Saturday, May 28, 2011

కబుర్లు - 51

అవీ, ఇవీ, అన్నీ

"బండిపూజలకి" తగినట్టుగా, కొత్త వాహనాలకి కొన్నికోట్లతో, ఓ పెద్ద షెడ్డు వేశారట ద్వారకా తిరుమలపైన శేషాచలం కొండమీద. 

కొత్తగా బైక్ లూ, కార్లూ కొనుక్కొన్నవారు వాళ్ల వాహనాలని ఆ షెడ్డులో పెట్టుకొని, శ్రీనివాసునికి "ప్రత్యేక" పూజలు చేసుకొని, వెళితే "శుభ"మట! (ఫోటోల్లో ఆ షెడ్డంతా ఖాళీగానే కనిపిస్తూంది. అసలు ఒకరోజున యెన్నికార్లూ, బైక్ లూ కొనుక్కొంటారు? దాంట్లో కొండమీదకొచ్చి బండిపూజలు చేయించుకొనేవాళ్లెందరు? అంత పెద్ద షెడ్ అవసరమా?)

కానీ, అక్కడవున్న స్వామీ, ఇరువురు దేవేరుల విగ్రహాలూ యెండకి యెండీ, వానకి తడిసీ, చలికి వణికీ కూడా భక్తులని అనుగ్రహిస్తున్నాయట! 

బండిపూజలు చేయించుకుంటున్నవాళ్లందరూ--ఇదేమి చోద్యం? అని ముక్కుమీద వేలు వేసుకుంటున్నారట!

ఈ బండి పూజలేమిటో? ప్రత్యేకలేమిటో? పూజలు చేసుకొన్న బళ్లు క్రిందకి వచ్చిన తరవాత యేమవుతున్నాయో? యే యాక్సిడెంట్లో బలవుతున్న బళ్లలో యెన్నింటికి "ప్రత్యేక" పూజలు చేశారో? వీటన్నింటికీ స్టాటిక్టిక్స్ తీసేదెవడు?

"హిజ్రాలు"--అంటే "ఆ మ కా" వాళ్లు. వీళ్లు ముఖ్యంగా విశాఖ, తూగోజి, పగోజి వాళ్లే అయివుంటారు. (వుత్తరదేశంలో ఇలాంటివాళ్లు పెళ్లిళ్లలో, చావుల్లో, మేళాలు కట్టి, పాటలుపాడి, వాళ్లిచ్చినంతపుచ్చుకొని, వెళ్లిపోతారు కానీ, భిక్షాటన చెయ్యరు!)

వీళ్లు ముఖ్యంగా హౌరా నుంచి చెన్నై,  బెంగళూరు, హైదరాబాదు, ముంబై వెళ్లే రైళ్లలో స్లీపర్ కోచ్ లలో, యేడెనిమిది మంది జట్టుగా చేరి చేసే అల్లరులు భరించేవాళ్లకే తెలుస్తాయి.

(అలాంటి వాళ్లతో నా ప్రయాణానుభవం, మా మూడో హనీమూన్ అనే మొన్నటి మాయాత్రలో ఢిల్లీ నుంచి సామర్లకోట తిరుగు ప్రయాణంలో వివరిస్తాను. కొంచెం వోపిక పట్టండి.)

వాళ్లకీమధ్య రైల్వే పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారట. వారి ఫోటోలూ, చిరునామాలూ సేకరించాలని అదేశించారట. ఆడిగినంత సొమ్ము ఇవ్వకపోతే ప్రయాణీకులమీద దాడులకి దిగుతున్న హిజ్రాలనీ, రాత్రివేళ వొంటరిగా ప్రయాణిస్తున్న ఆడవారిమీద దౌర్జన్యంచేసి, నగలూ, ఆభరణాలూ దోచుకొంటున్న హిజ్రాలనీ, తప్పుపట్టి, అలాంటి వాళ్లు వేరెవరైనా తమకు పట్టి ఇవ్వాలనీ, కొత్తగా వస్తున్న హిజ్రాల మీద వోకన్ను వేసి వుంచాలనీ, వారి వివరాలని పోలీసులకి చెపుతూవుండాలనీ, హెచ్చరించారట!
      
మొన్నోరోజు వాడెవడో హిజ్రాలు తనమీద దాడిచేసి, రైల్లోంచి తోసేశారనీ, క్రిందపడ్డ తాను ఇంకో రైలు క్రిందపడి ఓ కాలు పోగొట్టుకున్నాను అనీ పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాడట.

తీరా రైల్వే పోలీసులు దర్యాప్తు చేసి, వాడు చెప్పిన రైల్లో వాడు అసలు ప్రయాణించనేలేదనీ, వేరే రైల్లో ప్రయాణిస్తూ, స్టాపు లేని స్టేషన్లో దూకేసి, కాలు పోగొట్టుకున్నాడనీ, హిజ్రాల విషయం అంతా కట్టుకథ అనీ తేల్చారట!

ఇలాంటివాళ్లు కూడా వుంటారేమో మరి.

ఓ మూణ్నెల్ల క్రితం ముఖ్యమంత్రి కి కు రె పగోజి లో చింతలపూడి రచ్చబండ పర్యటనకి వస్తే, చేసిన యేర్పాట్లు చూడండి.

ఆయన పర్యటించే రెండు ప్రాంతాల్లో సువిశాలమైన వేదికలు నిర్మించారు.
మొదటి ప్రాంతంలో రచ్చబండ ముగిశాక, రెండో ప్రాంతానికి వెళ్లే రోడ్డుని పంచాయతీరాజ్ శాఖవారు "అగమేఘాలమీద" నూతనంగా నిర్మించారు. చలువపందిళ్లు వేయడంతోపాటు సభావేదికను, రహదారి డివైడర్లను మూడు రంగులతో అలంకరించారు.....1200 పోలీసులు....డాగ్ స్క్వాడ్, బాంబుతనిఖీ బృందాలు, ఓ "ఓఎస్డీ" స్థాయి అధికారితోపాటు 10 మంది ఎస్పీలూ, 40 మంది డీఎస్పీలతొపాటు, ఎస్సైలూ, కానిస్టేబుళ్లూ, హోం గార్డులతో సహా.....భారీ బందోబస్తు నిర్వహించారు. దీనితోపాటు, ఆయన దగ్గరకి యెవరూ రాకుండా, రోప్ పార్టీ సిధ్ధం చేశారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులు అధికారులకి "స్పష్టమైన" ఆదేశాలు ఇచ్చారు.

ఇంక, సీఎం భోజనం కోసం, పలావు అన్నం, తెల్ల అన్నం, ఇతర మామూలు వంటకాలూ, గోంగూర పచ్చడి, దొండకాయ ఆవకాయ, గుత్తి వంకాయ కూర, గుమ్మడికాయ కూర, వులవచారు, మజ్జిగ చారు, పిట్ట మాంసం, నాటుకోడి కూర, నాటుకోడి కుర్మా, బొమ్మిడాయ కుర్మా, రొయ్య.....వండి వడ్డించారు(ట).

ఆ ఖర్చులన్నీ యెవరు భరించారు? యెన్ని కొల్లేటి పిట్టలనీ, నాటుకోళ్లనీ, బొమ్మిడాయిలనీ, రొయ్యలనీ చంపారు? వాటిలో ఆయన యెన్ని తిన్నారు? మిగిలినవన్నీ "భోంచేసిన" వాళ్లెవరు?

అసలు అంత అవసరమా?! (వొద్దని రోశయ్య అయినా, కి కు రె అయినా యెందుకు చెప్పరు?)

ఫైనల్ గా వీటివల్ల సామాన్యులకి వొరుగుతున్నది యేమిటి?

2 comments:

Anonymous said...

>ఫైనల్ గా వీటివల్ల సామాన్యులకి వొరుగుతున్నది యేమిటి?
సామాన్యులకి వొరిగేరోజు ఎప్పుడో పోయాయి మాస్టారు, ఇప్పుడూ రోజులన్ని "చిడతల" భజనకారులదే.

కృష్ణశ్రీ said...

పై అన్నోన్!

మరి సామాన్యులకి యేదైనా "వొరగబెట్టే" ప్రయత్నాలు యేమైనా చేద్దామా?

"చిడతల" వాళ్లకి బుధ్ధివచ్చే ప్రణాళికలేమైనా వేద్దామా?

మొదలు పెడతారా?

ధన్యవాదాలు.