Sunday, December 13, 2009

హేతువాదం

అభిషేకాలు

త్రిమూర్తుల్లో--బ్రహ్మ 'సృష్టి కారుడు ', విష్ణువు 'స్థితి కారుడు ', శివుడు 'లయ కారుడు '!

(ఇక్కడ కారుడు అంటే, ముక్కు కారుడు లాంటి కారడం కాదు--ఫలనా పని చేసేవాడు, లేదా ఫలనాదానికి కారణం అయినవాడు--అని! ఇలాగే 'స్వర్ణకారుడు ', 'చర్మ కారుడు ' లాంటివి!)

శివుడు 'రుద్ర మూర్తి ', పైగా గరళాన్ని మింగాడు! అందుకనే నిత్యం ఆయన నెత్తిమీద నీళ్ళ చుక్కలు పడే యేర్పాటు చేస్తారు--పైగా అభిషేకం పేరుతో, నిత్యం శిరస్నానం చేయిస్తూ వుంటారు!

మరి, ఆంజనేయుడికీ, అంబేద్కర్ కీ, పొట్టి శ్రీరాములుకీ, ఎన్ టీ ఆర్ కీ--చామంతి పూల తోటీ, పాలతోటీ, పంచామృతాలతోటీ అభిషేకాలేమిటి?

ఓ వూరిలో, ఓ చెరువుగట్టున వున్న శివలింగాన్ని ఓ ఆవు నాకితే, చాలా సంతోషిస్తారు. అదే ఓ పంది, తన దురద తీర్చుకోడానికి తన వొంటిని దానికేసి రాసుకోడానికి ప్రయత్నిస్తే, దాన్ని తరిమేస్త్రారా లేదా?

మొన్నా మధ్య 'సిధ్ధాంతం' అనే వూళ్ళో, ఓ పంది ఓ ఆలయం ధ్వజ స్థంభం చుట్టూ ఆగకుండా ప్రదక్షిణాలు చేస్తుంటే, దాన్ని దైవ స్వరూపం గా భావించి, పూజలు చేసేశారు! అంతేగాని దాన్ని గుడిని అపవిత్రం చేసిందని తరిమెయ్యలేదు మరి!

అదే ఇంకో పంది, ఓ మసీదు చుట్టూ అలా ఆగకుండా ప్రదక్షిణాలు చేస్తే, ముసల్మానులు దాన్ని యేమి చేసేవారో?

యెదైనా మన మనసులో వుంది--మన భావనలో వుంది!

యేదో వూళ్ళో యెవరో దుండగులు అంబేద్కర్ విగ్రహం ముఖమ్మీద తారు పూసి, మెళ్ళో చెప్పుల దండవేస్తే, మిగిలిన వూళ్ళలో అయన విగ్రహాలకి పాలతోటీ, పంచామృతాలతోటీ అభిషేకిస్తే--అక్కడ అవమానింపబడిన విగ్రహం పవిత్రమైపోతుందా?

ఓ వూళ్ళో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించడం, మిగిలిన చోట్ల ఆ విగ్రహలని పాల తో అభిషేకించడం--ఇవన్నీ ఇలాంటివే!

ఆ పాలనీ, పంచామృతాలనీ, యే ఆంగన్ వాడీలోని పిల్లలకో ఇస్తే, వాళ్ళకి బలవర్ధక ఆహారం అందించినవాళ్ళు అవుతారు కదా?

అలాగే, కూరగాయలతోటి అమ్మవార్లనీ, జొన్నపొత్తులతోటి వినాయకుణ్ణీ, పళ్ళతోటి సాయిబాబాల్నీ అలంకరించేబదులు, వాటిని స్కూళ్ళలో మధ్యాన్న భోజన పధకానికి ఇస్తే, పాపం పిల్లలు చారునీళ్ళుతో భోజనం చేసే అవస్థ తప్పుతుంది కదా?

మొన్నెప్పుడో మన ఉన్నత న్యాయస్థానం 'కూడళ్ళలో విగ్రహలు ప్రతిష్టించడం పై' నిషేధం విధించింది.

ఇప్పుడు, ఇప్పటికే వున్న విగ్రహాలని కూడా, విచక్షణా రహితం గా 'ధ్వంసం' చెయ్యమని ఆర్డరు వేస్తే బాగుండును! దీనివల్ల యెవరికీ నష్టం వుండదు--గమనించండి!

