Saturday, January 16, 2010

జంతుప్రేమ

జంతుస్వభావం

కనుము పండుగ సందర్భం గా రోశయ్య ఓ గంగిరెద్దుకి అరటిపండు తినిపిస్తున్న ఫోటో కనిపించింది పొద్దున్నే పేపర్లో.

ఆ సమయం లో ఆ పక్కనే వెళ్తున్న యే ట్రైనో గట్టిగా కూతపెడితేనో, యే బస్సో, లారీనో గట్టిగా గ్యాస్ హారన్ కొడితేనో యేమిజరిగేది? ఆ గంగిరెద్దు బెదిరి కొమ్మువిసిరితే మన రోశయ్య గతి యేమిటి? (అమంగళము ప్రతిహతమౌగాక!)

టీవీలో ఓ ప్రకటనలో చూపినట్టు, ఆదిమానవుడు ఓ జంతువు తరుముతుంటే ముందు పరిగెడుతూంటాడు! వెంటనే ఇంకోజంతువు మీదెక్కి, వేటాడుతూంటాడు!

ఇవీ మానవ, జంతు స్వభావాలు! తనకి భయమేస్తే దానికి కారణమైన యెదటి మనిషిని చంపేదాకా వదలవు జంతువులు!

తనకి యే హానీ చెయ్యకపోయినా, తన వినోదం కోసమో, అవసరాలకోసమో, జంతువుని హింసించి అయినా, నిస్సహాయమైన దానికోపాన్నికూడా నిర్లక్ష్యం చేసి, దాన్ని వాడుకోవాలని చూస్తాడు--మనిషి!

ఓ ఆరేళ్ళ క్రితం, బెంగుళూరు బన్నేర్ ఘట్టా నేషనల్ పార్కుకి వెళ్ళాం మా పిల్లలతో--మా కూడా 9 యేళ్ళూ, 6 యేళ్ళూ వున్న మా తమ్ముడి కూతుళ్ళూ, యేడాది వయసున్న మా పెద్ద మనవడూ--చిన్నపిల్లలు!

సఫారీలూ అవీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇక సూర్యాస్తమయం అయిపోగానే, తిరిగి వెళ్ళే సమయం లో, అప్పటిదాకా వేరే వేరే చోట్ల పిల్లలకి ఆహ్లాదం కలిగించిన యేనుగులని వాటి అడ్డాకి చేర్చడానికి లోపలి రోడ్లమీద కొంత కొంత దూరం లో ఒకదానివెనుక ఒకదాన్ని నడిపించుకుంటూ వెళతారు మావటీలు.

దారిలో యెవరైనా చెయ్యియెత్తితే, ఆ యేనుగుని ఆపి, వాళ్ళు ఇచ్చే అయిదో, పదో యేనుగుని తొండంతో అందుకోమని, వాళ్ళు తీసుకుంటారు మావటీలు--అదో సంపాదన వాళ్ళకి.

నేను కూడా పిల్లల కోరికమీద చెయ్యెత్తాను--నా చేతిలో మా మనవడు, నా ముందు ఆడపిల్లలు--నా ఇంకో చేతిలో పదిరూపాయల నోటు--మావటీ 'హట్' అన్నాడు యేనుగుని--తను ఆగింది పాపం! పదిరూపాయలనోటుని అందుకుంది, మావటీకి అందించింది--కానీ ప్రొద్దుటనించీ యెంత అలిసిపోయిందో--దానికళ్ళల్లో నిస్సహాయతతో కూడిన కోపం--కాదు క్రౌర్యం!

మావటీ ఇంకా తొండం పిల్లల నెత్తిమీదపెట్టమని ఆఙ్ఞాపిస్తున్నాడు--అది కోపంగా బుర్ర అటూ ఇటూ వూపి ఒక్కడుగు ముందుకు వేసేటప్పటికి--నేను రోడ్డు పక్కకి రెండడుగులు వెనక్కి వేసి, పిల్లలని కూడా వెనక్కి లాగేశాను--మనవణ్ణి మా అమ్మాయికి అందించి!

గజరాజు సాగిపోయింది--మావటీ 'యేమీ ఫరవాలేదు ' అని సైగలు చేస్తూ వుండగా!

తరవాత ఓ గుడిదగ్గర అరటిపండు పెట్టబోయిన బాలుణ్ణి తొండంతో దూరంగా విసిరేసి, ఆ వెనక వున్న కొంచెం పెద్ద పిల్లాణ్ణి క్రిందపడేసి కసిగా కాళ్ళతో తొక్కేసి చంపేసిన యేనుగుని ఫోటోలతో సహా ప్రచురించారు పేపర్లో!

ఇంకా ఇలాంటివి రెండు మూడు చోట్ల జరిగినట్టు పేపర్లలో వస్తూనే వుంది!

అంతదాకా యెందుకు--మన శ్రీగిరిమీద 'వైష్ణవి ', 'అవనిజ ' అనే యేనుగులు వంతులవారీగా--వెనక టపాసు పేలిందని ఒకసారి, గుర్రం గట్టిగా సకిలించిందని ఒకసారి, మొన్న ఒకావిడ తన బిడ్డతో సహా పుణ్యం కోసం తనకిందనించి దూరి ఆ పక్కకి వెళ్ళిందని--భీభత్సం సృష్టిస్తున్నాయి--ఒకళ్ళో ఇద్దరో చనిపోవడమో, యేడెనిమిది మంది గాయపడడమో జరుగుతూంది!

పైగా ఆ యేనుగు చివరికి గ్యాస్ గోడౌన్ దగ్గరకి వెళ్ళి, భయం గా పడుకొందట చివరకి! ఇంకా నయం--దాని కోపం తగ్గక ఆ సిలిండర్లని విసిరేసి, గ్యాస్ లీకయి, సిలిండర్లని దొర్లించడం లో నిప్పు పుట్టి...........యేదైనా జరిగితే--తరవాత తరాలవాళ్ళు--మనం ద్వారక 'పట్టణం సముద్రం లో మునిగిపోయింది ' అని చెప్పుకున్నట్టు--'ఇక్కడ యేడు కొండలు వుండేవిట....శ్రీగిరి అని ప్రపంచ ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం వుండేదట ' అని చెప్పుకోవలసి వచ్చేదేమో!

సినిమాల్లోనూ, సర్కసుల్లోనూ, ఇతరత్రా జీవహింసని నిరోధించడానికి 'బ్లూక్రాస్ ' లాంటి సంస్థలు పాటు పడుతున్నాయి!

మరి ఈ యేనుగులగురించీ, ఇతర జంతువులగురించీ యెవరు పట్టించుకుంటారు?

చివరగా రోశయ్య భద్రత మాటేమిటి?

Saturday, January 2, 2010

లాలూ మూర్ఖః



అగ్రేసరీ మమత!
విన్నారా?

సోకాల్డ్ మేనేజ్ మెంట్ గురూ లాలూ, మన రైల్వేల్లో దొంగలెఖ్ఖలు వ్రాశాడట!

అసలు మిగులు 39 వేల కోట్లే అయితే, 79 వేల కోట్లకు పైగా వున్నట్టు మసిపూసి మారేడుకాయ చేశాడట!

స్వయం గా మమతాదీయే, మన పార్లమెంట్ లో ఈ ప్రకటన చేసింది!

ఇహ ఇప్పుడు తన దురంతాలతో--సారీ--'దురంతో'లతో ఆ మిగిలిన కోట్లలో యెన్ని ఆవిరైపోయాయో--మరెవరైనా రైల్వే మంత్రి అయ్యేవరకూ బయటికి రావు!

ఇక ఇప్పుడు మళ్ళీ--'యుబ' పేరుతో, అన్నీ ఏ సీ కుర్చీబోగీలే వున్న ఓ డజనో యెన్నో రైళ్ళని ప్రవేశాపెడుతోందట--అందులో మొదటిది కొలకత్తా నించి న్యూఢిల్లీ వరకూనట!

1500 కి మీ దూరం వరకూ ఒక రేటు, దాటితే 2500 కి మీ వరకూ ఇంకో రేటు వసూలు చేస్తారట! మధ్యలో యెక్కడైనా ఆ రైళ్ళు యెక్కాలంటే, పూర్తి టిక్కెట్ తీసుకోక తప్పదట!

రోజుకి సుమారు 60 వేల మంది 'యువత' కొలకత్తా-ఢిల్లీల మధ్య ప్రయాణిస్తున్నారట!

మరి గంటకి 350 కి మీ వేగంతో ప్రయాణించినా, యే పదిగంటలో ప్రయాణించినా 3000 కి మీ ప్రయాణించవే బుల్లెట్ రైళ్ళు సైతం?
మరి ఈ లెఖ్ఖన ఆ 60 వేలమందిలో మళ్ళీ సాయంత్రానికి వెనక్కి కొల్కత్తా చేరేవారెందరో! వాళ్ళలో 'యువత' యెందరో!

అసలు విషయం ఆఖరుకి వొచ్చింది--వీటిల్లో 60 శాతం సీట్లు 18-45 యేళ్ళ మధ్య వయసుగల 'యువత'కి కేటాయించారట!

మరి టిక్కెట్టు కొనేవారి వయసుని నెత్తిమీద జుట్టు రంగునిబట్టీ, కట్టు బట్టల్ని బట్టీ నిర్ణయిస్తారేమో--బుక్కింగ్ క్లర్కులు! లేదా వాళ్ళకి ప్రత్యేకమైన కళ్ళజోళ్ళేమైన సరఫరా చేస్తారేమో--మనిషిని చూడగానే వాడి వయసు ఠక్కున్న తెలిసిపోయేలాగ!

ఇప్పటి సంగతేమో తెలీదు గానీ, ఇదివరకు రైల్వే హాస్పటళ్ళు అంటే చాలా గొప్ప పేరు! అలాంటి హాస్పటళ్ళలో 'మెంటల్' విభాగాలు కూడా వుండే వుంటాయి!

మరి మమతని, ఆవిడ మాటల్ని తు. చ. తప్పకుండా పాటిస్తున్నవాళ్ళనీ పాపం అలాంటి వాటిలో చేర్పించి పుణ్యం కట్టుకొనేవాళ్ళెవరైనా వుంటే బాగుండును!

(మనం రైలెక్కాక క్షేమం గా గమ్యం చేరామంటే--మనం కృతఙ్ఞులై వుండవలసింది--తమ 'విధి'ని దైవకార్యం గా భావించో, పాపభీతివల్లో చక్కగా, సక్రమం గా నిర్వహిస్తున్న వేలాది మంది 'గాంగ్ మెన్'లలో చాలా మందికీ, ఇతర చిన్న వుద్యోగులకేగానీ, 'ఇలాంటివాళ్ళకి' కాదు!)

మన లెఖ్ఖల పండితులు, ఆర్థిక ఐంద్రజాలికులూ--మన్మోహనాదులు--ఈ విషయం ఆలోచిస్తే ఇంకెంత బాగుండును!