Thursday, June 30, 2011

కబుర్లు - 61

అవీ, ఇవీ, అన్నీ

చాలా కాలం తరవాత మన ప్రథాని నోరు విప్పాడు--పిచ్చి 'దంబరం' కూడా ఆయన తరచూ నోరు విప్పితే బాగానేవుంటుంది అన్న తరవాత.
 
నలుగురో ఐదుగురో హేమాహేమీల్లాంటి పత్రికా యెడిటర్లు ఆయన మనసులో వున్నది బయటపెట్టించలేకపోయారు. (ఓ మార్క్ టుల్లీ లాంటివాళ్లెవరైనా ప్రయత్నిస్తే బాగుండును). ఆయన యెప్పుడూ చెప్పేవే చెప్పారు. యెవరో మీడియాకి తప్పుడు ఆరోపణలతో సమాచారం ఇస్తున్నారు అనీ, మీడియా తానే ఫిర్యాదుదారూ, దర్యాప్తు సంస్థా, న్యాయ మూర్తీ పాత్రలని పోషిస్తోంది అనీ అన్నారు.

ఆ ప్రముఖ మీడియా ఎడిటర్లకీ సిగ్గు లేదేమో! సరిగ్గా నిలదీసిన దాఖలాలు లేవు. జూనియర్ విలేఖరులే మెరుగనిపించారు.
 
లోక్ పాల్ పరిధిలోకి తనను చేర్చడానికి అభ్యంతరం లేదు కానీ, తన మంత్రివర్గ సహచరులే వొద్దంటున్నారు అన్నాడట. మంత్రివర్గ సహచరుల మీద తనకి నియంత్రణలేదు అనడానికి ఇంతకన్నా ఋజువు యేమి కావాలి? మళ్లీ, నల్లధనం, ద్రవ్యోల్బణం ఆందోళనకరమే గానీ, తనదగ్గర 'మంత్రదండం' యేమీ లేదు అనీ, పెట్రో ధరల విషయంలో కూడా 'అద్భుత దీపం' లేదు అనీ, అన్నాడట. ఇలాంటి పిచ్చి మాటలు వినీవినీ చెవులు తడకలు కట్టలేదూ? రేప్పొద్దున ఆ పిల్లరాజు చేత 'నాదగ్గర మంత్రడం, అద్భుత దీపం ఇంకా చాలావున్నాయి' అని ప్రకటింపచేసేస్తారేమో! దేశ ప్రజలకి దేవుడే దిక్కేమో!
 
కొత్త విషయం ప్రణబ్ ఆఫీసు బగ్గింగ్ గురించి, మొన్న సెప్టెంబరులో ఆయన అనుమానం వ్యక్తం చేశారు, ఐ బీ చేత దర్యాప్తు చేయించాము, వాళ్లు అదేమీ లేదన్నారు. అయినా ప్రణబ్ మంత్రిత్వ శాఖ నుంచి యేదైనా వస్తే, హోం శాఖనుంచి 'లూప్' చెయ్యకుండా నాకే చెప్పమన్నాను! అన్నారట. ఇంక మేడం గారి గురించి అడిగితే, 'కిసుక్కున నవ్వి', నా ప్రభుత్వం చేసిన మంచిపనులు అన్నీ ఆవిడవల్ల జరిగినవే, చేతకాని పనులు అన్నీ నేనే చేసినవే! అన్నారట. మరి డిగ్గీ రాహుల్ ప్రథాని అవ్వాలంటున్నాడు కదా? అంటే, నాకు ఈ వుద్యోగం ఇచ్చారు. వుద్యోగం వున్నన్నాళ్లూ నేనే చేస్తాను. యువతరం ఆ వుద్యోగానికి రావలసిందే. మేడం ఇప్పటివరకూ నీ వుద్యోగం పీకేస్తానని అనలేదు. ఒకవేళ అంటే, నిక్షేపంగా పదవీ విరమణ చేస్తాను. అని వినయం వొలకబోశాడు. ఆయన "నికమ్మా"త్వానికి ఇంతకంటే నిదర్శనాలు యేమి కావాలి? పైగా మళ్లీ పదిహేనురోజులకోసారి నోరు విప్పుతారట--యెంపిక చెయ్యబడ్డ మీడియా ప్రతినిధుల ముందు! యెందుకూ? ఖర్చులూ, సమయం దండగ! ఆయన చెప్పిన, చెపుతున్న, చెప్పబోయే విషయాలు యెవరికి తెలియవని???!!!

