Friday, February 18, 2011

కబుర్లు - 30

అవీ, ఇవీ, అన్నీ

మన రోడ్లు : రాష్ట్రంలో 30వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయట. గత యేడు సంవత్సరాలుగా కొత్త రోడ్లు వెయ్యడం లేదు. కనీసం దెబ్బతిన్న తారు రోడ్లు కూడా బాగు చెయ్యడంలేదు.

జాతీయ రహదారులు కాకుండా, 65,664 కి మీ పొడవైన రోడ్లు రహదారులు, భవనాల శాఖ అధీనంలో వున్నాయట. చంద్రబాబు హయాంలో వాటికి మహర్దశ పడితే, కాంగీ ప్రభుత్వాల్లో--వాటి స్థితి ఫోటోల్లో చూస్తూనే వున్నాము.

యేటా రోడ్ల మరమ్మత్తులకోసం కనీసం చేపట్టవలసిన 13,200 కీ మీ లకి రూ.1500 కోట్లు ఖర్చుపెట్టడం రివాజట. అలాంటిది బడ్జెట్లో కేవలం 600 కోట్లే కేటాయిస్తుంటే, అవి యెందుకు వుపయోగపడుతున్నాయో తెలుస్తూనే వుంది. గత అయిదేళ్లుగా 20 కి మీ ల రోడ్లు మరమ్మత్తులకి నోచుకోక పోవడమే కాకుండా, మొన్నటి వర్షాలకి, వరదలకీ మరో 3 వేల కి మీ ల రోడ్లు నామ రూపాలు లేకుండా పోయాయట. వీటి మరమ్మతులకి రూ.928 కోట్లు అవసరమైతే, రూ.200 కోట్లిచ్చి, చేతులు దులుపుకొందట ప్రభుత్వం. అవి యెవరి చేతులు తడిపాయోగానీ, రోడ్లు మాత్రం అలాగే వున్నాయి.

ఈ రోడ్లమీద జరుగుతున్న ప్రమాదాల్లో, యేటా 14,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారట. ఇంకో 35 వేల మంది క్షతగాత్రులవుతున్నారట. ఇంకా, ప్రథాన రహదారులపై 300 ముఖ్యమైన వంతెనలు కూలడానికి సిధ్ధంగా వున్నాయట. అదే జరిగితే, ట్రాఫిక్ కి కొన్ని రోజులపాటు తీవ్ర అంతరాయాలు తప్పవట. (అయినా ఇప్పటికీ 144 చక్రాల భారీ వాహనాలు, కొన్ని వందల టన్నుల బరువుతో వాటిమీద ప్రయాణిస్తున్నాయి!). వీటి మరమ్మత్తుల ప్రతిపాదనలు గత అరేళ్లుగా ప్రభుత్వం దగ్గర మూలుగుతున్నాయట.

ఓ పదివేల కి మీ ల రోడ్లు నడవడానికి కూడా అయోగ్యంగా వుండడంతో, ఆర్టీసీ దాదాపు 3వేల గ్రామాలకి సర్వీసులు నిలిపివేసిందట. ఇంకొన్నింటిలో కూడా నిలిపివేసే ఆలోచనలో వుందట--బస్సుల మరమ్మతుల ఖర్చులు తట్టుకోలేక!

మరి అటు జలయఙ్ఞమూ కాక, ఇడు రోడ్ల యఙ్ఞమూ కాక, ఇంకేమి వెలగబెడుతున్నట్టో ప్రభుత్వం!

ఈ మధ్య పాక్ విదేశాంగ కార్యదర్శితో మన కార్యదర్శి చేసిన చర్చలు సఫలమయ్యాయట. ఇంక విదేశాంగ మంత్రుల చర్చలు త్వరలో ఢిల్లీలో జరగనున్నాయట. శుభం!

బో'ధనం '--అర్థంలేని స్కీము ఈ బోధన ఫీజుల చెల్లింపు. 

బడ్జెట్లో కేటాయించిన మొత్తాలు, పాత బకాయిలకే సరిపోలేదట! 2007-08 నాటికి రూ.74 కోట్లు వున్న బకాయిలు, మరుసటి సంవత్సరం రూ.438 కోట్లకీ, 2009-10 నాటికి రూ.1,962 కోట్లకీ యగబాకాయట! (రచ్చబండకి అవసరమైన రూ.2,500 కోట్లలో, అప్పటికప్పుడు రూ.1,250 కోట్లని విడుదల చేసింది ప్రభుత్వం! వాళ్లు నిర్మించిన స్టేజీలూ, మచ్చలేని తెల్లని నురుగులాంటి చాందినీలతో మోడర్న్ టెంటులూ, వాటిపై, స్టేజీ చుట్టూ మూడురంగుల గుడ్డలూ, వీటికీ, పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలకీ సరిపోయిందో లేదో ఆ కేటాయింపు! అయినా అవీ 'కార్యకర్తలకే' కాబట్టి, పార్టీకీ, ప్రభుత్వానికీ లాభమేనట. స్వీకరించిన అర్జీలు మాత్రం చెత్తబుట్టల్లోనూ, కాలవల్లోనూ దర్శనం ఇచ్చాయని ఫోటోలు కూడా వేసి, ప్రజలు ఆందోళనలు కూడా చేశారు). 

అసలు కొంతమంది తిమింగలాల చేత వృత్తివిద్యా కళాశాలలు కట్టించడానికి యెందుకు ప్రోత్సహించారు? సదుపాయాలు లేకపోయినా, వాటికి అనుమతులెందుకు ఇచ్చారు? ఫీజులు యెందుకు ఇబ్బడిముబ్బడిగా పెంచారు? వాటిని మేమే చెల్లిస్తాము అని యెందుకు ప్రకటించారు? వీటివల్ల యెవరు "లాభ" పడుతున్నారు? కాంట్రాక్ట్ లెక్చరర్లకీ, సిబ్బందికీ ముష్టి జీతాలే యెందుకు ఇస్తున్నారు? కోట్లెందుకు దండుకుంటున్నారు? మరిన్ని కాలేజీలు యెందుకు కడుతున్నారు?

పైగా, కాలేజీలు మూసేస్తామని బెదిరింపొకటి! మూసెయ్యమనండి--వారం రోజుల్లో ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిల్లాడతారు--విద్యార్థులు హాయిగా క్రికెట్ చూసుకొంటారు!

ఆ ధైర్యం వుందా ప్రభుత్వానికి?

శివరామ సుబ్రహ్మణ్యం--ఏపీఐఐసీ ఛెయిర్మన్--ఈయన ప్రభుత్వోద్యోగి కాదనుకుంటా....రాజకీయ నియామకం కాబోలు. సాటికులపోనికి రోశయ్య ఇచ్చిన బహుమతి అయివుండవచ్చు. ఆ మద్దతుతోనే మొదట్లో మీసాలు మెలేశాడు. అందుకే రాజకీయాలు మాట్లడతాడు. ఆమధ్య వాళ్ల కులసంఘం సభల్లోకూడా, ఎమార్ గురించి మాట్లాడాడు.

ఇప్పుడు బీదార్పులు మొదలెట్టాడు. మొదట "తనకి" నోటీసు ఇవ్వడానికి సాహసించిన ఎమార్, ఇప్పుడు 26 శాతం ఇచ్చేస్తామని రాజీకొచ్చిందంటే, తమ నైతిక విజయమే అంటూ, చర్యలు మాత్రం ప్రభుత్వమే తీసుకొంటుందనీ, తాను వున్నా, లేకపోయినా, కొత్త ఛెయిర్మన్ వచ్చినా, అధికారులు మారినా, అందరూ సంస్థ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. 

తన పదవికి యెసరొస్తూందని వుప్పందిందేమో! పాపం.

(కంపేరిటివ్ గా) చిన్నవయసులోనే పిచ్చి పిచ్చి బొమ్మలు వేసి, తిట్లూ, తన్నులూ తిన్న ఎం ఎఫ్ హుస్సేన్, గజగామినులూ అవీ చంకనాకిపోయినా, పిచ్చి తగ్గించుకోలేదు. ఇప్పుడు సినీనటి విద్యాబాలన్ ను నగ్నంగా చిత్రిస్తాననీ, అందుకావిడ వొప్పుకుందనీ అన్నాడట. ఆవిడేమో అదేమీ లేదు అందట! 

అవండీ సంగతులు.

No comments: