అవీ, ఇవీ, అన్నీ
నిన్న (25-05-2011) ఈనాడు ఇదీ సంగతి కార్టూన్ చూశారా?
తానేకాదు, తమవాళ్లందరూ "చెక్క కుర్చీల్లోనే" కూర్చుంటారు అనీ, దానితో ఓ 45 యేళ్లో యెంతో ఆ రాష్ ట్రాన్ని పరిపాలిస్తామనీ కలలు కంటోందిట మమతాదీ.
తానిన్నేళ్లూ కలలు కన్నది బుధ్ధదేవ్ కూర్చున్న ఆ కుర్చీ కోసమే అని మరిచిపోయినట్టుందీవిడ.
నందిగ్రామ్ వగైరాలతో, పర్యావరణం కోసం పోరాటం సాగించామని కూడా ఆవిడ మరిచిపోయినట్టుంది.
తమ వాళ్లకీ, ప్రభుత్వ అధికారులకీ, యంత్రాంగానికీ కొన్ని లక్షల చెక్క కుర్చీలకోసం యెన్ని చెట్లు నరుకుతారో ఇంక!
ఇంకా నయం, రైలు బద్దీలక్రింద ప్రస్తుతం వాడుతున్న కాంక్రీటు స్లీపర్ల స్థానంలో మళ్లీ "చెక్క స్లీపర్లు" వెయ్యమని పురమాయించలేదు! (యేమో....రేపు పురమాయిస్తారేమో....యెవరు చెప్పగలరు?)
వంద ఐదు రూపాయలో యెంతో వుండే ప్లాస్టిక్ కాఫీ/టీ గ్లాసుల స్థానంలో, ఒక్కోటీ రెండు మూడు రూపాయల ఖరీదు చేసే మట్టి ముంతలని ప్రవేశపెట్టిన లాలూ మళ్లీ రైలు యెక్కలేకపోయాడు.
ఒకప్పటి రైలు మంత్రీ, యేదో రాష్ ట్ర ముఖ్యమంత్రీ, కాంగ్రెస్ అధ్యక్షుడూ, కమలాపతి త్రిపాఠీ అలాగే ఓ ప్రత్యేక రైల్లో కాశీ నుంచి గంగాజలాన్ని తెప్పించుకొనేవాడుట వాళ్లింట్లో నిత్యావసరాలకోసం--కడుక్కోడాలతో సహా!
వాళ్ల చరిత్రలెంత దయనీయంగా ముగిశాయో, "తక్కువ ఙ్ఞాపక శక్తి" వున్న భారతీయ వోటర్లు మరిచిపోయినా, "పైవాడు" మరచిపోడు.
రైల్వేలని లాలూ వుధ్ధరించేస్తే, ఈవిడ సముధ్ధరించేసిందిట. ఇంక బెంగాల్ ని వుధ్ధరిస్తుందిట.
బెంగాలీ వోటరుకి కమ్యూనిస్టులకి ప్రత్యామ్నాయం వేరేదీ తోచకపోవడంతో తాను నెగ్గింది గానీ, దీదీ చమక్కులకీ, ఝలక్కులకీ వోటర్లు మురిసిపోవడం వల్ల కాదు అని ఆవిడ యెప్పుడు గ్రహిస్తుందో?
ద్రవ్యోల్బణం దారి తప్పుతోంది....ఆహారతో సహా. రేపు మళ్లీ డీజెల్ లీటరుకి ఓ నాలుగు రూపాయలూ, వంటగ్యాసు ఓ పాతిక నుంచి నలభై రూపాయలూ, కిరోసిన్ కనీసం రెండురూపాయలూ పెంచేస్తారేమో!
రిజర్వ్ బ్యాంకువారు అరకొర చర్యలు తీసుకోవడంతో సరిపెట్టకుండా ప్రభుత్వానికి ఓ రికమెండేషన్ కూడా వెలగబెట్టారుగా!
ఇంక ద్రవ్యోల్బణం నింగినంటక తప్పదేమో.
యెవరేమి చేస్తారో చూడాలి.
సాధారణంగా పిచ్చివాగుడు యెక్కువ వాగడనుకున్న జైరాం రమేష్, "ఐ ఐ టీ ల్లో చదువుతున్న విద్యార్థుల వల్లే వాటి స్థాయి నిలబడుతోందిగానీ, వాటి బోధనా సిబ్బందీ వగైరాల ప్రమాణాల వల్లకాదు" అంటున్నాడు.
దాని భావమేమో?
తితిదే వారు 23 వేలకి పైగా ఆర్జిత సేవా టిక్కెట్లని రద్దుచేశారట. ఇవన్నీ కొన్ని సంవత్సరాలపాటు కొంతమందే రిజర్వు చేసుకున్నవిట.
"ఉదయాస్తమన సేవ" అనేదోటి 2006 లో ప్రారంభించారట. పదిలక్షలు చెల్లిస్తే, ఐదుగురు గృహస్తులకు సుప్రభాత సేవనుంచీ, యేకాంత సేవ వరకూ మధ్యలో అన్ని సేవల్లో పాల్గొనే అవకాశం ఇచ్చేవారట. ఈ టిక్కెట్లు శని, ఆది, సోమ వారాల్లో మాత్రమే, నగదు చెల్లించిన వారికేనట. ఇప్పుడు ఆ సేవా టిక్కెట్ల జారీని రద్దు చేశారట.
బాగానే వుంది. ఈనాడు వారు ఈ "తాజా నిర్ణయం వల్ల భక్తులు ఆవేదన చెందుతున్నారు" అంటున్నారు! (అంత గొప్ప భక్తులెందరిని చూశారో మరి!)
No comments:
Post a Comment