Sunday, June 26, 2011

కబుర్లు - 60

అవీ, ఇవీ, అన్నీ

డీజల్ ఓ 3 రూపాయలూ, వంట గ్యాస్ ఓ 50 రూపాయలూ, కిరోసిన్ ఓ 2 రూపాయలూ మాత్రమే పెంచడంతో సరిపెట్టారు సర్కారువారు. అంతేకాక, తమ రాబడిలో ఓ 49,000 కోట్లు మాత్రమే వుదారంగా కోత పెట్టుకొని సంతృప్తి పడ్డారు. యేమాత్రం సంతృప్తి లేని, ఇనుకుడు కుండీల్లాంటి పొట్టలుగల ఆయిల్ కంపెనీలు మాత్రం, ఇంకా ఓ లక్షా ఇరవైవేలో యెన్నో కోట్లు నష్టాలు మూటగట్టుకుంటూనే వున్నాయట. అదీ అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్ 100 డాలర్లకన్నా తగ్గిన సమయంలో! రాష్ట్రాలు కూడా వుదారంగా తమ రాబడుల్లో కోతపెట్టుకోవచ్చని సలహా కూడా ఇచ్చారు. మమతాదీ అప్పుడే కోత పెట్టేసుకొంది గానీ, మహారాష్ట్ర, ఆంధ్ర లాంటివాళ్లు 'ససేమిరా' అంటున్నారు. ఇంక ద్రవ్యోల్బణం మాట దేవుడెరుగు!డిగ్గీ సింగ్ "రాహుల్ ప్రథాని పదవికి అర్హుడు" అని మాత్రమే అన్నాను. అయినా ఇప్పుడు ఆ పదవి ఖాళీ లేదుగా?! అన్నాట్ట. అంటే, ఖాళీ చేయించే పని చూడండ్రా అని తన తోటి భజంత్రీగాళ్లకి పురమాయిస్తున్నాడా? పిచ్చి 'దంబరం' పేపర్లో చూసేవరకూ సీబీఐ ప్రణబ్ ఆఫీసుల బగ్గింగ్ విషయంలో దర్యాప్తు జరుపుతోంది అని నాకు తెలీదు--అన్నాడట. అదేమి హోమో! అదేమి మంత్రో! నిజంగా సీబీఐ దర్యాప్తు సాగిస్తోందా? మరి ప్రైవేటు సంస్థ దర్యాప్తు సంగతేమిటి? అంతా "అంధేర్ నగరీ, అన్ భుజ్ రాజా" వ్యవహరం లా వుంది! మోక్షానికి 2014 దాకా ఆగాలా?మంత్రివర్గానికీ, పార్లమెంటుకీ సమర్పించబోయే "లోక్ పాల్" బిల్లులో, పౌరసమాజం సూచనలని పొందు పరిచే అవకాశం యెంతమాత్రం లేదు అనీ, అది ప్రభుత్వం ప్రతిపాదించిన పాత బిల్లు కూడా కాదు అనీ, దేశానికి యేది మంచిది అనుకుంటే అది చేసే స్వేచ్చ అన్నా హజారేకి యెప్పుడూ వుంటుంది అనీ--ప్రకటించేశాడు క 'పిల్సి 'బల్! పౌర సమాజం, ప్రజా సమూహం "ఈజిప్టు" తరహాలో వీళ్లకి గట్టిగా బుధ్ధి వచ్చేట్టు చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఓ ఇరవై రోజులు సమయం వుంది కాబట్టి, ఆ దిశలో విజృంభించాలని బ్లాగర్లకి నా విఙ్ఞప్తి!నేనన్నట్టే చాలామంది నల్లధనాన్ని "స్విస్" బ్యాంకుల్లో వెతకనఖ్ఖరలేదు, దేశంలో వెతికితే చాలు అంటున్నారు. నిజానికి, స్విస్ బ్యాంకులు ఖాతాల్లో దాచుకున్న సొమ్ముకి నూటికి సంవత్సరానికి 1% మాత్రమే వడ్డీ చెల్లిస్తాయి! వాములు మేసే స్వాములకి ఇవి తిన్నాక పళ్లలో చిక్కుకున్నంత కూడా కాదు! అందుకనే వాళ్లు ఆ ఖాతాలని "ఫండ్స్ పార్కింగ్" కోసమే తాత్కాలికంగా వాడుకొని, అక్కడనుంచి విదేశాలలోని తమ దొంగ ఖాతాల ద్వారా మన దేశానికి తరలించి, తెల్లధనం గా చెలామణి చేస్తూ, భారతీయ కుబేరులుగా "ఫోర్బ్స్" మేగజైన్ కి యెక్కుతున్నారు. కోరలు లేని "ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్" లాంటి చట్టాలూ, అవగాహన లేని దర్యాప్తు సంస్థల వుద్యోగులూ, ఒకవేళ వున్నా, పైవాడి అదేశాలకి యెదురుచూడ్డానికి అలవాటు పడడం--ఇలాంటి వాటివల్ల అవి నిష్ప్రయోజనంగా మారాయి. అలాంటివాళ్ల భరతం బట్టడానికి పౌర సమాజం యేమి చెయ్యగలదు? జన లోక్ పాల్ బిల్లు చట్టం అయ్యాక, ఈ పని మొదలెడదాం. బారాందే! నువ్వుకూడా వెయిటూ!ఓ పాతిక సంవత్సరాల క్రితం, బ్యాంకులు "వుత్పత్తి రంగానికే ఋణాలు" (ప్రొడక్టివ్ క్రెడిట్) ఇచ్చేవి. ఆ రోజుల్లో, పెరుగుతున్న జనాభాకి సరిపోయే "మకాన్"ల ఆవశ్యకత గ్రహించిన ప్రభుత్వం, నేషనల్ హౌసింగ్ బ్యాంకుని స్థాపించి, గృహ నిర్మాణ రంగాన్ని ప్రాథాన్యతా రంగం లో చేర్చి, బ్యాంకులని కూడా ధారాళంగా ఆ రంగానికి అప్పులు ఇవ్వమంది. తరవాత, సంస్కరణల పుణ్యమా అని, "మౌలిక వసతుల రంగం" (రోడ్లూ, పవర్ ప్లాంటులూ, విమానాశ్రయాలూ వగైరా) ప్రాధాన్యత గుర్తించి, పెట్టుబడులని ఆ వైపు మళ్లించారు. సందట్లో సడేమియాగా బ్యాంకులు ప్రాధాన్యత అసలు ఇవ్వకూడని రంగాలు (మద్యం తయారీదారులూ, వాటి హోల్ సేల్, రిటెయిల్ వ్యాపారులూ, మోటర్ సైకిళ్లూ, కార్లూ తయారుచేసే ఫ్యాక్టరీలూ, ప్రైవేటు విమాన యాన సంస్థలూ--ఒకటేమిటి--సిగరెట్లూ, బీడీలూ, గుట్కాలూ తో సహా అందరికీ ఋణాలు ఇచ్చేశాయి). ఇప్పుడు "వృధ్ధి రేటు" లో భాగంగా అవన్నీ లెక్కించబడుతున్నాయి! ఇప్పుడు ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేస్తే, "వాటి" వృధ్ధి రేటు తగ్గిపోతుందికదా? అదీ మన పాలకుల బెంగ! నరసాపురం లాంటి చిన్న వూళ్లలో కూడా, ఇళ్లు కట్టించుకుంటూ, తమకి ఓ పోర్షన్, అద్దెకివ్వడానికి ఓ పోర్షన్ నిర్మించేసి, పార్కింగుల ప్రసక్తి లేకుండా ప్రహరీ గోడలు నిర్మించేసుకొని, ఇప్పుడు కార్లు కొనేసి, పదిహేనడుగుల సిమెంటురోడ్డులో కూడా, ఇళ్లముందు అగ్గిపెట్టెల్లా రోడ్డుమీదే పార్కింగ్ చేసేస్తున్నారు! అదీ మన వృధ్ధి! విమానాశ్రయాల్లో మౌలిక వసతులు పెంచకుండా, ప్రైవేటు విమాన సంస్థలని ప్రోత్సహించి, వాళ్లు చేస్తున్న సర్కస్ ఫీట్లూ, జిమ్మిక్ లూ వినోదంగా చూస్తూంది ప్రభుత్వం. ప్రభుత్వ విమానయాన సంస్థ "ఎయిర్ ఇండియా" (దాంట్లో ఇండియన్ ఏయిర్ లైన్స్ ని విలీనం చేసి) తో ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు, ఆడుకుంటున్నాడు ప్రఫుల్ పటేల్. ఇది 2జీ స్కాము కన్నా పెద్దది! మరి ఈ వృధ్ధి రేట్లకోసం యేడుద్దామా? ద్రవ్యోల్బణం గురించి యేడుద్దామా? దువ్వూరివారూ! యేమంటారు?1980 లలో, చైనాలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీ ఈ వో లు సైతం, సైకిళ్లపై తమ కార్యస్థానాలకి వెళ్లేవారు. నగరాల్లో పీక్ అవర్ ట్రాఫిక్ అంతా సైకిళ్లదే! అవన్నీ న్యూస్ రీళ్లుగా మనదేశంలో సినిమాలలో చూపించేవాళ్లు. ఆశ్చర్యపోవడం మావంతు! ఇప్పుడు అదే చైనాలో, సైకిళ్లు కనుమరుగయ్యాయి! బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగుళూరు లోలా, ఐదారు లేన్లలో కార్లు వెళుతూండడం, ట్రాఫిక్ జాములూ--షరా మామూలే చైనాలో కూడా. ఇప్పుడు బెంగుళూరు లాంటి నగరాల్లో, ముఖ్యమైన రహదారుల్లో, సైకిళ్లని ప్రోత్సహించాలని కంకణం కట్టుకున్నారట కొంతమంది అత్యుత్సాహులు! వుదాహరణకి, జయానగర్ లాంటి "జీ బీ లింగప్పలు" వుండే ప్రాంతంలో, "ప్రత్యేక సైకిలు ట్రాక్ లు" యెర్ర రంగులో యేర్పాటు చేస్తారట. బాగుంది. "ఫైవ్ స్టార్ హోటళ్లకి కారుల్లోనే వెళ్లాలా? సైకిళ్లమీద రాకూడదా?" అని ప్రశ్నిస్తున్నారట కొంతమంది. అనేక రెస్టారెంట్లముందూ, ఫుడ్ కోర్టుల ముందూ, ప్రస్తుతానికి ఓ "ఐదు" సైకిళ్లు పార్కింగ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారట. త్వరలో పార్కింగ్ సౌకర్యాన్ని వందా, వెయ్యీకి పెంచుతారట! "పెళ్లి కుదిరితేగానీ పిచ్చి తగ్గదూ, పిచ్చి కుదిరితేగానీ పెళ్లి అవదూ"; "పిచ్చి ముదిరింది, తలకి రోకలి చుట్టండి!" అనీ ఇలాంటి సామెతలు గుర్తుకు రావడంలేదూ? మన దేశ వృధ్ధి రేటేమయిపోను? సైకిలు ప్రమోషన్ లాబీలేమైనా యాక్టివేట్ అయ్యాయా? సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలా? అయితే యెవరూ? ఇవన్నీ శేష ప్రశ్నలు.

3 comments:

Indian Minerva said...

నాకెప్పటినుంచో ఒక సందేహమండీ. మనదేశంలో ప్రజా విప్లవం వచ్చేందుకు కావలసినంత చైతన్యం మన జనాల్లో వుందా? పేదలు పోరాడేశక్తిలేక అలా పడివున్నారని, మధ్యతరగతి పోరాడాల్సిన అవసరంలేక వున్నా పోరాడాల్సిన అవసరంలేని స్థితిని పొందడానికి కృషిచేస్తూ వున్నారని నా అభిప్రాయం. ఇక్కడ మనం ప్రస్తుతయువత(అంటే మా గురించేనండోయ్) గురించి మాట్లాడటం అనవసరమూ చర్చ పోరాటపటిమగురించి కాబట్టి కొండొకచో అప్రస్తుతమూ కాబట్టి వదిలేస్తున్నాను. వివరించగలరు.

Indian Minerva said...
This comment has been removed by the author.
కృష్ణశ్రీ said...

డియర్ Indian Minerva!

ప్రజా విప్లవం అనేది వేరెక్కడో లేదు, వేరెక్కడినుంచో రాదు. మన మనసుల్లోనే వుంటుంది. నిద్రాణంగా వున్న ఆ శక్తిని చైతన్యవంతం చెయ్యడానికి ఓ మంచి నాయకుడు అవసరం. అలాంటి వాడు నిస్సందేహంగా అన్నా హజారే!

మేము హైస్కూల్లో చదువుకునేటప్పుడు, "విశాఖ వుక్కు" కోసం కాలేజీ విద్యార్థులు వుద్యమిస్తే, మా హెడ్ మేష్టారు "విద్యార్థులకి వుద్యమాలెందుకురా? చక్కగా చదువుకోండి" అని హెచ్చరించారు. తరవాత తెన్నేటి విశ్వనాథం వుద్యమానికి నాయకత్వం వహిస్తాను అంటే, ఆయనే నాయకత్వం వహిస్తున్నాడంటే తప్పకుండా మీరుకూడా వుద్యమంలో చేరవలసిందే--అని ప్రోత్సహించారు. సామాన్యులూ, మేధావులూ కూడా గౌరవించే నాయకత్వమంటే అదీ!

నిజానికి ప్రభుత్వంలో వాళ్ల అవినీతీ, అవకతవక విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నది నిరుపేదలూ, మధ్యతరగతీ మాత్రమే. ద్రవ్యోల్బణం వల్ల నిడ్డి విరుగుతున్నది యెవరికి? రాజకీయులు చేస్తున్న వుద్యమాల్లో పేదలు పూట తిండికోసం, వాళ్లిచ్చే డబ్బులకోసం చేరుతున్నారు. సరైన నాయకత్వం వుంటే వాళ్లు తప్పకుండా పోరాడతారు. పోస్కో తో సహా అనేక వుదాహరణలు చూడొచ్చు. మీరన్నట్టు మధ్యతరగతి యెప్పుడూ పోరాడాల్సిన అవసరం లేని స్థితిని పొందడానికి కృషి చేస్తూనే వుంటుంది--పైమెట్టు యెక్కాలని ప్రయత్నిస్తూనే వుంటుంది. కానీ, ఒక సారి జూలు విదిల్చిందంటే, యెంతకైనా తెగిస్తుంది--ఫ్రెంచి, బోల్షెవిక్ విప్లవాలు, మొన్నటి ఈజిప్టు ఆందోళన, అలా వచ్చినవే! నిజానికి వుద్యమాల వల్ల వాళ్లకి పోయేదేమీ లేదు--ఆయనెవరో అన్నట్టు "బానిస సంకెళ్లు తప్ప!" మా ముందు తరం వాళ్లు పోరాడకుండా వుంటే స్వాతంత్ర్యం వచ్చేదేనా? మా తరం వాళ్లు పోరాడకుండా వుంటే, మీ తరం ఈ మాత్రం సుఖంగా వుండేదేనా? అలాగే యువత ముందు తరాలకోసం ఆలోచించాలి. అవసరమైనప్పుడు వుద్యమించాలి! దానికోసం అందరూ కృషి చెయ్యాలి. అప్పుడే మంచి ప్రభుత్వం వచ్చేది. అందుకే, కదలండి, కదిలించండి, పెను నిద్దర వదిలించండి! (ఇలా అన్నది మహాకవి!).