Wednesday, May 11, 2011

కబుర్లు - 46

అవీ, ఇవీ, అన్నీ

అయోధ్య కేసు లో సుప్రీం కోర్టుకెళతామన్న పార్టీలన్నీ అలాగే వెళ్లాయి. నిన్న విచారణ ప్రారంభమయింది.

న్యాయవాదులందరూ తమ తమ కక్షిదారుల తరఫున "ప్రిలిమినరీ" వాదనలు వినిపించారు అన్ని కేసుల్లాగే. 

కానీ విశేషమేమిటంటే, అత్యున్నత న్యాయస్థానం వారు "అయితే ఆ తీర్పు మీ యెవరికీ నచ్చలేదా?" అని అడిగి, అందరూ "లేదు" అనగానే, "హమ్మయ్య! ఈ వొక్క విషయంలోనైనా మీ మధ్య 'యేకాభిప్రాయం ' వుందన్నమాట" అని జోకారట!

పైగా, "యెవరూ అడగకపోయినా, ఆ స్థలం విభజించాలని అలహాబాదు ధర్మాసనం తీర్పివ్వడమేమిటి?" అంటూ ఆ స్థలం విషయంలోనే కాకుండా, ఆ చుట్టుప్రక్కల ప్రభుత్వం సేకరించిన అరవైనాలుగో యెన్నో యెకరాల విషయం లో కూడా "యథాతథ స్థితి కొనసాగాలని" స్టే మంజూరు చేసిందట--యెవరూ అడగకపోయినా!

యేమైనా అర్థం వుందా?

అందరికీ తీర్పు నచ్చితే, అంత ఖర్చుపెట్టుకొని పై కోర్టుకి యెందుకు వెళతారు? ఒక ముక్కని అంతా తమకే కావాలని దెబ్బలాడుకొంటూంటే, దాని విభజన తప్ప ఇంకేమి పరిష్కారం వుంది? దాని(విభజన)కోసం యెవరు అడుగుతారు? 

యెవరి పట్టు వారిది కాబట్టి "రాజీ" మార్గం గా విభజనే బెస్ట్. ఆ మాత్రం తెలీదా అత్యున్నత న్యాయ స్థానం వారికి?

వాళ్ల వుద్దేశ్యం......వివాదం ఇంకో వందో, వెయ్యో యేళ్లు కొనసాగుతూ, "ప్రభుత్వాలకి" తలనొప్పిగా వుంటేనే, అనేకతరాల "న్యాయ" వుద్యోగులూ, వాదులూ, మూర్తులూ కాలుమీద కాలేసుకొని, తమ తరవాత తరాలకి అనుభవించడానికి సరిపడా సంపాదించచ్చు అనా?

సేకరించిన భూమి సంగతి ప్రభుత్వం చూసుకొంటుంది. దాని సంగతి మీకెందుకు?

ఒక్క విషయం మరిచిపోకండి! కక్షిదారుల సంగతెలా వున్నా, సామాన్య ప్రజలందరూ అలహాబాదు న్యాయస్థానం తీర్పుని హర్షాతిరేకంతో స్వాగతించారనీ, ఒక నిట్టూర్పు విడిచారనీ!

లేకపోతే, యెవరికీ పుట్టగతులుండవు.

నిన్న (10-05-2011) రాత్రి యేదో న్యూస్ ఛానెల్ చూస్తూండగా ఓ వార్త చివరి ముక్క విన్నాను ".....తి తి దే వారు ఆ పథకాన్ని అమలు చెయ్యబోమనీ, ఆ విషయంలో నిర్ణయం జరిగిపోయింది అనీ....." న్యాయ స్థానానికి నివేదించారనీ!

నాకు అనుమానం వచ్చేసింది.....ఇంతలోకే యెవరైనా "కదిలే తివాచీ" మీద "పిల్" వేసేశారా.....అదప్పుడే విచారణకి వచ్చిందా, న్యాయమూర్తులు సో కాల్డ్ "ఆగమ పండిత పక్షపాతులా?"......ఇలా!

నిద్రపోయేలోపు మిగిలిన ఛానెళ్లలో ప్రయత్నించానుగానీ, ఆ ప్రస్తావన లేదు.

ప్రొద్దున పేపర్లో చూద్దును కదా....విషయం ఆదికేశవుడి "అనంద.....అనంత....మయం" పథకమట! 

ఇప్పటివరకూ దాతలు ఇచ్చిన కొన్ని లక్షలో, కోట్లో డబ్బునీ, కొన్ని కిలోల బంగారాన్నీ వాళ్లకే తిరిగి ఇచ్చేస్తామనీ, వాళ్లు వాటిని వేరే పథకాలకి వుపయోగించుకోమంటే అలాగే చేస్తామనీ హామీ యిచ్చారట.

వాళ్ల నిర్ణయం చాలా బాగుంది. కానీ, ఆ పేరుతో ఇంకెంతో దండుకున్న వాళ్ల మాటేమిటి? దానిమీద దర్యాప్తులూ, శిక్షలూ మాటేమిటి?

మన్మోహన్లా వాళ్లపదవులు పోయాయికదా, అదే పెద్ద శిక్ష వాళ్లకి అంటారేమో!

భక్తులు వత్తిడి తేవలసిన అవసరం లేదూ? ఆలోచించండి! 

అన్నట్టు, అజిత్ భరిహోకె అనే పేరు గుర్తుందా? ఇదివరకూ తరచూ వినిపించేది అనేక సంచలన కేసుల్లో....ఓ ప్రత్యేక న్యాయస్థానం న్యాయ మూర్తిగా! నాకు గుర్తు రావడం లేదుగానీ అవన్నీ చాలా ముఖ్యమైన కేసులు.

ఇప్పుడు మళ్లీ ఆయన పేరు వినిపిస్తూంది--ఇంకొన్ని కేసుల్లో--ఢిల్లీ హైకోర్టో, సుప్రీం కోర్టో.....న్యాయమూర్తిగా!   
   

No comments: