అవీ, ఇవీ, అన్నీ
జనలోక్ పాల్ బిల్లు విషయంలో, కాంగీ/యూపీయే భభ్రాజిమానాలు, పౌరసమాజ సభ్యులపై బురదజల్లడానికి ప్రయత్నించి, జనాలు "ఛీ" కొట్టగానే, ఇలా లాభం లేదు అని, ఇంక "డైరెక్టు"గా వ్రేళ్లకీ, కాళ్లకీ మారాముళ్లు వెయ్యడం మొదలెట్టారు!
యేమైనాసరే, పౌరసమాజం వాళ్లచేత, "మహాప్రభో! మీరు ఇదివరకు తేదలుచుకున్నారన్న బిల్లే 'సర్వోత్తమం!' దాన్నే ప్రవేశపెట్టండి" అనిపించాలని వీళ్లు కంకణం కట్టుకొన్నారేమో!
లేకపోతే, ప్రక్కనపెట్టిన ఆ బిల్లులో "ప్రథాని"ని కూడా ఆ బిల్లు పరిథిలోకి తెస్తే, ఇప్పుడు "అలా కుదరదు" అనడమే కాకుండా, న్యాయమూర్తులూ, ఓ స్థాయి కన్నా చిన్న అధికారులూ వగైరాలని కూడా బిల్లు పరిధిలోంచి తప్పించాలని అంటున్నారంటే యేమిటీ అర్థం?
"అన్నన్నా హజారె!" అనీ, "ఈజిప్టు తరహా" అనీ మురిసిపోయిన వాళ్లు ఇప్పుడేమి చేస్తారూ?
"సామాన్య వోటరులూ"! ఆలోచించండి!
2014 లోనో, ఇంకో రెండేళ్లు ముందో, ఈ "ఇటాలిబాన్" కాంగీ/యూపీయే వాళ్లని "మీ వోట్లతో" కత్తికొక కండగా నరికి (మొన్న బంగ్లా సోదరులు "యెరుపు" పార్టీలని చేసినట్టు) బంగాళాఖాతంలో సొరచేపలకీ, తిమింగలాలకీ ఆహారంగా కలిపెయ్యవలసిన సమయం దగ్గరకొస్తూందా?
ప్రణాళికలు వెయ్యండి! విజృంభించండి! మీకు పోయేదేమీ లేదు!
(మహా అయితే, మళ్లీ ఇంకో "నిద్దరమొహమోడు" ప్రథాని అవ్వచ్చు......దేశం ఓ పెదేళ్లో యెంతో వెనక్కి పోవచ్చు!.....మళ్లీ ప్రత్యామ్నాయం వెదుక్కుందాం.....ఓ వెలుగు వెలుగుదాం!)
"భలే మామా భలే.....అదే మన తక్షణ కర్తవ్యం" అంటున్నారెవరో!
మరదే కదా?
దబ్బనం యెర్రగాకాల్చి, పొట్టమీద వాతలు పెట్టేస్తే, "బాల పాప చిన్నెలు" (గుక్క తిప్పుకోలేక బిగిసిపోవడం వగైరా) తగ్గిపోతాయనీ, చుట్ట యెర్రగా కాల్చి, నుదుటిమీద "బొట్టు" పెట్టేస్తే, మెదడుకి సంబంధించిన మూర్చ వంటి రోగాలు నివారణ అవుతాయి అనీ, నమ్మి ఆచరించేవారు ఓ యాభై, అరవై యేళ్ల క్రితం!
(ధన్వంతరీ, చఱకుడూ, శుశ్రుతుడూ వగైరాలు ఇలాంటి వైద్యాలగురించి యే గ్రంధాలలోనైనా వ్రాశారో లేదో తెలీదు!)
ఇప్పుడు "ఆందు నిమిత్తం" యేర్పడ్డ మంత్రివర్గ వుపసంఘం వారు, "బహుళ బ్రాండ్--రీటెయిల్ దుకాణాల" లో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్) అనుమతి ఇవ్వడమే ప్రస్తుత "ద్రవ్యోల్బణానికి" "సరైన" మందు అంటూన్నారట!
అంటే, మ్యాగ్నాలూ, మోర్ లూ, రిలయన్సులూ, బిగ్ బజార్లూ వంటివి "షేర్ మార్కెట్" లోకి వెళ్లిపోయి, వాటి షేర్లని విదేశీ పెట్టుబడిదారులు కొనేస్తే, ద్రవ్యోల్బణం చచ్చినట్టు దిగివస్తుందన్నమాట!
యెవరి చెవుల్లో పువ్వులు పెడతారో? పై చికిత్సలకీ, తుంటిమీదకొడితే పళ్లు రాలతాయనడానికీ దాఖలాలు ఇలాంటివే మరి!
యేమంటారు?
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మేల్ వాంగ్ ఛుక్....పెళ్లి చేసుకోబోతున్నాడట. యువకులందరికీ తప్పని శిక్షే అయినా, ఆమె "తన ఆలోచనలు అర్థం చేసుకొని, వెంట నడవగల హృదయం వున్న అమ్మాయి" అని పొంగిపోతున్నాడట.
ఈయన కొంచెం "డిఫరెంట్" రాజుగారట! సాదాసీదాగా వుంటూ, దేశంలోని 20 జిల్లాలనీ చుట్టొచ్చి, పొలాల్లోకి వెళ్లి రైతులని పలకరిస్తూ, వుపాధ్యాయుల, వైద్యుల సలహాలు స్వీకరిస్తూ పరిపాలిస్తున్నాడట.
తన అధికారాలకి తానే కోతపెట్టుకొని, ప్రజాస్వామ్య పధ్ధతిలో యెన్నికలు జరిపించి, భూసంస్కరణలు అమలు చేశాడట.
ఇంకా, పారిశ్రామికంగా, ఆర్థికంగా "దూసుకెళ్లడం" ముఖ్యం కాదు....నా దేశ ప్రజలు యెంత సంతోషంగా వున్నారనేదే ప్రధానం! అంటూ, "గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్" సిధ్ధాంతాన్ని అమలు పరుస్తున్నాడట ఈ యువకుడైన రాజు!
అలాంటి రాజుని నిజంగా "దైవాంశ సంభూతుడిగా" కొలవరూ ప్రజలు?
No comments:
Post a Comment