Friday, June 24, 2011

కబుర్లు - 59

అవీ, ఇవీ, అన్నీ


(యేమిటో--ఈ మధ్య యెంత సీరియస్ విషయాలు యెంతగా సణిగినా, తెలుగు బ్లాగర్లెవరూ సీరియస్ అవడంలేదు యెందుకో మరి!)కాంగీ కార్యదర్శి డిగ్గీ సింగ్, "రాందేవ్ కి పట్టిన గతే అన్నాకీ పడుతుంది" అని హెచ్చరించాడట! మళ్లీ "థూ నా బొడ్డు" అని, "రాం దేవ్ నేమి చేసినా, అన్నానేమి చేసినా, మా పార్టీకి సంబంధం లేదు. స్థానిక వ్యవస్థే చూసుకుంటుంది అన్నానంతే" అన్నాడట. అంటే షీలా, నువ్వు చూసుకో అని చెప్పడమా? (మొన్నోరోజు వీడే, "రాహుల్ ఇంక పెళ్లి చేసుకొని (వాడికి 41 యేళ్లిప్పుడు!), ప్రథానమంత్రి అయిపోవలసిన రోజు దగ్గరకి వచ్చేసింది" అని, మళ్లీ నేనలా అనలేదు అనేశాడు!) అన్నా దీక్ష అంటే ఓ సారి రుచి చూశాడుగా! అందుకే, ఆయనకాకుండా, ప్రశాంత్ భూషణ్ గానీ, కేజ్రివాల్ గానీ దీక్ష చేస్తే బాగుంటుంది అని కూడా అన్నాడట! వాడికి దీటుగా, "అన్నా చేస్తున్నాడా, ఇంకొకరా అన్నది కాదు ప్రశ్న. యెవరు చేసినా 'దేశ ప్రజానీకం యవత్తూ' దాని వెనక వుందని మరచిపోవద్దు!" అని జవాబిచ్చాడు అన్నా. బుధ్ధి తెచ్చుకుంటారా?చిత్రమైన విషయమేమిటంటే, ప్రభుత్వం ప్రవేశపెట్టదలుచుకున్న లోక్ పాల్ బిల్లు లో, అవినీతి చేసినవాడికంటే, వాడిమీద ఫిర్యాదు చేసినవాడికి యెక్కువ శిక్ష విధించవచ్చట! ప్రభుత్వ కర్మచారులందరినీ లోక్ పాల్ పరిధిలోకి తెస్తే, ఓ 40 లక్షలమంది కేంద్ర వుద్యోగులూ, 80 లక్షల మంది రాష్ట్ర వుద్యోగులమీదా మొత్తం 1 లక్షా 20 వేల ఫిర్యాదులు వస్తే, లోక్ పాల్ వుక్కిరిబిక్కిరి అయిపోతాడట! (అంటే, లోక్ పాల్ బిల్లు రాగానే ఖచ్చితంగా "అందరు" కర్మచారులపైనా ఫిర్యాదులు వస్తాయని గట్టి నమ్మకం అన్నమాట ప్రభుత్వానికి!). అసలు ఆ గొడవెందుకు? ఓ సారి లోక్ పాల్ యేర్పడ్డాక, వాడే చూసుకుంటాడు కదా--యే ఫిర్యాదుని, యెన్ని ఫిర్యాదులని యేమి చెయ్యాలో? ఇంక శిక్షల విషయానికొస్తే, ఓ స్పెషల్ కోర్టు ఫిర్యాదు పనికిమాలినది అని తలిస్తే, ఫిర్యాదీకి 'కనీసం ' 2 సంవత్సరాల శిక్ష విధించవచ్చట. వుదాహరణకి ఓ వూళ్లో యువజన సంఘం వాళ్లు, స. హ. చట్టం క్రింద దరఖాస్తుచేసి, మా సర్పంచ్ ఇంత తినేశాడు అని ఫిర్యాదు చేస్తే, స్పెషల్ కోర్టు వాళ్లు "ఠాట్! అది బోగస్ ఫిర్యాదు" అని సంఘం లో అందరికీ తలా రెండేళ్లూ శిక్ష వేసెయ్యచ్చట. సర్పంచ్ ఆ పరిధిలోకి రాడు కాబట్టి, వాడికి శిక్ష వుండదట! యెంత బాగుందో కదూ!యజుర్వేద మందిరం లో వున్న నగదూ, బంగారం వగైరా లెఖ్ఖించేశారు. కానీ, ఆ మందిరం తెరిచిన వెంటనే, ఓ ముఫ్ఫై ఐదున్నర లక్షలు, ఓ ట్రస్ట్ మెంబరు, ఓ కారులో బెంగుళూరు తరలిస్తూండగా, చెక్ పోస్ట్ లో పట్టేశారు! అవి ఓ 12 మంది భక్తులకి చెందినవి అనీ, వాళ్లు పోలీసు స్టేషన్ కి వెళ్లి, ఋజువులు చూపించి, తీసుకెళతారనీ, బాబా వారసుడు రత్నాకర్ ప్రకటించాడట. ఇంతవరకూ వాటిని యెవరూ తీసుకెళ్లలేదు. పోలీసులు విచారిస్తున్నారు! ఇంకా, రెండు గోనె సంచుల్లో 5 కోట్లో, 10 కోట్లో కుక్కేసి, ఓ వోల్వో బస్సులో తరలిస్తూంటే, పట్టుకున్నారట. దాని సంగతి యేమయిందో మరి పత్రికలలో కుడా రావడంలేదు. మధ్యలో, జగన్, తన అనుచరులూ, వారి పాద రక్షలూ సహా, సాయి మందిరంలో రత్నాకర్ ని కలిసాడట. యేమి చర్చించారో రహస్యం!