Tuesday, May 31, 2011

కబుర్లు - 52

అవీ, ఇవీ, అన్నీ

"హింస" బిల్లు అని వొహటి పుట్టుకొచ్చిందట మన యూపీయే పాలకుల్లో......తమ అవినీతిపూరిత జమానా నుంచి సామాన్యుల దృష్టి మరల్చేందుకూ, ప్రత్యర్థి బీజేపీని ఇరుకులోపెట్టి, చోద్యం చూసేందుకూ!

ఇటాలియమ్మ సోనియా సారధ్యంలోని "జాతీయ భద్రతా మండలి" (ఎన్ ఎస్ సీ) "కుల, మత, ప్రాంత, భాషా పరమైన వర్గాలను లక్ష్యంగా చేసుకొని సాగే హింసను యెదుర్కొనేందుకు (ప్రభుత్వం) కఠినంగా వ్యవహరించాలి" అనే ప్రాతిపదికపై, ఈ ముసాయిదా తయారయ్యిందట!

"1984 ఢిల్లీ సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ ముస్లిం వ్యతిరేక దాడులు, ఒడిస్సాలో క్రైస్తవ వ్యతిరేక దాడులు.....వంటి వాటికి అడ్డు కట్ట వేసేందుకు......" ఆవిడ ఆ బిల్లు తెస్తోందని కొంతమంది "విశ్లేషకులు" భావిస్తున్నారట.

దేశంలో యెక్కడైనా "మత హింస" చెలరేగినప్పుడు దాన్ని అడ్డుకోవటంలో కేంద్రం జోక్యం చేసుకునే "అవకాశం కల్పించడమే" ఈ బిల్లు ప్రత్యేకత(ట).

ఇప్పటివరకూ, యెక్కడైనా శాంతి భద్రతలని పరిరక్షించాల్సిన బాధ్యత, రాజ్యాంగం ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలదే

(అందుకే పీవీ జీ బాబ్రీ మసీదు కూలగొట్టేస్తున్నా, ఆ రాష్ ట్ర ప్రభుత్వ 'బాధ్యత' లో జోక్యం చేసుకోలేక పోయాడు!)

మరిప్పుడు, దొడ్డి దారిన రాష్ట్ర బాధ్యతలని వాటినుంచి బలవంతంగా తప్పిస్తూ, ఇంత అర్జంటుగా ఈ బిల్లు తేవలసిన ఆవశ్యకత యేమి వచ్చింది.....ప్రజల దృష్టిని మళ్లించడానికి కాకపోతే?

ఈ ముసాయిదా మెజారిటీ ప్రజల పట్ల వివక్షను ప్రదర్శిస్తోందనీ, టాడా చట్టాలకన్నా ప్రమాదకరంగా వుంది అనీ, భాజపా వారు తీవ్రంగా దుయ్యబడుతున్నారట.

కపిల్ సిబాల్ మాత్రం, మా ప్రభుత్వం ఈ బిల్లు విషయంలో పూర్తిగా కట్టుబడి వుంటుంది అన్నాడట!

ఈ ముసాయిదాపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ, సలహాలూ సూచనలూ ఇచ్చేందుకు (మాత్రమేనా?) జూన్ 4 వరకూ (ఇంకో నాలుగురోజులు మాత్రమేనా?) గడువు ఇచ్చారట!

రాష్ట్రంలో కేసీఆర్, కోదండరాం, నాగం లకి 'తెలంగాణా' ఓ అస్త్రమైతే, సోనియాకి ఈ కొత్త "హింస" బిల్లు ఓ ప్రత్యేకాస్త్రం! హమ్మ...యెంత యెత్తు యెత్తిందీ??!!

బాబులూ.....సూచనలు, సలహాలు వెంటనే ఇస్తారా? "ఇటాలిబాన్" కుట్రకి తలవొగ్గుతారా?

మొదలెట్టండి మరి!

*   *   *

"అప్రూవరు సాక్ష్యం".....ఇదో చిత్రమైన "న్యాయ సూత్రం" అంతర్జాతీయంగా గుర్తింపు వున్నదీ, అన్ని దేశాల్లోనూ అమల్లో వున్నదీనూ.

అంటే, ఒకడికన్నా యెక్కువమంది ఓ నేరం చేసినప్పుడు, వాళ్లలో వొకడు "అప్రూవరు"గా మారితే, వాడు తన నేరాన్ని వొప్పుకొంటూ, మిగతావాళ్ల నేరానికి కూడా సాక్ష్యం చెప్పి, వాళ్లకి శిక్షపడడానికి సహకరిస్తే, అప్రూవరుకి 'అసలు నేరం' క్రింద కాకుండా, మిగతా నేరాల్లో అతి చిన్న శిక్షని విధింపబడేలా చేస్తామని వాడితో దర్యాప్తు అధికారులూ, వారి పై అధికారులూ, మంత్రులూ, ప్రభుత్వాలూ 'వొప్పందం' చేసుకొని, వాణ్ని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టడమే--అప్రూవరు సాక్ష్యం!

వుదాహరణకి ఓ హత్య జరిగిందనుకోండి, అందులో నలుగురైదుగురు కలిసి చేశారనుకోండి, వాళ్లలో వొకడు కత్తితో పొడిచాడు, ఇంకొకడు హతుడి పెడరెక్కలు విరిచి పట్టుకొన్నాడు, ఇంకొకడు హతుడు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు, ఇంకొకడు ఆ గది బయట, ఇంకెవరూ రాకుండా కాపలా కాస్తున్నాడు, ఇంకొకడు ఆ యింటి ప్రహరీ బయట నుంచొని, యెవరైనా అటు వస్తే 'విజిలు' వేస్తానని వొప్పుకొని, అక్కడే వున్నాడు. 

వీళ్లందరినీ పోలీసులు పట్టుకొన్నారు....వివిధ సెక్షన్ల ప్రకారం, "హత్య, హత్యా ప్రయత్నం, హత్యకి సహకరించడం, కుట్ర, కుట్రలో భాగస్వాములవడం, తప్పించుకోడానికి ప్రయత్నించడం, తప్పించుకోవడం, సాక్ష్యాలని తారుమారు చెయ్యడానికి ప్రయత్నించడం, తారుమారు చెయ్యడం....." ఇలా కేసులు పెడతారు ఆ ఐదుగురిమీదా. 

ఇంకా, హత్యల్లో చాలా రకాలున్నాయి--ప్రీ ప్లాన్‌డ్ మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్, ఇంటెన్షనల్ మర్డర్, అన్ ఇంటెన్షనల్ మర్డర్, ఏక్సిడెంటల్ మర్డర్, మ్యాన్ స్లాటర్, మర్డర్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్, మర్డర్ ఫర్ ఆనర్, సైకోపాతిక్ మర్డర్, స్కిజోఫ్రెనిక్ మర్డర్, స్ప్లిట్ పర్సనాలిటీ మర్డర్......ఇలా కొన్ని వందల రకాలు!

ఈ గొడవంతా యెందుకంటే, 26/11 కేసులో "అప్రూవరు"గా మారిన డేవిడ్ హెడ్లీ అమెరికాలోని షికాగో జిల్లా కోర్టులో అనేక విషయాలు వెల్లడించాడట!

(వివరాలు మీరడిగితే మరోసారి!)

*   *   *

యెప్పుడు కట్టారో తెలీదుగాని, యేలూరులో 'ప్రాచుర్యం పొందిన' "ధన్వంతరి" మందిరం వుందట. యెవరు, యెప్పుడు, యెలా సంపాదించారోగాని ఆయన కలర్ ఫోటో కూడా ప్రతిష్టించినట్టున్నారక్కడ. పేపర్లో ఫోటో చూస్తే అలానే అనిపిస్తూంది.

చెఱకుడూ, శుశ్రుతుడూ వగైరాల కలర్ ఫోటోల అన్వేషణలో వున్నారో, లేక ఇప్పటికే యెక్కడైనా వాళ్లకీ మందిరాలు కట్టేశారో, పేపర్లో వార్తా, ఫోటో వస్తేగానీ తెలియదు.)

మొన్నెప్పుడో ఓ రోజు, 'పరమహంస పరివ్రాజకాచార్య' మైసూరు దత్తపీఠం 'ఉత్తరాథిపతి' శ్రీదత్త విజయానంద తీర్థస్వామీజీ ఆ మందిరాన్ని సందర్శించిన సందర్భంగా, "ధన్వంతరీ వైద్య భగవాన్"ను సేవించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిధ్ధిస్తాయి అని పేర్కొన్నారట. (కార్పొరేట్ ఆసుపత్రులవాళ్లూ, ఆరోగ్యశ్రీ పథకాలూ, 108, 104 లూ యేమైపోవాలో మరి?)

భగవాన్ కు విశేషార్చనలూ, స్వామి అనుగ్రహభాషణం......మామూలే.

అదీ సంగతి.

*   *   *

అదేరోజు, 138 చక్రాల, రైలంత పెద్ద ట్రాలీ వోటి ఢిల్లీకి వెళుతూండగా, పెరవలి దగ్గర్లో జాతీయరహదారిపై "హోర్డింగులు" అడ్డు వచ్చాయట. ట్రాలీని ఆపేసి, తెలివిగా చక్రాల్లోని గాలిని వీలైనంత తగ్గించి, యెత్తు తగ్గాక, చక్కగా వెళ్లిపోయారట, మళ్లీ గాలి నింపుకొని!

గొప్పేగానీ, దారిలో అనేక వంతెనలు బలహీనంగా వున్నాయి అంటూ మొత్తుకుంటున్న ప్రభుత్వ శాఖలని ప్రక్కనబెట్టి, అలాంటివాటికి అనుమతులు యెవరు ఇస్తున్నారో? 

No comments: