Sunday, March 23, 2014

కబుర్లు - 114


అవీ, ఇవీ, అన్నీ

పాత "గులేబకావళి కథ" సినిమాలో, "దాని మొగుడు" అనేవాడు, "వాడి పెళ్లం" అనే ఆవిడతో లేచిపోయాడు అని, ఎన్‌ టీ ఆర్ మారువేషం లో వుండగా, "దానిమొగుడు, వాడి పెళ్లాంతో లేచిపోతే......." ఆంటూ ఓ  డైలాగు వస్తుంది.

ఇప్పుడంతా---వాడి పెళ్లాం, దాని మొగుడు, వాడి కొడుకు, దాని కొడుకు, వాడి తమ్ముడు, వాడి మేనల్లుడు, వాడి మనవడు, వాడి బావమరిది, ఇలాగే......రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ కూడా.

(ఎలక్షన్ల గురించీ, రాజకీయాల గురించీ సణగడం శుధ్ధ వేస్ట్ అనుకునేవాణ్ని......వస్తున్న మార్పులు చూసి మళ్లీ సణగబుధ్ధేసింది మరి.)

తాజాగా పిచ్చిదంబరం, (తన కొడుకు కార్తి కి టికెట్ ఇచ్చినందువల్ల) యెన్నికల్లో పోటీ చేయబోను అని ప్రకటించేశాడు. ఎనిమిది సార్లు నెగ్గాను, పదిహేడేళ్లు గొప్ప గొప్ప శాఖలు మంత్రిగా వెలగబెట్టాను, 68 యేళ్లు వచ్చేశాయి, యువతకి అవకాశం అంటూ భగవద్గీతలు చెపుతున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకొని, గాంధీ మార్గం (యే గాంధీ యో?!--మరి ఇన్నాళ్లూ ఆ మార్గం లో లేనట్టేనా?) పడతానని కూడా అన్నాడు. రాజకీయాల్లో 98 యేళ్లు వచ్చినా రిటైర్ మెంట్ ఉండదు అనీ, కనీసం 88 వచ్చేవరకూ అయినా గవర్నర్ పదవులూ అవీ గ్యారంటీ అనీ, దొడ్డిదారిని అధికారం చేపట్టే మార్గాలు చాలానే వున్నాయి అనీ చెప్పకనే చెపుతున్నట్టు లేవూ ఈ మాటలు?

ఇంకా యెన్నాళ్లు మన చెవుల్లో పువ్వులు పెడతాడో!

నందన్‌ నీలేకణి ఆస్థి రూ.7,700 కోట్ల పైమాటేనట, ఆయన అఫిడవిట్ ప్రకారం. (అందులో సింహ భాగం 'ఊరివెలుపల పాడు కోనేటి చెంత......'దాచిన బంగారం లాంటివేననుకోండి). జేబులోని రూ.200/- తో జీవితాన్ని ప్రారంభించి, ఇతరులతో కలిసి రూ.10,000/- తో ఇన్‌ఫోసిస్ స్థాపించి, ఈ స్థితికి వచ్చాడంటే, 'ఇండియా వెలుగుతోంది' కి మంచి ఉదాహరణ కదూ! (మన పిచ్చాళ్ళేమో అది నమ్మక తింగరాళ్లనందరినీ గెలిపించి, దేశాన్ని ఈ స్థితికి తెచ్చారు.) తనకి ఓ పదవి ఇచ్చినందుకే కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కృతజ్ఞత  చాటుకుంటున్నారు. ఈయనకి ఓ 10 కోట్లో, 100 కోట్లో పారేసి నెగ్గడం కష్టం కాకపోవచ్చు. కానీ ఓటర్లు ఆలోచించ వలసింది--ఈయన చిల్లర డబ్బులకోసం కక్కుర్తి పడడు 'కాబట్టి సేవ చేస్తాడా' లేక ఆ కోట్లని 'లక్ష కోట్లు' చేసేలా 'దండుకుంటాడా' అని.

ఓ ప్రక్క బర్దన్‌ మూడో కూటమి విషయం లో చింతిస్తున్నా, కారత్ మాత్రం, ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం స్థాపిస్తాం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు! ప్రాప్త కాలజ్ఞత కూడా లేదు సీ పీ ఎం వాళ్లకి.

మన తెలుగు తేజం డా. ఆర్. సత్యనారాయణ "గీతమ్‌" లో పరిశోధనలు చేసి, కృత్రిమ కోడి మాంసం తయారు చేసే విధానం కనిపెట్టాడట. ఓ కోడి కండ సేకరిస్తే, టన్నులకి టన్నులు మాంసం తయారు చేసేసుకోవచ్చుట. కోళ్ల కి శుభవార్తే. జీవహింస తగ్గే ఛాన్‌స్ వుంది కాబట్టి, ప్రపంచానికీ శుభవార్తే.

కానీ, కండల సేకరణ యెలా చేస్తారో అని ఓ సందేహం.

చికెన్‌ అనగానే మన నారాయణ గుర్తొస్తాడు. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, సీపీఐ కలిసి పోటీ చేస్తేనే ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి అనీ, అలా నెరవేరకపోతే ఆరు నెలల్లోనే ఉద్యమాలు మొదలవుతాయి అనీ హెచ్చరించారు. (పాపం ఈయన జీవితం లో సగభాగం చికెన్‌ తిని నిద్రపోవడానికీ, మిగతా సగం ఉద్యమాలకే అంకితం అయిపోయాయి. ధన్యజీవి.)

ఓ ప్రక్క ఎం జే అక్బర్ లాంటివాళ్లు బీజేపీ లో చేరిపోతుంటే, అసదుద్దీన్‌ 'పవన్‌ కళ్యాణ్ సినిమాలు హైదరాబాదులో యెలా రిలీజ్ అవుతాయో చూస్తాం' అంటున్నాడు. పాపం హైదరాబాదు వాళ్ళందరూ చిన్నపిల్లలు కదా? వాళ్లకి ఓటు హక్కే లేదేమో!

ఇంక, పిల్ల నాయకుడు రాహుల్ పై, మృత్యు చుంబనం విషయం లో (ఓ ఆవిడని ముద్దుపెట్టుకొన్నందుకు ఆవిడ భర్త ఆవిడని హత్య చెయ్యడం పై) కేసు నమోదుచేశారట. మరి యెప్పటికి, యే శిక్ష పడుతుందో!



Friday, March 21, 2014

కబుర్లు - 113



అవీ, ఇవీ, అన్నీ

రాజకీయాల్లో సునామీ సృష్టిస్తాడని చాలా మంది అనుకొన్న చిరంజీవి, సముద్రం లో కాకిరెట్ట అయిపోయాడు. 
మిగిలిన రెట్టలన్నింటితో ఓ కొండ కడతానంటున్నాడు.

అసలు తిరుపతి మీటింగులో అంత ఆవేశం ప్రదర్శించిన తరువాత, "అభిమానులూ, యెక్కడ యే అవినీతి, అక్రమం కనిపించినా, యెవరికి అన్యాయం జరుగుతోందన్నా నా ఫలానా నెంబరుకి ఫోను చెయ్యండి. నేను చూసుకుంటా" అని హామీ ప్రకటించి వుంటే, ఈ రోజు చరిత్ర మరోలా వుండేది.

ఇప్పుడు పవన్‌ వచ్చాడు. తగిన, తగ్గని ఆవేశం తోనే మాట్లాడాడు. నాకున్న "నా అభిమానులు చాలు" అన్నాడు. అన్న చేసిన పొరపాట్లు చెయ్యకుండా వుంటే, మంచి భవిష్యత్తు కనిపిస్తోంది........అతనికీ మనకీ కూడా. ఈ ముసలాళ్లు మూడు పెళ్లిళ్లూ, స్త్రీజాతి కి అవమానం లాంటి చౌకబారు విమర్శలు మానుకోకపోతే, గుడ్డలూడ గొడతాడనిపిస్తోంది. చూద్దాం!

చారిత్రక తప్పిదం జరిగిందని తరవాత యెప్పుడో ఒప్పుకొనే బాధ లేకుండా ఇప్పుడే ఒప్పేసుకొన్నారు "మూడో కూటమి కోసం యెన్నికలకి ముందే ప్రయత్నం చెయ్యడం తప్పిదమే" అంటూ సీ పీ ఐ నాయకుడు బర్దన్‌.

బొక్కబోర్లా పడ్డాక, ఇప్పుడు లోక్ సభ యెన్నికలకు ముందే మూడో కూటమి యేర్పాటుకు ప్రయత్నించడం తప్పేనని పార్టీ అంగీకరించిందని చెప్పాడు. ప్రాంతీయ పార్టీలు యెక్కువ అనీ, వాటితో కూటమి కట్టడానికి ప్రయత్నించి, విఫలమయ్యామని చెప్పారు. (యెవరికి వారే ఆ కూటమి నాయకులుగా భావించుకొని, ప్రథానమంత్రి అయిపోవచ్చని సంబర పడితే, ఇంకెక్కడి కూటమి?) 

అయినా, యెన్నికల అనంతరం మూడో కూటమి యేర్పడుతుందని జోస్యం చెప్పారు. అయినా వాళ్లు కాంగ్రెసేతర, భాజపాయేతర, వామపక్షేతర, అవినీతి నాయకేతర, కుల సమీకరణేతర.......ఇలాంటి అనేకేతర కూటమి కావాలంటుంటే...........!

ప్రథాని నేతృత్వం లో 2008 లో, పిల్లల్లో పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న 200 జిల్లాల స్థితిగతులని అంచనా వేసి మెరుగు పరచడానికి యేర్పాటు చేసిన సంఘం ఇప్పటివరకూ కేవలం ఒకేసారి నవంబర్ 2010 లో మాత్రమే సమావేశం అయిందట. ఈ విషయం స హ దరఖాస్తు చేస్తే, ప్రథాని కార్యాలయం చెప్పిందట! ఆ ఒక్కరోజైనా ఆయన మౌన వ్రతం వదిలాడో లేదో?

కోట్లాది నిరుద్యోగులకి ఉపాధి మార్గాల అన్వేషణకి  జులై 2008 లో మన్మోహన్‌ నాయకత్వం లోనే మరో సంఘం వేశారట. అది కూడా 2012 జనవరి తరవాత మళ్లీ సమావేశం కాలేదట. ఆయనే నాయకుడిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి విధానాల రూపకల్పనకి సెప్తెంబర్ 2009 లో వేసిన సంఘం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదట. వాతావరణ మార్పుల అధ్యయనం కోసం జూన్‌ 2008 లో యేర్పాటైన సంఘం, నాలుగేళ్ల క్రితం ఒక్కసారి మాత్రమే సమావేశమయిందట. 

ఇవీ స హ దరఖాస్తులకి సమాధానం గానే బయటికి వచ్చాయట. 

పాపం ఆయనకి ప్రజా సేవకి సమయం యెక్కడుంది? మౌనం వీడడానికి అనుమతి యెక్కడ వుంది? 

ఒక స్వచ్చంద సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారత ప్రజానీకం ఒక సంవత్సరం లో 6 లక్షల 30 వేల కోట్లు వివిధ స్థాయుల్లో "లంచాలు" ఇచ్చుకొంటోందట!

భారత ప్రభుత్వం వ్యవసాయానికి కేటాయించిన 37,330 కోట్లు, విద్యా రంగానికి చేసిన 65,869 కోట్లు, రక్షణ రంగానికి చేసిన 3 లక్షల 3 వేల కోట్లూ కేటాయింపులకన్నా ఎన్నో రెట్లు యెక్కువ! 

మరి యెన్ని వేలమంది అవినీతి వ్యతిరేక సిబ్బందీ, నాయకులూ కావాలో వీటిని నిర్మూలించడానికి.

ఉత్తర ప్రదేశ్ లోని వృందావన్‌ లో ఇస్కాన్‌ వాళ్లు 300 కోట్ల ఖర్చుతో, 70 అంతస్తుల శ్రీకృష్ణ దేవాలయం కడతారట. మొన్న హోళీ రోజున శంకుస్థాపన చేశారు. 

ఆ సంస్థ యెంత ఒళ్లు బలిసి వుందో! అసలు ఇలాంటి వాటి ద్వారా వాళ్లు యేమి సాధించదలుచుకున్నారో ఆ సంస్థకి సంబంధించిన వాళ్లు యెవరైనా చెప్పగలరా?

దాన్ని ఓ టూరిస్ట్ అట్రాక్షన్‌ గా ప్లాన్‌ చేసి, ఓ ఐదేళ్లలో పెట్టుబడి రాబట్టుకొని, వదిలేయడం తప్ప, యెవరికి యేమి ఒరుగుతుందో? (ఇప్పటికే అనేక నగరాల్లో వున్న ఇస్కాన్‌ టెంపుళ్ల గతి యెలా వుందో!--చచ్చినాడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు తప్ప.) 

పాశ్చాత్య దేశాల్లో 1940 ల్లోనో యెప్పుడో ప్రారంభమై, 60 లు 70 లలో మనదేశానికి కూడా వ్యాపించిన హిప్పీ కల్చర్--జుట్టు గొరిచించుకోకపోవడం, నెలలతరబడి స్నానం చేయకపోవడం, భంగు త్రాగుతూ, గొట్టాలు పీలుస్తూ, పాడు కుంటూ గడపడం--కీ, జుట్టు గొరిగించుకొని, పిలక మాత్రమే వుంచుకొని, లుంగీలు కట్టుకొని, గురూ షర్టులు వేసుకొని, రుద్రాక్షలు ధరించి, గంతులువేస్తూ పాటలు పాడుకొనీ ఈ ఇస్కాన్‌ వాళ్లకీ, తేడా యేమీ కనిపించదు నాకు.

ఆం.ప్ర.ప్ర. ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం డైరెక్టర్ ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం నరసాపురం వచ్చారు మొన్న. 

రాష్ట్ర ప్రభుత్వం 1967 లో ప్రాచ్యలిఖిత గ్రంథాలయం యేర్పాటు చేసింది. 1975 లో దానికి పరిశోధనాలయం జోడించింది. డైరెక్టర్ కాకుండా 30 మంది సిబ్బందితో, యేటా రూ.1.90 కోట్ల ఖర్చు చేస్తోందిట. 

తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, పర్షియన్‌ వంటి 16 భాషల్లో సుమారు 24 వేల తాళపత్ర ప్రతులని డిజిటలైజేషన్‌ చేసి భద్రం చేశారట ఇప్పటివరకూ. వాటిలో కేవలం 78 గ్రంథాలని మాత్రం ముద్రించి పాఠకులకి అందుబాటులోకి తెచ్చారట. (ఆ గ్రంథాలయం లో మాత్రమే వాటిని చదువుకోవచ్చేమో). మరికొన్ని మాత్రం ఆన్‌లైన్‌ లో పొందుపరిచారట. వేమన పద్యాలు కొన్ని వేలు సేకరించి, ఓ మూడు వేలు ఎంపిక చేసి, వెబ్సైట్ లో ఉంచారట. 

పురావస్తు రంగాచార్యులు (1822-1900)  "ఒంటిచేత్తో" కూర్పు చేసిన లఘు శబ్దార్థ సర్వస్వం లోని 4 లక్షల పేజీలను (అనేక చేతులతో) డిజిటలైజ్ చేసి, వెబ్సైట్ లో వుంచారట. ఇంకా చాలా చేశారని ప్రస్తుత డైరెక్టర్ గారు చెప్పారు. చాలా సంతోషం.

కంప్యూటర్లు వచ్చింది 1990 ల్లో, డిజిటలైజేషన్‌ వచ్చింది 2000 ల్లో. మరి అంతకు ముందు వారు తాళ పత్రాలతో బాగానే ఆడుకున్నారన్నమాట. బాగుందికదూ.

Wednesday, March 5, 2014

కబుర్లు - 112


అవీ, ఇవీ, అన్నీ

మొన్న తిరుమలలో జగన్‌ వ్యవహారం పై గవర్నర్ తి తి దే వాళ్ల నుంచి నివేదికలు కోరారట. మరి యేమి చర్యలు తీసుకుంటారో చూడాలి. రాజకీయ నాయకులెవరూ దానిగురించి మాట్లాడినట్టు లేదు. లేక అవన్నీ ప్రచురించవద్దని మీడియావాళ్లని యెవరైనా కోరారా?

యెట్టకేలకి ఎన్‌ డీ తివారీ--రోహిత్ తన కొడుకే అనీ, తనకీ ఉజ్వలా శర్మకే పుట్టాడనీ ఒప్పుకొని, గర్వంగా ప్రకటించేశాడు. పైగా, వారసుడిగా అతనికి అప్పగించడానికి తనదగ్గర యేమీ లేదు అని కూడా అన్నాట్ట. మరి ఇన్నాళ్లూ అన్ని వెధవ్వేషాలు వెయ్యడం యెందుకు, కోర్టులదీ, ప్రభుత్వాలదీ, ప్రజలదీ సమయమూ, ధనమూ వృధా యెందుకు చేశాడు అని అడక్కండి. ఇంకా ఆ వయసులో కూడా ఓట్లు దండుకొని, పదవుల్ని అంటిపెట్టుకొని, ప్రజా సేవ చేయద్దూ? ఒప్పేసుకొంటే ఓట్లు రావు కదా.  

వీడు మన గవర్నర్ గా రాజ్ భవన్లో రాసలీలలు కొనసాగిస్తూంటే పదవి పీకేశారనుకుంటా. చింత చచ్చినా పులుపు చావదు కదా?

కేంద్ర హోం మంత్రి చిండా, సారీ షిండే ఓ యేడాది క్రితం రాజ్యసభలో మహారాష్ట్ర లోని భండారాలో జరిగిన అత్యాచారం గురించి ప్రకటనచేస్తూ, ముగ్గురు మైనర్ బాధితురాళ్ల పేర్లూ ప్రకటించేశారట. తరువాత నాలిక్కొరుక్కొని, ఆ ప్రకటన వ్రాసిన రూపొందించిన అధికారులమీద దర్యాప్తు చెయ్యమని ఆదేశించారట. (అప్పటికి జరగవలసిన నష్టం యెలాగూ జరిగిపోయింది). 

ఇప్పుడు ఆ విచారణ సంగతి యేమయిందో చెప్పమని స హ దరఖాస్తు చేస్తే, బదులే లేదట. అప్పీళ్ల తరువాత సీ ఐ సీ విచారణ నిర్వహిస్తే, ఆ దర్యాప్తు తాలూకు దస్త్రమే కనపడ్డం లేదు పొమమ్మన్నారట సీ ఐ సీ వారిని! ఆయనక్కోపం వచ్చి, సంబంధించిన అధికారులకు షో కాజ్ నోటీసులు ఇప్పించారట. ఆ దస్త్రాలు యేమౌతాయో.....మళ్లీ స హ దరఖాస్తు చెయ్యాలేమో!

మొన్న ఓ అరవాయన ఇడ్లీలు కిలోల్లెక్కన అమ్ముతున్నాడని తెలిసింది కదా. ఇప్పుడు బెంగుళూరులో ఒకాయన (మయ్యాస్ సంస్థ అధిపతి సదానందమయ్య) ప్రపంచం లో మొదటిసారి చక్కిలాల తయారీ యంత్రం రూపకల్పన చేసి, గంటకి 4,500 చక్కిలాలు, తక్కువ నూనెతో తయారు చేసేస్తున్నాడట. ఇంకా చిత్రం యేమిటంటే, బియ్యాన్ని పిండి ఆడడం దగ్గరనుంచీ అన్నీ యంత్రమే చేసి, చక్కిలాలు బయటికి వచ్చేస్తున్నాయట. మిక్కిలి చక్కిలంగా లేదూ!

2005 కి ముందు వెలువడిన 500, 1000 రూపాయల నోట్లు ఈ సంవత్సరం  డిసెంబర్ నెలాఖరు వరకూ యే ఆంక్షలూ లేకుండా చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. ఈమధ్య ఒకాయన తన డబ్బు బ్యాంకుఖాతాలోడెపాజిట్ చేద్దామని వెళ్లి, చలాన్‌ వ్రాస్తూండగా, ఇంకొకతను వచ్చి, ఓ 500 నోటిచ్చి, వంద నోట్లు ఇవ్వండి, మీరు యెలాగూ బ్యాంకులో కట్టేసేవే కదా అనడిగితే, పోనీ పాపం అని ఇచ్చాడట. తీరా ఆ నోటు క్యాషియర్ కి ఇస్తే, మిషన్‌ లో వేసి, అది దొంగనోటు అని తేల్చారట! ఇచ్చినవాడు యెప్పుడో గాయబ్! ఇంతకీ్ ఆ నోటు మీదున్న సంవత్సరం 2012! మరి 2012 వరకూ వెలువడిన నోట్లని యెప్పుడు రద్దు చేస్తారో?

Monday, March 3, 2014

కబుర్లు - 111


అవీ, ఇవీ, అన్నీ

111 వ టపా సందర్భంగా, వెంకన్న బాబు గుడి మీద యేమైనా సణగాలనుకున్నాను. కానీ పెద్ద ముఖ్యమైనవేవీ లేవు. ఇదివరకే అన్నీ సణిగేసినవే మరి. ఒకప్పటి ఈవో ఐ వై ఆర్ కృష్ణారావు ప్రాభుత్వ ముఖ్య కార్యదర్శి పదవి వస్తుందనుకొంటే  పాతాయన్నే పదవి లో కొనసాగించడంతో మనస్తాపం చెందారట.

ఆ మధ్య ఒకాయనో ఆవిడో, ఇంకో ఆయన్ని "మృత్యు బేహారి" అన్నారట. ఇప్పుడు పిల్లకాకి ని ముద్దు పెట్టుకోడానికి యెగబడి, ఒకావిడ సజీవ దహనం అయిందట. మరి వాణ్ని యేమనాలో?

ఫిబ్రవరి 26 న అస్సాం లోని జోర్హాట్ లో 600 మంది మహిళా స్వయం సంఘాల సభ్యులతో సమావేశం సందర్భం లో మహిళలు తమ అభిమానం చాటుకోడానికి ఆయన్ని కౌగిలిoచుకొని, ముద్దు పెట్టుకోడానికి యెగబడ్డారట. (బహుశా ప్రథాని పత్ని అయ్యే ఛాన్‌స్ యేమైనా వుండచ్చు అని భ్రమ పడ్డారేమో!). ఇంకేం, మీడియావాళ్లు పదే పదే టివీల్లో ఆ సీన్లు చూపిస్తుంటే, ఓ భర్త తన భార్య ఆయన్ని అన్ని సార్లు ముద్దుపెట్టుకోవడం--అదే వాళ్లు అలా చూపించడం తో మనస్తాపం చెంది, ఇంట్లో తన భార్యని గదిలో బంధించి, కిరోసిన్‌ పోసి నిప్పు అంటించాడట. ఆవిడ అక్కడికక్కడే మరణించగా, ఆవిడతో పెనుగులాటలో అతనికి కూడా గాయాలై, చికిత్స పొందుతున్నాడట.

అసలు సంగతి యెలా వున్నా, పార్టీ నేతలూ, పోలీసులూ అసలు ఆవిడ ముద్దే పెట్టుకోలేదు అనీ, పెట్టుకున్నా టీవీలో అది చూపించనేలేదనీ, ముద్దు పెట్టుకోడానికి అనుమతి పొందినవారి జాబితాలో ఆవిడ పేరే లేదనీ, ఆవిడ దగ్గరకి వచ్చే అవకాశమే లేదనీ, భర్తతో గొడవలవల్లే ఆవిడని ఆవిడే అంటించేసుకొందనీ కవరింగులు మొదలు పెట్టారట.

వేలం వెర్రుల్ని ప్రోత్సహించడం యెందుకు, నాటకాలాడ్డం యెందుకు!

పాకిస్థాన్‌ వాయవ్య ప్రాంతం లో ఖైబర్ గిరిజన ప్రాంతం లోని, పెషావర్ కి కేవలం 30 కి. మీ. దూరం లో జామృద్ ప్రాంతం లో పసిపాపలకి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ధ్వంసం చేస్తూ, తాలిబాన్లు బాంబు దాడి చేసి, ఓ పసిగుడ్డునీ, 12 మంది సిబ్బందినీ చంపేశారట! పోలియో చుక్కల కార్యక్రమాలని వాళ్లు నిషేధించారట--అమెరికాకి వ్యతిరేకంగా! ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పదుల్లో ఆరోగ్య కార్యకర్తలూ, భద్రతా సిబ్బందీ చనిపోయారట.

తమ పిల్లలనే చంపుకునే ఇలాంటి రాక్షసులు ఇంకా భూమ్మీద తిరుగాడడానికి దేవుడు యెందుకు అవకాశం ఇస్తున్నాడో! (బహుశా వాళ్ల పాపం ఇంకా పండలేదు అంటారేమో ఆధ్యాత్మ వాదులు.)

మొన్న మహాశివరాత్రి సందర్భంగా రష్యన్‌ వనితలు పాలకొల్లు లో, పాలకొల్లుకే చెంది, రష్యాలో తమకి శిక్షణ ఇస్తున్న తమ గురువైన ఇంకో వనితతో వచ్చి, తమ కూచిపూడి నృత్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించారట. వాళ్లు రష్యాలో చదువుకుంటూ, వుద్యోగాలు చేసుకుంటూ, కఠోర దీక్షతో నృత్యాన్ని అభ్యసించి, మనదేశం లో ప్రదర్శించడం యెంత గొప్ప విషయం! ఒళ్లు పులకించింది.

వాళ్ల పేర్లు చదువుతుంటే, నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ లో ఓ జోక్ గుర్తొచ్చింది. ఓ తెలుగువాడు మాస్కోలో రోడ్డుమీద కాలుజారి పడిపోతూ, "అయ్యోవ్! బాబోవ్! చచ్చాన్రోవ్!" అని అరిస్తే, మూడు ప్రక్కలనించి ముగ్గురు వచ్చి, "యెందుకు పిలిచావ్?" అనడిగారట. మనవాడు "నేను యెవర్నీపిలవలేదే!" అన్నాడట.

వాళ్ల ముగ్గురి పేర్లూ అవే మరి!