Wednesday, December 21, 2011

కబుర్లు - 82

అవీ, ఈవీ, అన్నీ

(చాలా రోజులుగా బయటికి సణగడానికి వీల్లేకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు మొదలు.)


  • లోక్ పాల్ స్థానం లో “జోక్ పాల్” బిల్లు
  • “కోడిపందాలు” జరిపించుకోవచ్చు అని తీర్పిచ్చిన చెన్నై హైకోర్టు.
  • హైవే మీద బైక్ గుద్దేసి, “చిరుతపులి” హతం!
  • ఒకావిడ పొట్టలో పాతికేళ్లు కాపురం చేసి, ఇప్పుడు బయటికి వచ్చి, “వ్రాస్తూనే వున్న” పెన్ను!
  • “తృటిలో తప్పిన” విమాన ప్రమాదం.
  • తితిదే వారి "లడ్డూల" గోల.

    జోక్ పాల్ బిల్లు సిధ్ధం అయ్యిందట—“....అదియునూ, నీవడిగినవి తక్క….” అని ప్రభుత్వం హుంకరిస్తూండగా! లోక్ పాల్ నియామకంలోగానీ, కార్యకలాపాల్లోగానీ ప్రభుత్వ జోక్యం, ఆధిపత్యం వుండకూడదు అంటే, ముఖ్యంగా దానికే ప్రాథాన్యం ఇస్తున్నారు. ప్రథాని మీద ఆరోపణలు వస్తే, ఆయన పద్మవ్యూహం మధ్యలో వుండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. 


సిటిజెన్స్ ఛార్టరూ, సీబీఐ, చిన్న వుద్యోగులూ వగైరాలన్నీ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు!
మరో పోరాటం తప్పదు. అన్నా సిధ్ధం అవుతున్నాడు. మనమూ సిధ్ధమేనా? 


చెన్నై హైకోర్టు మదురై బెంచ్ వారు విజ్ఙత ప్రదర్శించారు! జే జహంగీర్ అనే ఆయన “కోడి పందాలు” నిర్వహించుకోడానికి అనుమతి అడిగితే, “అలాగే” అనేశారు.


ఆయన అంతకుముందు కలెక్టరుగారినడిగితే, ఆయన ఇంకా సమాధానం ఇవ్వకపోవడంతో, కోర్టుకి వచ్చారట.
ఆ పందాలు—స్థానిక పోలీసు ఈన్స్ పెక్టర్, పశు వైద్యాధికారి సమక్షంలో జరగాలి అనీ, కోడి పుంజులకి మత్తు పదార్థాలేవీ తినిపించ/తాగించ కూడదు అనీ, దేనికీ యే విధమైన గాయాలు తగల కూడదు అనీ, కాళ్లకి కత్తులూ అవీ కట్టకూడదు అనీ, వేళ్లకి విషాన్ని పూయకూడదు అనీ, పోలీసులకీ, పశువైద్యాధికారికీ ఖర్చులని నిర్వాహకుడే భరించాలి అనీ, ఈ షరతులకి లోబడతామని అఫిడవిట్ దాఖలు చెసి, నిక్షేపంగా ఆ పందాలు నిర్వహించుకోవచ్చు అనీ—తీర్పు ఇచ్చింది న్యాయ స్థానం.
చిలకమర్తి వారి గణపతి రోజుల్లో, పేకాట పాకల్లో “ఖూనీ”లు జరిగాయని, పేకాటనీ, కోడి పందాల్లాంటివాటినీ శాంతి భద్రతల సమస్యగా తలపోసి, వాటిని నిషేధించారు. ఇప్పుడు, సాయంత్రం పూట, ముసలాళ్లు కాలక్షేపం కోసం క్లబ్బుల్లో చిన్న చిన్న పందాలతో పేకాట ఆడుకున్నా, అరెస్టు చేసి కేసులు పెట్టి, క్లబ్బులని మూయించేస్తున్నారు.
స్టాక్ మార్కెట్, ఫార్వార్డ్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్, లాంటివన్నీ జూదాలు కావు!
ఇకనైనా, ప్రభుత్వమూ, పోలీసులూ తమ బీసీ నాటి ఆలోచనలని మార్చుకొంటే బాగుంటుంది కదూ?
నిన్న విశాఖపట్నం శివారు జాతీయ రహదారిపై, ఓ బజాజ్ బైక్, రోడ్డుని దాటుతున్న “చిరుతపులి”ని గుద్దేసి వెళ్లిపోయిందట. పాపం ఆ చిరుత చచ్చిపోయింది! 


మరి ఆ చిరుతని గుద్దేసి వెళ్లిపోయిన ఆ “ధైర్యస్తుడు” యెవరో, వాడి మానసిక స్థితి ఆ సమయంలో యెలా వుందో (బహుశా తాగేసి వుంటాడు—అంటున్నారు కొందరు!) యెవరైనా పరిశోధిస్తే బాగుండును!
ఓ పాతికేళ్ల క్రితం, అద్దం ముందు నిలబడి, ఓ పెన్నుతో తన గొంతులోని “టాన్సిల్స్” యెలా వున్నాయో చూసుకొంటూ, క్రిందపడిపోయి, అదాటున ఆ పెన్ను మింగేసిందట ఒకావిడ! అప్పటినుంచీ యేమీ ఇబ్బంది లేదుగానీ, ఈ మధ్య కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళితే, ఆ పెన్నుని గుర్తించి, శస్త్ర చికిత్స చేసి, బయటికి తీశారట!
ఆవిడకిప్పుడు 76 యేళ్లట! విశేషం యేమిటంటే, “నాపెన్నూ ఇప్పటిక్కూడా శుభ్రంగా రాస్తోంది, నేనూ శుభ్రంగా వున్నాను!” అందటావిడ.
ఈవిడని యేమి “జయురాలు” అనాలి?
చెన్నైలో మొన్న సోమవారం 19న, హైదరాబాదునుంచి రాత్రి 8.40 కి వస్తున “స్పైస్ జెట్” విమానం దిగబోతూంటే, ఓ “కింగ్ ఫిషర్” విమానం, తన విశ్రాంత స్థలం నుంచి—సరదాగా—రన్ వే పైకి ప్రయాణం మొదలెట్టిందట! చెమటలు పట్టిన ఏ టీ సీ అధికారులు, స్పైస్ ని “అట్టే….అట్టే….” అంటూ, కాసేపు ఆకాశం లోనే చక్కర్లు కొట్టమని, కింగ్ ని తోక ముడిపించి, యెట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారట. 


ఏటీసీలో ఓ మంచి వుద్యోగి వున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా…….!
ఇప్పటికైనా, వేలంవెర్రిగా విమాన సర్వీసులని పెంచేస్తూ, భద్రత గురించి పట్టించుకోని ప్రభుత్వాలకి కళ్లు తెరుచుకుంటాయా?
తితిదే వారు కంప్యూటర్ల ద్వారా, ఇన్నేళ్లనుంచీ--సేవలమూలంగా, లడ్డూ ప్రసాదాలు యెన్ని యెలా దుర్వినియోగమయ్యాయో నిర్ధారించుకున్నారట! ఫలితంగా, రోజూ కళ్యాణోత్సవం లడ్డూల విక్రయం 1500 నుంచి 620 కీ, వడల సంఖ్య 1400 నుంచి 550 కి పడిపోయాయట! 


మిగిలిన ప్రసాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వేరే యెవరైనా చెప్పాలా?
మరి మిగిలిన సౌకర్యాల, దర్శన విధానాల సంస్కరణ యెప్పుడో…..ఆయనకే తెలియాలి!

Friday, November 18, 2011

కబుర్లు - 81అవీ, ఇవీ, అన్నీ

"మిగిలిన సరుకుల రేట్లు తగ్గించకుండా, కిలోరూపాయికి--అవీ ముక్కిపోయిన బియ్యం ఇస్తే యెవడికి కావాలి?" అంటూ టీవీల్లో చెరిగేస్తున్న ఆడవాళ్లకి సమాధానంగా, ఇప్పుడిస్తున్న కాస్త కందిపప్పూ వగైరాలతో ఓ ప్యాకేజీ గా ఓ కిలో చింతపండూ, ఓ కిలో వుప్పూ కూడా ఇస్తేబాగుంటుందనుకుంటున్నారట. 

ఓ కిలో యెండు మిరపకాయలు కూడా.....అనుకొని, మళ్లీ దాని రేటు స్థిరంగా వుండదు....ములిగిపోతామేమో అని సందేహిస్తున్నారట! అయినా నెలకి కిలో చింతపండూ, కిలో వుప్పూ యేంచేసుకుంటారట? 

యెలాగూ ఓ మంత్రిగారన్నట్టు, "వండిపెట్టే" పథకం గురించి ఆలోచిస్తే ఇంకా బాగుండునుకదా? 

యెలాగూ రైతులకీ, మహిళలకీ "వడ్డీ లేని" ఋణాలు అంటున్నారాయె! అదేదో "వుచిత భోజన కూపన్లు" ఇచ్చేసి, వండి వార్చి, వొడ్డించేస్తే పోను కదా?

"అయ్యవారేం చేస్తున్నారు?" అంటే, "చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు!" అన్నట్టు, మంత్రి డీ ఎల్ రవింద్ర (వండిపెట్టే పథకం గురించి చెప్పినది కూడా ఈయనేననుకుంటా!), "వందల కోట్లు ఆసుపత్రులకి ఖర్చు పెట్టారు. డాక్టర్లు లేరు, మందులు లేవు! అలాంటి పరిస్థితుల్లో నాకు వైద్య ఆరోగ్య శాఖని నాకిచ్చారు! (2009 లోనే ఇచ్చారేమో!) అప్పటినుంచీ చేసిన తప్పులు ఇప్పుడు దిద్దుకుంటున్నాను. (కాబట్టి జనాలు నన్నేమీ అనొద్దు!) అన్నాడట. 

బహుశా 2014 వరకూ పడుతుందేమో--ఆ తప్పులు దిద్దుకోడానికి--అప్పటివరకూ ఆ మంత్రి పదవీ, ఆ ప్రభుత్వమూ వుంటే.....!

డీ జీ సీ ఏ వాళ్లు, "విమాన చార్జీలు పెంచి వసూలు చేస్తే వూరుకోం" అని కళ్లెర్రజేశారట--మిగిలిన కంపెనీలని--కింగ్ ఫిషర్ సర్వీసులు రద్దవడంతో. 

పాపం సంపన్న శ్రేణి వినియోగదారులమీదా, ప్రభుత్వ వున్నతోద్యోగులమీదా యెంత ప్రేమో వారికి! 

ఓ ప్రక్క "తృటిలో తప్పిన" ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. గన్నవరం, రాజమండ్రి, విశాఖ లాంటి చోట్ల సరైన యేర్పాట్లే లేవు! గన్నవరం నుంచి సర్వీసు ప్రారంభించినరోజే, వాతావరణం బాగాలేక రద్దు చేశారు ఎయిర్ ఇండియాది! నిన్న ఓ విమానం, రెక్కకి పక్షి తగిలి, అద్దం పగిలిపోతే, అప్పటికే ల్యాండ్ అవడం వల్ల వూపిరి పీల్చుకొన్నారు! మొన్నెప్పుడో ఓ విమానమైతే తగలబడేపోయింది అక్కడెక్కడో. ఇవన్నీ వాళ్ల బాధ్యతలు కావన్నట్టు వాళ్లు పట్టించుకోరు

"చికెన్" నారాయణ ఓ వజ్రం లాంటి మాటన్నాడు. మనపొరుగు రాష్ట్రం తమిళనాడులో "నాయకులు" జైళ్లకి వెళుతుంటే, మన రాష్ట్రంలో "అధికారులు" మాత్రమే వెళ్లడం మొదలెట్టారు--అని!

అవున్నిజమేకదా? అయినా, రాజకీయం కాకపోతే, ఆ తేడా యేమిటో ఆయనకి తెలీదనుకోవాలా? 


ఆదికేశవుడూ, కృష్ణారావూ వుండగా, తి తి దే వారికి బంగారం రాగానే, పేపర్లో ప్రకటించేసేవారు. క్రొత్తవారు, రిస్కెందుకు అనుకున్నారేమో, ఇప్పుడు వొకేసారి, గత మూడు నెలలలో రూ.2.11 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు 'వితరణగా' అందాయి అని ప్రకటించారు. అదీ, ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ వరకూ) అన్ని ఆలయాలకీ కలిపి అనీ, శ్రీవారికొక్కరికే ఆ సమయంలో రూ.1.53 కోట్ల బంగారం వచ్చింది అనీ, జువెలరీ విభాగం వారు లెఖ్ఖలు కట్టారట!

బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నారు కదా? వాకే!

Tuesday, November 15, 2011

కబుర్లు - 80అవీ, ఇవీ, అన్నీ

హమ్మయ్య! శుభవార్త వెలువడింది! రాష్ట్రాల్లో రేషన్ కార్డులున్నవాళ్లందరికీ ఆథార్ సంఖ్య కేటాయించడం చెల్లదని, ఆథార్ సంఖ్యని "జనాభా లెఖ్ఖల" శాఖ మాత్రమే జారీ చేస్తుందనీ, ఆ ప్రక్రియ ఇంకా మొదలవలేదనీ, మిగిలిన యే "సంఖ్యలూ" చెల్లవు అనీ ప్రకటించేశారు!

మరి ఇన్నాళ్లనుంచీ, ప్రైవేటు యేజన్సీలని నియమించి, మందల్లా జనాలని తోలి, దరఖాస్తులని జారీ చేసి, మిగిలినవాళ్లకి 2013 వరకూ దరఖాస్తులే జారీ చెయ్యడం కుదరదనీ.......ఇలా వేషాలేసిన రాష్ట్రాలకీ, ప్రభుత్వాలకీ.....ఇంకా.....ఆ "కార్డు" లేకపోతే....మీకు 'రేషన్' రాదు; 'గ్యాస్' రాదు; 'పెన్షన్లు' రావు; మీరు ఈ దేశ వోటర్లేకారు.....ఇలా బెదిరించి "దండుకున్న" వారికి యేదీ శిక్ష?

"మూడీస్" అనే "ఇంటర్నేషనల్" (మా జార్గాన్ లో మోసగాళ్లనీ, ఓవరాక్షను చేసేవాళ్లనీ క్రమంగా "తాలూకాగాడు; జిల్లాగాడు; రాష్ట్రగాడు; నేషనల్ గాడు; ఇంటర్నేషనల్ గాడు....ఇలా వ్యవహరించేవాళ్లం!) రేటింగు యేజన్సీ, భారతీయ బ్యాంకుల రేటింగుని "కొంత" దించేసిందట! బ్యాంకులన్నీ బాధపడిపోతున్నాయట! (నిజంగా వాళ్ల పేరుకి తగ్గట్టు వాళ్లు "మూడీసే"....అంటే వాళ్ల మూడ్ కి తగ్గట్టు ప్రవర్తిస్తారు!)

ఇంకో రేటింగ్ యేజన్సీ "స్టాండర్డ్ & పూర్" వాళ్లు, అదే రేటింగుని, ఆ మర్నాడే 'కాస్త' పెంచారని సంతోషిస్తున్నాయట బ్యాంకులు! (వీళ్లకో స్టాండర్డ్ లేదు; వీళ్లు పూరూ కాదు! సత్యం రామలింగరాజు ఆడిటర్లు వీళ్లేనట.)  

మొన్న ప్రణోబ్ ముఖర్జీ, నిన్న రంగరాజన్ కూడా, బ్యాంకులు తమ "మౌలిక రంగ" (రోడ్లు, విద్యుత్తు, విమానయాన వగైరా); వాహన; గృహనిర్మాణ; వ్యక్తిగత ఋఅణ రంగాల్లో "జాగరూకత" వహించాలని చెప్పారు(ట!)

నేను మూడేళ్లనుంచీ చెపుతున్నాను--ఈ రంగాలు "ములుగుతున్నాయి" అని! అయినా, అలా "వెల్లవేసి" వాటిని కాపాడుకొస్తున్న ప్రభుత్వాలు మాత్రమే దీనికి బాధ్యులు అంటాను నేను!

మళ్లీ బ్యాంకులు "వుత్పాదక రంగ" ఋణ వితరణకి మాత్రమే పరిమితమైతే తప్ప, మన బ్యాంకులనీ, మన ఋణ వ్యవస్థనీ కాపాడగలిగేవాడు యెవడూ లేడు. వృధ్ధి రేటంటారా.....నా కాలిక్రింద బలాదూర్!

విజయ్ మల్లయ్య, యెప్పుడూ ఓ నలుగులు అందగత్తెల మధ్య (గాంధీగారు పాపం ఇద్దరు 'బెన్ ' ల భుజాలమీదే చేతులు వేసేవారు....వాళ్లు కూడా అందగత్తెలు అంటే మన కళ్లు పోతాయి!), చేతిలో ఓ షాంపేన్ గ్లాసుతో కనిపిస్తాడు! దేశంలోని "బీర్బల్"లకీ, మందుభాగ్యులకీ తగినంత "సరుకు" అందించిన ప్రజా సేవకుడూ, టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని వేలంలో సొంతంచేసుకొని, మన దేశానికి తీసుకువచ్చిన (అది ఆయన పెర్సనల్ లాకర్లో వుందేమో ఇప్పుడు!) "దేశ భక్తుడు"! అలాంటివాడు, ఈ రోజున నా "బీర్ బ్రాండు" ఎయిర్ లైన్స్ కష్టాల్లో వుంటే.....యెందుకు ఆదుకోరూ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు!

ఇంకో స్పైస్ జెట్ వాడో యెవరో, "ప్రైవేటు" విమాన సంస్థలకి ప్రభుత్వం యెందుకు సాయం చెయ్యాలి? అనడుగుతున్నాడు. 

బ్యాంకులేమో, ఇప్పటికే 8 వేలకోట్లిచ్చాం. ఇంకా కావాలంటే, ఓ 8 వందల కోట్లు (నీ మద్యం ఫ్యాక్టరీలలోంచి) మళ్లించు...అంటున్నారట! చేస్తాడో......దేన్‌దార్దాన్‌దే అంటాడో! 

అసలు వీటన్నింటికీ కారణమైన "ప్రఫుల్ పటేల్" హాయిగా వున్నాడు! (ప్రపంచమందరికీ అన్ని విషయలూ తెలుస్తున్నా, వాళ్లు "అదిగో పులి" అని చెపుతున్నా, గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతూ కాలక్షేపం చేసిన) సీబీఐ వాళ్లేమైనా చెయ్యగలరా వాడిని?  

చూద్దాం!Saturday, November 5, 2011

కబుర్లు - 79

అవీ, ఇవీ, అన్నీ

మొన్న మన్మోహనుడు గవర్నర్ల సదస్సును వుద్దేశించి ప్రసంగించారట.

గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగబధ్ధంగా యేర్పడింది. వాళ్లకి ఈయన సందేశాలివ్వడం యెమిటో?

అదేమీ తప్పు కాదేమోగానీ, ఆయన వువాచలు రాజకీయ వాసన కొడుతున్నాయి మరి! అవినీతి నిర్మూలనకి ఇదే సమయం అనీ, అందుకోసం రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకొంటే ఫలితాలు మరింత బాగుంటాయి అనీ, గవర్నర్లు "కేంద్రానికి కళ్లమాదిరిగా" వుండాలనీ, అభివృధ్ధి కార్యక్రమాలని పర్యవేక్షించాలనీ 'సూచించార' ట. దేశానికి "రెండో హరిత విప్లవం" అవసరమన్నారట! పండిన పంటకీ, కుళ్లిపోతున్న ధాన్యాలకీ దిక్కులేదుగానీ.......! ఆ విప్లవం కూడా గవర్నర్లే తేవాలని ఆయన వుద్దేశ్యమేమో మరి! బాగుంది.

మొన్నెప్పుడో, 'ఇండియన్ మినర్వా' వ్యాఖ్యకి సమాధానమిస్తూ, రైల్వే వెబ్ సైట్ గురించి నేను వ్రాసిన విషయమ్మీద, (http://osaamaa.blogspot.com/2011/09/74.html) ఈనాడువారు దృష్టి సారించి, అక్టోబర్ 29న వార్త వ్రాశారు!

అన్నట్టు, ఈనాడులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షల ప్రకటనల్లో, "వివాహ 5వ" అనే ప్రచురించడం మొదలెట్టారు. కానీ, మధ్య మధ్య మళ్లీ "16వ వివాహ" అని కూడా అప్పుడప్పుడూ వస్తున్నాయి.

ఇంక, "ఒడుదొడుకులు" ని "ఒడిదుడుకులు" అని సవరించారు. (అని సంతోషించినంతసేపు పట్టలేదు.....మళ్లీ నాల్రోజుల్లోనే, ఒడుదొడుకులు....అంటూ పెద్ద హెడ్డింగు!).

ఇంకా, మా ఎంబెరుమన్నార్ కోవెలని, "ఎంబెర్ మానార్" అనడం మానేశారు. "ఎంబెర్ మన్నార్" అంటున్నారు. సంతోషం.

కానీ, "ఎంబెరు మన్నార్" అన్నది సరైన పదం. అదికూడా మారిస్తే, ఇంకా సంతోషం.

అలాగే, "నిర్ధారణ" ని "నిర్ధరణ" అని వ్రాస్తున్నారు. అది అర్థం లేని మాట. సవరిస్తే సంతోషం!

తెలుగుని తెలుగులాగే బ్రతికించండి!


మొన్న అక్టోబరు 29నే, ఈనాడులో, సంపాదకీయం ప్రక్కన ముఖ్య వ్యాసంగా, "ఇందిరాగోపాల్" ఓ వ్యాసంవ్రాశారు--"నియంతా...నీవెంత" అంటూ.

ముందు అమెరికాని సపోర్టు చేస్తున్నట్టు అనిపించినా, తరవాత చక్కని హెచ్చరికల్తో ముగిసింది ఆ వ్యాసం.

చదవకపోతే చదవండి.

 

Tuesday, October 11, 2011

(యమర్జెంటు) కబుర్లు - 78.....అవే!

పిచ్చిదంబరం ఇదివరకోసారి "ఆ రెండుపార్టీలూ (కాంగీ; తెదేపా) తమ అభిప్రాయం చెప్పేవరకూ......." అన్నాడు. మొన్న మళ్లీ, "ఆ నాలుగుపార్టీలూ (ఎం ఐ ఎం నీ, వై యెస్ ఆర్ నీ కలిపాడు!).........." అన్నాడు. రేపు నేనో కొత్త పార్టీ పెడితే, "ఆ ఐదు పార్టీలూ......" అంటాడేమో! బాగానేవుంది.

ఆజాద్ యేదో నివేదిక ఇచ్చాడట! "మీనీ కోర్ కమిటీ" సంప్రదింపులు పూర్తి అయ్యాయట. "మెగా కోర్ కమిటీ" ఇంకా మాట్లాడుకోవాలట.

ఈలోపల, "సకలజనుల సమ్మె విరమింపచేసే బాధ్యత" కి కు రె కి అప్పజెప్పారట.

గవర్నరోడూ, ముక్కుమంత్రోడూ, చిరంజీవీ వగైరాలూ--రాష్ట్రపతి పాలనకి అవకాశమే లేదు--"శాంతీ, భద్రతా" భద్రంగానే వున్నాయి, (యెప్పుడో) యెన్నికకాబడిన, ప్రసిధ్ధమైన ప్రభుత్వం పనిచేస్తుంది--అని సెలవిచ్చేశారు!

ఇంకోప్రక్క, వుద్యోగులు--మేము సమ్మె చేసుకుంటాం, మాజీతాలు ఒకటో తారీక్కల్లా ఇచ్చేయాలి, పండుగ అడ్వాన్స్లు ఇవ్వాలి, మూడు నెలలజీతం ముందుగానే ఇచ్చెయ్యలి".....ఇలా మొదలెట్టారు.

ఆర్టీసీ వాళ్లేమో, కొన్ని వందల బస్సులు నడిపిస్తున్నాం అంటారు. వాళ్ల గుర్తింపు పొందిన సంఘం, అనేక "లాభకరమైన" హామీలని పొంది, సమ్మె విరమిస్తున్నాము అన్నారు. అదేదో "ఫోరాన్ని" రద్దు చేశాము అన్నారు.

మళ్లీ టీవీలనిండా, బస్సులు తిరగడంలేదు అని గోల! రైళ్ల సంగతి దేవుడికే యెరుక!

గద్దరోడు కార్మికులకి కొన్ని అడ్వాన్సులూగట్రా ఇప్పించాడు. మళ్లీ ప్రభుత్వం "థూచ్" అందట!

ఇంకో ప్రక్క, "తెలంగాణా + నెల్లూరు, అనంతపురం, చిత్తూరు - హైదరాబాదు" అనీ, "ఆంధ్ర + ఖమ్మం - శ్రీకాకుళం, విజయనగరం" అనీ, "రాయల - నెల్లూరు, అనంతపురం, చిత్తూరు + మహబూబ్ నగర్" అనీ, కోస్తాంధ్ర/సర్కార్లు - నెల్లూరు, చిత్తూరు, గుంటూరు" అనీ, ఇలా యెవడికితోచిన పిచ్చివాగుళ్లు వాళ్లు వాగేస్తున్నారు!

మరి పరిష్కారం యెలా?

'69; '73 లోల్లా పూర్తిస్థాయి సీ ఆర్ పీ ఎఫ్; మిలిటరీ దళాలు దిగాలి!

పిరికోళ్లు "పండుగుల సందర్భంగా విరామం; పరీక్షల సందర్భంగా విరామం; పంటచేతికొచ్చేదాకా విరామం......"ఇలా వుద్యమాన్ని, "అహింస ముసుగులో" యెగదొయ్యలేకపోతూంటే, అక్కడ కేంద్రం సంప్రదింపులమీద సంప్రదింపులకి పోతూంటే, "జనజీవనం" మాత్రమే అస్థవ్యస్థం అవుతోంది!

నాకైతే, యే ప్రభుత్వమూ లేకుండా, "అంధేరా ప్రదేశ్"లోనే, నివశిస్తే బాగుండును అనిపిస్తోంది! మన రాష్ట్ర బడ్జెట్ ఓ రెండేళ్లక్రితమే లక్ష కోట్లు దాటింది. ఇప్పుడు లక్షా ఇరవై వేల కోట్లో యెన్నో. మన రాష్ట్ర జనాభా ఓ ఫది కోట్లనుకుంటే, "తలకి" 12 వేలు వస్తుంది. {పావలా వడ్డీలూ, కిలోరూపాయి బియ్యాలూ (తెలుగుమాటేనండి....ఒరియాకాదు) అఖ్ఖర్లేదు}......ఒక్కొక్కరికీ పంచేస్తే, "ఓ రాష్ట్ర ప్రజలారా! మీకింకేవిధమైన పన్నులూ వుండవు. పైగా మీ ఖాతాలకి సంవత్సరానికి 12 వేలు బదిలీ చెయ్యబడుతుంది. ఇంకా కేంద్ర గ్రాంటులు వస్తే, మీకు బోనస్ కుడా గిట్టుబాటవుతుంది! (ప్రభుత్వం నడపడానికీ, ప్రాజెక్టులు వగైరాలకీ ప్రపంచ బ్యాంకు వుండనే వుంది!)" అని యే "కశెన్నగాడో" ప్రకటిస్తే, మనవోట్లన్నీ వాడికే వేశెయ్యమూ!?

భలే బహ్లే! మంచి పరిష్కారంకదూ????!!!!

వెధవలు వోటర్ల లిస్టులో నా పేరు చేర్చడంలేదుగానీ, చేరుస్తేనా, బృహన్నలలకి వోటెయ్యకుండా, ఇలాంటి హామీ ఇచ్చేవాళ్లనే యెన్నుకొనేలా చేసేవాణ్ని!

యేం చేస్త్రాం!

Wednesday, October 5, 2011

కబుర్లు - 77

అవీ, ఇవీ, అన్నీ

సకలజనుల సమ్మె చేసుకుంటున్నారు......తమ ప్రజలకి వ్యతిరేకంగా తామే! అని సంతోషిస్తున్నారా? రేపు యే పిచ్చిదంబరమో ఇంకో ప్రకటన చేసేవరకూ గాజులు తొడుక్కొని కూర్చుంటారా? ఇప్పుడే మీ సత్తా ప్రకటిస్తారా? తేల్చుకోండి! అంటున్నాడట కోడెల.

యేదీ, యెవడబ్బ సొమ్మూ కాదు! "ఈ దరిద్రం వదలాలంటే, వాడు అడిగిన తెలంగాణా ఇచ్చేస్తే పోను కదా......హైద్రాబాదు తప్ప"....అని సామాన్య జనాలు అంటున్నారంటే, యెంత విసిగిపోయారో ఓ సారి ఆలోచించండి!

కేసీఆర్ తన తోక తాను లేపలేకపోయినా, జానా రెడ్డి ని "తెలంగాణా వస్తే, ముఖ్యమంత్రివి నీవే" అని యెగదోసి, తెలంగాణా కాంగ్రెస్ మంత్రులనీ, ఎమ్మెల్యేలనీ, నాయకులనీ "వూతకర్రలుగా" చేసుకొని, తానో మహాత్ముడి స్టేజికి యెదగాలని వాడి స్ట్రేటజీ! దానికి పిల్లిగడ్డమోడొకడు మధ్యవర్తి! ఇప్పుడు, "తెలంగాణా ఇచ్చేస్తే, మా పార్టీని మీ పార్టీలో విలీనం చేసేస్తా"నంటాడా? "నీ విలీనం యెవడికి కావాలి--చిరంజీవి సపోర్టు మాకుండగా!" అని కాంగీవాళ్లంటూంటే, కొందరు మాత్రం, "బలేమామా బలే! అదే మన తక్షణ కర్తవ్యం" అంటున్నారు! ఇంకో ప్రక్క, కురువృధ్ధ జైపాల్ రెడ్డిని 'మీ నాయకత్వం అవసరం ' అంటున్నారు. మరి ఇంక బొర్రముక్కోడూ, మిడి గుడ్లోడూ, అంతమందిని బలిపెట్టి యేమి సాధించినట్టు?

మామూలుగా కాకపోతే, కుంచం తిరగేసి కొలవమన్నారు--అన్నాడు గిరీశం.

"ఆటునుంచి నరుక్కురమ్మన్నారు" అని కూడా అన్నాడు!

గాంధీ మార్గం ఫలితాన్నివ్వకపోతే, శివాజీ మార్గం ఆదర్శం అవుతుందన్నారు "అన్నా హజారే"! ఇప్పుడు అదే మార్గం పడుతున్నారేమో! "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా" అని చెప్పి, "వచ్చే యెన్నికల్లో కాంగీలకి వోటు వెయ్యొద్దు" అని ప్రచారం చెయ్యడానికి బయలుదేరుతానన్నాడు! దెబ్బకి దిమ్మతిరిగి, బొమ్మ గూట్లో పడింది......సల్మాన్ ఖుర్షీద్ అప్పుడే ప్రకటించేశాడు......"వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే "లోక్ పాల్" బిల్లుని ప్రవేశపెట్టి, ఆమోదింపచెయ్యడానికి ప్రయత్నిస్తాము" అని!

జై గాంధీ మార్గం! జై శివాజీ మార్గం! జై జై అన్నా హజారే!

సెన్సెక్స్ 16 వేలకన్నా క్రిందికి పడిపోయింది. ఇదివరకోసారి, 8 వేలకన్నా పడిపోతే సంతోషిస్తాను అని వ్రాశాను. యెందుకంటే, అది బలుపు కాదు వాపు అని ఖచ్చితంగా చెప్పాను. ఇప్పుడు నిజం అవుతోంది కదా? మూడీస్ ఎస్ బీ ఐ రేటింగుని తగ్గించేసింది. పిచ్చిదంబరం అనవసరంగా మార్కెట్లని వాచేలా చేసి, అదంతా బలుపు అనుకోమన్నాడు!

"నిరర్ధక ఆస్థుల" కాన్సెప్ట్ వచ్చినప్పటినుంచీ, యెలాగో అలా మేనేజి చేసి, (ఆడిటర్లకి ఆడీ కార్లు కొనిచ్చి) బ్యాంకులన్నీ తమకి నిరర్ధక ఆస్థులు దాదాపు లేవు అని ప్రకటించుకుంటూవస్తున్నాయి. ఇప్పుడు, మానవ ప్రమేయం లేకుండా, కంప్యూటర్లే ఈ ఆస్థుల నిర్ధారణ చేస్తున్నాయి. రేపు మార్చికి చూడాలి--ఈ బ్యాంకుల పరిస్థితి! యెన్నింటి గోడలూ, పునాదులూ చెదలు తినేశాయో!

ఇంకో ప్రక్క, "ఇంక కీలక రేట్లని పెంచొద్దు మహాప్రభో" అంటున్నారు పారిశ్రామిక వేత్తలు! దువ్వూరివారూ....ఆలకించకండి. మరోసారి వీళ్లకి పెద్ద యెత్తున షాక్ ఇవ్వండి! వృధ్ధి రేటు యేనెలకానెల జీరో అయినా, వృధ్ధి అంటూ జరక్కమానదు!

ప్రణొబ్ ముఖొర్జీ, తన కార్యాలయంలో దొంగ కెమేరాలు పెట్టించారు అని మొత్తుకొంటే, "దానితో వాడికి సంబంధం లేదు" అన్నారు. వాళ్ల శాఖ అప్పుడెప్పుడో వాడికి లేఖ వ్రాసింది అంటే, ఇప్పుడు "వాళ్లిద్దరూ ఫ్రెండ్స్!" అని షేక్ హేండులిప్పించేశారు! అసలు అది వాళ్ల మధ్య సమస్యా? మొత్తం దేశం సమస్యా?

ఇప్పుడు నెమ్మదిగా బయటకొస్తూంది......ఈ దరిద్రాలన్నింటికీ కారణం "అధిష్టానమే" అనీ, అక్కడ నేషనల్ ఎడ్వైజరీ కౌన్సిల్ పేర ఓ 17 మందితో "సూపర్ కేబినెట్" నడుస్తూంది అనీ, మంత్రులనీ, శాఖలనీ, పార్లమెంటులో బిల్లులనీ చదరంగంలో పావులని కదిపినట్టు ఆడిస్తోంది అనీ!

అరుణారాయ్ అనే ఆవిడ (తన సొంత లోక్ పాల్ బిల్ ఫేం) అందులో ముఖ్యురాలట. ఇంకా, హర్ష్ మందిర్ అనే మాజీ ఐయేఎస్ అధికారి ఓ సూపర్ కాప్ ట (బీజేపీని యెదుర్కొనే సత్తా వాడికే వుంది అని ఆవిడ నమ్మకంట)--ఆ కౌన్సిల్లో!

ఇంక రాజ్యాంగం యెందుకూ, మంత్రివర్గం యెందుకూ......అన్నీ కూడా యెందుకూ? పోనిద్దురూ!

Monday, October 3, 2011

కబుర్లు - 76

అవీ, ఇవీ, అన్నీ

ప్రణాళికా సంఘం వారేదో, పట్టణాల్లో "తలకి" 32 రూపాయలూ, పల్లెల్లో "తలకి" 26 రూపాయలూ--"రోజుకి" సంపాదించేవాళ్లందరూ "దారిద్ర్యరేఖకి" పైనున్నట్టే అని నిర్ధారించి, కోర్టువారికి చెపితే, భాజపావారు, మన్మోహన్ సింగ్ పేరనొకటీ, సోనియాగాంధీ పేరనొకటీ రూ.32/- చొప్పున రెండు డీడీలు తీసి పంపించి, "ఈడబ్బులతో మీరు ఒక రోజు బ్రతికి చూపించండి!" అని సవాలు విసిరారట! (పాపం వాళ్లా డీడీలు మార్చుకోడానికి కూడా భయపడి మానేశారట!)

యోగాగురు 'బారాందే' "నల్లధనానికి వ్యతిరేకంగా" వుద్యమించి, బొక్కబోర్లా పడ్డాడు. ఇంకా వుద్యమం కొనసాగుతోంది అని ప్రకటిస్తున్నాడు! దానికి బదులు, దేశంలోని భక్త ప్రజలనబడే వారందరికీ "భక్తిపేరుతో మీ వేలంవెర్రుల్ని తగ్గించుకోండిరాబాబూ!" అని ఒక్క పిలుపిస్తే, సంతోషించేవాళ్లలో మొదటివాడిని నేను. 

ఇంకా, నల్లధనాన్ని చాలావరకూ వెలికితీసే మార్గం నాకోటి తోచింది. అదేమిటంటే......గణపతి నవరాత్రులతో మొదలెట్టి, భారీ విగ్రహాలూ, భారీ లడ్డూలూ లాంటివే కాకుండా, కొత్తగా "కరెన్సీ" నోట్లతో అలంకరించడం అనే వెర్రి బాగా ముదురుతోంది! దసరా సందర్భంగా, పెద్ద పెద్ద అమ్మవారి గుళ్లేకాదు, వేంకటేశ్వర మొదలైన ఆలయాలేకాదు, పుంతలో ముసలమ్మదగ్గరనించీ, పెంటమీది పేరమ్మ వరకూ కనీసం పదో పదిహేనో లక్షలతో అలంకరిస్తున్నారు! 

ఈమధ్య కొన్నిచోట్ల యేకంగా కోట్లలోకి కూడా చేరింది! నిన్నెక్కడో ఒకచోట కోటీ పదకొండు లక్షల పదకొండు వేలతో, ఇంకో రెండుమూడు చోట్ల కోటికి పైగా,  అలంకరించారట! 

ఈ డబ్బు యే ఖాతాల్లోంచి వస్తోంది, యే బ్యాంకుల్లోంచి వస్తోంది, ఒకవేళ పాతనోట్లు ఇచ్చి, కొత్తనోట్లు గ మార్చుతున్నారంటే, యే బ్యాంకు అధికారులకి భక్తి యెక్కువై అలాంటి పనులు చేస్తున్నారో.....ఇలాంటి విషయాలు వెలికి తీస్తే సరి! చాలా కష్టం అంటారా! అఖ్ఖర్లేదు. ఇలాంటి వివరాలన్నీ స్థానిక పోలీసు ఐ డీ పార్టీ కానిస్టేబుళ్లు సేకరించి, పై అధికారులకి పంపిస్తూనే వుంటారు. వారినే ఇంకొన్ని వివరాలు సేకరించమంటే సరి! యెలా వుంది అవిడియా?

మొన్న ఓ రోజు, చిన్నతిరపతి లో ఓ పెద్దమనిషి, ఖద్దరు చొక్కా, ఖరీదైన కళ్లజోడూ వగైరాలతో "నేను హైదరాబాదులో పెద్ద వ్యాపారిని. ఇక్కడ ఓ కల్యాణమండపం కట్టించడానికి 30 లక్షలు విరాళం ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. ప్రస్తుతానికి, అన్నదాన పథకానికి గానూ ఓ లక్ష కి చెక్కు ఇస్తున్నాను" అనగానే, ఆలయ అధికారులు యెందుకైనా మంచిదని దేవస్థానం ఛైర్మన్ కి ఫోను చేసి మరీ....రాచమర్యాదలతో శ్రీవారి అంతరాలయ దర్శనంతోపాటు, పెద్దమొత్తంలో ప్రసాదాలూ వగైరాలన్నీ చదివించి, సాగనంపారట. ఆయన మళ్లీ ఓ పదిరోజుల్లో కల్యాణమండం గురించి మాట్లాడ్డానికొస్తానని చెప్పి మరీ వెళ్లాడట. 

తీరా బ్యాంకుకి వెళ్లి చూస్తే, చెక్కుజారీ చెయ్యబడిన ఖాతాలో రూ.16/- మాత్రమే వున్నాయి అనీ, అంతకు ముందుకూడా ఆ ఖాతాలో ఐదువేలకి పైబడి లావాదేవీలు జరగలేదనీ తేలి, మింగలేక, కక్కలేక అధికారులందరూ సతమతమయ్యారట! 

అవునుకదూ.....యెవరినైనా.....మెడలో కుక్కల గొలుసుల్లాంటివివేసుకొని, దానికి వేళ్లాడవలసిన "ఐడీ" కార్డులని చొక్కాజేబులో దాచుకొనే వాళ్లనైనా, అవి చూపించమని అడగడానికి మనవాళ్లకి అదేంటో....సిగ్గో, భయమో!

ప గో జి, కాళ్ల మండలం, పల్లిపాలెం గ్రామంలో, మొన్న ఓ యేడేళ్ల బాలుడు "విషపుటీగల" బారిన పడి మృతిచెందాడట. దాంతో, రెవెన్యూ అధికారులు, కొందరు గ్రామ సహాయకులతో (ఇంగ్లీషు సినిమాలు చూడడంలో నిపుణులేమో!) "ఆపరేషన్ రెస్క్యూ" నిర్వహించారట. 

ఆ వూరి రామాలయం గోపురంలో ఆ విషపుటీగల "తుట్టె" వుండడంతో, బ్రహ్మాండమైన ప్లాను వేసి, సిబ్బంది "ఫైర్ ప్రూఫ్" దుస్తులు ధరించి, ముందుగా గోపురానికి నాలుగుప్రక్కలా వున్న రంధ్రాలని బంకమట్టితో పూడ్చేశారట. 

తరవాత, ఇంకో రంధ్రంద్వారా, "మొనోక్రోటోఫాస్" పిచికారీ చేశారట. తరవాత, సిధ్ధంగా వుంచుకొన్న "పెట్రోలు" ఆ రంధ్రంగుండాపోసి, నిప్పంటించారట

ఇంకేముందీ! ఆపరేషన్ సక్సెస్, బట్ పేషంట్ డెడ్ అన్నట్టు, పెద్ద విస్ఫోటం సంభవించి, ఆ గోపుర శిఖరం విరిగిపడి, ఒకతనికి తీవ్రగాయాలవగానే క్రిందకు దూకేసి, మిగిలినవాళ్లకి కూడా గాయాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అధికారులతోపాటు.... "హమ్మయ్య! విషపుటీగలని సమూలంగా నిర్మూలించాం!" అని సంతోషిస్తున్నారట. 

ఇలాంటి "ఆపరేషన్" సరియైన భద్రతా చర్యలు లేకుండా, ప్లాను చేసినవాళ్లకీ, నిర్వహింపచేసినవాళ్లకీ మీరు యే యెవార్డు ఇప్పిస్తారు?       


Wednesday, September 28, 2011

కబుర్లు - 75

అవీ, ఇవీ, అన్నీ

"ఆండిముత్తు రాజా"....ఇంత సత్యసంధుడని యెవరూ అనుకోలేదు! ఆయన చెప్పినవన్నీ 'సత్యాలే' అని ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి.

మొన్న ఆగస్ట్ 24న ఆయన కోర్టులో యేమన్నాడో చదవండి--"2జీ స్పెక్ ట్రం ద్వారా ప్రభుత్వానికి యెలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ విషయాన్ని ఋజువు చేసేందుకు ప్రథాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం, ప్రస్తుత టెలికం మంత్రి కపిల్ సిబల్ లను విచారించాలి.....నష్టం వాటిల్లలేదని ప్రథాని, ప్రస్తుత టెలికం మంత్రి పార్లమెంటులోనే ప్రకటించారు. వాళ్లని విచారిస్తే, నష్టం వాటిల్లలేదు అని ఋజువు అవుతుంది. అప్పుడు నామీద కేసేలేదు!" అన్నారు!

ఇప్పుడు వరుసగా బయటికి వస్తున్న "నోట్"లూ, లేఖలూ వగైరాల వల్ల, అంతా ప్రథానికీ, చిదంబరం కీ, ప్రణోబ్ కీ, తెలిసే జరిగింది అని నిరూపితమవుతోంది.

(ఇవి బయటపడడం కూడా స హ చట్టం వల్లేనట! జనలోక్ పాల్ అంటేనే ఈ మంత్రులందరూ యెందుకు వుచ్చలుపోసుకొంటున్నారో అర్థం అవుతోంది కదా?)

బుకాయింపుల పర్వం బాగానే సాగుతోంది. "మా అతివిలువైన సహచరుడు" ని అరెస్టు చెయ్యక్కర్లేదు, విచారించక్కర్లేదు అంటాడొకడు. మా నోట్ గురించి, 'నిపుణుల అభిప్రాయం' తీసుకున్నాకే మాట్లాడతానంటాడు పైగా!

నికమ్మా ప్రథాని అయితే, ఆయనమీద నాకు పూర్తి నమ్మకం వుంది అంటాడు....యెవడడిగాడనో! కాయితాలమీద వున్న విషయం గురించి మాట్లాడమన్నారుగానీ, నీకు యెవరిమీద నమ్మకాలున్నాయి అనడిగారా?

సంకీర్ణధర్మం పేర, అందర్నీ వీలైనంత దోచుకోడానికి చూసీ చూడనట్టు వ్యవహరించడం అనే నేరం చేశారాలేదా? అనడుగుతున్నారు! కరుణానిధికి, "మా తమిళనాడు మంత్రులెవరూ (యేపార్టీ వాళ్లయినా) రాజీనామా చెయ్యాల్సిన అవసరం లేదు. చెయ్యరు." అనే ధైర్యం వాడికి యెలా వచ్చింది?

"ప్రతిపక్షం మధ్యంతర యెన్నికలు రుద్దడానికి ప్రయత్నిస్తోంది(ట)!" వొద్దుబా....బూ! యే యెన్నికలూ వద్దు...మంత్రులందరూ జైళ్లలో కూచున్నా; ఆఫీసులకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నా, పరిపాలనంటూ లేకపోయినా, రైళ్లూ బస్సులూ నడవకపోయినా, యెవరెలా పోయినా, యెన్నికలు మాత్రం వద్దు! మీ కుర్చీలు మీరు వదలొద్దు. అంతే!

ఒక్క నోటీసుతో, దిమ్మతిరిగి పట్టపగలే చుక్కలు కనిపించి, లిఖితపూర్వకంగా క్షమాపణ అడిగాడట--అన్నా హజరేని 'నువ్వు నిలువెల్లా అవినీతిపరుడివి ' అని దూషించిన మనీష్ తివారీ అనే ఓ కాంగీ అధికార ప్రతినిధి! చిరునవ్వుతో క్షమించేశాడట అన్నా! ఇంకెవరెవరు యేమేమి అంటారో చూడాలి.

సినిమాలో తప్ప బయట యెక్కడా వినిపించని పాటలు వున్నట్టు, యెవరూ పట్టించుకోని వార్తలు కొన్ని వుంటాయి--అవి యెంత ముఖ్యమైనవైనా!

ప్రభుత్వం వివిధ సందర్భాల్లో "స్వాధీనం చేసుకున్న ఆయుధాలు" గత పాతికేళ్లలో, 750 మంది "ఎం పీ" లు "కొనుక్కొన్నారు"ట! (ఇది కూడా స హ చట్టం క్రింద ప్రభుత్వం వెల్లడిచేసిన రహస్యమేనట!)

అలాంటి ఆయుధాలని, "సిట్టింగు" ఎంపీలకు మాత్రమే, మొదట అడిగినవారికి మొదట ప్రాతిపదికన "విక్రయించవచ్చు" అని రూలట!

అలా కొనుక్కున్నవాళ్ల లిస్టులో కొన్ని పేర్లు చూడండి.....యూపీ ముఖ్యమంత్రి మాయావతి; కాంగీ నేత జనార్దన్ ద్వివేది; భాజపా నాయకుడు షానవాజ్ హుస్సేన్; కేంద్ర మంత్రులు జయంతీ నటరాజన్; ప్రణీత్ కౌర్; విన్సెంట్ పాలా; మాజీ యెన్నికల ప్రధానాధికారి ఎమ్మెస్ గిల్; ప్రస్తుత సీ ఎం లు భూపీందర్ సింగ్ హుడా; శివరాజ్ సింగ్ చౌహాన్; ఇంకా నాయకులు జగదీష్ టైట్లర్; వీకే మల్ హోత్రా; మదన్ లాల్ ఖురానా; సజ్జన్ కుమార్; సీపీయెం సీనియర్ నేత సుభాషిణీ ఆలీ; ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీలు అతీక్ అహ్మద్; సురేష్ కల్మాడీ; బాబూభాయ్ కటారాలు కూడా అలా కొనుక్కొన్నారట!

మరి వీళ్లకి ప్రజలడబ్బు తగలేసి జడ్ కేటగరీ; జడ్ ప్లస్; జడ్ ప్లస్ ప్లస్ అంటూ భద్రత కల్పించడం యెందుకో?

పోనీ ఆ విషయం ప్రక్కన పెట్టినా; వాళ్లలో యెంతమంది మళ్లీ ఆ ఆయుధాలని ఇతరులకి యెన్ని లక్షలకి విక్రయించారో; ప్రస్తుతం అవి యెవరిదగ్గర వున్నాయో, వాటికి లైసెన్స్ లు వున్నయోలేదో, మళ్లీ అవి యెప్పుడైనా స్వాధీనం అయ్యాయేమో--ఇలాంటి సమాచారం కోసం యెవరైనా ఇంకో స హ దరఖాస్తు చేశారంటారా? చేసే వుంటారు.....!

ప్రథాన యెన్నికల కమీషనరుగా ఎస్ వై ఖురేషీ నియామకమే తప్పుడు వ్యవహారం అన్నారందరూ.

ఇప్పుడు వాడేమంటున్నాడో చూడండి.....హజారే అన్నట్టు ఎంపీల రీకాల్ భారత్ లాంటి పెద్ద దేశం లో ఆచరణ సాధ్యం కాదుట. వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారవుతుందిట. అనేక సమస్యలకి దారి తీస్తుందిట. అలాగే, అభ్యర్థులందరినీ తిరస్కరిస్తున్నాం అని బ్యాలెట్లో ఆప్షన్ ఇస్తే కూడా బోళ్లు సమస్యలు వచ్చేస్తాయట.

ఒకవేళ వోటర్లందరూ అందరు అభ్యర్ధులనీ తిరస్కరిస్తే, యేం చెయ్యాలి అనే సమస్య వస్తుందిట! ఇంటింటికీ తిరిగి చేసే ప్రచారం కూడా మంచిది కాదుట!

పెద్ద దేశం అని యెన్నికలు నిర్వహించడమే మానేస్తామా? వీడి సందేహాలకి చిన్నపిల్లాడు కూడా సమాధానాలు చెప్పగలడు. అయినా సమస్య వచ్చినప్పుడు యేంచెయ్యాలో ఆలోచించచ్చుగా? ముందునుంచీ అన్నీ వ్యతిరేకించడం యెందుకు? "అమ్మ చెప్పిందీ......" గనుకా?

సకలజనుల సమ్మెవల్ల యెవరికైనా యేదైనా మేలు జరిగిందో లేదోగానీ, పరోక్షంగా కొందరికి మేలు జరిగిందేమో అనిపిస్తూంది! యెందుకంటే, "ఏపీబీసీఎల్" డిపోల నుంచి దుకాణాలకి మద్యం సరఫరా నిలిచిపోయిందట! మొత్తం 38 డిపోలుంటే, అందులో 17 తెలంగాణాలో వున్నాయట! అవి మూతపడడంతో, ప్రక్క జిల్లాల నుంచి యెలాగోలా తెప్పించి సరఫరా చేసినా, యేమాత్రం సరిపోవడం లేదట! ఇంక అది కూడా సాధ్యం కాకపోవడంతో, "ప్రభుత్వానికి కోట్లలో నష్టం వస్తూంది....."అనిమాత్రమే....చింతిస్తున్నారట ప్రభుత్వం వారు!

మొన్న జేపీ ఢిల్లీలో అదేదో సంఘం ముందు తన అభిప్రాయాలు వెల్లడించాక, తను చెప్పిన విషయాలు మీడియాకి వెల్లడిస్తే, ఆయన చెప్పిన వాటితోపాటు, "జనలోక్ పాల్" ఓ రాజ్యాంగేతర శక్తి అవుతుంది అనికూడా అన్నాడు అని రిపోర్టు చేశారు--ఈనాడుతో సహా! నిన్న ఆయన నేను అనని మాటలని మీడియా వాళ్లు కావాలనే ప్రచారం చేశారు అన్నాడు! నమ్ముదాం మరి.

వీళ్లకి పదవులివ్వడమే దండగ అనుకొంటే, ప్రతీ వూళ్లోనూ వాళ్లకి సన్మానాలూ, పేపర్లో శుభాకాంక్షల ప్రకటనలూ, కత్తో, గదో, కిరీటమో, యెద్దుకొమ్ములో బహూకరించడాలూ.....ఇవన్నీ అవసరమా??

యేమంటారు?

Wednesday, September 21, 2011

కబుర్లు - 74

అవీ, ఇవీ, అన్నీ

బస్సుల్లో రిజర్వేషన్లకి వెయిటింగ్ లిస్ట్, సగం మంది మిగిలినా ఇంకోబస్సూ--ఇలా సంతోషించినంతసేపు పట్టలేదు--మళ్లీ మెలికలు పెట్టారు. ఇలా ప్రత్యేకంగా వేసిన బస్సుల్లో 50శాతం రుసుం అదనంగా వసూలు చేస్తారట! గరుడ బస్సుల్లో వెయిటింగులిస్ట్ అంటూ 5 టిక్కెట్లే ఇస్తారట. అలా 20 మంది దాటినా గరుడ బస్సులని మాత్రం ప్రత్యేకంగా వేయరట! మరి కేన్సిలేషన్లేవీ లేకపోతే, వెయిటింగ్ లిస్ట్ వాళ్ల గతేమిటో! సూపర్ లగ్జరీలకి అయితే, వాళ్లకి యే బస్సులో సీటు కేటాయించారో, ఎస్ ఎం ఎస్ పంపిస్తారట!

Indian Minerva పొరపాటున Indianrailways.gov.in లోకి వెళ్లి వుంటారు.

అనేకసార్లు "వెబ్ పేజ్ నాట్ అవైలబుల్" అని, యెప్పటికో వోపెన్ అవుతుంది. వెబ్ సైట్ ప్రారంభమైనప్పటినుంచీ, దాదాపు మూడునెలలకిపైగా "ఈ టికెటింగ్ ఫెసిలిటీ హేస్ బీన్ టెంపరరిలీ స్టాప్డ్...." అనే చూపిస్తోంది.

మిగిలిన ప్యాసెంజర్ సర్వీసెస్ లో, జర్నీ ప్లానర్, పీ ఎన్ ఆర్ స్టేటస్, ఎరైవల్/డిపార్చర్ లు బాగానే పని చేస్తాయి మన అదృష్టం బాగుంటే!

టికెట్ రిజర్వేషన్ కి మాత్రం ఇంకా ఐఆర్ సీటీసీనే బాగుంది.

మొన్ననే, కి కు రె మన రాష్ట్రంలో "స్త్రీనిధి" అని ఓ బ్యాంకులాంటిది--1098 కోట్లతో ప్రారంభించాడు. దీని వుద్దేశ్యం--డ్వాక్రా సంఘాల సభ్యులు, సూ ఋ సంస్థల బారిని పడకుండా, తమకి తామే అప్పులు ఇచ్చుకొంటూ, తీర్చుకొంటూ 'అభివృధ్ధి' చెందడానికట.

మరి అభివృధ్ధికల్లా మూలం యేమిటి? ఇంకేమిటి--రాష్ట్ర వ్యాప్తంగా 925 సంఘాలకీ, 925 కోట్లతో "కమ్యూనిటీ" భవనాల నిర్మాణం(ట). మిగిలే కోట్లతో, ఒక్కో సభ్యురాలికీ రూ.15,000/- మాత్రమే ఋణంగా ఇవ్వడం(ట).

లక్షల్లో అప్పులుచేసి, బంగారాలు కొనేసి, వాయిదాలు కట్టడానికి మళ్లీ వాటిని "ముత్తూట్"; "మణుప్పురం" లలో తనఖాపెట్టి, అవీ తీర్చలేక, ఇవీ తీర్చలేక కాదూ--మహిళలు విషవలయం లో చిక్కుకున్నది? వీళ్లకి 15 వేలు యేమూలకి?

ఇంక "వాళ్లేమో" బంగారాన్ని కరిగించేసి, లక్ష్మీదేవి బొమ్మతోనూ, మేరీమాత బొమ్మతోనూ.....ఇలా నాణాలు తయారుచేయించి, (అప్పట్లో తక్కువరేటుకి 'పడేసుకొన్న' బంగారాన్ని, ఇప్పటి యెక్కువరేటుతో అమ్ముకొని,) కొన్ని వందల కోట్లు కేరళకి తరలించుకుపోతున్నారు! ఆర్బీఐ యేమో ఇప్పుడు "ఎన్ బీఎఫ్ సీ"లకి కొన్ని నిబంధనలు విధించడం గురించి ఇంకా 'ఆలోచిస్తూంది!'(ట).

సరేలెండి. బాగానే వుంది కదా.

ఇంక, ఓ "క్రీడాధికారి" మొన్నంటాడూ--క్రీడలకి 'ఇతోధిక' ప్రోత్సాహం ఇవ్వడానికి, 923 కోట్లో యెంతో పెట్టి, అన్ని గ్రామాల్లో, "క్రీడా ప్రాంగణాలు" నిర్మిస్తారట! (ప్రాంగణాలంటే స్టేడియం లు కాదట--ప్రత్యేక భవనాలేమో!)

ఇంకో మంత్రంటాడూ, యేలూరులో యెప్పుడో నిర్మించిన "స్టేడియం" శిధిలమైపోయింది, దాన్ని త్వరలో, కొన్ని కోట్లతో  పునర్నిర్మిస్తాము అని! (ఆ స్టేడియం నిర్మించాక ఒకటో రెండో రంజీ మ్యాచ్ లు తప్ప, అక్కడ యేక్రీడా జరగలేదు--మదన కామ క్రీడలు తప్ప!)

యెవరూ 1000 కోట్ల గురించి మాట్లాడడంలేదు చూడండి! అలా మాట్లాడితే, సీబీఐ వాళ్లు వెంట తరుముతారో యేమో ఖర్మ!

అసలు  ఈ రానాలు మట్టినీ, ఇసుకనీ, సిమెంటునీ, కంకరనీ ఇలా తినేసి, అరిగించేసుకొంటూ, పొట్టలు పెంచేసుకొంటూ వుండగా, గాలో యెవడో ఇనుముని డెభ్భైనాలుగో యెన్నో కిలోల బంగారంగానూ, 23 యెన్నో కోట్ల నగదుగానూ మార్చుకున్నాడని యేడవడం యెందుకు???!!!

ఇంక మన ఆర్ టీ యే లగురించి యెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దశాబ్దాల క్రితమే "బ్రోకర్ల" వ్యవస్థ రద్దు చేసినా, మనం యేదైనా పనిమీద అక్కడికి వెళితే, అక్కడ అసలు వుద్యోగులు వుండరు--వాళ్లు నియమించుకున్నవాళ్లు వాళ్ల పని చేసేస్తూ వుంటారు. వాళ్లు "మీ బ్రోకరు యెవరు? అతన్ని పంపించండి" అంటారు. అక్కడి "హెల్ప్ డెస్క్"లు బ్రోకర్లకీ, వుద్యోగులకీ మధ్య సూపర్ బ్రోకర్లుగా మారాయి!

ఇంక, కోట్లతో టెస్ట్ ట్రాక్ లూ, సిమ్యులేటర్లూ యేర్పాటు చేస్తున్నాం, ఆన్ లైన్ లో అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటారు గానీ, కొన్ని వందల ట్రాఫిక్ సిగ్నల్స్ లో యే రెండో మూడో అడిగి, లైసెన్స్ ఇచ్చేస్తారు! కొన్న బైక్ స్పీడ్ యెంత, సరిగ్గా బ్రేక్ వెయ్యగలడా, పార్కింగ్ చెయ్యడం వచ్చా, ఓవర్ టేకింగ్ యెలా చేస్తున్నాడు--ఇలాంటివన్నీ పరీక్షించరు! అలా జరిగి వుంటే, ఓ "అయాజ్" బలయి వుండేవాడుకాదు పాపం!

అన్నట్టు మన గవర్నరు గారు, స హ చట్టం మంచిదే గానీ, అది దుర్వినియోగం అయిపోతోంది....దానిపేరు చెప్పి అధికారులని బెదిరించేస్తున్నారు....అని వాపోయారట! తోలుమందం అధికారులని అలా "బ్లాక్ మెయిల్" చేసినా తప్పులేదంటాను నేను. మరి ఆయనకి అంత బాధ యెందుకు వచ్చేసిందో!

   

Tuesday, September 20, 2011

కబుర్లు - 73

ఆవీ, ఇవీ, అన్నీ

(పేర్ల మార్పుల గురించి)-- ఇంకా, వుత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం "వుత్తరాంచల్" ని 2007 లో "వుత్తరాఖండ్" గా మార్చారట. ఆంచల్ అన్నా, ఖండ్ అన్నా భాగమేకదా? మరి ఇదెందుకో!

పాండిచ్చేరి పేరుని సుమారు 130 యేళ్లు పాలించిన ఫ్రెంచి వాళ్లు పెట్టారుట. దాన్ని తరువాత పుదుచ్చేరి (కొత్త గ్రామం) అని మార్చారట. ఆ గ్రామం అసలు పేరు అదేననీ, దాన్ని పలకడం ఫ్రెంచివాళ్లు పాండిచ్చేరి అనేవారనీ చెప్పలేదెందుకో! 

"ఆస్సాం" ని అసోం గానూ, "ఓరిస్సా"ని ఒడిశా గానూ మార్చారు. గుజరాత్ లోని "వడోదర" పట్టణాన్ని, ఆంగ్లేయులు నోరు తిరగక, బరోడా అని పిలిచారట. దాన్ని తిరిగి 1974లో వడోదర గా మర్చారట. "వటోదర" అంటే మర్రిచెప్పు పొట్టలొంచి పుట్టిన పట్టణమట! 

కేరళలోని "త్రివేండ్రం" ని అనంత పద్మనాభుని పేరిట, తిరువనంతపురంగా మార్చారట. (అంతకు ముందు దాన్ని "తిరువాన్‌కూరు" అనీ, ఇంగ్లీషువాళ్లు "ట్రేవన్‌కూరు" అనీ; ఇప్పటికీ ఆ రాజులని, వాళ్ల సంస్థానాన్నీ "తిరువాన్‌కూరు" సంస్థానం అనీ యెందుకు వ్యవహరిస్తున్నారో, ఆపేర్లు "గాలికి" యెందుకు కొట్టుకుపోయాయో; కొట్టుకుపోకుండా యెందుకు వున్నాయో--యెవరైనా చెప్పగలరా? జయలలిత తన పేరుని జయలలితా అనే వ్రాయమంటే జీ హుజూర్ అన్న మీడియా, పురందరేశ్వరిని--పురంధేశ్వరి; పురంధరేశ్వరి; పురంధ్రేశ్వరి అనీ ఇలా ఇష్టం వచ్చినట్టు వ్రాయడం యెందుకో--అందుకే!)  

ఇంకా అక్కడి "కొచ్చిన్" ని కొచ్చి గానూ; "కళ్ళికోట" కాలికట్ గా మార్చబడ్డ పట్టణాని కోజికోడ్ అనీ; "అలెప్పీ" ని అళప్పుజ గానూ మార్చారట. తమిళనాడులోని "కంజీవరం" ని కాంచీపురంగానూ, "కేప్ కోమరిన్" ని కన్యాకుమారిగానూ మార్చారట. 

ఇంక మన రాష్ట్రంలో 1970లో ఒంగోలు జిల్లా యేర్పడిందిట. దాన్ని 1972లో ప్రకాశం జిల్లాగా మార్చారట. 

1978లో హైదరాబాదు "రాష్ట్రం" హైదరాబాదు రూరల్; హైదరాబాదు అర్బన్ అనే రెండు జిల్లాలుగా విడిపోతే, రూరల్ కి కొన్ని ఇతర ప్రాంతాలు కలిపి, అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మామగారైన "కే వీ రంగారెడ్డి" జిల్లాగా మార్చారట. అది ఇప్పుడు "రంగారెడ్డి" జిల్లాగా వ్యవహరించబడుతూంది. (ఆయన ప్రఖ్యాత "పిడతల రంగారెడ్డి" కాదు). 

ఇటీవల నెల్లూరు జిల్లాని "పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా" అని మార్చారట. ఇంకానయం, "మనుమసిధ్ధిపాలించిన విక్రమసిమ్హపురం అనే నెల్లూరుని మార్చిన పొట్టి శ్రీరాములు జిల్లా" అనలేదు! 

ఇంకా మొన్నమొన్న, కడపజిల్లా పేరుని "వై ఎస్ ఆర్ కడప జిల్లా" అని మార్చారట! (డిటో....దేవునిగడప అనబడిన కడప అనబడిన వై ఎస్.....అనలేదు!) 

అసలు విషయమేమిటంటే, రాష్ట్రాలు యెన్ని పేర్లు మార్చినా, కొన్ని అప్పటప్పటి "ఆక్ట్"లకి లోబడి, పేర్లు మార్చడం అసాధ్యమట! అందుకే, "బోంబే హైకోర్టు"; "బోంబే స్టాక్ ఎక్స్చేంజి"; "మెడ్రాసు హైకోర్టు"....ఇలా కొనసా....గిస్తున్నారట! 

ఇవన్నీ బాగానే వున్నాయిగానీ, "అల్లాహ్"ఆబాద్; "ఔరంగ్"ఆబాద్; "హైదర్"ఆబాద్; "సికిందర్"ఆబాద్; "నిజాం"ఆబాద్; "ఆదిల్"ఆబాద్;  "తుగ్లక్"ఆబాద్ వగైరాలనీ; "వరంగల్"; "కరీం"నగర్ ఇలాంటి వాటినీ యెందుకు మార్చరు?! (మారిస్తే, కాంగీవారి ఓ జాతికి చెందిన సోదరులు ఆగ్రహిస్తారనీ, వోట్లు వెయ్యరనీ భయమా?! యేమో! మీరే చెప్పాలి.

మిగతా......మరోసారి!

Saturday, September 17, 2011

కబుర్లు - 72

అవీ, ఇవీ, అన్నీ

ఇంక పేర్లమార్పు గురించి మొన్న (11-09-2011) ఈనాడు ఆదివారంలో ఓ వ్యాసం వచ్చింది. 

పోర్చుగీసువాళ్లు వాళ్ల భాషలో, "బోం బహియా" (మంచి తీరం) అని పిలిస్తే, అది "బోంబే" గా మారిందనీ, స్థానికులు పూజించే "ముంబాదేవి" పేరుమీద దాన్ని 1996లో "ముంబాయిగా" మార్చారు అనీ వ్రాశారు. (మొదటిదానికి ఆథారాలేమిటో నాకు తెలీదు).

మద్రాసు అసలుపేరు "మదరాసు" అనీ, ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు అక్కడికి వచ్చాక, సమీపంలో స్థానికులు "చెన్నపట్టణం" యేర్పాటు చేసుకున్నారు అనీ, దాన్నే తమిళులు "చెన్నై" అనేవారనీ, తరవాత, ఆ రెంటినీ కలిపి, మద్రాసు అనే వ్యవహరించేవారు అనీ, తరవాత తమిళతంబిలు దాన్ని "చెన్నై" గా మార్చారు అనీ వ్రాశారు. 

"కాళీకా తా" అంటే కాళీమాత అని అర్థంట. ఆ పేరుమీదే కోల్కతా అని పిలిచేవారట. బ్రిటిష్ వాళ్లు దాని క్యాల్కట్టా అని పలికితే అదే స్థిరపడింది. 2001 లో దాన్ని "కోల్కత్తా" అని మార్చారు మన బంగబంధులు. (వీళ్లకి అనవసరంగా "ఓకారాలు పెట్టడం" ఓ ఆనవాయితీ). దీనికి సంబంధించి ఓ తెలుగు జోకు:

కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ గా వున్న రోజుల్లో, ఓ బంగాయన ఇన్స్ పెక్షన్ కో దేనికో వచ్చి, రెడ్డిగారు ఆయన గదిలో లేకపోవడంతో, "వేరీజ్ రోమలింగారెడ్డి?" అని చిందులు తొక్కుతూంటే, అప్పుడే అక్కడికి వచ్చిన రెడ్డిగారు, "రోమలింగారెడ్డి, యోనివర్సిటీని వదిలి వెళ్లడులెండి!" అని సముదాయించాడట!

అలాగే, మన మంగళంపల్లివారు, దశాబ్దాలుగా మెడ్రాసులో వుంటూ, బాగా సాంబారు తాగడంవల్లేమో, నోరు బాగా సాగదీసుకొని, "పెలుకే బెంగారమాయెరా.....అందాల రేమ...." అని పాడతారు. పాపం అది ఆయన పధ్ధతి!

(ఇదంతా రోమాయణంలో పెడకలవేటలెండి!)

ఇక, బెండకళూరు--అంటే వుడికించిన బీన్స్ (దొరికే ప్రాంతం) కాబట్టి 14వ శతాబ్దంలో ఆ పేరు వచ్చిందిట. అప్పట్లో, హొయసల రాజు "బళ్లాలుడు" ఈ ప్రాంతంలో వేటకు వచ్చి, ఆకలితో అలమటిస్తుంటే, ఒకామె, ఆ బీన్స్ పెట్టిందట. అందుకాయన ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టాడట. (దీనికాథారాలు యేమిటో, తరువాత అది బెంకళూరుగాకాక, బెంగుళూరుగా యెందుకు మారిందో నాకు తెలీదు). దాన్నే ఇప్పుడు బెంగళూరు అని మార్చారు కన్నడ కస్తూరివారు.

నాకయితే, అటు టిప్పు సుల్తాన్ కీ, ఇటు బహమనీ సుల్తానులకీ, ఇటు బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీసు వాళ్లకీ అనేక "బెంగలు" కలిగించినందుకే దాన్ని "బెంగల వూరు" అన్నారనీ, అదే బెంగళూరుగా మారిందనీ ఓ నమ్మకం.

ఇంకా ఆ బళ్లాలుడి అరి అంటే శత్రువు స్థాపించిందే నేటి వార్తల్లో వున్న "బళ్లారి" అనీ, అక్కడ వున్న కోట నిన్నో, మొన్నో కట్టినంత క్రొత్తగా వుంటుంది అనీ నా వుద్దేశ్యం.

మిగతా........మరోసారి! 

Friday, September 16, 2011

కబుర్లు - 71

అవీ, ఇవీ, అన్నీ

నా కబుర్లు - 70 మీద ఓ అన్నోన్ వ్యాఖ్యానించారు--".....రద్దు అనగానే......'సూట్ కేసులు '....." అంటూ. 

నిజానికి ఇప్పుడంత సీన్ లేదండి! రెండేళ్లకి పైగా వ్రాయబడుతున్న టపాల లింకులని కొంతమంది సహృదయులు రైల్వే అధికారులకి పంపించీ, పేపర్లలో వాళ్లని కడిగేసేలా వ్యావాసాలు వచ్చీ, విజిలెన్స్ దాడులూ అవీ జరిగీ, ఇప్పటికి కొంత మంచి జరుగుతోంది. అందుకని, మనం నిర్భయంగా వుండొచ్చు.

ఇంక Indian Minerva, కబుర్లు బాగున్నాయి అంటూ, "విశేషాధికారాలు" గురించి, మిగతా విషయాలగురించీ వ్రాశారు.

మనరాజ్యాంగం, న్యాయసూత్రాలూ ప్రకారం, ఓ ముద్దాయికి "మరణ శిక్షని" ఖాయం అని ఓ న్యాయస్థానం తీర్పు ఇచ్చాక (అది దేశ అత్యున్నత న్యాయస్థానమే అవనక్కరలేదు.), ఆ ఖైదీ రాష్ట్రపతికి క్షమాభిక్షకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రపతి మళ్లీ ఆ దరఖాస్తుని కేంద్ర మంత్రివర్గానికి పంపించి, మీ అభిప్రాయం చెప్పండి అంటారు. 

అక్కడ జరుగుతోంది లండాచోరీ.

మనదేశ ప్రథమ ప్రథాని నెహ్రూ నుంచి, దేవెగౌడ గాడిదాకా, అక్కణ్నించీ మన్మోహన్ దాకా, అందరూ రోజుకి 18 గంటలూ, ఇంకా అత్యవసరమైతే 20 గంటలూ శ్రమపడినా, అంతకు ముందు నానవెయ్యబడిన "రోకళ్లు" యెంతవరకూ నానాయో చూసుకోవడం, ప్రతిరోజూ వచ్చే ఓ పదో యెన్నో రోకళ్లని క్రొత్తగా నానెయ్యడం లాంటి పనులకే ఆ సమయం సరిపోవడంలేదు!

ఇంక కేబినెట్ సమావేశానికి ఆ క్షమాభిక్ష దరఖాస్తు చేరాలంటే, ప్రథానమంత్రి కార్యాలయం నుంచి అది ప్రయాణిస్తూ, హోం శాఖద్వారా, న్యాయ శాఖ ద్వారా, అవసరమైతే విదీశీ వ్యవహారాల శాఖ ద్వారా....ఇలా ప్రయాణించి, చేరాలి.

తీరా అక్కడికి చేరేటప్పటికి, వాళ్లు మళ్లీ దీన్ని ఓ క్రొత్త రోకలిగా నానేస్తారు. అది చర్చకి వచ్చినప్పుడు, ఖైదీ యే అఫ్జల్ గురునో అయితే, మంత్రులకి తమ ఓజాతి సోదరులూ, రాజీవ్ హంతకులు అంటే మరోజాతి సోదరులూ, యే గ్రాహం స్టెయిన్ హంతకులో అంటే, ఇంకోజాతి సోదరులూ, యే తందూరి హత్యాపాతకులో అంటే, వేరేరకం సోదరులూ......ఇలా గుర్తుకు వచ్చి, "రోకలి నాననివ్వండి.....అప్పుడు చూద్దాం!" అనేస్తారు.

ఇలాంటి పెద్దకేసులు కాకుండా, యే ఫేక్షన్ హత్యల కేసో, పరువు హత్యల కేసో అయితే, రోకలి బాగా నానిన తరవాత, "మరణశిక్ష ఖాయం" అని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు.

ఆ దస్త్రం, మళ్లీ వైకుంఠపాళీలో నిచ్చెనలూ, పాములూ దాటుకుంటూ రాష్ట్రపతికి చేరినా, రాష్ట్రపతి కూడా--పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, అనేక ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకొంటూ, విదేశ అతిథులని ఆహ్వానించడం, బహుమతి ప్రదానోత్సవాలూ, కాన్‌ఫరెన్సుల్లో 'పిలుపులు ఇవ్వడం ' లాంటి కార్యక్రమాలతో, రోజుకి 20 గంటలు పనిచేస్తూ, ఈ దస్త్రం దగ్గరికి రావాలా?

ఈ మధ్యలో, యెప్పుడో ఆదస్త్రం  మీద "ఫలానా తేదీలోపల, జైలువారికి అనుకూలమైన సమయంలో మరణశిక్ష అమలుపరచండి" అనే క్రింది అధికారి నోట్ మీద, రాష్ట్రపతి సంతకం అనే అఫీషియల్ రబ్బర్ స్టాంప్ పడుతుంది. రొటీన్ గా ఆ విషయం పత్రికలవాళ్లకి తెలియజెయ్యబడుతుంది.

అప్పుడు మళ్లీ, "ఆ శిక్ష మీద స్టే మంజూరు చెయ్యాలి" అంటూ పిటిషన్లు దాఖలు అవుతాయి--సుప్రీం కోర్టులో. డిఫెన్సు లాయరు యే రాం జేఠ్మలానీయో అయితే, వెంటనే స్టే లభిస్తుంది. ఆ కేసు, మిగిలిన కొన్నివేలకేసులతోపాటు, కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ పోతూ వుంటుంది!

యేతావాతా తేలేదేమిటంటే, కోటికి పడగెత్తిన ధనవంతుడైనా, అమానుషుడైన హంతకుడైనా, సామాన్యమానవుడైనా, వాడికి భూమ్మీద నూకలు పూర్తిగా చెల్లేంతవరకూ, శివుడాజ్ఞ అవదనీ, అప్పటివరకూ వాళ్లని చీమైనా కుట్టలేదనీ, మన రాజ్యాంగమూ, మనమూ అందరూ నిమిత్తమాత్రులమేననీ!

అదండీ సంగతి!  

మిగతా విషయాలమీద మరోసారి.

Thursday, September 15, 2011

కబుర్లు - 70

అవీ, ఇవీ, అన్నీ

రాజీవ్ హంతకులకి మరణశిక్షని నిలుపుదల చేస్తూ, మద్రాస్ హైకోర్టు స్టే విధించిందట మొన్నెప్పుడో. సుబ్రహ్మణ్యం స్వామి ఆ కేసుని తమిళనాడులో కాకుండా, వేరే రాష్ ట్రంలో విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టుకి వెళతానంటున్నాడు. 

అసలు వీళ్లందరూ మరిచిపోతున్నది--వాళ్లు ఒక్క రాజీవ్ హంతకులే కాదు--గొల్లపూడివారన్నట్టు, మారణహోమం సాగించి, మరో 17 మందినో యెంతమందినో (వాళ్ల పేర్లు కూడా దొరకడం లేదట ఇప్పుడు--ఇదీ ఆయనన్నమాటే!) పొట్టన పెట్టుకొని, కొన్ని పదులమందిని క్షతగాత్రులనీ, వికలాంగులనీ చేసినవాళ్లు అని! (వాళ్ల పేర్లగురించీ, వాళ్ల ప్రస్తుత స్థితిగురించీ తెలుసుకోడానికి యెవరూ ప్రయత్నించినట్టులేదు.)

మా చిన్నప్పుడు హైస్కూల్లో "బాయ్ స్కౌట్స్" "గర్ల్ గైడ్" శిక్షణలుండేవి. (సర్ బేడెన్ పౌల్ అనే ఆయన స్థాపించాడు స్కౌట్స్ ఆర్గనైజేషన్ ని.) ఆ శిక్షణలో భాగంగా, విరామ సమయల్లో "యెల్" అని కొత్త కొత్త రైమ్‌స్ లాంటివి నేర్పించేవారు. (యెల్ అంటే, "కేక"/"పిలుపు" అని అర్థం. అసలు మన తెలుగులో ఓ విచిత్రమైన పదం ఈ కేక. "సాయంత్రం సినిమాకి వెళతాను" అని ఒకడంటే, "నువ్వేళ్లేటప్పుడు కేక పెట్టరా, నేనూ వస్తాను" అంటాడింకోడు!)

ఇంతకీ ఒక యెల్ యెందుకో జ్ఙ్ఞాపకం వచ్చింది. అది:

వర్షమురానీ,
తుఫానురానీ,
ఆటలు ఆడగ,
పాటలు పాడగ,
తయారు మేన్!
హ హ్హ హ్హ హ్హ!

ఇప్పుడదెందుగ్గుర్తొచ్చిందంటారా! వస్తున్నా....అక్కడికే!

వర్షమురానీ,
తుఫానురానీ,
యెండలు మండనీ,
చలిపులి కొరకనీ,
హెలికాప్టరెక్కనునేను,
హ హ్హ హ్హ హ్హ!

అనేశాడు మన కి కు రె. ఇవాళ (15-09-2011) ప గో జి పర్యటనకి బయలుదేరి, ఓ ముష్టి జెట్ ఎయిర్ వేస్ విమానంలో రాజమండ్రి బయలుదేరితే, మధురపూడి విమానాశ్రయంలో మబ్బులు దట్టంగా వుండి, విమానం చాలాసేపు గాలిలో చక్కర్లు కొడుతూ, చివరికి హైదరాబాదు తిరిగివెళ్లిపోమని అదేశాలు అందిన మరుక్షణమే గ్రవుండ్ క్లియరెన్స్ దొరికి, మీడియావాళ్లు చాలాసేపు "వుత్కంఠగా" యెదురు చూసింతరవాత, సురక్షితంగా దిగిందట ఆ విమానం!

రేపణ్నించీ ఆయన "విమానాలు కూడా--జెట్ ఎయిర్లూ, స్పైస్ జెట్లూ, కింగ్ ఫిషర్లూ--యెక్కను" అని ప్రకటిస్తాడేమో!

అది కాదు విశేషం! 

రెండురోజులనించీ, సీ ఆర్ ఆర్ కాలేజీ గ్రవుండులో హెలీపాడ్ వద్ద "ట్రయల్ రన్ లు" చేస్తున్నారట. (రాజమండ్రి నుంచి యేలూరు హెలికాప్టర్లో రావాలి ఆయన!)

అదీ పెద్ద విశేషం కాదు.

"మంత్రి పితాని", సీ ఎంగారూ, పెద్ద నాయకులూ తరచూ యేలూరు వస్తూంటారు కాబట్టి, "శాశ్వత ప్రాతిపదికన" జిల్లాలోని ముఖ్యమైన పట్టణాల్లో హెలీపాడ్లు నిర్మించాలనీ, వాటికి అనువైన స్థలసేకరణ వెంటనే జరిగేలా చూడాలి అనీ, జిల్లా కలెక్టరు కి సూచించారట!!!!!!

బాగుందా??

అన్నట్టు, ఇవాళే మరోచోట ఇంకో ముఖ్యకార్యక్రమం జరగబోతోంది. "తమిళనాడు" లో (అసలు జనాలకి అలవాటైన పేర్లు మార్చేసి, కొత్తపేర్లు పెట్టవలసిన అవసరం యేమైనా వుందా? అనేది వేరే విషయం. ఓ నవాబుగారు ఓ పట్టణానికి "మహబూబ్ నగర్" అని పేరు పెట్టినా, జనాలు అప్పటికీ ఇప్పటికీ దాన్ని "పాలమూరు" గానే వ్యవహరిస్తున్నారు! మనుమసిధ్ధి పాలించిన "విక్రమసిం హపురం" అన్నా, ఆంగ్లేయులు పేరెట్టిన "కో కెనడా" అన్నా యెవరికైనా అర్థం అవుతుందా???) జయలలితా....తన యెన్నికల వాగ్దానాల్లో భాగంగా, అనేక స్థాయుల్లోని పాఠశాలల్లోని విద్యార్థులకి ఓ 68 లక్షల మందికి(!)--నిజంగా నిజం--ల్యాప్ టాప్ లు "వుచితంగా" అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారట! ఈ యేడాది 9 లక్షల 12 వేల "ఎల్ టీ" లు (అంటే ల్యాప్ టాప్ లు--లిబరేషన్ టైగర్స్ కాదండోయ్!) పంపిణీ చేస్తారట. మిగతావి వచ్చే "నాలుగేళ్లలో" అందజేస్తారట. 

మొత్తం ప్రాజెక్ట్ కి రూ.10,200 కోట్లు అవసరం అయితే, తొలివిడతగా రూ.912 కోట్లు కేటాయించారట. ఈ ఎల్ టీ లు ఈసీఐఎల్ అఫ్ తమిళనాడు కి అప్పగించారట.

ఓసారి నేను ఓ టపాలో--అంకోపరి ఒక్కొక్కటీ 35 వేలో యెంతో వుంటుందేమో అంటే, లక్షా ముఫై ఐదువేలు వుంటుంది అన్నాడో నిపుణుడు. మరి ఇప్పుడు 10/15 వేలకే యెలా అందిస్తున్నారో! (అండర్ ఇన్వాయిసింగ్ కాదుకదా?)

జూలై నెలలో భారీ యంత్రపరికరాల విభాగంలో "వ్యతిరేక" వృధ్ధి రేటు నమోదవడంతో, మొత్తం పారిశ్రామిక వృధ్ధి రేటు 3.3 శాతానికే పరిమితమయ్యిందట. కానీ నిపుణులు ఈ గణాంకాలు "నమ్మబుల్" గా లేవు అంటున్నారు!

మన ఆర్టీసీ వారికి బుర్రలో ఓ బల్బు మెరిసిందట ఇన్నాళ్లకి. బస్సులకి రిజర్వేషన్ చేసేటప్పుడు, ఓ బస్సులోని సీట్లు మొత్తం నిండిపోతే, వెయిటింగ్ లిస్ట్ లో కూడా రిజర్వ్ చేస్తారట. ఇంకోబస్సుకి సగం సీట్లు నిండినా, ప్రత్యేక బస్సు వేసి అందులో పంపిస్తారట. యేబస్సుకి రిజర్వ్ చేసుకున్నారో సరిగ్గా అలాంటి బస్సునే పంపిస్తారట. మరి "అలాంటి" బస్సులు సరిపడా తెస్తారా?

అలాగే, రైల్వే వాళ్లకి కూడా ఓ మెరుపు మెరిసి, తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ కి, వుదయం 8 నుంచి 9 వరకూ, యేజంట్ లాగిన్ రద్దుచేశారట! ప్రతీ రైల్వే జోన్ లో 200 నుంచి 500 మంది యేజంట్లు వున్నారట! ఇప్పుడు తత్కాల్ టిక్కెట్లు బాగానే దొరుకుతున్నాయట సామాన్యులకి. సౌత్ సెంట్రల్ రైల్వే లోనైతే యేజంట్ల వ్యవస్థ పూర్తిగా రద్దు చెయ్యాలని నిర్ణయించారట!

హమ్మయ్య!


   

Tuesday, September 13, 2011

కబుర్లు - 69

అవీ, ఇవీ, అన్నీ

ముకేష్ అంబానీ ముంబాయిలో "యాంటిల్లా" పేరుతో నిర్మించిన 27 అంతస్తుల నివాస భవనం లోని పనివాళ్ల సంఖ్య 600 ట. వాళ్ల జీతాలు ఒక్కొక్కరికీ 6000 నించి 6500 మధ్య వుంటాయట. 

(ఇంతకు ముందే 17 అంతస్తులో యెన్నో వున్న నివాస భవనం వుంది కదా, మళ్లీ ఇదెందుకు అని అడిగితే, ఇది మా సంస్థల వున్నతోద్యోగులకి అని జవాబిచ్చాడోసారి--ఈయనేనో, ఇంకో అంబానీనో.)

పుడితే--గాలి గనులతో సంబంధం వున్న ప్రభుత్వ శాఖల్లోనైనా, అంబానీల ఇళ్లలో పనివాళ్లగానైనా పుట్టాలని చాలామంది అనుకుంటున్నారట!

అరుంధతీరాయ్ అని ఒకావిడవుంది. (అధోగతీరాయ్ అని పేరుపెట్టారో బ్లాగరు ఈమెకి!). యెప్పుడో ఓ పుస్తకం వ్రాసి, అదృష్టం బాగుండో, పైరవీలు పనిచేసో దానికి ఓ ఎవార్డు సాధించింది. తరవాత చెయ్యడానికి పనేమీలేక, పేపర్లకి యెక్కుతూ, వుద్యమకారిణి అని వ్యవహరించబడుతోంది.

అన్నా హజారే వుద్యమం "ప్రపంచ బ్యాంకు అజెండా"కి నకలు అనీ, అలాంటి వుద్యమాలని "నిర్మించడానికి" ప్రపంచ బ్యాంకూ, ఫోర్డ్ ఫౌండేషన్ "నిధులు" అందజేస్తాయి అనీ, హజారేను "ఆరాధ్యుడు" గా ప్రచారం చేశారనీ, అది ఆందోళనకరమైన విషయం అనీ, ఆయన బృందం రూపొందించిన జనలోక్ పాల్ బిల్లు పైనా తనకి అనేక సందేహాలున్నాయి అనీ--రెచ్చిపోయిందట ఓ టీవీ ఛానెల్లో!

చూశారా--యెవరికీ తెలియని విషయాలని ఈవిడ యెలా కనిపెట్టి ప్రచారం చేసేస్తోందో? జనాలు వెర్రి పుచ్చకాయలు అనుకుంటారో యేమిటో ఇలాంటి కుహనా మేధావులు!

"కాస్త నదురుగా వున్న ఓ బ్లాగులో ఓ అడ్డమైన కామెంటు వ్రాసేస్తే, నాకు పాపులారిటీ వస్తుందని అలా చేశాను....నన్ను క్షమించండి" అన్నాడిదివరకో కుర్రాడు. ఆ కుర్రాడికీ, ఈవిడకీ తేడా యేమీ కనిపించడంలేదు నాకు.

మా వూళ్లో, గణపతి వుత్సవాల సందర్భంగా "రాష్ ట్ర స్థాయి సినీ డ్యాన్స్; పాటల పోటీలు" పెట్టారు! బహుమతులు వరుసగా, రూ.1500/-, షీల్డు; రూ.1000/-, షీల్డు; రూ.600/-, షీల్డు; ఇంకా "కన్సొలేషన్" ఇచ్చారట. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికీ రూ.50/- మాత్రమేనట. 

ఇంక యెలా నిర్వహించారో మీరే వూహించుకోండి! 

భక్తి వ్యాపారులూ--జిందాబాద్!

"చిరు" కాంగీలో విలీనం అయినా, "తనదైన ముద్ర" కోసం "వ్యూహాత్మకంగా" అడుగులు కదుపుతున్నాట్ట! ప్రత్యేకంగా ఓ క్యాంపు కార్యాలయం యేర్పాటు (అంటే--ఇంతకు ముందు ప్రరాపా ప్రథాన కార్యాలయం పేరు మార్పు!), త్వరలో ఒక టీవీ ఛానెల్ (దీనికి "ఎస్ న్యూస్" అని పేరు పెడతారట. "ఎస్" కి సంబంధించిన సెంటిమెంట్ యేమిటో మరి!) యేర్పాటు, వివిధ కేంద్రాల్లో "ప్రాంతీయ విలీన మహాసభలు" నిర్వహించడం (పనిలో పనిగా బలప్రదర్శనకి వాటిని వేదికలుగా వుపయోగించుకోవడం), ఇంకా ఓ న్యూస్ పేపరు పెట్టడం--ఇలా పడుతున్నాయట ఆ అడుగులు.

యెన్నికల ప్రచారంలోనూ, ఆ తరవాతా, పాటీయా....పిచ్చా....?రోజుకి ఓ అరలక్షమందికి తీర్థ ప్రసాదాలు (అనేక వెరయిటీల్లో) అందించి, కాటాకి వచ్చేసి, కాంగీలో చేరినందుకు వాళ్లు ఇచ్చిన (తొడుక్కునే) కోట్లు--ఈ పథకాలన్నింటికీ సరిపోతాయా? యేమో!

"స్వంత పనుల" నిమిత్తం మలేషియా ప్రయాణం కూడా పెట్టుకొన్నాట్ట.

ఇవన్నీ "అధిష్టానం" సీసీ కెమేరాల్లో రికార్డు అవుతున్నాయనీ, తోక కాదు--దానిలోని వెండ్రుకలు కదిలినా, తోక మొత్తం తెగిపోతుందనీ గుర్తుంచుకొంటాడా?

చూద్దాం!  

Sunday, September 11, 2011

కబుర్లు - 68

అవీ, ఇవీ, అన్నీ

"వేమన్న", పాపం తన జీవితమంతా "పరుసవేది" అన్వేషణలోనే గడిపి, తీరా అది పట్టుబడ్డాక విరాగి అయిపోయాడట!

టైము బాగుంటే, మట్టి పట్టినా బంగారం అయిపోతుందంటారు. అలాగే, యేల్నాటి శని సమయంలో బంగారం పట్టుకున్నా, మట్టి అయిపోతుందనీ అంటారు!

"ఇనుము" రాళ్లనీ, ఇనప "మట్టినీ" బంగారంగా మార్చే పరుసవేది విద్యని వంటబట్టించుకున్న గాలి జనార్దన రెడ్డి మాత్రం, "భక్తి" దాకానే వెళ్లాడు. భక్తికి పరాకాష్ట అయిన "వైరాగ్యం" చేరుకోకుండానే, కృష్ణ జన్మస్థానంలో వైరాగ్య బోధ జరిపించాలని ప్లాను వేశారు సీబీఐ వాళ్లు. (యెవరు ఆ యేర్పాటు చెయ్యమన్నారో ఇంకా తేలాల్సి వుంది).

పేపర్లూ, టీవీలూ హోరెత్తి పోతున్నాయి--"గని గజనీ స్వర్ణ విలాసం" వగైరాలతో!  

బాగుందండీ--ఆయనకి విద్య తెలిసింది, వుపయోగించుకున్నాడు. భక్తి పెరిగింది--ఇంట్లో పూజా సామాగ్రీ, దేవుళ్ల విగ్రహాలూ అన్నీ బంగారంతో చేయించుకున్నాడు. తిరుమలేశునికి ఓ కిరీటం కూడా చేయించాడు.

ఇప్పుడు, ఆ కిరీటం పెడితే, స్వామికి "శిరోభారం" వస్తుందేమో అని అనుమానం రావడంతో, దాన్ని ప్రక్కన పెట్టారట. దాన్నేం చెయ్యాలో ఇంకా నిర్ణయించలేదట! నిత్యాభిషేకాలతో ఆయనకి "పడిశం" పట్టడం లేదుకదా? మరి శిరోభారం యెందుకు వస్తుందో వాళ్లే చెప్పాలి!

(ఆమధ్య పంచారామాల్లోని శివలింగాలు అభిషేకాలతో "అరిగి" పోయాయని టీవీలు కోళ్లయి కూశాయి. ఫలితం హళ్లికి హళ్లి, సున్నకి సున్న! తిరుమలేశుడు "అరిగి"పోతున్నాడని నేనంటే, మూలవిరాట్టుకి అభిషేకాలు చెయ్యం అన్నారు. అమలవుతోందో లేదో మరి! ముసలాన్ని యెంత అరగదీసినా, ఓ బాణం పుల్లంతైనా మిగలదా--ఫరవాలేదులెండి--అనేవాళ్లూ వున్నారు.)

స్వామికి ఆభరణాలు చేయించదలుచుకున్నవాళ్లు, ముందు తితిదేవారిని సంప్రదించి, వారి అనుమతితో "కొలతలు తీసుకొని", ఆభరణాలు చేయించి మరీ సమర్పిస్తారు. ఈ తతంగం నడిచినప్పుడూ, తిరుమాడ వీధుల్లో కిరీటాన్ని, దేవుడి కన్నా ముందో ప్రత్యేక వాహనమ్మీద  వూరేగించినప్పుడు, ఆయన బిల్లులు ఇవ్వలేదు అని యెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన 45 కోట్లన్నాడు, మదింపుచేసింది 22 కోట్లు మాత్రమే అంటున్నారు!

కొంచెం తేడా అనిపిస్తే, ప్రతీవాడూ "నన్ను ముట్టుకోకు నామాల కాకీ" అనేవాడే!

మరణశిక్షల్ని రద్దు చేయాలంటున్నారు "సమయానుకూల" వాదులు. నిజానికి, మరణ శిక్ష పడి, అది యెప్పుడు అమలు చేస్తారో తెలియకపోవడం, దినదిన గండంగా బ్రతకడం అనేది, రౌరవాది నరకాలని మించిన శిక్ష! అలాంటిది, యేళ్లతరబడీ క్షమాభిక్ష విఙ్ఞప్తులని, యేవిషయం తేల్చకుండా, జాగు చేసిన, మన సర్వోత్తమ రాజ్యాంగాధినేతలకి యేమిటి శిక్ష? (బహుశా అంబేద్కర్ కి ఈ విషయంలో యెలాంటి కనీస అనుమానం కూడా రాలేదు. వచ్చివుంటే, ఆ శిక్షకి తగ్గ యేర్పాటు చేసి వుండేవాడు రాజ్యాంగంలోనే!)

"అమాయకుల్ని చంపడానికి యేమతమూ అంగీకరించదు. ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు ప్రేలుడు--ఆటవిక చర్య" అన్నాట్ట--యెవరోకాదు పార్లమెంటు మీద దాడిలో కొంతమందిని విచక్షణారహితంగా కాల్చేసి, వురిశిక్షపడి, "నన్ను వురితియ్యండ్రా మొర్రో! లేకపోతే, అద్వానీ ని ప్రథాని చెయ్యండ్రా! ఆయనైతే నన్ను క్షణాల్లో వురి తీయించేస్తాడు!" అని మొరపెట్టుకొన్న "అఫ్జల్ గురు"!

ఇప్పటికి వాడి మతబోధలు వాడి తలకెక్కాయనుకుందామా? లేక....!

"వురుమురిమి, మంగలం మీద పడిందట!"

పాపం రోశయ్య, తాను ముఖ్యమంత్రిగా వుండగా, "అన్ని విషయాలూ అధిష్టానం (అమ్మ) చూసుకొంటుంది. నేను నిమిత్తమాత్రుణ్ని" అంటూ, ఖర్మకాలి, ఓ నిర్ణయం తీసుకొన్నాడట తనంత తానే!

ఇప్పుడదే మెడకు చుట్టుకొనేలా వుంది. ఓ లాయరెవరో "యేసీబీ వారు రోశయ్యకి క్లీన్ చిట్ యెలా ఇచ్చారు?" అంటూ యేసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు కేసు వేస్తే, క్లీన్ చిట్ కి సంబంధించిన ఆధార పత్రాలని సమర్పించమన్నారట. యెటుపోయి యెటు వస్తుందో! ఈ వయసులో గవర్నర్ గారిని అంత క్షోభ పెట్టడం అవసరమా జగన్నాథులూ? (అవునులే, నాన్న ప్రసాదాన్ని గ్రద్దలా తన్నుకుపోయాడుగా మరి!)

ఆధారమంటే మళ్లీ గుర్తొచ్చింది--బెంగుళూరులో "ఆథార్" గురించి ఇదివరకో టపా వ్రాశానుగా....ఈమధ్య "ఫణిబాబుగారు"--తమ ఆథార్ వివరాల సమర్పణ త్వరలోనే ముగిసిందని ఓ టపా వ్రాస్తే, ఆహా! అని సంతోషించాను. (బాబుగారూ! మీ అనుమతిలేకుండా, మీ పేరు వాడుకోవడం కోసమే ఇక్కడ మీ ప్రస్తావన తెచ్చానని భావించక, క్షమించండి!).

నిన్న (10-09-2011), విజయవాడ ప్రథాన తపాలా కార్యాలయంలో, ఈరోజు "ఆథార్ దరఖాస్తులని సాయంత్రం 5.30 కి" జారీ చేస్తామని "పక్షం" రోజులకి ముందే ప్రకటిస్తే, అప్పటికి ఓ 1500 మంది అక్కడికి చేరారట! వున్న వొకేవొక్క కవుంటరు తెరవగానే--తోపులాట, తొక్కిసలాట, ప్రథాన ద్వారం అద్దాలూ, పూలకుండీలూ ధ్వంసం, ముగ్గురికి అద్దమ్ముక్కల గాయాలు, ఓ వృధ్ధుడు సొమ్మసిలడం, వూపిరాడక అనేకమంది చిన్నారులూ, మహిళల ఆర్తనాదాలూ, ఇవన్నీ మూడు గంటలపాటు కొనసా....గడం, పోలీసులెవరూ లేకపోవడం, వెరశి--200 మందికి కూడా దరఖాస్తులు అందించలేకపోవడం........ఇదండీ జరిగినది!

ఆ ప్రకటన జారీ చేసినవాడెవడో, వాడికి--నేనిదివరకు "అజ్మల్ కసబ్"కి విధించమన్న శిక్ష --విధిస్తే, మీకేమయినా అభ్యంతరమా?!

ఆలోచించండి మరి!   

   

Thursday, September 1, 2011

కబుర్లు - 67అవీ, ఇవీ, అన్నీ


నిన్నో, మొన్నో, బోధి వృక్షం క్రింద నిద్రించినట్టున్నాడు మన కి కు రె. చాలా బాగా ఙ్ఞానోదయం అయ్యింది ఆయనకి.

"రైతుకి కనీసం 70-80 శాతం ఆదాయం వస్తేగానీ, గిట్టుబాటుకాదు--ఆదిశగా 'కేంద్ర, రాష్ట్ర ' ప్రభుత్వాలు ఆలోచించకపోవడం తప్పే!" అంటున్నారు.

మరి తానూ ఓ రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశకుడూ, ముక్కుమంత్రీ అని మరచిపోయారా?

మన"సు" కవి చెప్పినట్టు, 'యెదటి మనిషికీ చెప్పేటందుకే నీతులు వున్నాయి" అందామా?

కరప్షన్ పితామహుడు కరుణ, మంచి సమయంలో వుద్యమం మొదలెట్టించాడు--వురిశిక్ష రద్దు చెయ్యాలి అని. (రేప్పొద్దున్న రాజాకీ, కనిమొళికీ వురి వేస్తారేమో అని భయమేమో! అదే కాకుండా, సాక్షాత్తూ "రాజీవ్" హంతకులకి ఆ శిక్ష పడింది కదా.....ఇంతకన్నా కాంగీల మీద కక్ష తీర్చుకోడానికి ఇంకేం అవకాశం వస్తుంది?!)

పచ్చివెలక్కాయ పడింది కాంగీల గొంతులో!

వుద్యమం వుధృతం అవుతోంది. సరే.

మేమూ వున్నామంటూ, కమ్మీనిస్టులు తయారయ్యారు(ట). యెప్పటినించో ప్లాన్ చేసుకొన్న వాళ్ల మీటింగులని ఇప్పుడు నిర్వహిస్తున్నారట--వురి కి వ్యతిరేకంగా!

అన్నా దీక్ష తరవాత యేమిటి? లోక్ పాల్ తరవాత యేమిటి? అనేవాళ్లకి నేను చెప్పేది--వురిశిక్ష రద్దు చెయ్యండి. దాని స్థానంలో--నాలుగు రోడ్ల కూడళ్లలో, పదునైన కత్తితో, వాళ్ల గొంతుకలు కోసే (జబా అనో యేదో అంటారు.....కోళ్లని అలా నరకడాన్ని మన "ముస్లిం సోదరులు")......శిక్షని ప్రవేశపెట్టండి--అని!

యేమంటారు?

తాజా కలం: ఈనాడువారు తాము "ముస్లిం సోదరులు" అనే ప్రత్యేక "జాతి"ని "డీ రికగ్నైజ్" చేసినట్టున్నారు--ఇవాళ్టి (01-09-2011) పేపర్లో, ఫోటోల క్రింద "ముస్లింలు" అని మాత్రమే వ్రాశారు! కీపిటప్ ఈనాడూ!

Tuesday, August 30, 2011

కబుర్లు - 66అవీ, ఇవీ, అన్నీ

పాపం కి కు రె మొదటిసారిగా (ముక్కుమంత్రిగా) తనపేరుమీద "యువకిరణాలు" అనే పథకం ప్రవేశపెట్టాలని ముచ్చటపడితే, బొచ్చె దానికి ముందు "రాజీవ్" పేరు చేర్చేవరకూ వూరుకోలేదు.

ఇప్పుడేమో బొచ్చె పర్యటనలు మొదలెడితే, "మీ ప్రభుత్వానికీ, నీ పదవికీ ఆక్సిజన్ అందించిన మా చిరు ఫోటో పెట్టుకోకుండా వెళతావా? ఖబడ్దార్!" అంటున్నారు.

పాపం అధిష్టానానికి వొంట్లో బాగాలేదు, ఓ మూడు నెలలు మన వుద్యమానికి సెలవు ప్రకటిద్దాం--అన్నాట్టో పెద్దమనిషి. 

వుద్యమం చల్లబడుతున్నట్టు కనిపిస్తోంది, ఇంక రాస్తా/రోడ్డు రోకోలతో పని కాదు, "ఢిల్లీ వెళ్లే" రైళ్ల రోకోలూ, "విమానం" రోకోలూ చేద్దామంటున్నాడు--అప్పట్లో చందారెడ్డి చెంచా కొండా లక్ష్మణ్ బాపూజీ!

కొంతం (మం)దిలీపులు యెవరో సమాలోచన వాళ్లో యెవరో--రాజకీయుల మాటలని కొన్ని దశాబ్దాలనుంచీ కోట్ చేస్తూ, '600 మంది అమాయకులు ఆత్మాహుతి చేసుకున్నారు......అవి ఆపడానికి కృషి చేద్దాం....' అనడాన్ని కొనియ 'ఆడుతున్నారు '!

బీజేపీవాళ్లు--కాంగీవాళ్లు "యెవరైనా తమకి అనుకూలంగా వున్నన్నాళ్లూ నెత్తికెత్తుకొంటారు, వ్యతిరేకమైతే, కోర్టులనీ, సీబీఐ నీ వుసికొల్పుతారు" అంటే, ఇదో మేచ్ ఫిక్సింగ్ అంటున్నారు కొంతమంది!

జర్నలిస్టులకి, నాయకులని వెర్రిమొర్రి ప్రశ్నలేసి, "నోకామెంట్లు" రాబట్టడం తప్ప తెలియడం లేదు. "గురువా.....శిష్యా..."; "బాబాయ్.....అబ్బాయ్"; "మామా....అల్లుడూ..." లాంటి క్యామెడీ--అనేక పేర్లతో వ్రాసే వాళ్లు మార్క్ టులీ లాంటివాళ్లని ఆదర్శంగా తీసుకుంటే బాగుండును. 

   

Friday, August 19, 2011

(యమర్జెంటు) కబుర్లు - 65అవీ, ఇవీ, అన్నీ

ఈ మధ్య సణుగుడు మానలేదుగానీ, ప్రచురణ కుదరలేదు. ఇదిగో ఇప్పుడు మొదలు.

అర్జెంటుగా సణుక్కున్నవి--జనలోక్ పాల్, అన్నా హజారే అరెస్టు, దీక్ష, జగన్ మీద విచారణలూ, ఇలా చాలా వున్నాయి మరి.

పాపం అధిష్టానానికి కేన్సరో యేదో వచ్చి, విదేశంలో ఆపరేషన్ చేయించుకుని, త్వరగానే కోలుకుంటోందట. ప్రజల పూజలు ఫలించి, పాపం  క్షేమంగా తిరిగి వస్తుందని ఆశిద్దాం. 

ఆవిడ ఓ కమిటీని వేసిందట--తన బదులుగా. వాళ్లేమి సలహా ఇచ్చారోగానీ, పి చ్చిదంబరం రెచ్చిపోయాడు. జోక్ యేమిటంటే, అన్నా హజారేనీ, కేజ్రీవాల్ నీ అరెస్టు చేసి, రాజా ప్రక్కనా, కల్మాడీ ప్రక్కనా బంధించారట! జైలు అధికారిణిగా ఖైదీల కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన కిరణ్ బేడీని అదే జైల్లో పెట్టారట!

జనాగ్రహానికి వెరచి మళ్లీ విడుదల చేశారట. బాగానే వుంది కానీ, అసలు విషయం వదిలేసి, అన్నా 7 రోజులా, 14 రోజులా, 21 రోజులా--యెన్ని రోజులు దీక్ష చెయ్యచ్చు అనేదానిమీద ఆయనకి అనుమతి ఇవ్వడానికి చర్చలు!  రాం లీలా మైదానంలో ఆయన దీక్ష. 9 రోజుల వరకూ ఖచ్చితంగా యేమీ ఫర్వాలేదు అని ఆయన వైద్యుడి ప్రకటన.

అసలు ఈ ప్రభుత్వానికీ, పార్టీలకీ యేమైనా బుధ్ధి వుందంటారా? 

ఈ లోపల ప్రథానిని లోక్ పాల్ పరిథిలో వుంచాలని వొకడూ, అఖ్ఖర్లేదని వొకడూ, న్యాయపాలిక ని మినహాయించాలని వొకడూ, అఖ్ఖర్లేదని వొకడూ--ఇలా మేథావుల ప్రకటనలు! పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెడతానంటున్న వరుణ్ గాంధీ. యేబిల్లయినా నెగ్గినప్పుడు కదా.....ప్చ్! అంటున్నవాళ్లూ. అసలు ఇంత అవసరమా అంటున్నవాళ్లు! అవసరమైతే "పార్లమెంటు మెంబర్లనే" మార్చాలి అని కొందరి సూచనలు! గుడుగుడుగుంచం అంటూ అక్కడికే చేరాలి! అదే--యెన్నికలు! దానికోసం వుద్యమాన్ని కొనసాగించాలని నా కోరిక!

ఇదివరకు జస్టిస్ రామస్వామిని అభిశంసించడానికి ముఖం చాటేశారు కాంగీలు. ఇప్పుడు జస్టిస్ సేన్ ని అభిశంసించడానికి యేర్పాట్లు చేశారు. ఆయన మాత్రం ఓ చీఫ్ జస్టిస్ కుట్ర వల్లే ఇదంతా జరుగుతోందని వాపోతున్నాడు! జనలోక్ పాల్ పరిథిలో వుంటే ఈ బాధలు లేకపోవును కదా?

రాజశేఖర్రెడ్డి మీదా, జగన్ మీదా ఆరోపణలు కొత్త కాదు. అనేక సాక్ష్యాధారాలతో సహా పత్రికలు కథనాలు ప్రచురించాయి. దేనికైనా టైము రావాలి అన్నట్టు--ఇప్పుడు రాష్ట్ర వున్నత న్యాయస్థానం గట్టిగా చెపితే, సీ బీ ఐ రంగంలోకి దిగి, సోదాలూ, గట్రా! ఆ జడ్జీలు అక్కడే వున్నంతకాలం బాగానే వుంటుంది. మారితే? యేమో! అందుకే జనలోక్ పాల్ పరిథిలోకి న్యాయ పాలికలు కూడా వుండాలన్నది!

తెలంగాణా వాళ్లు "సకలజనుల సమ్మె" అంటున్నారు. వుద్యోగులే సమ్మెకి సిధ్ధంగా లేరట! మరి సకల జనులు యెవరి మీద సమ్మె చేస్తారు? తమ మీద తామేనేమో!

చూద్దాం!


Saturday, July 9, 2011

కబుర్లు - 64

అవీ, ఇవీ, అన్నీ

మన బుర్రోవాదుల బుర్రల్లోని ఆలోచనలు యెన్ని వెర్రితలలు వేస్తున్నాయో చూడండి!

సామాన్యులకి యేడాదికి 4 గ్యాస్ సిలిండర్లు సరిపోతాయట. అందుకని, ఐదో సిలిండరు కావాలనేవాళ్లకి ఒక్కోటీ రూ.800/- కి తక్కువకాకుండా అమ్మాలట. అప్పుడు సబ్సిడీ భారం తీరిపోతుందటా!

అసలు ఈ గొడవంతా యెందుకు? ఆ గ్యాసు కంపెనీలని ప్రతీవూళ్లోనూ చిల్లరకొట్లు తెరిచి, వాళ్లకిష్టం అయిన రేటుకి సిలిండర్లు అమ్ముకోమంటే వొదిలిపోతుందికదా? దీపం పథకాలూ వగైరా చెట్టెక్కి, అందరూ యెండుపుల్లలతో వంటలు ప్రారంభిస్తారు? హబ్బే! గ్యాసు యేజన్సీలు రద్దుచేస్తే, మా పలుకుబడీ, సంపాదనా యేమికాను? అంటారు రాజకీయులు!

మళ్లీ దానికీ "ఆథార్" సంఖ్యే ప్రమాణమట!

ఇంక ఈ ఆథార్ యెలా పాము మెలికలు తిరుగుతూ నడుస్తోందో చూశారా? ఇప్పటి వరకూ మనకి యెన్ని రకాల "కార్డులు" వున్నాయో గమనించారా?

ఆథార్ సంఖ్య కోసం బెంగుళూరు లాంటి మహానగరంలో, ఓ 12 పోస్టాఫీసులని యెంపికచేసి, అన్ని లక్షలమందినీ అక్కడే అప్లికేషన్లు తీసుకోమన్నారట. తీరా రెండురోజుల్లో ఇచ్చిన అప్లికేషన్లకి సంఖ్యలు కేటాయించాలంటే రోజుకి గరిష్ఠంగా 50 వేసుకున్నా, (ఆ 50 పూర్తయ్యేవరకూ కొన్ని వందలమంది పడిగాపులు పడాలట!) 2012 జనవరి నెలాఖరువరకూ జారీ పూర్తి కాదట! అందుకని అప్ప్లికేషన్లని ఇవ్వడం మానేశారట!

ఇంక అప్లికేషన్ తోపాటు ఒక "గుర్తింపు" పత్రమూ, ఒక "నివాస ధృవీకరణ" పత్రమూ, ఇంకా ఫోటోలూ, వేళ్లూ, కళ్లూ వగైరాలు తీసుకెళ్లాలట! (పిచ్చి కుదిరితేగానీ పెళ్లి కాదు, పెళ్లైతేగానీ పిచ్చి కుదరదు అన్నట్టు, ఆ జాబితాలలోని కార్డులు పొందడానికి "ఆథార్" కావాలట. ఆథార్ కావాలంటే, ఆ పత్రాలు వుండాలట!). ఆ జాబితాలు పరికించండి......

గుర్తింపు పత్రాల జాబితా--పాస్ పోర్ట్; పాన్ కార్డ్; రేషన్ కార్డ్; వోటరు కార్డ్; డ్రైవింగ్ లైసెన్స్; గవర్నమెంటువారు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డ్; వుపాధి హామీ జాబ్ కార్డ్; గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన కార్డ్; ఆయుధ లైసెన్స్; ఫోటోతో వున్న బ్యాంక్ ఏటీఎం కార్డ్; ఫోటో వున్న క్రెడిట్ కార్డ్; పెన్షనర్ ఫోటో కార్డ్; స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డ్; ఫోటో వున్న రైతు పాస్ బుక్; హౌసింగ్ వాళ్లిచ్చిన ఫోటో కార్డ్; పోస్టల్ వాళ్లిచ్చిన ఫోటో, చిరునామా వున్న కార్డ్--ఇవేమీ లేకపోతే, ఓ గ్రూప్ 'ఏ' గెజిటెడ్ అధికారి, తన లెటర్ హెడ్ మీద, ఫోటో తో ఇచ్చిన గుర్తింపు పత్రం! (యెన్నయ్యాయో నేను లెఖ్ఖపెట్టలేదు!).

ఇంక, నివాస ధృవీకరణ పత్రాల జాబితా........(మళ్లీ) పాస్ పోర్ట్; రేషన్ కార్డ్; వోటరు కార్డ్; డ్రైవింగ్ లైసెన్స్; పెన్షన్ గుర్తింపుకార్డ్; స్వాతంత్ర్య సమర యోధుల గుర్తింపు కార్డ్; ఫోటోతో వున్న రైతు పాస్ బుక్; బ్యాంక్ స్టేట్మెంట్/పాస్ బుక్; పోస్టాఫీసు యెకవుంట్ స్టేట్మెంట్/పాస్ బుక్; ప్రభుత్వం వారు జారీచేసిన గుర్తింపు కార్డు; విద్యుత్ వినియోగ బిల్లు; నీటి వాడకం బిల్లు; టెలిఫోను ల్యాండ్ లైన్ బిల్లు; ఆస్థి పను రసీదు (ఇవన్నీ కూడా మూడు నెలలకుమించి పాతవి కాకూడదు??!!); ఇన్స్యూరెన్స్ పోలసీ, ఫోటో తో మరియూ అధికార్ల సంతకాలతో బ్యాంకు వారు తమ లెటర్ హెడ్ మీద జారీచేసిన వుత్తరం; యేదైనా రిజిస్టర్డ్ కంపెనీ తన లెటర్హెడ్ మీద ఫోటోతో జారీచేసిన వుత్తరం; గుర్తింపు పొందిన విద్యా సంస్థ ఇచ్చిన వుత్తరం; వుపాధి హామీ జాబ్ కార్డ్; ఆయుధ లైసెన్స్; హౌసింగ్ బోర్డ్ గుర్తింపు కార్డు; ఒక ఎంపీ గానీ, ఎమ్మెల్యేగానీ, గ్రూప్ 'ఏ' గెజిటెడ్ అధికారిగానీ చిరునామా ధృవీకరిస్తూ ఇచ్చినవుత్తరం; పంచాయతీ సర్వోన్నతాధికారి ఇచ్చిన పత్రం; ఇన్‌కం టేక్స్ యెసెస్మెంట్ ఆర్డరు; వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్; రిజిస్టర్ అయిన క్రయ/లీజు/అద్దె యెగ్రిమెంట్; పోస్టలు వారిచ్చిన నివాస ధృవీకరణ పత్రం; రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చిన కుల/డోమిసైల్ సర్టిఫికెట్ (ఫోటో తో వున్నది). (ఇవికూడా యెన్నో నేను లెఖ్ఖపెట్టలేదు!).

ఇవికాకుండా--పుట్టిన తేదీ ధృవీకరణకోసం--జనన ధృవీకరణ పత్రం; ఎస్ ఎస్ ఎల్ సీ సర్టిఫికెట్; పాస్ పోర్ట్; గ్రూప్ 'ఏ' గెజిటేడ్ అధికారి తన లెటర్ హెడ్ మీద ఇచ్చిన జనన తేదీ ధృవీకరణ పత్రం.

(హమ్మయ్య! జాబితాలు పూర్తయ్యాయి. కానీ, నాకు రెండు....కాదు....మూడు సందేహాలు--ఈజాబితాల్లో వున్న కార్డుల్లో యే వొక్కదానిలో అయినా మన చిరునామా వుంటుందా? ఒకవేళ వున్నా అది ఖచ్చితంగా సరిగ్గా వుంటుందా? మనం ఆ చిరునామాలో యెన్నాళ్లు వుంటామో గ్యారంటీ వుదా?--ఇదీ మొదటి సందేహం. రెండోది, యెవరైనా వీటిలో యేదో ఒక ధృవపత్రం వొకటి రెండు రోజుల్లో--అదీ పైసా ఖర్చు చెయ్యకుండా (ఫోటోలకి తప్ప) సాధించగలరా? ఇంక మూడోది--అవన్నీ వున్నవాడికి, లేదా యేదో ఒక గుర్తింపు పత్రం, నివాస ధృవీకరణ పత్రం వున్నవాడికి "ఆథార్" అవసరం యేమిటీ?

ఈ సందేహాలకి తెలిసీ యెవరైనా సమాధానం చెప్పలేదో, వాళ్ల తల వెయ్యి వ్రక్కలు కాకమానదు--అనడానికి నేను భేతాళుణ్ని కాదు. అర్థరాజ్యం, కూతుర్నిచ్చి పెళ్లీ అనడానికి మా పెసిగాణ్నీ కాదు! ఒక్కటి మాత్రం చెప్పగలను--నా చేతిలో వుంటే ఇలాంటి ప్రణాళికలూ, నిర్ణయాలూ చేసే బుర్రోవాదులని, బిషప్ హేటో లెవెల్లో.......%$*^(@!.!

అదీ సంగతి!

ఇంకా చాలా వున్నాయి సణగడానికి కానీ వోపీలేదు......మరోసారి!

Tuesday, July 5, 2011

కబుర్లు - 63

అవీ, ఇవీ, అన్నీ

అయ్యింది--ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ, ఇంకొంతమందీ కలిసి ఓ వందమంది తమ పదవులకి రాజీనామాలు ఇచ్చేశారు. రాజ్యాంగ సంక్షోభమేదీ రాలేదుగానీ, పదవుల సం"క్షామం" మొదలయ్యింది. మన యెమ్మెల్యేలే ఓ 300 మంది వున్నారనుకుంటా. వారిలో మూడో వంతుమంది కూడా రాజీనామా చెయ్యకపోతే, ఇంకేమి సంక్షోభం? దానిక్కూడా స్పీకర్లు అందుబాటులో లేని సమయం యెంచుకున్నారు! వాళ్లు వచ్చేలోపల, ఓ రెండురోజులు తెలంగాణా బందూ, తరవాత వుత్తరాదినుంచి దక్షిణాదికి రైళ్ల రాకపోకల బందూ, తరవాత 'హైదరాబాదు మినహా' ఇతరచోట్ల 'వంటావార్పూ'--ఇలా కార్యక్రమం ప్రకటించేశాడు. 
 
అసలు ఇలాంటివాటికి అవకాశం యెందుకు ఇవ్వాలి? రాజీనామా ఇచ్చిన మరుక్షణమే అవి అమోదంపొందినట్టు భావించి, వారికి వుండే సకల సౌకర్యాలూ రద్దు చెయ్యాలి. ఇంకా, ఒక్క ఆరోగ్య కారణాల మినహా, మరెందుకు రాజీనామా చేసినా, తరువాత ఆ స్థానానికి యెన్నికలకయ్యే ఖర్చు రాజీనామా చేసినవాడిదగ్గరనుంచే వసూలు చెయ్యాలి. అప్పుడుగానీ వీళ్ల నాటకాలకి తెరపడదు.

రాజీనామా ఇచ్చినవాళ్లు అడుగుతున్నది యేమైనా టన్నులకొద్దీ బంగారమా? మణిమాణిక్యాల్లాంటి భాగ్యమా? యేదో.......తెలంగాణా ఇస్తే ఇవ్వండి, లేకపోతే మా రాజీనామాలు ఆమోదించండి......అనడుగుతున్నారంతేగా? ఆమాత్రానికి సదరు స్పీకర్లూ, ప్రభుత్వాలూ, అధిష్టానం "ఆమోదించాం పొండి" అనేస్తే, గొడవొదిలిపోను కదా? అఖిలపక్షాలూ, యేకాభిప్రాయాలూ ఇవన్నీ యెందుకు? ఈలోపల బందులూ అవీ అంటూ ఓ పదో పాతికో మంది అమాయకులు బలయ్యేవరకూ చోద్యం చూడ్డానికా? యేడిసిన్నట్టే లేదూ వ్యవహారం?

కల్మాడీ గారి టీపార్టీ పుణ్యమాని, ఇంకో ముగ్గురో యెందరో తిహార్ జైలు అధికారులని కూడా సస్పెండు చేశారట. వాళ్లని బదిలీ చెయ్యడానికి "అండమాన్" వగైరాచోట్ల ఖాళీలు లేవేమో! కానివ్వండి. ఇప్పటికైనా సెల్లులకి తాళాలూ గట్రా వేస్తున్నారా? రాత్రిళ్లు చికెనూ, మందూ పార్టీలు కూడా చేసుకొంటున్నారా? మరోసారి ఇంకో జడ్జి గారెవరైనా యే అర్థరాత్రో అకస్మాత్తు తణిఖీ నిర్వహిస్తేగానీ బయటపడవేమో?!

ఈ మధ్య రైళ్లగురించి సణగడంలేదు--మమతాదీ ముఖ్యమంత్రి అయిపోయి, రైల్వేల గురించి పట్టించుకొనేవాడూ, వెలగబెడుతున్నాం అనే నాథుడూ లేకుండా పోయాడు. ఏ సీ కంపార్టుమెంట్లలో అనేక బొద్దింకలూ, పురుగులూ స్వైరవిహారం చెయ్యడం స్వానుభవమైనా, ఆ చిన్న విషయం బహిరంగంగా యేమి సణుగుతాములే అని వూరుకున్నాను. ఇప్పుడు మళ్లీ నిన్న (04-07-2011), చెన్నై నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న "దురంతో"లో, బొద్దింకలూ, పురుగులతో వంటిమీద దద్దుర్లు వచ్చినా సహించి, యెలుకలతోకూడా సహవాసం చెయ్యడానికి అలవాటుపడ్డా, విజయవాడ వచ్చేసరికి "పాచికంపు" కొడుతున్న భోజనం పెట్టడంతో సహనం నశించి రెచ్చిపోయిన ప్రయాణీకులు రైలుని ఓ రెండున్నరగంటలపాటు నిలిపేసి, ఆందోళన చేశారట. "దురంతో" చార్జీలతో, మామూలు కోచ్ లు వెయ్యడమేమిటి? అని నిలదీసినవాళ్లకి అధికారులు "అది తమచేతుల్లో లేదు" అని నచ్చచెప్పారట. బోగీలని వీలైనంతవరకూ శుభ్రపరిచేలా చేసి, పంపించారట! 
 
అసలు, తెలివి వెర్రితలలు వేసి ఇలాంటి రైళ్లని ప్రవేశపట్టారని అందరూ అన్నా, తన పంతం నెగ్గించుకొంది మమతాదీ! వాళ్లకి మనం రోడ్లమీద వెళుతున్నప్పుడు చూసే "వేగముకన్న క్షేమము మిన్న"; "ఆలస్యంగా బయలుదేరి 'స్వర్గానికి ' పోయేకంటే, త్వరగా బయలుదేరి గమ్యం చేరడం మంచిది" లాంటి నినాదాలు యెక్కడైనా కనిపించాయో లేదో? వచ్చిన రైలుని కనీసం శుభ్రపరిచే ఆస్కారం కూడా లేకుండా, వెంటనే తిరుగు ప్రయాణం ప్రారంభించి, స్టేషన్లలో ఒకనిముషం మాత్రమే ఆగుతూ, పరుగులు పెడుతూ, ప్రయాణీకులు క్రిందకి దిగడానికి లేకుండా, యెక్కువరేట్లతో నాసిరకం తిళ్లు పెడుతూ, అనువుగాని సమయాల్లో, 'మెయింటెనెన్సు ' పేరుతో అరగంటా, నలభై ఐదు నిమిషాలు ఆపేస్తూ, యేమాత్రం అనువుగాని సమయాల్లో గమ్యం చేరుస్తున్న "దురంతో"; "సూపర్ ఫాస్ట్" లాంటి రైళ్లవల్ల యెవరికి యేమి వొరుగుతోంది? చక్కగా అనువైన సమయంలో బయలుదేరి, టిఫిన్లూ, భోజనాల సమయంలో వచ్చే స్టేషన్లలో వాటికి యేర్పాట్లు చేసి, కొంచెం యెక్కువసేపు ఆపి, గమ్యస్థానం కూడా అనువైన సమయాల్లో చేరిస్తే అందరికీ అనుకూలంగా వుంటుంది. ప్రతీ స్టేషను ముందూ "ఔటర్"లో కాసేపు ఆగడం యే రైలుకీ తప్పడం లేదు. ఆ సమయాలని (మనభాషలో) రెగ్యులేట్ చేస్తే యెంతబాగుంటుంది? (రైల్వే భాషలో రెగ్యులేట్ అంటే అక్కడితో ఆ రైలుని ఆపెయ్యడం!). 
 
పైగా చాలామంది ఇళ్లనుంచి తెచ్చుకొన్న ఆహార పదార్థాలు తినేసి, చెత్త బోగీల్లో పారెయ్యడం, చాక్లెట్ రేపర్లూ, వేరుశెనగ తొక్కలూ, కమలా పళ్ల తొక్కలూ, త్రాగేసిన నీళ్ల/బటర్ మిల్క్  కవర్లూ, ఖాళీ ప్లాస్టిక్ సీసాలూ (ముఖ్యంగా ఏసీ బోగీల్లో) సీట్లక్రిందకి తోసెయ్యకపోవడంవల్ల మూడొంతులు పారిశుధ్య సమస్య తీరుతుంది కదా? ప్రతీ రైల్వే డివిజన్ హెడ్ క్వార్టర్లోనూ ఓ బోధి వృక్షం మొలిచి, పెరిగి, పెద్దదైతేనేగానీ, వాటి క్రింద రైల్వేవాళ్లకి ఙ్ఞానోదయం అవదేమో! మనమేం చెయ్యగలం.....ప్రార్థించడం తప్ప!

నల్లధనం విషయంలో సుప్రీం కోర్టు చివరాఖరికి విసుగు చెంది, ఓ వున్నతస్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించేసిందట. ఇంక ఇతర దర్యాప్తు సంస్థలన్నీ ఆ సంస్థ క్రిందే పనిచెయ్యాలని ఆదేశించిందట. ముఖ్యంగా "అధికారులనుంచి నోటీసులు అందుకున్నవారి పేర్లు బహిర్గతం చెయ్యవలసిందే" అందట. హమ్మయ్య. ఓ ములుగర్రపోటు తగిలిందన్నమాట ప్రభుత్వ వృషభానికి. ఇప్పుడేమి జరుగుతుందో వెండితెరపై చూద్దాం!

Sunday, July 3, 2011

కబుర్లు - 62

అవీ, ఇవీ, అన్నీ

మొన్న సాయి యజుర్ మందిరంలోని ఖజనాని లెఖ్ఖించాక కూడా, ఆ గది తాళాలు సత్యజిత్ దగ్గరే వున్నాయట. (పేపర్లో రత్నాకర్ అని వ్రాశారా? యేమో గుర్తు లేదు. యెవరైతేనేం?). మళ్లీ నిన్న ఇంకో గదితెరిచి చూస్తే, అందులో సుమారు ఓ కేజీ బంగారం, ఓ రెండువందల కేజీల వెండీ, వజ్రాల వుంగరాలూ, వెండీ ఇతరపాత్రలూ దగ్గరదగ్గర ఓ 80 లక్షల విలువైన వస్తువులు 'దొరికాయట'. ఇంకా ఆ మందిరంలో యెన్ని గదులున్నాయో!

ఇంక, ఆయన దేవుడా కాదా అనే విషయంలో కాదనేవాళ్లూ; అయినా కాకపోయినా అనేవాళ్లూ; అవును అనేవాళ్లూ యెప్పుడూ వున్నారు. ఇప్పుడు కొత్తగా, అబ్దుల్ కలాం, రతన్ టాటా, వాజపేయీ లాంటి కొంతమంది (దాదాపు ఓ యాభై మంది) ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ, వాళ్లందరూ ఆయన్ని సందర్శించి, ఆశీస్సులకోసం పడిగాపులు పడేవారు కాబట్టి, నిజంగా ఆయన దేవుడు కాకపోతాడా? ఆయనకి యేవో మహిమలు వుండకపోతాయా? అనేవాళ్లు కొంతమంది తయారయ్యారు. వాళ్లకి ఇదివరకే సమాధానం చెప్పినవాళ్లు వున్నారు, ఇప్పుడు మళ్లీ, "వాళ్లందరూ తమ తమ వేరు వేరు 'అవసరాలకోసం '; వేరు వేరు 'యెజెండాలకోసం '--ఇలా వెళ్లేవారు తప్పితే, ఆయన మహిమల వల్లకాదు అనీ చెపుతున్నారు.

మొన్నీమధ్య ఓ బ్లాగులోనో వ్యాఖ్యలోనో ఒకాయన ఓ కొత్త విషయం చెప్పాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి అప్పుడెప్పుడో సాయి గురించి యేదో వ్రాశాడు అనీ, అందుకే ఆయన "నోరు పడిపోయింది" అనీ! ఇదెక్కడి దారుణమైన విషయమో! నాకు తెలిసీ, ఆయనకి గొంతు కేన్సరో యేదో వచ్చి, మాట్లాడలేకపోయేవారనీ, చాలా శ్రమతీసుకుని మాట్లాడినా, స్పష్టంగాలేక బొంగురుగా వుండడంతో వినేవాళ్లకి అర్థం చేసుకోవడం కష్టం అయ్యేది అనీ, అలా మాట్లాడడానికి ఆయన నొప్పితో బాధపడేవారనీ, అందుకే కాయితాన్నీ కలాన్నీ ఆశ్రయించేవారనీ, అయితే మాట పూర్తిగా పోవడం జరగలేదు అనీ విన్నాను. మరి సిన్మాల్లో సాయి వేషం వేసిన వాళ్లకీ, మాటలు వ్రాసినవాళ్లకీ, ఆ పాత్రని యెదిరించినవాళ్లకీ, సినిమా తీసినవాళ్లకీ యేమైనా అయిందోలేదో మరి!

మొన్నొక జడ్జి గారు తిహార్ జైలుకి అకస్మాత్తుగా తనిఖీకి వెళ్లేటప్పటికి, అక్కడ జైలరుగారు వారి కార్యాలయంలో సురేష్ కల్మాడీ తో బిస్కెట్లు తింటూ, టీ త్రాగుతూ, పిచ్చాపాటీ మాట్లాడుతున్నారట--సాధ్యమైనంత వినయంగా! ఇంక మిగిలిన 2జి స్కాం ముద్దాయిలు సెల్ తాళాలు తీసి వుండగా, యధేచ్చగా విహరిస్తున్నారట! ఈ విషయంలో జడ్జిగారు సుప్రీంకోర్టుకి నివేదిక యేమిచ్చారో ఇంకా తెలీదుగానీ, ఆ జైలరుగారిని వెంటనే "అండమాన్" కి బదిలీ చేశారట! అబ్బే......అదేమీ కాదు, ఆయనకి కొన్ని నెలల క్రితమే అక్కడికి బదిలీ అయ్యింది, యెలాగూ నిన్ననే వెళ్లాల్సి వుంది, అందుకని వెళ్లిపోయారంతే--అన్నారట కొన్ని జైలువర్గాలు. వుద్యోగుల విషయంలోనైనా, అధికారులవిషయంలోనైనా, "బదిలీ శిక్ష కాదు" అనే సూత్రం వల్లెవేస్తూ వుంటాయి మేనేజ్ మెంట్లు. మరి ఇదేమిటో?

చాలా కాలానికి, యెంపికచేసిన పత్రికా యెడిటర్లముందు అయినా నోరు విప్పాడు ప్రథాని అని కాంగీవాళ్లూ, ప్రభుత్వం వాళ్లూ సంతోషిస్తూంటే, బాంబు పేలినట్టు బంగ్లా ప్రభుత్వంవారు మన రాయబారిని పిలిచి, "దీని సంగతేమిటి?" అని నిలదీశారట! ఆయన నీళ్లు నములుతూ, వచ్చెయ్యవలసివచ్చిందిట! ఇంతకీ, మన ప్రథాని, బంగ్లాదేశీయుల్లో నాలుగోవంతుమంది అదేదో ముస్లిం సంస్థలో సభ్యులో, సానుభూతిపరులో అనీ, వాళ్లు భారత్ కి బధ్ధ వ్యతిరేకులు అనీ, వాళ్లు పాకిస్థాన్ ఐ ఎస్ ఐ వాళ్లేమి చెపితే అది చేస్తారు అనీ వ్యాఖ్యానించారట! (యే సందర్భంలోనో ఆ యెడిటర్లెవరూ మనకి చెప్పనేలేదు!). తీరా బాంబు పేలినంతపని అయ్యాక, బంగ్లా పౌరలంటే మాకు యెంతో గౌరవం, ప్రజాస్వామ్యబధ్ధంగా యెన్నికైనా బంగ్లా ప్రభుత్వం బలంగా వుండాలనే మేము కోరుకుంటాం, వాళ్ల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మా అభిమతం కాదు--ఇలా అంటూ, సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ, పొర్లుదండాలు పెట్టవలసి వస్తోందట! అందుకు బాధ్యుడైన అధికారిగురించి "విచారిస్తున్నారు" అనుకొంటా!

కేరళలోని పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగలోని ఆరు రహస్య అరల్లో, ఇప్పటికి సి; డి; ఎఫ్ అరల్ని తెరిస్తేనే, దాదాపు 50,000 కోట్ల విలువైన (కేవలం బంగారం, రాళ్లూ వగైరాల విలువ మాత్రమే--పురాతనత్వం విలువ కాకుండా) సంపద వెలుగుచూసింది అనీ, దాంతో, 40,000 కోట్ల ఆభరణాలు గల బాలాజీ ని అధిగమించిందనీ అన్నారు. ఇప్పుడు 'ఏ' అరని తెరిస్తే, వెలుగు చూసిన సంపదతో మొత్తం 75,000 కోట్లకు చేరిందట. బి అరని 1872 వ సంవత్సరం నుంచీ యెప్పుడూ తెరవలేదట. అది కాకుండా, ఇ అరని కూడా ఇంకా తెరవాలట. మొత్తం అయ్యేటప్పటికి ఇంకెన్ని రోజులు పడుతుందో, మొత్తం సంపద లెఖ్ఖ యెన్ని కోట్లకు చేరుతుందో?

ఆర్థికమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు కూడా, చిల్లర వ్యాపారాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని యెంత తొందరగా ఆహ్వానిస్తే అంత త్వరగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది, కానీ ఓ నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమే అంటున్నాడు. (మనం యేమి చేసినా ద్రవ్యోల్బణం తగ్గదు, దాని పెరుగుదల రేటు మాత్రమే తగ్గుతుంది--అని ప్రాథమిక సూత్రాన్ని కూడా మధ్యలో గుర్తుచేశాడు!). స్వపన్ దాస్ గుప్తా అయితే, ఆ ప్రతిపాదనకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారి చిత్రం ప్రచురించిన తన వ్యాసంలో, భారతీయులు 'ప్రపంచం మనని యెవరికోసం బ్రతికిస్తుంది?' అంటూ మారకుండా వుండిపోతే, మరో పాకిస్తాన్ అయిపోవడం ఖాయం అన్నాడు.

అసలు ఈ బెంగాలీ బాబులంతా వొకేలా ఆలోచిస్తారేమో? అరవబాబులు వీళ్లకి సరిగ్గా వ్యతిరేకం. దేశం గురించి పట్టించుకోకుండా, వాళ్లపని వాళ్లు చూసుకొంటారు! మధ్య వచ్చిందల్లా, మనలాంటివాళ్లకే చచ్చే చావు!

Thursday, June 30, 2011

కబుర్లు - 61

అవీ, ఇవీ, అన్నీ

చాలా కాలం తరవాత మన ప్రథాని నోరు విప్పాడు--పిచ్చి 'దంబరం' కూడా ఆయన తరచూ నోరు విప్పితే బాగానేవుంటుంది అన్న తరవాత.
 
నలుగురో ఐదుగురో హేమాహేమీల్లాంటి పత్రికా యెడిటర్లు ఆయన మనసులో వున్నది బయటపెట్టించలేకపోయారు. (ఓ మార్క్ టుల్లీ లాంటివాళ్లెవరైనా ప్రయత్నిస్తే బాగుండును). ఆయన యెప్పుడూ చెప్పేవే చెప్పారు. యెవరో మీడియాకి తప్పుడు ఆరోపణలతో సమాచారం ఇస్తున్నారు అనీ, మీడియా తానే ఫిర్యాదుదారూ, దర్యాప్తు సంస్థా, న్యాయ మూర్తీ పాత్రలని పోషిస్తోంది అనీ అన్నారు.

ఆ ప్రముఖ మీడియా ఎడిటర్లకీ సిగ్గు లేదేమో! సరిగ్గా నిలదీసిన దాఖలాలు లేవు. జూనియర్ విలేఖరులే మెరుగనిపించారు.
 
లోక్ పాల్ పరిధిలోకి తనను చేర్చడానికి అభ్యంతరం లేదు కానీ, తన మంత్రివర్గ సహచరులే వొద్దంటున్నారు అన్నాడట. మంత్రివర్గ సహచరుల మీద తనకి నియంత్రణలేదు అనడానికి ఇంతకన్నా ఋజువు యేమి కావాలి? మళ్లీ, నల్లధనం, ద్రవ్యోల్బణం ఆందోళనకరమే గానీ, తనదగ్గర 'మంత్రదండం' యేమీ లేదు అనీ, పెట్రో ధరల విషయంలో కూడా 'అద్భుత దీపం' లేదు అనీ, అన్నాడట. ఇలాంటి పిచ్చి మాటలు వినీవినీ చెవులు తడకలు కట్టలేదూ? రేప్పొద్దున ఆ పిల్లరాజు చేత 'నాదగ్గర మంత్రడం, అద్భుత దీపం ఇంకా చాలావున్నాయి' అని ప్రకటింపచేసేస్తారేమో! దేశ ప్రజలకి దేవుడే దిక్కేమో!
 
కొత్త విషయం ప్రణబ్ ఆఫీసు బగ్గింగ్ గురించి, మొన్న సెప్టెంబరులో ఆయన అనుమానం వ్యక్తం చేశారు, ఐ బీ చేత దర్యాప్తు చేయించాము, వాళ్లు అదేమీ లేదన్నారు. అయినా ప్రణబ్ మంత్రిత్వ శాఖ నుంచి యేదైనా వస్తే, హోం శాఖనుంచి 'లూప్' చెయ్యకుండా నాకే చెప్పమన్నాను! అన్నారట. ఇంక మేడం గారి గురించి అడిగితే, 'కిసుక్కున నవ్వి', నా ప్రభుత్వం చేసిన మంచిపనులు అన్నీ ఆవిడవల్ల జరిగినవే, చేతకాని పనులు అన్నీ నేనే చేసినవే! అన్నారట. మరి డిగ్గీ రాహుల్ ప్రథాని అవ్వాలంటున్నాడు కదా? అంటే, నాకు ఈ వుద్యోగం ఇచ్చారు. వుద్యోగం వున్నన్నాళ్లూ నేనే చేస్తాను. యువతరం ఆ వుద్యోగానికి రావలసిందే. మేడం ఇప్పటివరకూ నీ వుద్యోగం పీకేస్తానని అనలేదు. ఒకవేళ అంటే, నిక్షేపంగా పదవీ విరమణ చేస్తాను. అని వినయం వొలకబోశాడు. ఆయన "నికమ్మా"త్వానికి ఇంతకంటే నిదర్శనాలు యేమి కావాలి? పైగా మళ్లీ పదిహేనురోజులకోసారి నోరు విప్పుతారట--యెంపిక చెయ్యబడ్డ మీడియా ప్రతినిధుల ముందు! యెందుకూ? ఖర్చులూ, సమయం దండగ! ఆయన చెప్పిన, చెపుతున్న, చెప్పబోయే విషయాలు యెవరికి తెలియవని???!!!

ప్రణబ్ మంత్రివర్గం చేతిలో వుండే ఆదాయపన్ను శాఖ క్రిందవుండే 'ఎన్‌ఫొర్స్ మెంట్ డైరక్టరేట్' లాంటి ఐదో ఆరో దర్యాప్తు సంస్థలకి తగిన 'మౌలిక వసతులు' లేకపోవడంతోనే, ఓ ప్రైవేటు సంస్థని వినియోగించాము అనీ, ఆ సంస్థ 16 చోట్ల "మెత్తటి పదార్థాన్ని" కనుగొంది అనీ, అది బబుల్ గమ్ ఖచ్చితంగా కాదు అనీ, ఆ విషయంలో ఆ కార్యాలయాల్లో పారిశుధ్యం నిర్వహించే అధికారినీ, పనివాళ్లనీ సస్పెండు చేశాము అనీ, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ప్రతినిధి అదేదో "గుప్తా" అనేవాడు ప్రకటించాడట! మన ఆదాయ పన్ను శాఖా దానిక్రింద దర్యాప్తు సంస్థలూ కూడా "నికమ్మా"లేనన్నమాట! మరి బాధ్యులైనవాళ్లని ప్రశ్నించి, ఆ పదార్థాన్ని యెవరు పెట్టమన్నారు, ఆ పెట్టమన్నవాళ్లని ప్రశ్నించి, ఆ పదార్థంలోని నొక్కులూ వగైరా గుర్తులవల్ల అక్కడేమి అతికించారు, యెన్నాళ్లు, యేమి సమాచారం సేకరించారు, యెవరికి ఇచ్చారు--ఇలాంటివేమీ కనుక్కోవాలని కూడా ఆ నికమ్మాలకి తోచడం లేదు! ఆ పనులు చేయించినవాడినీ, అలాంటి వెధవల్నీ ఓ పట్టు పడితే, మంత్రదండాలూ, అద్భుతదీపాల అవసరం వుంటుందంటారా?

తెలంగాణాకి 'గూర్ఖా లేండ్' తరహా......అని యెవరో (పిచ్చి 'దంబరమే' అంటున్నారు) పిత్తితే, మళ్లీ కేసీఆర్, తన 'రాజకీయ పార్టీల తో చర్చలలో' భాగంగా మళ్లీ తెలంగాణా కాంగ్రెస్ నేతలతో, జానారెడ్డి ఇంటికివెళ్లి మంతనాలు సాగించాడట. అందరూ రాజీనామాలు చేస్తే, 'రాజ్యాంగ సంక్షోభం' వస్తుంది అనీ, అప్పుడు తెలంగాణాని వొడిసిపట్టుకోవడం చాలా వీజీ అనీ, ఒకవేళ అలాంటి సంక్షోభమేమీ రాకపోయినా, వాళ్లందరూ తెరాస టిక్కెట్లమీదో, స్వతంత్రులుగానో పోటీచేస్తే, ఇతరులెవరూ బరిలో నిలవరు అనీ, మళ్లీ వాళ్లనందరినీ నెగ్గించే బాధ్య తాను చూసుకుంటాను అనీ (పనిలో పనిగా జానారెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాను అనీ) హామీలిచ్చేశాడట. జానారెడ్డి యెగిరిగంతేసినా, మిగిలినవాళ్లు 'విస్తృత సమావేశం' నిర్వహించి, అప్పుడు చెపుతాం అన్నారట. వాడిమాటలు నమ్మెయ్యడానికి--పోటికి నిలవకుండా వుండడానికి తెరాస, ఐకాస నాయకులూ, కుక్కతోకపట్టుకొని గోదారి ఈదగలము అనుకోడానికి కాంగీ నేతలూ 'వెర్రిపప్పలు' లా కనిపిస్తున్నారేమో వాడికి! అప్పుడే కొంతమంది ఎంపీలూ, రాజ్యసభ సభ్యులూ--మేము రాజీనామాలు చెయ్యం, మీరూ మీరూ చూసుకోండి అనికూడా అనేశారట. తననీ, కోదండరాం నీ, వేదికపైనున్న నేతలనందరినీ "జైళ్లలో" పెట్టినా భయపడం అని జయశంకర్ సంస్మరణసభలో ప్రకటించాడట. దొంగాడా చెయ్యి కొరుకుతావన్నట్టు, కి కు రె అలాంటి పిచ్చిపని చేస్తే, మళ్లీ తెలంగాణాని అగ్నిగుండం చేసేసి, సామాన్యులకీ, విద్యార్థులకీ బొందలుపెట్టి, ఆనందిద్దామనుకుంటున్నాడు పాపం! ఈ సారి సంక్షోభం రాదు అనీ, 356 అని పెద్ద పెద్ద అంకెలు హైరరాబాదంతా ఆకాశంలో కనిపిస్తున్నాయి అనీ అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి వాడికి యెందుకు కనపడడంలేదో?

"నేనింక సినిమాలలో ముఖ్యమంత్రిగా నటించను. నిజం ముఖ్యమంత్రిగానే చూడాలని ప్రజలు ఆశగా యెదురుచూస్తున్నారు" అని ప్రకటించిన చిరంజీవి, అందాకా, వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో యే నౌకాశ్రయాలశాఖో కేటాయిస్తే ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోతానన్నా, "మాలో మేమే కొట్టుకు ఛస్తున్నాం! క్యూలో చివర నిలబడితే, అక్టోబరు నెలాఖరుకి యేమైనా ఫలితం వుండొచ్చు" అన్నారట అసలువాళ్లు. మరేమి చేస్తాడో?

హోదా, పరపతి గల నేరస్తులమీద దర్యాప్తూ, విచారణా యేమాత్రం జరగకపోవడంతో, దేశంలో చట్టబధ్ధ పాలన చట్టుబండలు అవుతోంది అంటూ ఆయనెవరో సుప్రీం కోర్టులో 'పిల్' దాఖలు చేస్తే, కోర్టుకూడా 'విచారిస్తూ', లా కమిషన్ వారూ, ప్రభుత్వమూ 'సమగ్ర నివేదిక' ఇవ్వాలని ఆదేశించిందట. బాగానే వుంది. సదరు కమిషన్ వగైరాలు యేమి నివేదిక ఇస్తారో మళ్లీ వాయిదానాటికి చూడాలి.

(ఈ న్యాయాలయాలూ, అక్కడనడిచే 'తతంగాలూ' సామాన్యులెవరికీ అర్థం కాని చిదంబర రహస్యాలు. వాటి విషయంలో ఇంకో టపా వ్రాస్తాను.)

అమరనాథ యాత్ర మొదలయ్యిందట. కొన్ని సార్లు, సంవత్సరానికోసారి యేర్పడే ఆ మంచులింగం చిన్నదిగానే వుండడం, త్వరగా కరిగిపోతూండడం లాంటి కారణాలతో, ఆ ప్రదేశంలో ఓ రాతి లింగాన్ని ప్రతిష్టిస్తే, మంచు కరిగిపోయినా దేవుడున్నట్టు వుంటుందని వో ప్రతిపాదన వచ్చిందట--ఆ ప్రభుత్వంలో పెద్దలనుంచే అనుకుంటా. (హిమాలయాలని కూడా వదలకుండా, బంగారు తాపడాలూ అవీ చేశేసి, నిత్యాన్నదానాలూ అవీ ప్రవేశపెట్టీసి, బాగా డబ్బుచేసుకోవచ్చని గొప్ప ప్లానే వేశారు కానీ, అక్కడి ఆలయ పూజారులూ, మతపెద్దలూ "ససేమిరా" అన్నారట. ఆ లింగుడు అంతవరకూ అదృష్టవంతుడే!

ఇంకో గొప్పవిషయం యేమిటంటే, కేరళ పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగలో, ఇన్నాళ్లూ తెరవకుండా వుంచిన ఆరు అరల్లో, ఓ మూడింటిని తెరిపిస్తే, సుమారు 700 కోట్ల విలువైన బంగారు, రత్నాల ఆభరణాలూ, అలంకరణ వస్తువులూ లభించాయట. అలా తెరవాలని చెప్పి, సుప్రీంకోర్టే పుణ్యం కట్టుకొంది. ఆ లెఖ్ఖంతా పారదర్శకంగానే జరిగిందంటున్నారు. బృందంలో యేడుగురు సభ్యులూ, అందులో ఇద్దరు కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తులూ వున్నారట. మరి అది నిజమైన పారదర్శకతేనా, సత్యసాయి ట్రస్టు లాంటిదా? యేమో--సుప్రీంవారే తేల్చాలి.  

   

Sunday, June 26, 2011

కబుర్లు - 60

అవీ, ఇవీ, అన్నీ

డీజల్ ఓ 3 రూపాయలూ, వంట గ్యాస్ ఓ 50 రూపాయలూ, కిరోసిన్ ఓ 2 రూపాయలూ మాత్రమే పెంచడంతో సరిపెట్టారు సర్కారువారు. అంతేకాక, తమ రాబడిలో ఓ 49,000 కోట్లు మాత్రమే వుదారంగా కోత పెట్టుకొని సంతృప్తి పడ్డారు. యేమాత్రం సంతృప్తి లేని, ఇనుకుడు కుండీల్లాంటి పొట్టలుగల ఆయిల్ కంపెనీలు మాత్రం, ఇంకా ఓ లక్షా ఇరవైవేలో యెన్నో కోట్లు నష్టాలు మూటగట్టుకుంటూనే వున్నాయట. అదీ అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్ 100 డాలర్లకన్నా తగ్గిన సమయంలో! రాష్ట్రాలు కూడా వుదారంగా తమ రాబడుల్లో కోతపెట్టుకోవచ్చని సలహా కూడా ఇచ్చారు. మమతాదీ అప్పుడే కోత పెట్టేసుకొంది గానీ, మహారాష్ట్ర, ఆంధ్ర లాంటివాళ్లు 'ససేమిరా' అంటున్నారు. ఇంక ద్రవ్యోల్బణం మాట దేవుడెరుగు!డిగ్గీ సింగ్ "రాహుల్ ప్రథాని పదవికి అర్హుడు" అని మాత్రమే అన్నాను. అయినా ఇప్పుడు ఆ పదవి ఖాళీ లేదుగా?! అన్నాట్ట. అంటే, ఖాళీ చేయించే పని చూడండ్రా అని తన తోటి భజంత్రీగాళ్లకి పురమాయిస్తున్నాడా? పిచ్చి 'దంబరం' పేపర్లో చూసేవరకూ సీబీఐ ప్రణబ్ ఆఫీసుల బగ్గింగ్ విషయంలో దర్యాప్తు జరుపుతోంది అని నాకు తెలీదు--అన్నాడట. అదేమి హోమో! అదేమి మంత్రో! నిజంగా సీబీఐ దర్యాప్తు సాగిస్తోందా? మరి ప్రైవేటు సంస్థ దర్యాప్తు సంగతేమిటి? అంతా "అంధేర్ నగరీ, అన్ భుజ్ రాజా" వ్యవహరం లా వుంది! మోక్షానికి 2014 దాకా ఆగాలా?మంత్రివర్గానికీ, పార్లమెంటుకీ సమర్పించబోయే "లోక్ పాల్" బిల్లులో, పౌరసమాజం సూచనలని పొందు పరిచే అవకాశం యెంతమాత్రం లేదు అనీ, అది ప్రభుత్వం ప్రతిపాదించిన పాత బిల్లు కూడా కాదు అనీ, దేశానికి యేది మంచిది అనుకుంటే అది చేసే స్వేచ్చ అన్నా హజారేకి యెప్పుడూ వుంటుంది అనీ--ప్రకటించేశాడు క 'పిల్సి 'బల్! పౌర సమాజం, ప్రజా సమూహం "ఈజిప్టు" తరహాలో వీళ్లకి గట్టిగా బుధ్ధి వచ్చేట్టు చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఓ ఇరవై రోజులు సమయం వుంది కాబట్టి, ఆ దిశలో విజృంభించాలని బ్లాగర్లకి నా విఙ్ఞప్తి!నేనన్నట్టే చాలామంది నల్లధనాన్ని "స్విస్" బ్యాంకుల్లో వెతకనఖ్ఖరలేదు, దేశంలో వెతికితే చాలు అంటున్నారు. నిజానికి, స్విస్ బ్యాంకులు ఖాతాల్లో దాచుకున్న సొమ్ముకి నూటికి సంవత్సరానికి 1% మాత్రమే వడ్డీ చెల్లిస్తాయి! వాములు మేసే స్వాములకి ఇవి తిన్నాక పళ్లలో చిక్కుకున్నంత కూడా కాదు! అందుకనే వాళ్లు ఆ ఖాతాలని "ఫండ్స్ పార్కింగ్" కోసమే తాత్కాలికంగా వాడుకొని, అక్కడనుంచి విదేశాలలోని తమ దొంగ ఖాతాల ద్వారా మన దేశానికి తరలించి, తెల్లధనం గా చెలామణి చేస్తూ, భారతీయ కుబేరులుగా "ఫోర్బ్స్" మేగజైన్ కి యెక్కుతున్నారు. కోరలు లేని "ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్" లాంటి చట్టాలూ, అవగాహన లేని దర్యాప్తు సంస్థల వుద్యోగులూ, ఒకవేళ వున్నా, పైవాడి అదేశాలకి యెదురుచూడ్డానికి అలవాటు పడడం--ఇలాంటి వాటివల్ల అవి నిష్ప్రయోజనంగా మారాయి. అలాంటివాళ్ల భరతం బట్టడానికి పౌర సమాజం యేమి చెయ్యగలదు? జన లోక్ పాల్ బిల్లు చట్టం అయ్యాక, ఈ పని మొదలెడదాం. బారాందే! నువ్వుకూడా వెయిటూ!ఓ పాతిక సంవత్సరాల క్రితం, బ్యాంకులు "వుత్పత్తి రంగానికే ఋణాలు" (ప్రొడక్టివ్ క్రెడిట్) ఇచ్చేవి. ఆ రోజుల్లో, పెరుగుతున్న జనాభాకి సరిపోయే "మకాన్"ల ఆవశ్యకత గ్రహించిన ప్రభుత్వం, నేషనల్ హౌసింగ్ బ్యాంకుని స్థాపించి, గృహ నిర్మాణ రంగాన్ని ప్రాథాన్యతా రంగం లో చేర్చి, బ్యాంకులని కూడా ధారాళంగా ఆ రంగానికి అప్పులు ఇవ్వమంది. తరవాత, సంస్కరణల పుణ్యమా అని, "మౌలిక వసతుల రంగం" (రోడ్లూ, పవర్ ప్లాంటులూ, విమానాశ్రయాలూ వగైరా) ప్రాధాన్యత గుర్తించి, పెట్టుబడులని ఆ వైపు మళ్లించారు. సందట్లో సడేమియాగా బ్యాంకులు ప్రాధాన్యత అసలు ఇవ్వకూడని రంగాలు (మద్యం తయారీదారులూ, వాటి హోల్ సేల్, రిటెయిల్ వ్యాపారులూ, మోటర్ సైకిళ్లూ, కార్లూ తయారుచేసే ఫ్యాక్టరీలూ, ప్రైవేటు విమాన యాన సంస్థలూ--ఒకటేమిటి--సిగరెట్లూ, బీడీలూ, గుట్కాలూ తో సహా అందరికీ ఋణాలు ఇచ్చేశాయి). ఇప్పుడు "వృధ్ధి రేటు" లో భాగంగా అవన్నీ లెక్కించబడుతున్నాయి! ఇప్పుడు ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేస్తే, "వాటి" వృధ్ధి రేటు తగ్గిపోతుందికదా? అదీ మన పాలకుల బెంగ! నరసాపురం లాంటి చిన్న వూళ్లలో కూడా, ఇళ్లు కట్టించుకుంటూ, తమకి ఓ పోర్షన్, అద్దెకివ్వడానికి ఓ పోర్షన్ నిర్మించేసి, పార్కింగుల ప్రసక్తి లేకుండా ప్రహరీ గోడలు నిర్మించేసుకొని, ఇప్పుడు కార్లు కొనేసి, పదిహేనడుగుల సిమెంటురోడ్డులో కూడా, ఇళ్లముందు అగ్గిపెట్టెల్లా రోడ్డుమీదే పార్కింగ్ చేసేస్తున్నారు! అదీ మన వృధ్ధి! విమానాశ్రయాల్లో మౌలిక వసతులు పెంచకుండా, ప్రైవేటు విమాన సంస్థలని ప్రోత్సహించి, వాళ్లు చేస్తున్న సర్కస్ ఫీట్లూ, జిమ్మిక్ లూ వినోదంగా చూస్తూంది ప్రభుత్వం. ప్రభుత్వ విమానయాన సంస్థ "ఎయిర్ ఇండియా" (దాంట్లో ఇండియన్ ఏయిర్ లైన్స్ ని విలీనం చేసి) తో ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు, ఆడుకుంటున్నాడు ప్రఫుల్ పటేల్. ఇది 2జీ స్కాము కన్నా పెద్దది! మరి ఈ వృధ్ధి రేట్లకోసం యేడుద్దామా? ద్రవ్యోల్బణం గురించి యేడుద్దామా? దువ్వూరివారూ! యేమంటారు?1980 లలో, చైనాలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీ ఈ వో లు సైతం, సైకిళ్లపై తమ కార్యస్థానాలకి వెళ్లేవారు. నగరాల్లో పీక్ అవర్ ట్రాఫిక్ అంతా సైకిళ్లదే! అవన్నీ న్యూస్ రీళ్లుగా మనదేశంలో సినిమాలలో చూపించేవాళ్లు. ఆశ్చర్యపోవడం మావంతు! ఇప్పుడు అదే చైనాలో, సైకిళ్లు కనుమరుగయ్యాయి! బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగుళూరు లోలా, ఐదారు లేన్లలో కార్లు వెళుతూండడం, ట్రాఫిక్ జాములూ--షరా మామూలే చైనాలో కూడా. ఇప్పుడు బెంగుళూరు లాంటి నగరాల్లో, ముఖ్యమైన రహదారుల్లో, సైకిళ్లని ప్రోత్సహించాలని కంకణం కట్టుకున్నారట కొంతమంది అత్యుత్సాహులు! వుదాహరణకి, జయానగర్ లాంటి "జీ బీ లింగప్పలు" వుండే ప్రాంతంలో, "ప్రత్యేక సైకిలు ట్రాక్ లు" యెర్ర రంగులో యేర్పాటు చేస్తారట. బాగుంది. "ఫైవ్ స్టార్ హోటళ్లకి కారుల్లోనే వెళ్లాలా? సైకిళ్లమీద రాకూడదా?" అని ప్రశ్నిస్తున్నారట కొంతమంది. అనేక రెస్టారెంట్లముందూ, ఫుడ్ కోర్టుల ముందూ, ప్రస్తుతానికి ఓ "ఐదు" సైకిళ్లు పార్కింగ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారట. త్వరలో పార్కింగ్ సౌకర్యాన్ని వందా, వెయ్యీకి పెంచుతారట! "పెళ్లి కుదిరితేగానీ పిచ్చి తగ్గదూ, పిచ్చి కుదిరితేగానీ పెళ్లి అవదూ"; "పిచ్చి ముదిరింది, తలకి రోకలి చుట్టండి!" అనీ ఇలాంటి సామెతలు గుర్తుకు రావడంలేదూ? మన దేశ వృధ్ధి రేటేమయిపోను? సైకిలు ప్రమోషన్ లాబీలేమైనా యాక్టివేట్ అయ్యాయా? సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలా? అయితే యెవరూ? ఇవన్నీ శేష ప్రశ్నలు.