అవీ, ఇవీ, అన్నీ
రాజకీయాల్లో సునామీ సృష్టిస్తాడని చాలా మంది అనుకొన్న చిరంజీవి, సముద్రం లో కాకిరెట్ట అయిపోయాడు.
మిగిలిన రెట్టలన్నింటితో ఓ కొండ కడతానంటున్నాడు.
అసలు తిరుపతి మీటింగులో అంత ఆవేశం ప్రదర్శించిన తరువాత, "అభిమానులూ, యెక్కడ యే అవినీతి, అక్రమం కనిపించినా, యెవరికి అన్యాయం జరుగుతోందన్నా నా ఫలానా నెంబరుకి ఫోను చెయ్యండి. నేను చూసుకుంటా" అని హామీ ప్రకటించి వుంటే, ఈ రోజు చరిత్ర మరోలా వుండేది.
ఇప్పుడు పవన్ వచ్చాడు. తగిన, తగ్గని ఆవేశం తోనే మాట్లాడాడు. నాకున్న "నా అభిమానులు చాలు" అన్నాడు. అన్న చేసిన పొరపాట్లు చెయ్యకుండా వుంటే, మంచి భవిష్యత్తు కనిపిస్తోంది........అతనికీ మనకీ కూడా. ఈ ముసలాళ్లు మూడు పెళ్లిళ్లూ, స్త్రీజాతి కి అవమానం లాంటి చౌకబారు విమర్శలు మానుకోకపోతే, గుడ్డలూడ గొడతాడనిపిస్తోంది. చూద్దాం!
చారిత్రక తప్పిదం జరిగిందని తరవాత యెప్పుడో ఒప్పుకొనే బాధ లేకుండా ఇప్పుడే ఒప్పేసుకొన్నారు "మూడో కూటమి కోసం యెన్నికలకి ముందే ప్రయత్నం చెయ్యడం తప్పిదమే" అంటూ సీ పీ ఐ నాయకుడు బర్దన్.
బొక్కబోర్లా పడ్డాక, ఇప్పుడు లోక్ సభ యెన్నికలకు ముందే మూడో కూటమి యేర్పాటుకు ప్రయత్నించడం తప్పేనని పార్టీ అంగీకరించిందని చెప్పాడు. ప్రాంతీయ పార్టీలు యెక్కువ అనీ, వాటితో కూటమి కట్టడానికి ప్రయత్నించి, విఫలమయ్యామని చెప్పారు. (యెవరికి వారే ఆ కూటమి నాయకులుగా భావించుకొని, ప్రథానమంత్రి అయిపోవచ్చని సంబర పడితే, ఇంకెక్కడి కూటమి?)
అయినా, యెన్నికల అనంతరం మూడో కూటమి యేర్పడుతుందని జోస్యం చెప్పారు. అయినా వాళ్లు కాంగ్రెసేతర, భాజపాయేతర, వామపక్షేతర, అవినీతి నాయకేతర, కుల సమీకరణేతర.......ఇలాంటి అనేకేతర కూటమి కావాలంటుంటే...........!
ప్రథాని నేతృత్వం లో 2008 లో, పిల్లల్లో పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న 200 జిల్లాల స్థితిగతులని అంచనా వేసి మెరుగు పరచడానికి యేర్పాటు చేసిన సంఘం ఇప్పటివరకూ కేవలం ఒకేసారి నవంబర్ 2010 లో మాత్రమే సమావేశం అయిందట. ఈ విషయం స హ దరఖాస్తు చేస్తే, ప్రథాని కార్యాలయం చెప్పిందట! ఆ ఒక్కరోజైనా ఆయన మౌన వ్రతం వదిలాడో లేదో?
కోట్లాది నిరుద్యోగులకి ఉపాధి మార్గాల అన్వేషణకి జులై 2008 లో మన్మోహన్ నాయకత్వం లోనే మరో సంఘం వేశారట. అది కూడా 2012 జనవరి తరవాత మళ్లీ సమావేశం కాలేదట. ఆయనే నాయకుడిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి విధానాల రూపకల్పనకి సెప్తెంబర్ 2009 లో వేసిన సంఘం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదట. వాతావరణ మార్పుల అధ్యయనం కోసం జూన్ 2008 లో యేర్పాటైన సంఘం, నాలుగేళ్ల క్రితం ఒక్కసారి మాత్రమే సమావేశమయిందట.
ఇవీ స హ దరఖాస్తులకి సమాధానం గానే బయటికి వచ్చాయట.
పాపం ఆయనకి ప్రజా సేవకి సమయం యెక్కడుంది? మౌనం వీడడానికి అనుమతి యెక్కడ వుంది?
ఒక స్వచ్చంద సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారత ప్రజానీకం ఒక సంవత్సరం లో 6 లక్షల 30 వేల కోట్లు వివిధ స్థాయుల్లో "లంచాలు" ఇచ్చుకొంటోందట!
భారత ప్రభుత్వం వ్యవసాయానికి కేటాయించిన 37,330 కోట్లు, విద్యా రంగానికి చేసిన 65,869 కోట్లు, రక్షణ రంగానికి చేసిన 3 లక్షల 3 వేల కోట్లూ కేటాయింపులకన్నా ఎన్నో రెట్లు యెక్కువ!
మరి యెన్ని వేలమంది అవినీతి వ్యతిరేక సిబ్బందీ, నాయకులూ కావాలో వీటిని నిర్మూలించడానికి.
ఉత్తర ప్రదేశ్ లోని వృందావన్ లో ఇస్కాన్ వాళ్లు 300 కోట్ల ఖర్చుతో, 70 అంతస్తుల శ్రీకృష్ణ దేవాలయం కడతారట. మొన్న హోళీ రోజున శంకుస్థాపన చేశారు.
ఆ సంస్థ యెంత ఒళ్లు బలిసి వుందో! అసలు ఇలాంటి వాటి ద్వారా వాళ్లు యేమి సాధించదలుచుకున్నారో ఆ సంస్థకి సంబంధించిన వాళ్లు యెవరైనా చెప్పగలరా?
దాన్ని ఓ టూరిస్ట్ అట్రాక్షన్ గా ప్లాన్ చేసి, ఓ ఐదేళ్లలో పెట్టుబడి రాబట్టుకొని, వదిలేయడం తప్ప, యెవరికి యేమి ఒరుగుతుందో? (ఇప్పటికే అనేక నగరాల్లో వున్న ఇస్కాన్ టెంపుళ్ల గతి యెలా వుందో!--చచ్చినాడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు తప్ప.)
పాశ్చాత్య దేశాల్లో 1940 ల్లోనో యెప్పుడో ప్రారంభమై, 60 లు 70 లలో మనదేశానికి కూడా వ్యాపించిన హిప్పీ కల్చర్--జుట్టు గొరిచించుకోకపోవడం, నెలలతరబడి స్నానం చేయకపోవడం, భంగు త్రాగుతూ, గొట్టాలు పీలుస్తూ, పాడు కుంటూ గడపడం--కీ, జుట్టు గొరిగించుకొని, పిలక మాత్రమే వుంచుకొని, లుంగీలు కట్టుకొని, గురూ షర్టులు వేసుకొని, రుద్రాక్షలు ధరించి, గంతులువేస్తూ పాటలు పాడుకొనీ ఈ ఇస్కాన్ వాళ్లకీ, తేడా యేమీ కనిపించదు నాకు.
ఆం.ప్ర.ప్ర. ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం డైరెక్టర్ ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం నరసాపురం వచ్చారు మొన్న.
రాష్ట్ర ప్రభుత్వం 1967 లో ప్రాచ్యలిఖిత గ్రంథాలయం యేర్పాటు చేసింది. 1975 లో దానికి పరిశోధనాలయం జోడించింది. డైరెక్టర్ కాకుండా 30 మంది సిబ్బందితో, యేటా రూ.1.90 కోట్ల ఖర్చు చేస్తోందిట.
తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, పర్షియన్ వంటి 16 భాషల్లో సుమారు 24 వేల తాళపత్ర ప్రతులని డిజిటలైజేషన్ చేసి భద్రం చేశారట ఇప్పటివరకూ. వాటిలో కేవలం 78 గ్రంథాలని మాత్రం ముద్రించి పాఠకులకి అందుబాటులోకి తెచ్చారట. (ఆ గ్రంథాలయం లో మాత్రమే వాటిని చదువుకోవచ్చేమో). మరికొన్ని మాత్రం ఆన్‌లైన్ లో పొందుపరిచారట. వేమన పద్యాలు కొన్ని వేలు సేకరించి, ఓ మూడు వేలు ఎంపిక చేసి, వెబ్సైట్ లో ఉంచారట.
పురావస్తు రంగాచార్యులు (1822-1900) "ఒంటిచేత్తో" కూర్పు చేసిన లఘు శబ్దార్థ సర్వస్వం లోని 4 లక్షల పేజీలను (అనేక చేతులతో) డిజిటలైజ్ చేసి, వెబ్సైట్ లో వుంచారట. ఇంకా చాలా చేశారని ప్రస్తుత డైరెక్టర్ గారు చెప్పారు. చాలా సంతోషం.
కంప్యూటర్లు వచ్చింది 1990 ల్లో, డిజిటలైజేషన్ వచ్చింది 2000 ల్లో. మరి అంతకు ముందు వారు తాళ పత్రాలతో బాగానే ఆడుకున్నారన్నమాట. బాగుందికదూ.
3 comments:
అన్నీ పచ్చి నిజాలే!కబుర్లు నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి!
డియర్ శాస్త్రిగారూ!
అలా జరిగితే ఇంక కావలసిందేముంటుంది!
ధన్యవాదాలు.
ఎలక్షన్ల గురించీ, రాజకీయాల గురించీ సణగడం శుధ్ధ వేస్ట్---ఇది నా అభిప్రాయం శాస్త్రి గారు!సన్యాసులు,వేదాంతులు,వ్యాపారవేత్తలు,సినీ నటులు రాజకీయ రొచ్చులో పడి దొర్లుతున్నారు. పట్టపగలు నడి బజార్లో వ్యభిచారం చేస్తున్నారు!ఆ రొచ్చు మనకు అంటకుండా చూసుకుందాం!
Post a Comment