 33

అవీ, ఇవీ, అన్నీ

జర్మనీ మంత్రి మన ప్రణబ్ కి ఎల్జీటీ బ్యాంకులో భారతీయుల ఖాతాలకి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి తమకు యే అభ్యంతరం లేదు అనీ, యెలాంటి సమాచారాన్నైనా అందించగలమనీ హామీ ఇచ్చారట. ప్రణబ్ ఆయన్ని "అభినందించారట". మరి సమాచారం యెప్పుడు అడుగుతారో?

ఇంకా, ఇతర దేశాల్లో, పన్ను ఎగవేత (టాక్స్ ఇవేజన్), పన్ను మోసం (టాక్స్ ఫ్రాడ్) ల మధ్య తేడా వుందట! యెగవేత నేరం కాదట! యెగవెయ్యడం మోసం కాదట! ఈ వ్యత్యాసం తొలగించడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోందట. దీనిమీద ఆథారపడే వొప్పందాలు వుంటాయట. మరి అన్ని దేశాలతోనూ, ముఖ్యంగా స్విస్, జర్మనీ లతో వొప్పందాలెప్పుడో?

లిబియా అధ్యక్షుడు (కర్నల్) మొవమ్మర్ గడ్డాఫీ దేశం వదలి పారిపోయాడంటున్నాయి పాశ్చాత్య దేశాలు. తాను దేశం లోనే వున్నాను అంటున్నాడు ఆయన. పాతిక పైగా హత్యా ప్రయత్నాలని తప్పించుకొన్న చిరంజీవి ఆయన. మరి యేమవుతుందో!

మా జిల్లాలో, ఈ మధ్య జిల్లా కలెక్టరుతోసహా, వున్నతాధికారులందరూ సంకల్పం చేసుకొని, "వైద్యనిధి" యేర్పాటు చేశారు. తమిళనాడులో ధర్మపురి జిల్లాలో ఇలాంటి "స్కీము" అమలవుతోందని తెలిసి, ఓ నలుగురు వైద్యుల బృందాన్ని 2010 సెప్టెంబరులో ఓ మూడు రోజుల పాటు అక్కడ పర్యటించి నివేదిక సమర్పించమని, దాని ప్రకారం ఇక్కడ స్థాపించారట. 

అక్కడనించీ, ప్రభుత్వ (రెవెన్యూ) వుద్యోగులందరూ రెచ్చిపోయి, తమ జీతాల్లో కొంతభాగాన్ని ఈ నిధికి అర్పించి, పేపర్లలో ఫోటోలు వేయించుకొంటున్నారు. వున్నతాధికారులందరూ తలో 10 వేలూ అర్పించారట. వచ్చిన ఓ లక్షతో "బుట్టాయగూడెం" ప్రా ఆ కేం కి "భవనం" కట్టించేశారట. ప్రజలూ ముందుకు రావడంతో, మిగిలిన భవనాలన్నీ 12 లక్షలతో "ఆధునీకరించారట". 15 లక్షలతో ఆధునిక పరికరాలు కొన్నారట. అన్ని పరీక్షలూ, ఎక్స్ రేలూ, స్కాన్లూ అన్నీ వుచితం ట. అత్యాధునిక ఆపరేషన్ థియేటరు సిధ్ధమయ్యిందట. కేంద్రమంత్రి పళ్లం రాజు ఈ ఆసుపత్రిని ప్రారంభించారట. 

ఇంకా, మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల ప్రజలూ కుటుంబానికి రూ.20 చొప్పున ప్రతీనెలా 20 వేలు వచ్చేలా తీర్మానాలు చేసుకొని, దానితో రోగులకి భోజనాలూ, పళ్లూ, రొట్టెలూ, పాలూ వగైరా అందిస్తున్నారట. నిధి మొత్తం ఇప్పటికి రూ.44 లక్షలకి దాటిందట.

ఇన్నేళ్లుగా కలక్టర్లెవరూ ఇలాంటి "స్కీములు" యెప్పుడైనా వేశారా? ఓ సారి గుర్తు తెచ్చుకోండి!

పుబ్బలోపుట్టి, మఖలో మాడిపోయే ఈ స్కీములవల్ల వొరిగేదేమిటి? ఇలాంటి స్కీములు యెన్ని వేసి, యెన్ని కోట్ల కోట్లు ఖర్చుపెడితే, కనీసం అన్ని గిరిజన మండలాల్లోని పీ హెచ్ సీ లు బాగుపడతాయి?

పైగా, జిల్లా కలెక్టరుగారికి--పుట్టిన రోజు, పెళ్లిరోజు, పదోన్నతి వగైరాలకీ, జాతీయ పర్వదినాల్లోనూ శుభాకాంక్షలు చెప్పే వొరవడిని ప్రవేశపెట్టింది "ఈనాడు". దాంతో వుద్యోగులూ, ఇతరులూ కూడా ప్రకటనల రూపం లో "అవి" చెప్పేస్తున్నారు!

పాక్ లో అమెరికా జరిపిన పైలట్ రహిత యుధ్ధ విమాన క్షిపణి దాడుల్లో, నాలుగు క్షిపణులు ప్రయోగిస్తే, యేడుగురు వుగ్రవాదులు హతమయ్యారట. రెండుదేశాల సంబంధాల్లో 'ప్రతిష్టంభన' నెలకొందట.

అఫ్ఘాన్ లో ఓ మానబబాంబు పేలి, 31 మంది ప్రాణాలు కోల్పోయారట. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారట కూడా. ఇది తాలిబాన్ల పనేనట. 

సోమాలియాలో మొగాడిషూ లో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, ఓ 'కారు ఆత్మాహుతి దళం' పేల్చుకోవడంతో 8 మంది పౌరులు మృతి చెందారట. కారు పూర్తిగా లోపలికి రాలేదు కాబట్టి సరిపోయిందట. వస్తే, స్కోరు ఇంక బాగా పెరిగేదట!

వుగ్రవాదానికి మతం లేదట!

Friday, February 25, 2011

కబుర్లు - 32

అవీ, ఇవీ, అన్నీ

మన దేశంలో "ఆదాయపు పన్ను విభాగం" పనిచేయడం ప్రారంభించి 150 యేళ్లు అయిన సందర్భంగా, రూ.150 విలువతో, వెండి, రాగి, నికెల్, తగరాలతో ఓ నాణెం విడుదల చేస్తారట!

ఇంక, ఓ శాఖకి 16 యేళ్ల వయసొచ్చిందనో, ఇంకో విభాగానికి మైనారిటీ తీరింది అనో, రూ.16/-; రూ.18/- వగైరా విలువైన నాణాలు విడుదల చేయడం మొదలెడతారేమో!

నిజంగా ఇలాంటి "అవిడియా"లు ఇచ్చేవాళ్లకి భారత రత్న కన్నా పెద్దది--యే "భారత వీర బుర్రో" అనో పురస్కారాలు ప్రకటిస్తే బాగుండును ప్రభుత్వంవారు!

సూర్యుడు "అత్యంత చురుకైన" దశలోకి రావడంవల్ల, "ప్రపంచ కత్రినా" యేర్పడి, జనజీవనం అస్తవ్యస్తం కావచ్చనీ, ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల నష్టాన్ని కలిగించవచ్చనీ, సమాచార వుపగ్రహాలు దెబ్బతినడం, విమానాలు కూలిపోవడం, విద్యుత్ అంతరాయాలూ యేర్పడవచ్చు అనీ, "బెడింగ్టన్" అనే శాస్త్రవేత్త ప్రకటించాడట.

సౌర తుఫాను ప్రభావం యెలావుంటుందో గతవారమే అనుభవంలోకి వచ్చిందట. దానివల్ల యేర్పడిన కాంతిపుంజం రేడియో సమాచార వ్యవస్థని అస్తవ్యస్తం చేసిందట.

2013 లో సూర్యుడు ఈ దశలోకి పూర్తిగా వస్తాడట. అప్పుడేమి జరగనుందో మరి!

2జీ లో, లైసెన్స్ లు పొందిన కంపెనీలు వాటాలను అమ్మేసిన కంపెనీల మూలాలు పాకిస్థాన్ లో వున్నాయి అనీ, హోం మంత్రిత్వ శాఖే ఆ విషయం చెప్పిందనీ, దేశ భద్రతకి ముప్పు "కోణం" లో పరిశోధన చెయ్యాల్సిన బాధ్యత సీబీఐ దేననీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిందట.

ఆ కోణానికి సంబంధించిన వివరాలేవీ తనకు తెలియవు అనీ, సుబ్రహ్మణ్యం స్వామి ఫిర్యాదు ప్రతి కూడా తనదగ్గర లేదు అనీ, సీబీఐ నిస్సిగ్గుగా చెపితే, స్వామి అప్పటికప్పుడు ఆ ప్రతిని అందజేశారట!

ఆ కుక్కతోక పట్టుకొని, గోదావరిని యెన్నేళ్లలో ఈదుతామో మరి!

ప.గో. జిల్లా వ్యాప్తంగా, కొన్ని కోట్ల విలువైన 200 యెకరాల దేవాలయ భూములు "ఆక్రమణల్లో" వున్నాయట. ఇది అధికారిక సమాచారమేనట. ఇంక లీజు వ్యవహారాల్లో దాదాపు 250 యెకరాల్లో విలువైన పంట దేవుడికి దక్కకుండా పోతోందట. మొత్తం అన్ని దేవాలయాలకీ దాతలు ఇచ్చిన 16 వేల యెకరాల భూమి ఈ శాఖ క్రింద వుండాలట. గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం అంటూ , దస్త్రాలు వున్న భూముల విషయంలో మాత్రం కేసులు "నడుస్తున్నాయట." మిగిలినవాటిలో, అవి ఆక్రమించుకున్న రౌడీలూ, గూండాలూ జోలికి వెళ్లకుండా, తమ ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారట.

ఆలయల ఆస్థుల పరిరక్షణకి తాము కృషి చేస్తున్నట్లు ఆ అధికారి ఈ మధ్యనే పేర్కొన్నారట!

భీమవరం ఆర్ టీ వో ఆఫీసు 2003 లో యేర్పడితే, అప్పుడు సరఫరా అయిన "ప్రింటరు" తోనే ఇప్పటికీ సీ బుక్కులూ, లైసెన్స్ లూ, పర్మిట్లూ జారీ చేస్తున్నారట. ఫలితంగా ఇదివరకు తాలూకాఫీసు సీలు లా (బంగాళా దుంపని సగానికి కోసి, దాంతో ముద్రవేసినట్టు), నాసిరకం అక్షరాలూ, పోలిక కనిపించని ఫోటోలతో అవి విరాజిల్లుతున్నాయట.

"త్వరలోనే" క్రొత్త ప్రింటరు వచ్చేస్తుందని అధికారి సెలవిచ్చారట. 

ద్వారకా తిరుమలలో ఈ మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న (22-02-2011) పాత అంబర్ ఖానా లో, రాత్రి రెండున్నర ప్రాంతంలో గ్యాస్ సిలిండరు పేలిపోయి, తునాతునకలై, సరుకుల బస్తాలు, కార్యాల బీరువాలు, ఇతరవస్తువులు చెల్లా చెదురయ్యాయట. జన నష్టం జరగలేదు కదా అని వూపిరి పీల్చుకొన్నారట.....అగ్నిమాపక యంత్రాలు వచ్చి, మంటలని అదుపులోకి తెచ్చాక!

వాస్తు పండితులెవరైనా ఆ వూరినీ, కొండనీ పరిశీలిస్తే బాగుండునేమో!

Saturday, February 19, 2011

కబుర్లు - 31

అవీ, ఇవీ, అన్నీ

ముడిచమురు ధర బ్యారెల్ 100 డాలర్లకి మించినా, పెట్రోల్, డీజెల్ ధరల్ని పెంచే వుద్దేశ్యం ప్రభుత్వానికి లేదని జైపాల్ రెడ్డి ప్రకటించారు మొన్ననే. చమురు "మార్కెటింగ్" కంపెనీలు ఇప్పటికే రూ.80 వేల కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి అనీ, త్వరలో అది లక్ష కోట్లకి చేరవచ్చనీ కూడా అన్నారట. గత జూన్ నెలలో నియంత్రణని యెత్తేశాక కేవలం 7 సార్లు మాత్రమే ధరలు పెంచాయిట. వచ్చే బడ్జెట్లో ముడిచమురు, "ఇతర వుత్పత్తుల"పై కస్టమ్‌స్, ఎక్సైజ్ సుంకాల్ని ఆర్థికమంత్రి తగ్గిస్తారని విశ్వసిస్తున్నారట ఆయన.

మొన్ననే రూ.4,442 కోట్లు సబ్సిడీ ఇచ్చాక, ఐ వో సీ రూ.1,635 కోట్ల లాభం ప్రకటించిందట. మరి వున్న నాలుగు కంపెనీలూ దాదాపు అదే స్థితిలో వుంటే, వాటి నష్టాలు మొత్తం ఓ 15 వేల కోట్లు దాటవు కదా? ఈ మోళీ లెఖ్ఖలేమిటో యే మణిశంకర్ అయ్యరైనా పరిశోధిస్తే బాగుండును.

అన్నట్టు, సుబ్రహ్మణ్యం స్వామికీ, మణిశంకర్ లాంటివాళ్లకే రహస్యాలు యెందుకు తెలుస్తున్నాయో? (ప్రభుత్వాల్లో పెద్దపదవుల్లో వున్న 'బుర్రోవాదులందరూ' అరవ్వాళ్ళే అవడంవల్లనేమో!)

ఆర్థిక మంత్రితో మొన్ననో సమావేశంలో, మణిశంకర్ దేశంలో అవినీతీ, ధరలూ పెరిగిపోవడం పై ఆందోళన వ్యక్తం చేశారట. 

మంత్రిగారేమో, "అకస్మాత్తుగానూ, ముందుగానే వూహించిన రీతిలోనూ, ధరల్లో చోటుచేసుకొనే మార్పులని యెదుర్కోడానికి ప్రామాణిక కార్యాచరణ విధానాలు అవసరం" అనీ, "ముందుగానే చర్యలు తీసుకొనేందుకు యంత్రాంగాన్ని యేర్పాటు చెయ్యాలి" అనీ పేర్కొన్నారట. మరి యేర్పాటు చెయ్యలసింది యెవరో? యే అమెరికా ఆర్థిక మంత్రో, వరల్డ్ బ్యాంకో కాదు కదా!