ఓ తొమ్మిది నెలల క్రితం, ప్రణబ్ గారి ఆఫీసులో, ఓ 16 చోట్ల దొంగ కెమేరాలూ, టేపులూ పెట్టిన వైనం ఆయనే గమనించి, వెంటనే ఆ విషయం దర్యాప్తు చెయ్యమని ఓ ప్రైవేట్ సంస్థకి అప్పగించారట! ఆ దొంగ కెమేరాలు హోం మంత్రిగారే పెట్టించాడు అని చెవులు కొరుక్కొంటున్నారట. లేకపోతే, దర్యాప్తు సీబీఐ కే అప్పగించేవారుకదా? అని క్రొశ్నిస్తున్నారు. నిజమే కదా? తొమ్మిది నెలల తరవాత, ఆ పదహారుచోట్లా వున్నది "బబుల్ గం" మాత్రమే అనీ, దాంట్లో పెద్ద విచారించవలసిన అగత్యం లేదనీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయట! (బబుల్ గం నవిలేసి, దాంతో యేమేమి చెయ్యచ్చో "జెఫ్ఫ్రీ ఆర్చర్" కథలూ, నవలలూ చదవండి). ఆర్థిక మంత్రే టాయిలెట్ లో యేమి చేస్తున్నాడో బయటివాళ్లు వీడియోలు చూస్తున్నారంటే, సామాన్యులకి దిక్కెవరు?మొన్నోరోజు అదేదో "దాస్ గుప్తా" అనే ఆర్థిక నిపుణుడి వ్యాసం వొకటి చదివాను. ఆర్థిక సంస్కరణల తరువాయి భాగం అమలు చెయ్యడంలో ప్రభుత్వం అనవసరంగా ఆలస్యం చేస్తూంది అనీ, కైర్న్-వేదాంత మీద యేడాది పైగా నాంచుతోంది అనీ, పోస్కో వ్యవహారంలో రాజకీయాలకి ఆస్కారం ఇచ్చి, ప్రాజెక్టుని అలస్యం చేస్తోంది అనీ, చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీ ప్రతక్ష పెట్టుబడులని యెంత తొందరగా ఆహ్వానిస్తే అంత త్వరగా ద్రవ్యోల్బణం తగ్గి, వృధ్ధి రేటు పెరిగిపోతుంది అనీ--ఇలా అమూల్యాభిప్రాయాలని వెలిబుచ్చాడు. ఈయన యెవరి కొమ్ము కాస్తున్నాడో తెలుస్తూనే వుంది కదా? ఇంకా, ఈయనే అనుకుంటా, రతన్ టాటా గత సంవత్సరంలో 16 దేశాల్లో కోట్లాది పెట్టుబడులు పెట్టాడనీ, మనదేశంలో ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు అనీ, అది దేశం లోంచి పెట్టుబడి 'యెగిరిపోవడంతో' (ఫ్లైట్ ఆఫ్ కేపిటల్) సమానమనీ అన్నాడు. మరి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీవాళ్లు ఓ నాలుగువందలేళ్లక్రితం మనదేశం లో పెట్టుబడులు పెట్టడం పెట్టుబడి 'యెగిరిపోవడమే' అనుకున్నారా? సంపద తమ దేశానికి "యెగిరి రావడం" అనుకున్నారా?! యేమిటో ఈ ఆర్థిక నిపుణులు!కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్డి ఊరప్ప (తన పేరు "యెడ్యూరప్ప" అని మాత్రమే ప్రచురించాలని ఆయన యెన్నికవగానే మీడియా వాళ్లకి ఆఙ్ఞ జారీ చేశాడు) తనతో 'సఖ్యంగా' వుండమని చెప్పడానికి యెవరినో తనదగ్గరకి పంపించాడని కుమార స్వామి అన్నాడు. వెంటనే, మర్నాటి పేపర్లో, యెడ్యూరప్ప ఓ ప్రకటన ఇచ్చాడు--కుమార స్వామి అదే ఆరోపణ, ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో "ఆన" పెట్టాలనీ, తానుకూడా ఆ ఆరోపణ అబధ్ధమని "ఆన" పెడతాననీ, డేటూ టైమూ చెప్పమనీ! మొత్తానికి రేపు 27 న ఇద్దరూ అక్కడ ఆనలు పెట్టడానికి యేర్పాట్లు చేస్తున్నారు! జనాలు పిచ్చోళ్లు అనుకోబట్టిగానీ, మంజునాథుడిమీద అంత భయమూ, భక్తీ, నమ్మకమూ వుంటే, అసలు యెవడైనా గడ్డి యెందుకు కరుస్తాడు? ఇదో రకం రాజకీయం మరి!

9 comments:

శరత్ 'కాలమ్' said...

మీ కబుర్లు చూస్తుంటే గ్రేటాంధ్రాలో ఎ బి ఎన్ ప్రసాద్ న్యూస్ జాటింగ్స్ చదివినట్లుగా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

Praveen Sarma said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.in - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్‌లో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్‌లోని పాత ఆర్కివ్‌లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా

Indian Minerva said...

"వాడిమీద ఫిర్యాదు చేసినవాడికి యెక్కువ శిక్ష విధించవచ్చట"

శభాష్... ఎంతయినా మరి ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు కదా ఎంతమంది దొగ గాడిదలు తప్పించుకుపోయినా.

యెడ్యూరప్ప.... నాకు తెలీకడుగుతానూ వాడెం ముఖ్యమంత్రండీ. కేరళ, మంత్రవైద్యం అని తిరుగుతుంటాడు. మరీ అంత వ్యామోహమా పదవిమీద. కర్ణాటక రాజధానిని అర్జంటుగా కేరళలోకి షిఫ్ట్ చెయ్యాలంటుంటాను అప్పుడైతే ఈ రానుపోను ఖర్చులు కలిసొస్తాయి "మా" ముఖ్యమంత్రి గారికి.

కృష్ణశ్రీ said...

డియర్ శరత్!

ఎ బి ఎన్ ప్రసాద్ అంటే ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్ట్ అనుకుంటా. ఆయనతో నాకు పోలికా! ధన్యోస్మి.
'గ్రేటాంధ్రా'కి ఓ లింకు ప్రసాదిస్తే ఇంకా సంతోషం.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ Praveen Sarma!

నా బ్లాగ్ మీ ఏగ్రిగేటర్ లో కనపడింది. సంతోషం.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ Indian Minerva!

ఇక్ష్వాకుల కాలం నాటి ఆ వెర్రితోనే దొంగ గాడిదలు తప్పించుకుంటున్నాయి! అవునా?

పోనీలెద్దురూ.....మీ ముఖ్యమంత్రి ప్రక్కనే వున్న కేరళకే వెళుతున్నాడు. మీరన్నట్టయితే, మా రాజధానిని ఢిల్లీకే మార్చాలి. మీ రాష్ట్రానికి లక్షల్లో కలిసొస్తే, మాకు కోట్లలో కలిసొస్తాయి.

మా కి.కు.రె గోళ్లన్నీ కొరికేసుకొని, ఇంక వేళ్లు కొరుక్కోడం మొదలెడదామనుకుంటున్నాట్ట!

ధన్యవాదాలు.

panipuri123 said...

> ఎ బి ఎన్ ప్రసాద్ న్యూస్ జాటింగ్స్
శరతన్న చెప్పింది కరక్ట్...
http://telugu.greatandhra.com/

panipuri123 said...

it's not ABN Prasad,
it's mbsprasad@gmail.com
http://telugu.greatandhra.com/mbs/political/index.php

కృష్ణశ్రీ said...

డియర్ panipuri123!

హమ్మయ్య! శరతన్న చెప్పింది కరక్ట్ అన్నారంటే, నేనింక రెండు వీరతాళ్లూ తగిలించుకోవచ్చన్నమాట. లింకులు ఇచ్చినందుకు సంతోషం. మరేఁ....ఏ బీ ఎన్ అంటే ఆంధ్రజ్యోతి కదా....ఎంబీఎస్ కరెక్టు. మరి జాటింగ్స్ వేరే యెక్కడైనా వుంటాయా? కనిపిస్తున్నవేనా?

ధన్యవాదాలు.