విజయవాడ ఆంధ్రపత్రిక సెంటర్లో వుండే, కొన్ని టన్నుల బరువైన శ్రీ నీలం సంజీవరెడ్డి విగ్రహన్ని, ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భం గానే అనుకుంటా, జనాలు పడగొట్టి, కృష్ణ కాలవదాకా ఈడ్చుకెళ్ళి, అందులో పడేశారు!

దీనివల్ల యెవరికైనా యేమైనా నష్టం వచ్చిందా?

అలోచించండి!

10 comments:

మాగంటి వంశీ మోహన్ said...

మనుషుల బుద్ధులు కోతులకుంటే - కోతుల బుద్ధులు కొందరివి అని మా తాతగారు చెప్పేవారు. మొదటిది ఆంజనేయులవారుట, రెండవది మనమట. కనపడుతోంది...కనపడుతోంది...

మీరు చెప్పే శ్రీరాములు, అంబేడ్కరు వగైరా వగైరా పాలాభిషేకాల సంగతి వొప్పుకుంటాను సరే .....మంచి పాయింటే. ...మధ్యలో ఆంజనేయుడిని ఇరికించారెందుకో!.... లేక పొరపాటున ఏదో అనబోయో, రాయబోయో కలం తూలిందా?

అది అలా పక్కన బెట్టి, మరి మీరు కూడా ఆ బాంకులో ఉద్యోగం మానేసి చక్కగా మీ ఆస్తీ, బాఘా లౌక్యం వున్న మనిషిలాగా కనపడుతున్నారు కాబట్టి - మీ బంధువులను ఒప్పించి వాళ్ళ ఆస్తీ - ఇలా అంత ఆస్తితోనూ కూరగాయలూ, జొన్నపొత్తులూ, పళ్ళూ కొని చారునీళ్ళతో భోజనం చేసి అవస్థ పడుతున్న మీ దగ్గర్లో వున్న స్కూలు మధ్యాహ్న భోజన పధకానికి రాసిచ్చెయ్యండి..భారం వదిలిపోతుందీ....ఆ పైన ఆ పిల్లలకు సాయం చేసినవారూ అవుతారూ. ఏ స్కూలుకి ఇస్తారో చెప్పండి, ఆ స్కూలుకొచ్చి మీ పేరు మీద శిలాఫలకాలు చెక్కిస్తాము - శాశ్వతంగా పడి ఉండటానికి..... అదీ సంగతి మాష్టారూ......

ఇంకా బోలెడు రాయొచ్చు...సమయం కుదిరినప్పుడో, వీలు చూసుకునో తర్వాత వస్తా..

వంశీ

కెక్యూబ్ వర్మ said...

దుబారా చేయడం ద్వారా ఏదో సాధించేయొచ్చని అనుకోవడం, ఎక్కడో జరిగినదానికి అతిగా స్పందించడం, మీడియా కవరేజీ కోసం కొత్త కొత్త ఫీట్లూ చేయడం ఈ మద్య పరిపాటయ్యింది. ఇట్లాంటివి మాటాడితే పై స్పందనలాగే వుంటాయి జవాబులు.

విజయ క్రాంతి said...

అయ్యా ఒసామా గారు వర్మ గారు ... అవును మరి ..
వూరికే వుండరు ..హేతు వాదం పేరుతో తమ పబ్బం గడుపుకొంటున్నారు మరి మీ హేతు వాడ సంఘ నాయకులు .మరి వారిని ఏమి చేయాలో చెప్పండి ? జనాలకి ఇప్పుడు చేయాల్సింది అభివృద్ధి . మందు మాన్పించండి మంచిది , వోటు సరిగ్గా వాడమని చెప్పండి మంచిది .
కాని స్వవిషయాలని వూరికే గేలి చేసి మాట్లాడేది ఎందుకు ?
పాలు అభిషేకం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలు . మీడియా కోసమో ఇంకా దేని కోసమైనా కాని మీ డబ్బులు తీసుకోలేదు గా ?

అయినా గొప్ప వీర హేతు వాది అని చెప్పే ఇన్నయ్యగారు ( మీ కు తెల్సిన వారే అనుకుంటా ) జాతకాలు లేవంటారు . కాని వారు అమెరికా వెళ్ళింది ఆ డబ్బుతోనే . ఎం న్యాయం ?

మీకు చాతనవుతే మీరు చేయండి దానాలు ధర్మాలు . వేరే వాళ్ళని అనటం ఎందుకు ?

Unknown said...

డియర్ Vamsi M Maganti!

ముందుగా మీ దృష్టిలో నా టపా పడడం ఓ అదృష్టం గా భావిస్తున్నాను! మీ వెబ్ పేజ్ చూశాను--చాల బాగుంది--మీ కృషిని అభినందిస్తున్నాను!

చూడగానే మీ వివరాలు తెలిసేలా వ్రాస్తే బాగుండేది. మిగిలినవాళ్ళగురించి తరవాత.

ఇక మీ 'ఆలయాలు' క్రింద యేమి వ్రాస్తారో చూడాలని వుంది.

ఇక నా టపా పై మీ వ్యాఖ్య గురించి--

మీరు నా టపాలు చదవడం ఇదే మొదలు అని తెలుస్తూనే వుంది--యెందుకంటే, ఇలాంటి వ్యాఖ్యలకి ఇదివరకే సమాధానం చెప్పడం జరిగింది.

భక్తి పేరుతో వేలం వెఱ్ఱిగా కూరగాయలూ, పళ్ళూ, పాలూ పాడు చెయ్యద్దన్నాను గానీ, నా అస్తి అమ్ముకునేంత దురద నాకు లేదు--ఇప్పటికే నేను చేస్తున్న సేవలూ, త్యాగాలూ చాలు నాకు. మీ శిలాఫలకాలు నేను ఆశించను.

ఇక మీకేం కనపడిందోగాని, తూలడం నా కలానికి అలవాటు లేదు.

ఏ పేపరు చూసినా, 'ఆధ్యాత్మికం' పేరుతో, వివిధ గుళ్ళలో దేవుళ్ళకి చేస్తున్న వివిధ అలంకారాలని పోటీ పడి ప్రచురిస్తున్నారు--ఒకరిని చూసి ఇంకొకరు రెచ్చెపోతున్నారు!

ఆంజనేయుడి గుళ్ళో కూడా, పెర్మనెంట్ గా శివలింగానికి కట్టినట్టు నెత్తిమీద క్రింద చిల్లు వున్న ఓ ఇత్తడి పాత్ర కట్టేసి, రోజూ దాంట్లో పాలు పోసేస్తున్నారు కొన్ని గుళ్ళలో! ఇంకా, చామంతిపూలతో అభిషేకం, తమలపాకులతో అభిషేకం--ఇలా!

పాతికేళ్ళ క్రితమే, కొన్ని వూళ్ళలో, రోజుకి నాలుగు కావిళ్ళ చొప్పున నీళ్ళు కొనుక్కొని, ఇంటిల్లపాదీ అవసరాలు--త్రాగే నీటితో సహా తీర్చుకొనేవాళ్ళం!

ఇప్పటికీ కొన్ని వేల వూళ్ళలో, గ్రామాలలో వాడకానికి కూడా నీళ్ళు వుండవు--త్రాగునీటి సంగతి తరవాత!

ఇలాంటి పరిస్థితుల్లో, శ్రీపతి వెంకన్నకి రోజూ సహస్ర కలశాభిషేకాలా? (ఇప్పుడు బుధవారం ఒక్కరోజుకే సరి పెట్టారనుకోండి--అది మాత్రం యెందుకో!)

నేను యెందుకు అని వేసిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం వుంటే వ్రాయండి!

మీరు ఇంకా బోలెడు వ్రాసినా వుపయోగం వుండదు!

అన్నట్టు ఓ సారి ఒకాయన గాంధీగారి మీద విమర్శనాత్మకం గా కొన్ని పేజీలు వ్రాసి, ఆయనని పూర్తిగా చదవమంటే--చదివి, ఆ కాగితాలకి గుచ్చిన గుండుసూదిని తీసుకొని, కాగితాలు తిరిగి ఇచ్చేశాడట! మీ అభిప్రాయం చెప్పలేదేమంటే, 'ఇందులో విలువైనది తీసుకున్నానుగా?' అని బోసినోటితో నవ్వాడటా మహత్ముడు!

ధన్యవాదాలు!

Unknown said...

డియర్ కెక్యూబ్ వర్మ!

చాలా సంతోషం!

బాపు గీసిన ఓ ప్రఖ్యాత కార్టూన్ గుర్తొచ్చింది--

ఓ వీధిలో ఓ అందమైన అమ్మాయి నించుని వుంటుంది--బస్సుకోసం యెదురు చూస్తూ అనుకుంటా!

(ఆమెవంకే చూస్తూ, నడిచి, సైడుకాలవలో పడిపోయినవాళ్ళు ముగ్గురు నలుగురు వుంటారప్పటికే!)

సైడుకాలవలో ఇంతకుముందు పడినవాడు, పక్కవాడితో అంటూంటాడు 'ఇంకోడొస్తున్నాడు--మీరు పక్కకి జరగండి!' అని!

వాళ్ళ హావభావాలు తలుచుకొంటే, ఇప్పటికీ ఓ పావుగంట నవ్వు ఆగదు!

అలా--'విజయ క్రాంతి' వస్తున్నారు--మీరు పక్కకి జరగండి! మాగంటివారికి ఇచ్చిన సమాధానం చదువుకుంటారు!

ధన్యవాదాలు!

Unknown said...

డియర్ విజయక్రాంతి!

చాలా సంతోషం!

మీ ఆక్రోశం యెందుకో అర్థం కాలేదు.

'పబ్బం గడుపుకోవడం' యేమిటో, 'స్వవిషయాలని గేలి చెయ్యడం' యేమిటో, 'ఇన్నయ్యగారు' గొడవేమిటో, 'దానధర్మాల' ప్రసక్తి యెందుకో--నాకేమీ అర్థం కాలేదు!

ధన్యవాదాలు!

మాగంటి వంశీ మోహన్ said...

డియర్ ఒసామాగారూ

మీ కంట్లో నా "నలుసు" పడటం ఆ ఆంజనేయుల వారి ప్రసాదమే! ఇలాటి అభినందనలకు - అదే హేతా(టా)భినందనలు- కు అతీతులం! కాబట్టి మీవి మీవద్దే వుంచుకోండి.

చూడగానే వివరాలు తెలియడానికి ఇదేమీ మీ మధ్యాహ్నభోజనంలోని పొగపు లేని చాఱు కాదు, అన్నీ సమపాళ్ళలో వున్న షడ్రుసోపేతమైన విందు కాబట్టి ఆ విందు వివరాలు, ఆహ్వానం వున్నవాళ్ళకే కాబట్టీనూ...:)

ఇక నా "ఆలయాల" కింద ఏమి వ్రాస్తానో మీ హేతువుతో ఊహించుకోవచ్చు. ఊహించలేకపోతే అంతకన్నా విచారకరమైన సంగతి ఇంకోటి లేదు.

ఇక మీ వ్యాఖ్య పై నా ప్రతివ్యాఖ్య --

ఇదివరలో సమాధానాలు చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పను, నేను రచించిన హేతు(టు) భారతాన్ని చదువుకోండి అనేది మీ ఉద్దేశమైతే సంతోషమే!

భక్తులు వారి దురద వారి, ఆస్తులమ్ముకునో, ఏదోటి చేసో భక్తితో - అంటే కూరగాయలతో, పళ్ళతో, పాలతో తీర్చుకుంటారు. అందుకనో, ఐతేనో మీరు చూసేవి మీకు భూతద్దంలో కనపడుతోన్నట్టున్నవి. మీకు ఏ విధమైనా దురదలేదు కాబట్టి, ఆస్తి అమ్ముకోవడంతో సహా, ఆ దురద ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఉత్సాహం, అత్యుత్సాహం ఎక్కువగా కనపడుతోంది మీ మాటల్లో. కాకుంటే మనకు లేని దురద, పక్కవాడికుందే అన్న దుగ్ధతో ఇంకోకరిని గోకితే, కొంతమందికి సమ్మగా వుండొచ్చు, కొంతమందికి కాలొచ్చు. గోకే స్థలాన్ని బట్టి. కాబట్టి దురద లేనప్పుడు తెచ్చుకోవాలన్న దుగ్ధ, గోకాలన్న గోకర్ణం తగ్గించుకోండి. ఈ వయసులో మీకు అవసరమూ కాదు, అంటుకుంటే వదిలే రోగమూ కాదు. ఇక శిలాఫలకాలు మీరు ఆశించనవసరము లేదు. మీరు ఆస్తి అమ్ముకుని, మాధవ సేవ ఎప్పుడైతే చేస్తారో, అప్పుడే మీకు సంబంధం లేకుండా అన్నీ మీ సొంతమవుతవి - కొన్ని తరాలవరకూ.

మధిరాపానం చేసినవాడికి ఆ మత్తు తగ్గిన తర్వాత కానీ తెలిసిరాదుట, ఎంత తూలామన్నది. కొంతమంది ఆ పానమే జీవితమనుకుంటారు.

మరి మీరే ఒక పేపరు మొదలుపెట్టి అందులో "ఒసామాత్మికం" అనే అరివీర భయంకర సంపాదకీయం మొదలుపెట్టండి - మొదటి చందాదారుణ్ణి నేనే చేర్పిస్తాను. అది కుదిరేపనికాదనుకుంటే, విగ్రహారాధన లేని గుడి (లేదా భవనం) కట్టో, చక్కగా మీరే అందులో కూర్చుంటే ఇక ఆ విగ్రహాలకు చేసిన అలంకారాలన్నీ మీ మీదే. అప్పటికి దురద అంటుకుంటే, ఆ అభిషేకాలతో తగ్గుతుంది అని చాలామందికి అచంచల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని, విశ్వాసం మాత్రమే సుమా మూఢనమ్మకం కాదు - వమ్ము చెయ్యరని ఆశిస్తున్నాను.

ఆంజనేయుడు ఆ శివపుత్రుడే కాబట్టి ఆయనకు - వారి తండ్రికి చేసే విధానం పాటించడంలో తప్పు లేదు. ఈనాటి రాజకీయనాయకుల వారసత్వం లాగా. ఆయనకు తమలపాకులు ఇష్టమని చదువుకోనివాడికైనా తెలుసు. మీకు తెలియకపోవటమనేది చాలా ఆనందం కలిగించే విషయమే.

పాతికేళ్ళ క్రితం మేమూ రోజూ ఎనిమిది కావిళ్ళ చొప్పున కొనుక్కున్నాము. కానీ ఆ తర్వాతి ఎలక్షన్లో మా "హేతువు" అంటే బుద్ధి ఉపయోగించి బుర్ర వున్నవాడిని, పని చేసేవాడిని , ఊరికి కావలసిన పని చెయ్యకపోతే బడితపూజకు సిద్ధమైపోయిన ప్రజల సహాయంతో ఎన్నుకున్నాము కాబట్టి అప్పటినుంచి మాకాబాధలు తప్పినాయి. అంత హేతువు మీకు లేకపోయిందే అన్న విచారం ఆనందంగా మారబోతూ దోబూచులాడుతోంది. మీ హేతువు ఒక మంచి పనికి, అదీ మీమంచికి ఉపయోగపడలేదే అన్నది చాలా విచారకరం.

మీ హేతువుతో, సేవతో ఒక్క మనిషికి సాయం చేయండి - వేల గ్రామాలు బాగుపడ్డంతో సమానం.

వెంకన్నకు సహస్ర కలశాభిషేకం ఎందుకు చేస్తారన్న మాట తి.తి.దే వారి పుస్తకం చదవండి తెలుస్తుంది. ఆ సంగతి ఇక్కడ వ్రాయాలంటే మీ బ్లాగు స్థలం సరిపోదు.

బోలెడు వ్రాయవలసిన చొట బోలెడు వ్రాయొచ్చు, అది ఎక్కడైనా కావొచ్చు - వుపయోగం అనేది హేతువు వున్నవాడికి అర్థమవుతుంది, వాడుకుంటాడు. ఇలాటి చోట? మరి. అదీ సంగతి!

అన్నట్టు "గండూషణం తతో దద్యాత్ ముఖప్రక్షాళణం తథా" అని ఒకాయన చెబితే తరువాత జరిగిన గొడవలో హేతువాదికి బోసినవ్వే మిగిలిందిట. ఎందుకో ఈపాటికి తెలిసుంటుంది అని భవదీయుడి అభిప్రాయం.

ధన్యవాదాలు!

PS: ఇదే చివరి సమాధానం. :)

Unknown said...

డియర్ Vamsi M Maganti!

మీ 'ఆఖరి సమాధానానికి' నా ధన్యవాదాలు!

'నా మధ్యాహ్న భోజనం' యేమిటో నాకు అర్థం కాలేదు! కానీ, షడ్రసోపేతమైన విందులో వడ్డించి, విస్తరిలో వుమ్మినట్టుంది మీ విందు! ఆహ్వనం వున్నవాళ్ళకే వడ్దించండి--వాళ్ళతోటే పొగిడించుకోండి!

మీ వివరాలు తెలుస్తాయేమోనని మీ బ్లాగులోకి ప్రవేశించాను గానీ యేదో బావుకుందామని కాదు! మీ చాటువుల కలెక్షన్ చూసి అభినందించాను! అక్కర్లేదంటే మీ ఇష్టం.

ఇక మీరన్న భక్తుల దురద యేమిటోగానీ, మీ నోటి దురద బాగా తీర్చుకున్నారు! సంతోషం!

పేపరు పెట్టడం, గుడి కట్టడం గురించి నేనేమైనా వ్రాశానా? మీ దగ్గర నేను వ్రాసినవాటికి సమాధానం లేకపోవడం వల్లే ఇలా పక్కదారి పడతారు!

వాయుపుత్రుడైన ఆంజనేయుడు, శివపుత్రుడెలా అయ్యాడో, ఆయనకి తమలపాకులంటేనే ఇష్టం అని యే పురాణం లో వ్రాశారో మీరు చెప్పలేదు!

మీరు మీవూరికి నీళ్ళబాధలు తప్పించుకుంటే, దేశం లో అందరి బాధలూ తీరిపోయినట్టే అన్న మీ మంచి బుధ్ధికి నా జోహార్లు!

నేను చేస్తున్న 'సాయాల గురించి' మాట్లాడక్కర్లేదని ముందే చెప్పాను!

వెంకన్నకు అభిషేకాలు ప్రతిరోజూ ఇదివరకు లేవు--మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోయాయి! పుస్తకాలు చదవక్కర్లేదు!

గొడవలుజరిగి, యెదటివాళ్ళకి బోసినవ్వే మిగలాలనుకొనేవాళ్ళు వాదనలకి దిగడం యెందుకో?

మరోసారి ధన్యవాదాలు!

Ekalavya said...

గురువుగారూ! నమస్కారం!

కొత్తగా బ్లాగు ప్రపంచంలోకి ప్రవేశించిన నాకు మొట్టమొదటే మీ బ్లాగులతో పరిచయం అవడం నా అదృష్టం గా భావిస్తున్నాను.

మీ వివిధ బ్లాగులలోని టపాలన్నిటినీ శ్రధ్ధగా చదవడానికి ప్రయత్నిస్తున్నాను—వాటి మీద వచ్చిన వ్యాఖ్యలూ, మీ సమాధానలతో సహా!

పొగడ్త అనుకోకపోతే, నిజంగా మీలాంటివాళ్ళు అరుదు గురువుగారూ!

వెంటనే నా దృష్టినాకర్షించిన ఒకటి రెండు టపాలూ, వాటి మీద 'కువ్యాఖ్యలూ' చదివాక చాలా కోపం వస్తోంది. వీళ్ళెవరికైనా బుర్రలు వున్నాయా అని.

మీరు వ్రాసిన ముఖ్య విషయన్ని కామెంట్ చేసే ధైర్యం యెవరికీ వున్నట్టు లేదు! ఏదో విషయం మీద అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది!

మీ తరఫున వాళ్ళ గూబలు పగలకొట్టాలని వుంది—మీరనుఙ్ఞ ఇస్తే!

నమోవాకాలు!

A K Sastry said...

డియర్ Ekalavya!

బ్లాగుప్రపంచంలోకి స్వాగతం!

చాలా సంతోషం.

బుర్రలు అందరికీ వుంటాయి--అందులో గుజ్జే కొంచెం తేడాగా వుంటుంది కొంతమందికి!

ఇది స్వేచ్చా ప్రపంచం--యెవరికీ యెవరి అనుఙ్ఞా అక్కరలేదు.

ఆవేశం వద్దు--అర్థం చేసుకోండి, నలుగురికీ తెలియచెప్పండి.

ధన్యవాదాలు!