ప్రణబ్ మంత్రివర్గం చేతిలో వుండే ఆదాయపన్ను శాఖ క్రిందవుండే 'ఎన్‌ఫొర్స్ మెంట్ డైరక్టరేట్' లాంటి ఐదో ఆరో దర్యాప్తు సంస్థలకి తగిన 'మౌలిక వసతులు' లేకపోవడంతోనే, ఓ ప్రైవేటు సంస్థని వినియోగించాము అనీ, ఆ సంస్థ 16 చోట్ల "మెత్తటి పదార్థాన్ని" కనుగొంది అనీ, అది బబుల్ గమ్ ఖచ్చితంగా కాదు అనీ, ఆ విషయంలో ఆ కార్యాలయాల్లో పారిశుధ్యం నిర్వహించే అధికారినీ, పనివాళ్లనీ సస్పెండు చేశాము అనీ, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ప్రతినిధి అదేదో "గుప్తా" అనేవాడు ప్రకటించాడట! మన ఆదాయ పన్ను శాఖా దానిక్రింద దర్యాప్తు సంస్థలూ కూడా "నికమ్మా"లేనన్నమాట! మరి బాధ్యులైనవాళ్లని ప్రశ్నించి, ఆ పదార్థాన్ని యెవరు పెట్టమన్నారు, ఆ పెట్టమన్నవాళ్లని ప్రశ్నించి, ఆ పదార్థంలోని నొక్కులూ వగైరా గుర్తులవల్ల అక్కడేమి అతికించారు, యెన్నాళ్లు, యేమి సమాచారం సేకరించారు, యెవరికి ఇచ్చారు--ఇలాంటివేమీ కనుక్కోవాలని కూడా ఆ నికమ్మాలకి తోచడం లేదు! ఆ పనులు చేయించినవాడినీ, అలాంటి వెధవల్నీ ఓ పట్టు పడితే, మంత్రదండాలూ, అద్భుతదీపాల అవసరం వుంటుందంటారా?

తెలంగాణాకి 'గూర్ఖా లేండ్' తరహా......అని యెవరో (పిచ్చి 'దంబరమే' అంటున్నారు) పిత్తితే, మళ్లీ కేసీఆర్, తన 'రాజకీయ పార్టీల తో చర్చలలో' భాగంగా మళ్లీ తెలంగాణా కాంగ్రెస్ నేతలతో, జానారెడ్డి ఇంటికివెళ్లి మంతనాలు సాగించాడట. అందరూ రాజీనామాలు చేస్తే, 'రాజ్యాంగ సంక్షోభం' వస్తుంది అనీ, అప్పుడు తెలంగాణాని వొడిసిపట్టుకోవడం చాలా వీజీ అనీ, ఒకవేళ అలాంటి సంక్షోభమేమీ రాకపోయినా, వాళ్లందరూ తెరాస టిక్కెట్లమీదో, స్వతంత్రులుగానో పోటీచేస్తే, ఇతరులెవరూ బరిలో నిలవరు అనీ, మళ్లీ వాళ్లనందరినీ నెగ్గించే బాధ్య తాను చూసుకుంటాను అనీ (పనిలో పనిగా జానారెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాను అనీ) హామీలిచ్చేశాడట. జానారెడ్డి యెగిరిగంతేసినా, మిగిలినవాళ్లు 'విస్తృత సమావేశం' నిర్వహించి, అప్పుడు చెపుతాం అన్నారట. వాడిమాటలు నమ్మెయ్యడానికి--పోటికి నిలవకుండా వుండడానికి తెరాస, ఐకాస నాయకులూ, కుక్కతోకపట్టుకొని గోదారి ఈదగలము అనుకోడానికి కాంగీ నేతలూ 'వెర్రిపప్పలు' లా కనిపిస్తున్నారేమో వాడికి! అప్పుడే కొంతమంది ఎంపీలూ, రాజ్యసభ సభ్యులూ--మేము రాజీనామాలు చెయ్యం, మీరూ మీరూ చూసుకోండి అనికూడా అనేశారట. తననీ, కోదండరాం నీ, వేదికపైనున్న నేతలనందరినీ "జైళ్లలో" పెట్టినా భయపడం అని జయశంకర్ సంస్మరణసభలో ప్రకటించాడట. దొంగాడా చెయ్యి కొరుకుతావన్నట్టు, కి కు రె అలాంటి పిచ్చిపని చేస్తే, మళ్లీ తెలంగాణాని అగ్నిగుండం చేసేసి, సామాన్యులకీ, విద్యార్థులకీ బొందలుపెట్టి, ఆనందిద్దామనుకుంటున్నాడు పాపం! ఈ సారి సంక్షోభం రాదు అనీ, 356 అని పెద్ద పెద్ద అంకెలు హైరరాబాదంతా ఆకాశంలో కనిపిస్తున్నాయి అనీ అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి వాడికి యెందుకు కనపడడంలేదో?