అక్రమ ఆయుధాల పుట్ట హైదరాబాదేనట. గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డి, విదేశాలనించి వాటిని తెప్పించి అమ్మేవాడట. సూరి హత్యకేసులో నిందితుడు భాను, ఉత్తరప్రదేశ్, బీహార్లనుంచి పిస్తోళ్లు, రివాల్వర్లు తెప్పించి, విక్రయించేవాడట.

మన రాజధానిలో వేల సంఖ్యలో అక్రమ ఆయుధాలుంటే పోలీసులు యేడాదిలో కేవలం 785 తుపాకులు, పిస్టళ్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారట. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో 'అధికారికంగా' 10 వేల ఆయుధాలుంటే, అంతకు మూడు రెట్లు అక్రమ ఆయుధాలున్నట్లు అంచనాట.

రాజస్థాన్ లోని సరిహద్దు గ్రామాల్లో 'వారపు సంతల్లో' బహిరంగంగానే వీటిని విక్రయిస్తున్నారట. ఒక్కోటీ రూ.20 నుంచి రూ.30 వేలదాకా పలుకుతాయట. పాపం వాళ్లవీ 'పొట్టకూటికోసం వ్యాపారాలే' కదా!

ఇటలీ ప్రథాని సిల్వియో బెర్కుస్లోనీ, మైనర్ బాలిక రూబీకి డబ్బులిచ్చి, శృంగారంలో పాల్గొనడం, అధికార దుర్వినియోగం ఆరోపణలపై, ముగ్గురు మహిళా న్యాయమూర్తుల ముందు విచారణ జరగబోతోందట. 

మన ఇటాలియమ్మ వాళ్లని ఆదర్శంగా గ్రహిస్తుందేమో చూడాలి మనం.

1977 నాటికి, అంతర్వేది వెళితే, బిందెలతో మంచినీళ్లు పట్టుకెళ్లవలసి వచ్చేది. కానీ, అక్కడ 'కోకాకోలా' పుష్కలంగా దొరికేది! ప్రతీ చిన్న కొట్లో సైతం, కనీసం కొన్ని పదుల కేసులు వుండేవి ఆ సీసాలతో.

అలాంటిది, జార్జి ఫెర్నాండెజ్ "మీ ఫార్ములా యేదో మా ప్రభుత్వానికి చెపుతారా? వ్యాపారం యెత్తేసి వెళ్లిపోతారా?" అంటే, దేశం వదలి వెళ్లి పోయారు! మంత్రం వేసినట్టు ఆ సీసాలన్నీ వెంటనే మాయం అయ్యాయి దేశం లోంచి!

ఇప్పుడో వెబ్ సైట్, ఆ పానీయానికి అంత రుచి 'మెర్కండైజ్ 7ఎక్స్ ' అనే రహస్య పదార్థం తో వస్తుందనీ, దాని ఫార్ములాని కూడా ప్రకటించారట! యెంతవరకూ నిజమో మరి.

Friday, February 18, 2011

కబుర్లు - 30

అవీ, ఇవీ, అన్నీ

మన రోడ్లు : రాష్ట్రంలో 30వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయట. గత యేడు సంవత్సరాలుగా కొత్త రోడ్లు వెయ్యడం లేదు. కనీసం దెబ్బతిన్న తారు రోడ్లు కూడా బాగు చెయ్యడంలేదు.

జాతీయ రహదారులు కాకుండా, 65,664 కి మీ పొడవైన రోడ్లు రహదారులు, భవనాల శాఖ అధీనంలో వున్నాయట. చంద్రబాబు హయాంలో వాటికి మహర్దశ పడితే, కాంగీ ప్రభుత్వాల్లో--వాటి స్థితి ఫోటోల్లో చూస్తూనే వున్నాము.

యేటా రోడ్ల మరమ్మత్తులకోసం కనీసం చేపట్టవలసిన 13,200 కీ మీ లకి రూ.1500 కోట్లు ఖర్చుపెట్టడం రివాజట. అలాంటిది బడ్జెట్లో కేవలం 600 కోట్లే కేటాయిస్తుంటే, అవి యెందుకు వుపయోగపడుతున్నాయో తెలుస్తూనే వుంది. గత అయిదేళ్లుగా 20 కి మీ ల రోడ్లు మరమ్మత్తులకి నోచుకోక పోవడమే కాకుండా, మొన్నటి వర్షాలకి, వరదలకీ మరో 3 వేల కి మీ ల రోడ్లు నామ రూపాలు లేకుండా పోయాయట. వీటి మరమ్మతులకి రూ.928 కోట్లు అవసరమైతే, రూ.200 కోట్లిచ్చి, చేతులు దులుపుకొందట ప్రభుత్వం. అవి యెవరి చేతులు తడిపాయోగానీ, రోడ్లు మాత్రం అలాగే వున్నాయి.

ఈ రోడ్లమీద జరుగుతున్న ప్రమాదాల్లో, యేటా 14,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారట. ఇంకో 35 వేల మంది క్షతగాత్రులవుతున్నారట. ఇంకా, ప్రథాన రహదారులపై 300 ముఖ్యమైన వంతెనలు కూలడానికి సిధ్ధంగా వున్నాయట. అదే జరిగితే, ట్రాఫిక్ కి కొన్ని రోజులపాటు తీవ్ర అంతరాయాలు తప్పవట. (అయినా ఇప్పటికీ 144 చక్రాల భారీ వాహనాలు, కొన్ని వందల టన్నుల బరువుతో వాటిమీద ప్రయాణిస్తున్నాయి!). వీటి మరమ్మత్తుల ప్రతిపాదనలు గత అరేళ్లుగా ప్రభుత్వం దగ్గర మూలుగుతున్నాయట.

ఓ పదివేల కి మీ ల రోడ్లు నడవడానికి కూడా అయోగ్యంగా వుండడంతో, ఆర్టీసీ దాదాపు 3వేల గ్రామాలకి సర్వీసులు నిలిపివేసిందట. ఇంకొన్నింటిలో కూడా నిలిపివేసే ఆలోచనలో వుందట--బస్సుల మరమ్మతుల ఖర్చులు తట్టుకోలేక!

మరి అటు జలయఙ్ఞమూ కాక, ఇడు రోడ్ల యఙ్ఞమూ కాక, ఇంకేమి వెలగబెడుతున్నట్టో ప్రభుత్వం!

ఈ మధ్య పాక్ విదేశాంగ కార్యదర్శితో మన కార్యదర్శి చేసిన చర్చలు సఫలమయ్యాయట. ఇంక విదేశాంగ మంత్రుల చర్చలు త్వరలో ఢిల్లీలో జరగనున్నాయట. శుభం!

బో'ధనం '--అర్థంలేని స్కీము ఈ బోధన ఫీజుల చెల్లింపు. 

బడ్జెట్లో కేటాయించిన మొత్తాలు, పాత బకాయిలకే సరిపోలేదట! 2007-08 నాటికి రూ.74 కోట్లు వున్న బకాయిలు, మరుసటి సంవత్సరం రూ.438 కోట్లకీ, 2009-10 నాటికి రూ.1,962 కోట్లకీ యగబాకాయట! (రచ్చబండకి అవసరమైన రూ.2,500 కోట్లలో, అప్పటికప్పుడు రూ.1,250 కోట్లని విడుదల చేసింది ప్రభుత్వం! వాళ్లు నిర్మించిన స్టేజీలూ, మచ్చలేని తెల్లని నురుగులాంటి చాందినీలతో మోడర్న్ టెంటులూ, వాటిపై, స్టేజీ చుట్టూ మూడురంగుల గుడ్డలూ, వీటికీ, పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలకీ సరిపోయిందో లేదో ఆ కేటాయింపు! అయినా అవీ 'కార్యకర్తలకే' కాబట్టి, పార్టీకీ, ప్రభుత్వానికీ లాభమేనట. స్వీకరించిన అర్జీలు మాత్రం చెత్తబుట్టల్లోనూ, కాలవల్లోనూ దర్శనం ఇచ్చాయని ఫోటోలు కూడా వేసి, ప్రజలు ఆందోళనలు కూడా చేశారు). 

అసలు కొంతమంది తిమింగలాల చేత వృత్తివిద్యా కళాశాలలు కట్టించడానికి యెందుకు ప్రోత్సహించారు? సదుపాయాలు లేకపోయినా, వాటికి అనుమతులెందుకు ఇచ్చారు? ఫీజులు యెందుకు ఇబ్బడిముబ్బడిగా పెంచారు? వాటిని మేమే చెల్లిస్తాము అని యెందుకు ప్రకటించారు? వీటివల్ల యెవరు "లాభ" పడుతున్నారు? కాంట్రాక్ట్ లెక్చరర్లకీ, సిబ్బందికీ ముష్టి జీతాలే యెందుకు ఇస్తున్నారు? కోట్లెందుకు దండుకుంటున్నారు? మరిన్ని కాలేజీలు యెందుకు కడుతున్నారు?

పైగా, కాలేజీలు మూసేస్తామని బెదిరింపొకటి! మూసెయ్యమనండి--వారం రోజుల్లో ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిల్లాడతారు--విద్యార్థులు హాయిగా క్రికెట్ చూసుకొంటారు!

ఆ ధైర్యం వుందా ప్రభుత్వానికి?

శివరామ సుబ్రహ్మణ్యం--ఏపీఐఐసీ ఛెయిర్మన్--ఈయన ప్రభుత్వోద్యోగి కాదనుకుంటా....రాజకీయ నియామకం కాబోలు. సాటికులపోనికి రోశయ్య ఇచ్చిన బహుమతి అయివుండవచ్చు. ఆ మద్దతుతోనే మొదట్లో మీసాలు మెలేశాడు. అందుకే రాజకీయాలు మాట్లడతాడు. ఆమధ్య వాళ్ల కులసంఘం సభల్లోకూడా, ఎమార్ గురించి మాట్లాడాడు.

ఇప్పుడు బీదార్పులు మొదలెట్టాడు. మొదట "తనకి" నోటీసు ఇవ్వడానికి సాహసించిన ఎమార్, ఇప్పుడు 26 శాతం ఇచ్చేస్తామని రాజీకొచ్చిందంటే, తమ నైతిక విజయమే అంటూ, చర్యలు మాత్రం ప్రభుత్వమే తీసుకొంటుందనీ, తాను వున్నా, లేకపోయినా, కొత్త ఛెయిర్మన్ వచ్చినా, అధికారులు మారినా, అందరూ సంస్థ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. 

తన పదవికి యెసరొస్తూందని వుప్పందిందేమో! పాపం.

(కంపేరిటివ్ గా) చిన్నవయసులోనే పిచ్చి పిచ్చి బొమ్మలు వేసి, తిట్లూ, తన్నులూ తిన్న ఎం ఎఫ్ హుస్సేన్, గజగామినులూ అవీ చంకనాకిపోయినా, పిచ్చి తగ్గించుకోలేదు. ఇప్పుడు సినీనటి విద్యాబాలన్ ను నగ్నంగా చిత్రిస్తాననీ, అందుకావిడ వొప్పుకుందనీ అన్నాడట. ఆవిడేమో అదేమీ లేదు అందట! 

అవండీ సంగతులు.

Wednesday, February 16, 2011

కబుర్లు - 29

అవీ, ఇవీ, అన్నీ

ఈజిప్టు మహా నిరసన ఫలించి, ముబారక్ పదవి వదిలి పారిపోయాడట. శుభం! ఓ రెండుసార్లో యేమో కాల్పులు జరిగినా, అధికారులదే తప్పు అని తేల్చి, వాళ్లని పదవులనించి తొలగించారట.

దీన్ని చూసి, మన వాళ్లూ, పోలీసులూ పాఠాలు నేర్చుకుంటే యెంత బాగుండును?

రాస్తా రోకోలూ, రైల్ రోకోలూ, ముట్టడులూ, దూసుకుపోవడాలూ, వినూత్న నిరసనల పేరుతో చొక్కాలు విప్పెయ్యడాలూ, గుళ్లు గీయించుకోడాలూ, వెర్రి మొర్రి దీక్షలూ, తమని తాము ఓ గదిలో బంధించుకొని, యెవరూ లోపలకి రాకుండా 'నిరశనలూ'--చుట్టుపక్కల వాళ్ల వాళ్లందరూ వుద్రిక్తులైపోవడం, పోలీసులు వాళ్లందరినీ బాదేసి, తలుపులు బద్దలుగొట్టి నిరశనకారుల్ని హాస్పటళ్లలో చేర్చడం.......ఇలాంటివాటికి మీడియా పూర్తి కవరేజీ......ఇలాంటివాటివల్ల యేమి సాధిస్తున్నారు? యెవరిని వారు ప్రశ్నించుకోవాలి.

మొన్నామధ్య, విజయవాడలో గుంటూరుకు చెందిన "హవాలా" వ్యాపారులనీ, వాళ్ల అనుచరులనీ, పట్టుకొని, అరకోటికి పైగా స్వాధీనం చేసుకొన్నారట.

ఇప్పుడు హవాలా అనేది సర్వ సాధారణమైపోయింది. ఇదివరకు చాలా కొద్దిమంది మాత్రమే వినియోగించుకొనేవారు కానీ, దానిలోని సౌలభ్యం చూసి వాడుకొనేవాళ్ల సంఖ్య పెరిగింది. 

హవాలా అంటే, పూర్వం బ్యాంకులు లేని కాలంలో, చిలకమర్తివారి గణపతి నవలలో, వాడి తండ్రో, తాతో "పునహా" నించి పెళ్లికోసం మన వైపు తిరిగి వస్తూ, "నారాయణ కర్ను" గారి పేర "దర్శన హుండీ" వ్రాయించుకొని వచ్చినట్టు!

మనం ఇవాళ ఫ్లయిట్లో బెంగుళూరో, ఢిల్లీనో వెళ్ళాలి. అక్కడ ఓ అరకోటి యెవరికో చెల్లించాల్సిన అవసరం వుంది. మన డీల్ సెటిలయ్యేప్పటికి, బ్యాంకులు మూశేసారు. మన ఫ్లయిట్ సాయంత్రమే! మరెలా?

యేముందీ--సింపుల్ గా హవాలా వాడి షాపుకెళ్లి, అరకోటికి సరిపడా చెక్కులు ఇచ్చేసి, వాడి కమీషన్ (లక్షకి రెండు వందలో యెంతోనట) కట్టేసి, వాడిచ్చిన "కోడ్"--మాటో, సంఖ్యో నోట్ చేసుకొని, ఫ్లైట్ యెక్కెయ్యడమే! మనం ఫ్లైట్ దిగాక, అక్కడి హవాలా యేజంటుకి ఓ ఫోను కొట్టి, కోడ్ చెప్పేస్తే, మనం లాడ్జికి వెళ్ళేటప్పటికి అక్కడ అరకోటీ ప్రత్యక్షం! యెంత సుళువో చూశారా? 

ఇప్పుడు బ్యాంకులన్నీ "ఆన్లైన్" అయ్యాక, డ్రాఫ్టులు కూడా తగ్గిపోయాయి. 

మరి--హవాలాని అరికట్టడం యెలా? 

ఇప్పటికే, బ్యాంకులన్నీ "కే వై సీ" (నో యువర్ కస్టమర్) "పీ ఎం ఎల్" (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్) "సీ టీ ఆర్" (కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం....ఇంకేదో) లాంటి చట్టాల క్రింద తమ శాఖల్లో జరిగే పెద్ద లావాదేవీలన్నీ కాలపరిమితి ప్రకారం పై అధికారులకి పంపిస్తున్నాయి. యెటొచ్చీ, వాటిని సమర్థంగా వినియోగించుకొనే యంత్రాంగమే లేదు! అందుకే ఇన్ని కుంభకోణాలూ, స్కాములూ, స్విస్ బ్యాంకు ఖాతాలూ!

స్కోర్లు : నిన్న (15-02-2016) ఒక్క రోజునే, మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలలో "మరణించిన" వారి సంఖ్య--28! (గాయపడ్డవాళ్ల లెఖ్ఖ సరిగ్గా తెలీదు). జిల్లాలవారీగా--మెదక్-7; రంగారెడ్డి-2; నిజమాబాద్-2; ఖమ్మం-1; కర్నూలు-3; హైదరాబాద్-3; ఆదిలాబాద్-3; కరీమ్నగర్-1; అనంతపురం-4; విశాఖ-2! (ఇంకా రేపు బయటికి వచ్చేవున్నాయేమో!)

మన రోడ్ల గురించీ, వాహనాల గురించీ యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటారా?.....అలాగే మరి!

Thursday, February 3, 2011

కబుర్లు - 28

అవీ, ఇవీ, అన్నీ

ఒడీసా రాజధాని భుబనేశ్వర్ లోని ఓ ఎపార్ట్ మెంట్లో నివాసం వుంటున్న, సన్నోఖెముండి శాసన సభ్యుడు రమేష్ జెనా (కాంగ్రెస్) ఫ్లాట్ ను 01-02-2011 న పోలీసులు చుట్టుముట్టి "యెనిమిదిమంది నేరచరితులని" అదుపులోకి తీసుకున్నారట. సదరు ఎమ్మెల్యే కూడా ఓ హత్యకేసులో అరెస్టయి, ఈ మధ్యనే బెయిలుమీద బయటికి వచ్చాడట! పైగా, చుట్టుముట్టిన పోలీసులమీద కాల్పులు సాగించారట. రెండుగంటలపాటు కాల్పులు కొనసాగాక, నలుగురు పారిపోగా, 8 మంది దొరికారట! మరి అక్కడేమి గూడుపుఠాణీ జరుగుతోందో యెవరూ చెప్పలేదేమో.

ఉత్తరప్రదేశ్లో బరేలీ వద్ద 01-02-2011 నే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐ టీ బీ పీ) రిక్రూట్మెంటుకి 416 పోస్టులకి 11 రాష్ట్రాలనుంచి ఓ లక్షమందికి పైగా వచ్చారట! తమ పత్రాలు తీసుకోవడం లేదని ఆందోళనకి దిగి, యేడు బస్సులూ, ఓ పెట్రోలు పంపూ, పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలూ, పోలీసు వ్యాన్లూ తగులబెట్టారట. సమీపం లోని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలపై రాళ్లు విసిరారట. పోలీసులతో సహా ఓ 20 మంది గాయపడ్డారట.

పాపం కలెక్టరుగారు ఐటీబీపీ వాళ్లతో మాట్లాడి, దరఖాస్తులు పోస్టులో పంపిస్తే సరిపోతుంది అని చెప్పి, వాళ్లని వెనక్కి పంపేశారట. 

అంతటితో అయ్యిందా? బరేలీ నుంచి కొల్కత్తా వెళుతున్న హిమగిరి ఎక్స్ ప్రెస్ టాపెక్కి ప్రయాణించిన అభ్యర్థుల్లో ఓ యెనిమిది మంది యువకులు మృతి చెంది, 17 మంది గాయపడ్డారట. మిగిలినవాళ్లు ఆ బండిలోని ఏసీ కోచ్ ని తగులబెట్టారట ఆగ్రహంతో!

అలాంటి రిక్రూట్మెంట్ పధ్ధతిని పాటించమన్న, పాటించిన వాళ్లకి కోర్ట్ మార్షల్ చేసి, యెలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందో?

ప్రాచీన నాగరికతా దేశం ఈజిప్ట్ అంటుకుందట. వారం రోజులకి పైగా 30 యేళ్లనించీ పరిపాలిస్తున్న వాళ్ల అధ్యక్షుడు హోస్నీ ముబారక్ గద్దె దిగాల్సిందేనంటూ ఆందోళన చేస్తున్నారట. 01-02-2011 న పది లక్షలమంది, పోలీసులు కాల్పులు జరపబోమని ప్రకటించడంతో, ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించారట.

అంతకు ముందు అందోళనకారులమీద పోలీసు చర్యల్లో అధికారికంగా ఓ 150 మందీ, అనధికారంగా 300 మందికి పైగా మరణించారట.  

ఆయన ప్రతిపక్ష నాయకులని చర్చలకి పిలిచాడు. అవి కూడా ఫలప్రదం కాలేదని తెలుస్తోంది.

ఓపెక్ కి నాయకుడిగా వ్యవహరించినట్టున్నాడు ఆయన. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. 'డీ స్టెబిలైజేషన్ ' లో నిపుణులైన సీ ఐ యే వారే దీనికి కారణమేమో--యే వికీ లీక్స్ వాడో, యే పదేళ్ల తరవాతో బయటపెడతాడేమో!

వాడి సంగతెలావున్నా, ఓ ప్రక్క వుల్లిపాయలు హోల్సేల్ ధరలు సగానికి తగ్గినా, రీటెయిల్ లో మాత్రం యేమాత్రం తగ్గలేదట. ముడి చమురు ధర మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో పీపా 100 డాలర్లు దాటేసిందట!

"క్రితం జూలై లో 147 కి పెరిగినప్పుడే మనం భయపడలేదు--ఇప్పుడు భయపడతామా?" అంటున్న ప్రణబ్, ఆహార, ఇతర ద్రవ్యోల్బణం మాత్రం అందోళన కలిగిస్తోందంటున్నాడు.

చమురు కంపెనీలకి మూడో త్రైమాసికం లో వాటిల్లిన ఆదాయ నష్టం లో 50% అంటే ఓ 8000 కోట్లు సబ్సిడీని మంజూరు చేసిందట ప్రభుత్వం. అందుకని, వాటి త్రైమాసిక ఫలితాలని కూడా ప్రకటించకుండా వాయిదా వేశారట. మిగిలిన 8000 కోట్లూ కూడా ఇస్తేగానీ ప్రకటించరేమో మరి.

అవ్వాకావాలి, బువ్వా కావాలి అంటున్న ప్రభుత్వం, ఆయిల్ పూల్ ఖాతాని తిరిగి యెందుకు ప్రారంభించదో?

1924 జనవరి 1న మరణించిన సోవియెట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాడిమిర్ ఇల్యిచ్ ఉల్యనోవ్ (లెనిన్) మృత దేహాన్ని, ఓ గాజుపెట్టిలో వుంచి, ఇన్నేళ్లూ మాస్కోలోని రెడ్ స్క్వేర్లో 'మౌసొలియం' లో భద్రపరిచారు. 

అలాగే, మావో దేహాన్ని బీజింగ్ లో ఇంకో 'మౌసోలియం ' లో భద్ర పరిచారు.

ఇప్పుదు రష్యా ప్రభుత్వం లెనిన్ దేహాన్ని ఖననం చెయ్యాలని, ప్రజాభిప్రాయం సేకరించి మరీ, ప్రయత్నిస్తూందట.

ప్రభుత్వమే దొంగవేషాలు వేస్తోందని ఆరోపిస్తున్నారట వాళ్ల కమ్యూనిష్టులు!

ఐన్ స్టీన్ మెదడు మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి అనీ, హిట్లర్ అవయవాలు, వాడి మూడంగుళాల శిశ్నం తో సహా భద్రపరిచారనీ, పరిశోధించారనీ వింటూంటాము.

మరి ఈ లెనిన్ వల్లా, మావో వల్లా యేమి వుపయోగమో?

కమ్యూనిష్టులకే వేలం వెర్రి యెక్కువేమో! అనిపిస్తుంది నాకు.