Sunday, December 13, 2009

హేతువాదం

అభిషేకాలు

త్రిమూర్తుల్లో--బ్రహ్మ 'సృష్టి కారుడు ', విష్ణువు 'స్థితి కారుడు ', శివుడు 'లయ కారుడు '!

(ఇక్కడ కారుడు అంటే, ముక్కు కారుడు లాంటి కారడం కాదు--ఫలనా పని చేసేవాడు, లేదా ఫలనాదానికి కారణం అయినవాడు--అని! ఇలాగే 'స్వర్ణకారుడు ', 'చర్మ కారుడు ' లాంటివి!)

శివుడు 'రుద్ర మూర్తి ', పైగా గరళాన్ని మింగాడు! అందుకనే నిత్యం ఆయన నెత్తిమీద నీళ్ళ చుక్కలు పడే యేర్పాటు చేస్తారు--పైగా అభిషేకం పేరుతో, నిత్యం శిరస్నానం చేయిస్తూ వుంటారు!

మరి, ఆంజనేయుడికీ, అంబేద్కర్ కీ, పొట్టి శ్రీరాములుకీ, ఎన్ టీ ఆర్ కీ--చామంతి పూల తోటీ, పాలతోటీ, పంచామృతాలతోటీ అభిషేకాలేమిటి?

ఓ వూరిలో, ఓ చెరువుగట్టున వున్న శివలింగాన్ని ఓ ఆవు నాకితే, చాలా సంతోషిస్తారు. అదే ఓ పంది, తన దురద తీర్చుకోడానికి తన వొంటిని దానికేసి రాసుకోడానికి ప్రయత్నిస్తే, దాన్ని తరిమేస్త్రారా లేదా?

మొన్నా మధ్య 'సిధ్ధాంతం' అనే వూళ్ళో, ఓ పంది ఓ ఆలయం ధ్వజ స్థంభం చుట్టూ ఆగకుండా ప్రదక్షిణాలు చేస్తుంటే, దాన్ని దైవ స్వరూపం గా భావించి, పూజలు చేసేశారు! అంతేగాని దాన్ని గుడిని అపవిత్రం చేసిందని తరిమెయ్యలేదు మరి!

అదే ఇంకో పంది, ఓ మసీదు చుట్టూ అలా ఆగకుండా ప్రదక్షిణాలు చేస్తే, ముసల్మానులు దాన్ని యేమి చేసేవారో?

యెదైనా మన మనసులో వుంది--మన భావనలో వుంది!

యేదో వూళ్ళో యెవరో దుండగులు అంబేద్కర్ విగ్రహం ముఖమ్మీద తారు పూసి, మెళ్ళో చెప్పుల దండవేస్తే, మిగిలిన వూళ్ళలో అయన విగ్రహాలకి పాలతోటీ, పంచామృతాలతోటీ అభిషేకిస్తే--అక్కడ అవమానింపబడిన విగ్రహం పవిత్రమైపోతుందా?

ఓ వూళ్ళో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించడం, మిగిలిన చోట్ల ఆ విగ్రహలని పాల తో అభిషేకించడం--ఇవన్నీ ఇలాంటివే!

ఆ పాలనీ, పంచామృతాలనీ, యే ఆంగన్ వాడీలోని పిల్లలకో ఇస్తే, వాళ్ళకి బలవర్ధక ఆహారం అందించినవాళ్ళు అవుతారు కదా?

అలాగే, కూరగాయలతోటి అమ్మవార్లనీ, జొన్నపొత్తులతోటి వినాయకుణ్ణీ, పళ్ళతోటి సాయిబాబాల్నీ అలంకరించేబదులు, వాటిని స్కూళ్ళలో మధ్యాన్న భోజన పధకానికి ఇస్తే, పాపం పిల్లలు చారునీళ్ళుతో భోజనం చేసే అవస్థ తప్పుతుంది కదా?

మొన్నెప్పుడో మన ఉన్నత న్యాయస్థానం 'కూడళ్ళలో విగ్రహలు ప్రతిష్టించడం పై' నిషేధం విధించింది.

ఇప్పుడు, ఇప్పటికే వున్న విగ్రహాలని కూడా, విచక్షణా రహితం గా 'ధ్వంసం' చెయ్యమని ఆర్డరు వేస్తే బాగుండును! దీనివల్ల యెవరికీ నష్టం వుండదు--గమనించండి!

విజయవాడ ఆంధ్రపత్రిక సెంటర్లో వుండే, కొన్ని టన్నుల బరువైన శ్రీ నీలం సంజీవరెడ్డి విగ్రహన్ని, ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భం గానే అనుకుంటా, జనాలు పడగొట్టి, కృష్ణ కాలవదాకా ఈడ్చుకెళ్ళి, అందులో పడేశారు!

దీనివల్ల యెవరికైనా యేమైనా నష్టం వచ్చిందా?

అలోచించండి!

Tuesday, December 1, 2009

లాలూ మూర్ఖహ.....


అగ్రేసరీ మమత!

కోచ్ ల కొరత కారణంగానే కొత్త రైళ్ళను నడపడం కష్టం గా మారిందని, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు శ్రీ ఎం ఎస్ జయంత్ అన్నారట.

ఆరువేల కోచ్ లు అవసరం వుండగా, మూడువేలే అందుబాటు లో వున్నాయని చెప్పారట!

రాయ్ బరేలీలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైతే, కోచ్ ల కొరత ‘కొంతమేరకు’ తీరనుందట—ఇది ముక్తాయింపు!

(రాయ్ బరేలీ అప్పట్లో ఇందిరాగాంధీ నియోజక వర్గం—ఇప్పుడు సోనియా గాంధీదనుకుంటా! అందుకని ఈ చెక్కభజన అనికూడా అనుకుంటా!)

మొన్నీ మధ్యనే ‘అన్నీ ఏసీ బోగీలు‘ తయారు చేసి ఓ ‘తురంతో’కో, ‘గరీబ్ రథ్’ కో ఇచ్చారని వార్త వచ్చింది! వున్న దురంతోల్లోనూ, గరీబ్ రథ్ లలోనూ 23 నించి 26 శాతం మాత్రమే నిండుతుండగా, ఈ కొత్త, పూర్తి ఏసీ రైలు యెలా కిట్టుబాటవుతుందో మమతకే తెలియాలి.

ఇక మూడు వేల కోచ్ లు అందుబాటులో వున్నాయంటే, బాగా పాడైపోయిన ఓ వంద రైళ్ళకి చెందిన 2300 బోగీలని కొత్తవి వేసేసినా, ఇంకా 700 బోగీలు వుంటాయి—వీటితో ఓ 30 రైళ్ళని ప్రవేశ పెట్టచ్చు కదా?

ఆడలేక మద్దెల ఓడన్నట్టు లేదూ ఈ వ్యవహారం?

కక్కుర్తి బెర్తులు తొలగించిన రైళ్ళలో పై బెర్తుని క్రిందకి దించి, పాత కన్నాల్ని పూడ్చి, కాస్త రంగులైనా వెయ్యడానికి దిక్కు లేదు గానీ, కొత్త రైళ్ళూ, పూర్తి ఏసీ రైళ్ళూ, అవీనట! మీరు దేంతో నవ్వుతారు?

మనం ఇంతకు ముందు చెప్పుకున్న 'రైల్వేలకి చెందిన (అపార) స్థలాలని' 'పబ్లిక్-ప్రైవేట్' భాగస్వామ్యం తో 'అభివృధ్ధి' చేద్దామని ఓ ఆలోచనట! ఇక వాటిని ఆ దేవుడే కాపాడాలేమో!

సంచీ లాభం చిల్లు కూడదీసినట్లు, మేనేజ్ మెంట్ గురు లాలూ డబ్బాకొట్టుకున్న లాభాలని మమత కరగేసి, తను ఇంకో సూపర్ మేనేజ్ మెంట్ గురు అయిపోతుందేమో!

అయినా ఆశ్చర్యం లేదు!