"నేనింక సినిమాలలో ముఖ్యమంత్రిగా నటించను. నిజం ముఖ్యమంత్రిగానే చూడాలని ప్రజలు ఆశగా యెదురుచూస్తున్నారు" అని ప్రకటించిన చిరంజీవి, అందాకా, వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో యే నౌకాశ్రయాలశాఖో కేటాయిస్తే ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోతానన్నా, "మాలో మేమే కొట్టుకు ఛస్తున్నాం! క్యూలో చివర నిలబడితే, అక్టోబరు నెలాఖరుకి యేమైనా ఫలితం వుండొచ్చు" అన్నారట అసలువాళ్లు. మరేమి చేస్తాడో?

హోదా, పరపతి గల నేరస్తులమీద దర్యాప్తూ, విచారణా యేమాత్రం జరగకపోవడంతో, దేశంలో చట్టబధ్ధ పాలన చట్టుబండలు అవుతోంది అంటూ ఆయనెవరో సుప్రీం కోర్టులో 'పిల్' దాఖలు చేస్తే, కోర్టుకూడా 'విచారిస్తూ', లా కమిషన్ వారూ, ప్రభుత్వమూ 'సమగ్ర నివేదిక' ఇవ్వాలని ఆదేశించిందట. బాగానే వుంది. సదరు కమిషన్ వగైరాలు యేమి నివేదిక ఇస్తారో మళ్లీ వాయిదానాటికి చూడాలి.

(ఈ న్యాయాలయాలూ, అక్కడనడిచే 'తతంగాలూ' సామాన్యులెవరికీ అర్థం కాని చిదంబర రహస్యాలు. వాటి విషయంలో ఇంకో టపా వ్రాస్తాను.)

అమరనాథ యాత్ర మొదలయ్యిందట. కొన్ని సార్లు, సంవత్సరానికోసారి యేర్పడే ఆ మంచులింగం చిన్నదిగానే వుండడం, త్వరగా కరిగిపోతూండడం లాంటి కారణాలతో, ఆ ప్రదేశంలో ఓ రాతి లింగాన్ని ప్రతిష్టిస్తే, మంచు కరిగిపోయినా దేవుడున్నట్టు వుంటుందని వో ప్రతిపాదన వచ్చిందట--ఆ ప్రభుత్వంలో పెద్దలనుంచే అనుకుంటా. (హిమాలయాలని కూడా వదలకుండా, బంగారు తాపడాలూ అవీ చేశేసి, నిత్యాన్నదానాలూ అవీ ప్రవేశపెట్టీసి, బాగా డబ్బుచేసుకోవచ్చని గొప్ప ప్లానే వేశారు కానీ, అక్కడి ఆలయ పూజారులూ, మతపెద్దలూ "ససేమిరా" అన్నారట. ఆ లింగుడు అంతవరకూ అదృష్టవంతుడే!

ఇంకో గొప్పవిషయం యేమిటంటే, కేరళ పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగలో, ఇన్నాళ్లూ తెరవకుండా వుంచిన ఆరు అరల్లో, ఓ మూడింటిని తెరిపిస్తే, సుమారు 700 కోట్ల విలువైన బంగారు, రత్నాల ఆభరణాలూ, అలంకరణ వస్తువులూ లభించాయట. అలా తెరవాలని చెప్పి, సుప్రీంకోర్టే పుణ్యం కట్టుకొంది. ఆ లెఖ్ఖంతా పారదర్శకంగానే జరిగిందంటున్నారు. బృందంలో యేడుగురు సభ్యులూ, అందులో ఇద్దరు కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తులూ వున్నారట. మరి అది నిజమైన పారదర్శకతేనా, సత్యసాయి ట్రస్టు లాంటిదా? యేమో--సుప్రీంవారే తేల్చాలి.  

   

No comments: