Friday, June 17, 2011

(యమర్జంటు) కబుర్లు - 57


అవీ, ఇవీ, అన్నీ


తాటిపట్టెల్లాంటి తమ నాలుకలని కూడా యెన్ని మెలికలు తిప్పగలవో--మన గుంట నక్కలు--అని అస్తమానూ అశ్చర్యపోవడం మనవంతు!

మొన్న 15-06-2011న జన లోక్ పాల్ విషయంలో, ప్రభుత్వ, పౌరసమాజ ప్రతినిధుల చర్చలు ఫలించలేదు కానీ, మళ్లీ 20, 21 తారీఖుల్లో మళ్లీ చర్చించాలని మాత్రం వొప్పుకున్నారట. "అప్పటికీ యేకాభిప్రాయం రాకపోతే, 'ఇరుపక్షాల వాదనలతో' 'ఒక ' చిత్తు ప్రతి (డ్రాఫ్ట్) కేబినెట్ కి సమర్పిస్తాం" అన్నాడు క 'పిల్సి 'బల్. ఇంకా వివరిస్తూ, "మా ఆశప్రకారం, పౌర సమాజం వాళ్లు తీవ్ర విభేదాలున్న ఆంశాలపై 'ఒక' ప్రతిని మాకిస్తారు. విభేదాలు వున్నాయని 'మేమనుకుంటున్న' అంశాలపై 'ఒక' ప్రతిని తయారుచేసి, అప్పుడు 'యేకాభిప్రాయానికి రావడానికి ' ప్రయత్నిస్తాము" అన్నాడు. (ప్రశాంతి భూషణ్ మాత్రం, "మౌలిక విభేదాలు చాలా వున్నాయి కాబట్టి, ఇంక మంత్రివర్గమే నిర్ణయం తీసుకోవాలి" అన్నాడు.)


ఓ నక్క "వూళ" పెట్టగానే, మర్నాటికల్లా మిగిలినవి యేమన్నాయో చూడండి! ప్రభుత్వం 'మీ డిమాండ్లు అన్నీ తీరుస్తాం' అని చెప్పింది కాబట్టి, ఇదివరకు నా దీక్ష విరమించాను, ఇప్పుడు ఆ వాగ్దానాలపై మళ్లీ వెనక్కి పోతోంది కాబట్టి, మళ్లీ ఆగష్ట్ 16 నుంచీ దీక్ష చేస్తాను" అని హజారే ప్రకటించడం పాపమట. "ప్రభుత్వం, దేశానికి ఓ మంచి చట్టం చేసివ్వడం అనే ఒక గొప్ప అవకాశాన్ని చేతులారా పాడుచేసుకోడమే కాకుండా, నాటకం ఆడుతూంది. ప్రభుత్వ బిల్లు 'జోక్ పాల్ ' బిల్లు మాత్రమే!" అని కేజ్రీవాల్ అనడం మహా పాపమట! ప్రభుత్వం మాత్రం, జూన్ 30లోగా బిల్లు ప్రతిని 'ఆశించినప్రకారం, పౌరసమాజం సహకారంతో' సిధ్ధం చేయడానికి దృఢ సంకల్పంతో వున్నాము" అని ప్రకటించిందట! (దీని నోరు యేదో?)

గుంటనక్కలు మూడు, త్రిగళగీతం ఆలాపించాయట! (పిచ్చి 'దంబ 'రం; క 'పిల్సి 'బల్; సల్మాంకుర్ 'షిద్ ' లు!). ఈ చివరినక్క, "ప్రభుత్వం 'మేము ' నడిపిస్తూంటే, నిర్ణయాలు 'బయట ' జరిగితే, ఇంక ప్రభుత్వం యెందుకు?" అందట! (ఆ అహంకారమే వద్దంటూంది పౌర సమాజం!). రెండో నక్క, "ప్రభుత్వానికి సమాంతరంగా వేరే నిర్మాణాన్ని సృష్టించలేము. ప్రభుత్వం తనంతటతాను తన 'అధికారాన్ని ' యెందుకు వదులుకోవాలి?" అందట! (అధికారం తలకెక్కి, దిగకపోతేనే పౌరసమాజం కళ్లెర్రజేస్తోందిరా మూర్ఖా!). "ఓ ప్రక్క బెదిరిస్తూ, చర్చలు జరపడం కుదరదు" అని కూడా అందట. "ప్రపంచంలో యెక్కడా ఓ ప్రతిని తయారు చెయ్యడానికి 'వుపవాసం ' ఓ మార్గమని నేననుకోను!" అందట మొదటి నక్క, తన తాటిపట్టెని వెకిలిగా వ్రేళ్లాడేస్తూ! (మీచేత మూడు చెరువుల నీళ్లు త్రాగించడానికి 'వుపవాసమే' సరైన మార్గం కదరా? 'పళ్లన్నీ'యప్ప!)

ఈ మూడూ కాకుండా, వేరేప్రక్కనుంచి, ఓ మీసాలు వ్రేళ్లాడేసుకునే నక్క వీ'రప్ప ' "అదొక్కటే పౌరసమాజమా? ఇంకాకొన్ని పౌరసమాజాలున్నాయి! ప్రభుత్వం 'జాతీయ యేకాభిప్రాయం ' కోరుతోంది" అని తన గణిత, సాంఘిక శాస్త్రాల పరిఙ్ఞాన్ని బయటపెట్టుకొంది! పైగా, "మొత్తం 40 అంశాల్లో, 34 అంశాలపై యేకాభిప్రాయం వుంది. అయినాసరే, చర్చించకుండా దీక్ష చేస్తాను అంటే, ఆయన ముందే నిర్ణయించుకున్నట్టు!" అని తెలివిని ప్రదర్శించింది! (పౌరసమాజం వొకటేననీ, దాని ప్రతినిధులు వేరువేరుగా వుండొచ్చనీ కనీస ఙ్ఞానం లేదా? పౌర సమాజం చెప్పేది జాతీయ యేకాభిప్రాయం కాదా? అసలైన ఆ "ఆరు" అంశాలపై చర్చించే ప్రసక్తే లేదని భీష్మించిందెవరురా దరిద్రుడా?).

అసలు ప్రభుత్వం తరఫున "మీ డిమాండ్లకి ప్రభుత్వం అంగీకరిస్తోంది" అని చెప్పి, "అన్నా" చేత దీక్ష విరమింపచేసింది ఇవే గుంటనక్కలు కాదూ? వీళ్లందరికీ రాజైన "నీలిరంగు నక్క" వూళపెడితే యెక్కడ ఛస్తానో అని నోరు విప్పదు! ఆ నక్కని అడవికి రాజుని చేసిన ఇటలీ దేవత "చివరికి"గానీ నోరు విప్పదు--అటో ఇటో తేలేదాకా!

అతి ప్రమాదకర విషయం యేమిటంటే, కేపిటలిస్ట్ సమాజ ప్రతినిధి--టైమ్‌స్ ఆఫ్ ఇండియా--"అన్నా హజారే నేతృత్వంలోని ఒక ఫ్యాక్షన్" అని మొయిలీ అన్నాడని రిపోర్టు చేసింది! ఆయన అన్నాడో, వీళ్లే వాడినోట్లో ఆ మాటలు కుక్కారో! ఫ్యాక్షనిష్టులూ.....జాగ్రత్త!

నా విఙ్ఞప్తి--ఈజిప్టు తరహా అంటూ అయ్యవారిని చెయ్యబోయి కోతులని చెయ్యక, ఈ గుంటనక్కల మెలికలు తిరిగే తాటిపట్టెల వ్యవహారాలని మీ శాయశక్తులా ప్రచారం చెయ్యండి! "అన్నా" ముందు వీళ్లందరూ యెందుకు మోకరిల్లరో చూద్దాం!

జై భారత్!

No comments: