Saturday, May 21, 2011

కబుర్లు - 47

అవీ, ఇవీ, అన్నీ

యెలక్షన్లయిపోగానే, పెట్రోలు రేటు పెంచేశారు. డీజల్, గ్యాస్ ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తారట. 

అనేకమంది కాలమిష్టులూ, ఆర్థిక నిపుణులూ, నాలాంటివాళ్లూ, ఈ ఆయిల్ కంపెనీలు "రావలసిన లాభాలని రాకపోవడంతో" నష్టాలుగా చూపిస్తున్నాయనీ, ప్రభుత్వ సబ్సిడీ కేవలం వెంట్రుక శాతమేననీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా "లాభాలు" పిండుకోడానికే ఈ "బీదార్పులు" అనీ మొత్తుకొంటున్నారు.మీడియావారెవరైనా వాళ్ల "ఆడిటర్ల"నుంచి సమాచారం సేకరిస్తే, "సత్యం ఆడిటర్ల"కి మించిన కుంభకోణాలు బయటికొస్తాయేమో ప్రయత్నించవచ్చుకదా?!

2జీకి మించిన కుంభకోణం మన విమానయానం లో జరిగిందనీ, మంత్రి ప్రఫుల్ పటేల్ దానికి బాధ్యుడనీ నిప్పురాజుకొంది. నిజానికి నాలాంటివాళ్లు మొత్తుకొంటూనే వున్నాము--మన దేశానికి అన్ని "ప్రైవేటు" విమానయాన సంస్థలూ, వాళ్ల విమానాలనబడే "డబ్బాలూ" అవసరమా అని. 

మన "డొమెస్టిక్" ఇండియన్ ఎయిర్ లైన్స్ నీ, "ఇంటర్నేషనల్" ఎయిరిండియానీ యెందుకు కలిపెయ్యవలసి వచ్చింది? మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి, పైలెట్ల సంఘాలని గుర్తింపు రద్దుచేసి, మీ వుద్యోగాలు తొలగిస్తాం అని బెదిరించి, పిచ్చిపిచ్చి చేష్టలు చేసి, చివరికి వాళ్లకి "దాసోహం" అని, గుర్తింపు పునరుధ్ధరణ నుంచీ వాళ్ల డిమాండ్లు అన్నీ వొప్పుకొని, సమ్మె విరమింపచెయ్యవలసిన అవసరం యెవరికి యెందుకు వచ్చింది? ప్రఫుల్ పాత్ర యేమిటి?

ఎయిర్ పోర్టుల దగ్గరనించీ మన మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా, మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ల, వాటి సిబ్బందీ, నైపుణ్యాలని పెంచుకోకుండా, "జెట్"; "స్పైస్ జెట్"; "కింగ్ ఫిషర్" లాంటి సంస్థలకి యెందుకు అనుమతి ఇచ్చారు?

హెలికాప్టర్ల దగ్గరనించీ నిపుణులైన పైలెట్లు, వారికి కావలసిన సమాచారం యెందుకు అందుబాటులో వుండటం లేదు? ఓ రాజశేఖర రెడ్డి, ఓ దోర్జీ, యెందుకు ప్రమాదాలబారినపడి అశువులు కోల్పోవలసి వచ్చింది? 

1962 లో చైనా యుధ్ధం సమయంలో మనకి రష్యా వారిచ్చిన "మిగ్" "గ్నాట్" విమానాలనే పైలెట్ల శిక్షణకి యెందుకు వుపయోగిస్తున్నారు? అవి "ఈగల్లా" యెందుకు రాలిపోతున్నాయి? పైలెట్లు యెందుకు మరణిస్తున్నారు?

ఓ ప్రక్క "సుఖోయ్"లూ, ఇంకో ప్రక్క "బోయింగ్ 737"లూ ప్రవేశించినా, ఇంకా మన "డబ్బా" విమానాలనే యెందుకు వాడుతున్నారు? అవి తరచూ యెందుకు మొరాయిస్తున్నాయి?

ఇలాంటి ప్రశ్నలకి జవాబులు మన మీడియా వాళ్లే కనుక్కోవాలి.

ప్రఫుల్ పటేల్ ని నిలదీయండి.....కనిమొళి ప్రక్క సెల్ లోనే వాడినీ కూర్చోపెట్టండి!

అప్పుడైనా విమానప్రయాణీకులకి భద్రత వుంటుందేమో.

మన రాష్ట్రంలో రైతన్నలకి కష్టాలు తీరడం లేదు. ఇబ్బడిముబ్బడిగా ధాన్యం పండించినా, గిట్టుబాటు ధరలు చెల్లించేవాళ్లు లేరట. గోనె సంచులు లేవట. యంత్రాలు వాడటంవల్ల, తేమశాతం పెరిగిపోతోందట. 

మళ్లీ ఆ యంత్రాల్లో "సరిగ్గా" 100 గ్రాముల వడ్లు వేస్తేనే సరైన తేమశాతం చూపిస్తాయట. ఇంకొన్ని వడ్లు యెక్కువ వేసినా, తేమశాతం పెరిగిపోతుందట! దిక్కుమాలిన యెలక్ట్రానిక్కూ, డిజిటల్లూ పిశాచాలు మనకెందుకంటారు?

సరే బాగానే వుంది. కానీ, మన ప్రభుత్వాలు, సుప్రీం కోర్టు "పేదలకి వుచితంగా పంచండి" అన్నా, "ఠాట్! వీల్లేదు! యెలకలకీ, పందికొక్కులకీ పెడతాం; ఇంకా ముక్కిపోతే సముద్రంలో పారబోస్తాం" అంటున్నాయి.

మరి మీ దరిద్రగొట్టు నిరసనలేమిట్రాబాబూ! ధాన్యాన్ని "మంటల్లో" పోస్తారా? కృష్ణలో "నిమజ్జనం" చేస్తారా! "ప్రభుత్వా"లకీ మీకూ తేడా యేమి వుంది? అన్నదాత యెపుడూ అన్నదాతే కావాలిగానీ, అన్న "హోత" (హోమం చేసేవాడు) అవకూడదు. బుధ్ధి తెచ్చుకోండి. టమాటాలు కాలనీల్లో, కిలో అర్థరూపాయికి అమ్మారు కొందరు రైతులు. ఇంకా మిగిలితే, పశువులకి మేపారు......అంతేగానీ అగ్నికి ఆహుతి చెయ్యలేదు. వాళ్లని చూసి నేర్వండి.

కోర్టుల పుణ్యమా అని, నిర్బంధ బందులూ, హర్తాళ్లూ తగ్గాయి కానీ, ఇప్పుడు అనవసర "రాస్తా"; "రైల్" రోకోలు! వీటికి అంతం యెప్పుడో?!

మీ శరీరంలో "జీవప్రక్రియ" రెండురోజులో, రెండుగంటలో అఖ్ఖర్లేదు--రెండు నిమిషాలపాటు ఆగిపోతే--సంభవించేదాన్ని "మరణం" అంటారు. 

మరి ప్రజల జీవనాడులైన రాస్తాలనీ, రైళ్లనీ కొన్ని గంటలపాటు "రోకో" చేస్తే, జనజీవనం యెలా అస్థవ్యస్థమౌతుందో, యెన్ని మరణాలూ, జీవప్రక్రియ స్థంభనలూ సంభవిస్తాయో యెవరైనా ఆలోచించారా?

హై, సుప్రీం కోర్టులూ--ఇలాంటి వ్రాతలని "పిల్లులు" (అంటే మాత్రలూ, మార్జాలాలూ కాదు) గా స్వీకరిస్తే యెంతబాగుండును?

సర్వే జనాస్సుఖినో భవంతు!

No comments: