Saturday, May 7, 2011

కబుర్లు - 45

అవీ, ఇవీ, అన్నీ

"సేవ వలన మనకు చేకూరు ఆనంద
మదియె శాంతి సుఖములంది యిచ్చు
శాంతికన్న మిన్న సౌఖ్యంబు లేదయా
ఉన్నమాట తెలుపుచున్న మాట

స్వర్గమనగ వేరు సురలోకమున లేదు
నరుల లోకమందె యమరియుండు
తనదు లోని అహము తా చంపుకొన్న
అది స్వర్గమగును అవనియందు

కష్టసుఖముల నొకరీతి గాంచవలయు
కలిమిలేములు విడదీసి గడువరాదు
కీర్తి అపకీర్తులను నొక మూర్తిగానె
భావమందుంచి మెలగుటే భక్తి పథము"

ఇదేమిటి?

సత్యసాయి ఆశువుగా చెప్పిన కవితలలో ఒకటిగా చెప్పబడుతున్నది. నాకు బాగా నచ్చింది.

"వేకువజాము :

3 గంటలకి దిన చర్య ప్రారంభం. 6 గంటలవరకూ ఓంకార స్మరణ

ఉదయం :

6.00: భక్తుల ఉత్తరాల పరిశీలన, 7.00: అల్పాహారం; 8.00: భక్తులకు ప్రత్యేక దర్శనం; 9.00: భజన కార్యక్రమంలో పాల్గొంటారు; 9.30: విశ్రాంతి. (భోజనం మరి?)

మధ్యాహ్నం :

3.00: భక్తులకి దర్శనం; 3.30: ప్రముఖులతో భేటీ(?!).

సాయంత్రం :

5.00: ప్రశాంతి నిలయంలో నిర్వహించే భజనలో పాల్గొంటారు.

5.30: యజుర్వేద మందిరానికి వెళతారు; 7.00: భోజనం; 7.30: ట్రస్టు వ్యవహారాలను రాత్రి 9 గంటలవరకూ చూస్తారు.

(తర్వాత?! యజుర్వేద మందిరంలో రెండో అంతస్తులో వున్న తన యేసీ శయన మందిరానికి చేరి, వాటర్ బెడ్ పై నిద్రిస్తారు....యేదో సంగీతాన్ని వింటూ!--అని యెక్కడో చదివిన గుర్తు)

ఇదేమిటీ?

సత్యసాయి దినచర్యగా చెప్పబడినది!  

*   *   *

అయ్యప్ప మకర జ్యోతి గుంటకట్టి, గంట వాయించేసింది. అది "కృత్రిమమే" అని దేవస్వోం బోర్డు పెద్ద కోర్టుకి తెలిపింది.

కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు అక్కడ మంటలు వేసేవారనీ, తరవాత అక్కడో తిన్నె నిర్మించి, దానిమీద కొన్ని కేజీల హారతి కర్పూరం వెలిగించడం ద్వారా, దేవస్వోం వారు మకర జ్యోతిని వెలిగిస్తున్నారు అనీ, బోర్డు వారు వొప్పుకున్నారు.

అంతే కాకుండా, "ఆ సమయంలో" ఆకాశంలో 'పొడిచే' నక్షత్రమే 'అసలు మకర జ్యోతి ' అని కూడా వొప్పుకున్నారు.

ఆ సో కాల్డ్ జ్యోతి కోసం వెళుతూనో, తిరిగి వస్తూనో, టాటా సుమోల్లోనో, ప్రత్యేక వాహనాల్లోనో, తొక్కిసలాటల్లోనో, లాఠీ ఛార్జీల్లోనో, గాయపడిన, మరణించిన వాళ్లకి యెవరు జవాబుదారీ?

ఆ బోర్డు వాళ్లకి వేలల్లో యేమైనా విదిల్చిందేమో. కానీ, వాళ్లు దండుకొనే దాన్లో వీళ్లకి ఇచ్చిందెంత శాతం?

*   *   *

దేశంలోనే తొలిసారిగా హైదరాబాదులోని సనత్ నగర్లో ఈఎస్ ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. (ఈ ఎస్ ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్--ప్రభుత్వోద్యోగులకి సెలవు కావలసి వస్తే, మెడికల్ సర్టిఫికెట్లు జారీ చెయ్యడానికి మాత్రమే వుపయోగపడే సంస్థ!) రూ.129.87 కోట్ల నిధులు, 126 పడకల సామర్ధ్యంతో యేర్పాటు చేశారు. (అంటే పడక్కో కోటి పైగా!)

ఇంకా చాలా వార్తుంది......కానీ, ప్రభుత్వ సొమ్ము పడకల పాలేనా?!

మీరే చెప్పాలి.....బిల్డింగుకెంతయ్యిందో, పడకలకీ వగైరాలకీ యెంతయ్యిందో, కావలసిన డాక్టర్లూ, ఎక్విప్ మెంటూ, ఆపరేషన్ థియేటర్లూ, సామాగ్రీ, యేసీలూ గట్రాలు "ఆ కోటిలోకి" వస్తాయో--అవన్నీ ఎక్స్ ట్రాలో--లాంటి ప్రశ్నలకి జవాబులు.
 
   

No comments: