Monday, March 3, 2014

కబుర్లు - 111


అవీ, ఇవీ, అన్నీ

111 వ టపా సందర్భంగా, వెంకన్న బాబు గుడి మీద యేమైనా సణగాలనుకున్నాను. కానీ పెద్ద ముఖ్యమైనవేవీ లేవు. ఇదివరకే అన్నీ సణిగేసినవే మరి. ఒకప్పటి ఈవో ఐ వై ఆర్ కృష్ణారావు ప్రాభుత్వ ముఖ్య కార్యదర్శి పదవి వస్తుందనుకొంటే  పాతాయన్నే పదవి లో కొనసాగించడంతో మనస్తాపం చెందారట.

ఆ మధ్య ఒకాయనో ఆవిడో, ఇంకో ఆయన్ని "మృత్యు బేహారి" అన్నారట. ఇప్పుడు పిల్లకాకి ని ముద్దు పెట్టుకోడానికి యెగబడి, ఒకావిడ సజీవ దహనం అయిందట. మరి వాణ్ని యేమనాలో?

ఫిబ్రవరి 26 న అస్సాం లోని జోర్హాట్ లో 600 మంది మహిళా స్వయం సంఘాల సభ్యులతో సమావేశం సందర్భం లో మహిళలు తమ అభిమానం చాటుకోడానికి ఆయన్ని కౌగిలిoచుకొని, ముద్దు పెట్టుకోడానికి యెగబడ్డారట. (బహుశా ప్రథాని పత్ని అయ్యే ఛాన్‌స్ యేమైనా వుండచ్చు అని భ్రమ పడ్డారేమో!). ఇంకేం, మీడియావాళ్లు పదే పదే టివీల్లో ఆ సీన్లు చూపిస్తుంటే, ఓ భర్త తన భార్య ఆయన్ని అన్ని సార్లు ముద్దుపెట్టుకోవడం--అదే వాళ్లు అలా చూపించడం తో మనస్తాపం చెంది, ఇంట్లో తన భార్యని గదిలో బంధించి, కిరోసిన్‌ పోసి నిప్పు అంటించాడట. ఆవిడ అక్కడికక్కడే మరణించగా, ఆవిడతో పెనుగులాటలో అతనికి కూడా గాయాలై, చికిత్స పొందుతున్నాడట.

అసలు సంగతి యెలా వున్నా, పార్టీ నేతలూ, పోలీసులూ అసలు ఆవిడ ముద్దే పెట్టుకోలేదు అనీ, పెట్టుకున్నా టీవీలో అది చూపించనేలేదనీ, ముద్దు పెట్టుకోడానికి అనుమతి పొందినవారి జాబితాలో ఆవిడ పేరే లేదనీ, ఆవిడ దగ్గరకి వచ్చే అవకాశమే లేదనీ, భర్తతో గొడవలవల్లే ఆవిడని ఆవిడే అంటించేసుకొందనీ కవరింగులు మొదలు పెట్టారట.

వేలం వెర్రుల్ని ప్రోత్సహించడం యెందుకు, నాటకాలాడ్డం యెందుకు!

పాకిస్థాన్‌ వాయవ్య ప్రాంతం లో ఖైబర్ గిరిజన ప్రాంతం లోని, పెషావర్ కి కేవలం 30 కి. మీ. దూరం లో జామృద్ ప్రాంతం లో పసిపాపలకి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ధ్వంసం చేస్తూ, తాలిబాన్లు బాంబు దాడి చేసి, ఓ పసిగుడ్డునీ, 12 మంది సిబ్బందినీ చంపేశారట! పోలియో చుక్కల కార్యక్రమాలని వాళ్లు నిషేధించారట--అమెరికాకి వ్యతిరేకంగా! ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పదుల్లో ఆరోగ్య కార్యకర్తలూ, భద్రతా సిబ్బందీ చనిపోయారట.

తమ పిల్లలనే చంపుకునే ఇలాంటి రాక్షసులు ఇంకా భూమ్మీద తిరుగాడడానికి దేవుడు యెందుకు అవకాశం ఇస్తున్నాడో! (బహుశా వాళ్ల పాపం ఇంకా పండలేదు అంటారేమో ఆధ్యాత్మ వాదులు.)

మొన్న మహాశివరాత్రి సందర్భంగా రష్యన్‌ వనితలు పాలకొల్లు లో, పాలకొల్లుకే చెంది, రష్యాలో తమకి శిక్షణ ఇస్తున్న తమ గురువైన ఇంకో వనితతో వచ్చి, తమ కూచిపూడి నృత్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించారట. వాళ్లు రష్యాలో చదువుకుంటూ, వుద్యోగాలు చేసుకుంటూ, కఠోర దీక్షతో నృత్యాన్ని అభ్యసించి, మనదేశం లో ప్రదర్శించడం యెంత గొప్ప విషయం! ఒళ్లు పులకించింది.

వాళ్ల పేర్లు చదువుతుంటే, నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ లో ఓ జోక్ గుర్తొచ్చింది. ఓ తెలుగువాడు మాస్కోలో రోడ్డుమీద కాలుజారి పడిపోతూ, "అయ్యోవ్! బాబోవ్! చచ్చాన్రోవ్!" అని అరిస్తే, మూడు ప్రక్కలనించి ముగ్గురు వచ్చి, "యెందుకు పిలిచావ్?" అనడిగారట. మనవాడు "నేను యెవర్నీపిలవలేదే!" అన్నాడట.

వాళ్ల ముగ్గురి పేర్లూ అవే మరి!  

4 comments:

Anonymous said...

"ముద్దు పెట్టుకోడానికి అనుమతి పొందినవారి జాబితాలో ఆవిడ పేరే లేదనీ"... కెవ్వు.

TVS SASTRY said...

కొంతమందిని ముద్దు పెట్టుకుంటే మటా ash!

A K Sastry said...

డియర్ puranapandaphani!

మామూలుగా ఇలాంటివి టీవీల్లో చూసేవాళ్లూ, సెక్యూరిటీని లెఖ్ఖ చెయ్యకుండా బారికేడ్స్ దాటుకొని.....అని చదివేవాళ్లూ ఇవన్నీ స్పాంటేనియస్ గా జరుగుతున్నాయనుకుంటారు. వాటి వెనుక ఇలాంటి తతంగాలు వుంటాయని అందరికీ తెలియజెయ్యడమే నా వుద్దేశ్యం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ శాస్త్రిగారూ!

పాపం ఓ జీవితం బుగ్గిపాలు అయిందికదా....వీళ్ల వెర్రి ప్రచార ప్రయోగాలకి!

ధన్యవాదాలు.