Saturday, July 9, 2011

కబుర్లు - 64

అవీ, ఇవీ, అన్నీ

మన బుర్రోవాదుల బుర్రల్లోని ఆలోచనలు యెన్ని వెర్రితలలు వేస్తున్నాయో చూడండి!

సామాన్యులకి యేడాదికి 4 గ్యాస్ సిలిండర్లు సరిపోతాయట. అందుకని, ఐదో సిలిండరు కావాలనేవాళ్లకి ఒక్కోటీ రూ.800/- కి తక్కువకాకుండా అమ్మాలట. అప్పుడు సబ్సిడీ భారం తీరిపోతుందటా!

అసలు ఈ గొడవంతా యెందుకు? ఆ గ్యాసు కంపెనీలని ప్రతీవూళ్లోనూ చిల్లరకొట్లు తెరిచి, వాళ్లకిష్టం అయిన రేటుకి సిలిండర్లు అమ్ముకోమంటే వొదిలిపోతుందికదా? దీపం పథకాలూ వగైరా చెట్టెక్కి, అందరూ యెండుపుల్లలతో వంటలు ప్రారంభిస్తారు? హబ్బే! గ్యాసు యేజన్సీలు రద్దుచేస్తే, మా పలుకుబడీ, సంపాదనా యేమికాను? అంటారు రాజకీయులు!

మళ్లీ దానికీ "ఆథార్" సంఖ్యే ప్రమాణమట!

ఇంక ఈ ఆథార్ యెలా పాము మెలికలు తిరుగుతూ నడుస్తోందో చూశారా? ఇప్పటి వరకూ మనకి యెన్ని రకాల "కార్డులు" వున్నాయో గమనించారా?

ఆథార్ సంఖ్య కోసం బెంగుళూరు లాంటి మహానగరంలో, ఓ 12 పోస్టాఫీసులని యెంపికచేసి, అన్ని లక్షలమందినీ అక్కడే అప్లికేషన్లు తీసుకోమన్నారట. తీరా రెండురోజుల్లో ఇచ్చిన అప్లికేషన్లకి సంఖ్యలు కేటాయించాలంటే రోజుకి గరిష్ఠంగా 50 వేసుకున్నా, (ఆ 50 పూర్తయ్యేవరకూ కొన్ని వందలమంది పడిగాపులు పడాలట!) 2012 జనవరి నెలాఖరువరకూ జారీ పూర్తి కాదట! అందుకని అప్ప్లికేషన్లని ఇవ్వడం మానేశారట!

ఇంక అప్లికేషన్ తోపాటు ఒక "గుర్తింపు" పత్రమూ, ఒక "నివాస ధృవీకరణ" పత్రమూ, ఇంకా ఫోటోలూ, వేళ్లూ, కళ్లూ వగైరాలు తీసుకెళ్లాలట! (పిచ్చి కుదిరితేగానీ పెళ్లి కాదు, పెళ్లైతేగానీ పిచ్చి కుదరదు అన్నట్టు, ఆ జాబితాలలోని కార్డులు పొందడానికి "ఆథార్" కావాలట. ఆథార్ కావాలంటే, ఆ పత్రాలు వుండాలట!). ఆ జాబితాలు పరికించండి......

గుర్తింపు పత్రాల జాబితా--పాస్ పోర్ట్; పాన్ కార్డ్; రేషన్ కార్డ్; వోటరు కార్డ్; డ్రైవింగ్ లైసెన్స్; గవర్నమెంటువారు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డ్; వుపాధి హామీ జాబ్ కార్డ్; గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన కార్డ్; ఆయుధ లైసెన్స్; ఫోటోతో వున్న బ్యాంక్ ఏటీఎం కార్డ్; ఫోటో వున్న క్రెడిట్ కార్డ్; పెన్షనర్ ఫోటో కార్డ్; స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డ్; ఫోటో వున్న రైతు పాస్ బుక్; హౌసింగ్ వాళ్లిచ్చిన ఫోటో కార్డ్; పోస్టల్ వాళ్లిచ్చిన ఫోటో, చిరునామా వున్న కార్డ్--ఇవేమీ లేకపోతే, ఓ గ్రూప్ 'ఏ' గెజిటెడ్ అధికారి, తన లెటర్ హెడ్ మీద, ఫోటో తో ఇచ్చిన గుర్తింపు పత్రం! (యెన్నయ్యాయో నేను లెఖ్ఖపెట్టలేదు!).

ఇంక, నివాస ధృవీకరణ పత్రాల జాబితా........(మళ్లీ) పాస్ పోర్ట్; రేషన్ కార్డ్; వోటరు కార్డ్; డ్రైవింగ్ లైసెన్స్; పెన్షన్ గుర్తింపుకార్డ్; స్వాతంత్ర్య సమర యోధుల గుర్తింపు కార్డ్; ఫోటోతో వున్న రైతు పాస్ బుక్; బ్యాంక్ స్టేట్మెంట్/పాస్ బుక్; పోస్టాఫీసు యెకవుంట్ స్టేట్మెంట్/పాస్ బుక్; ప్రభుత్వం వారు జారీచేసిన గుర్తింపు కార్డు; విద్యుత్ వినియోగ బిల్లు; నీటి వాడకం బిల్లు; టెలిఫోను ల్యాండ్ లైన్ బిల్లు; ఆస్థి పను రసీదు (ఇవన్నీ కూడా మూడు నెలలకుమించి పాతవి కాకూడదు??!!); ఇన్స్యూరెన్స్ పోలసీ, ఫోటో తో మరియూ అధికార్ల సంతకాలతో బ్యాంకు వారు తమ లెటర్ హెడ్ మీద జారీచేసిన వుత్తరం; యేదైనా రిజిస్టర్డ్ కంపెనీ తన లెటర్హెడ్ మీద ఫోటోతో జారీచేసిన వుత్తరం; గుర్తింపు పొందిన విద్యా సంస్థ ఇచ్చిన వుత్తరం; వుపాధి హామీ జాబ్ కార్డ్; ఆయుధ లైసెన్స్; హౌసింగ్ బోర్డ్ గుర్తింపు కార్డు; ఒక ఎంపీ గానీ, ఎమ్మెల్యేగానీ, గ్రూప్ 'ఏ' గెజిటెడ్ అధికారిగానీ చిరునామా ధృవీకరిస్తూ ఇచ్చినవుత్తరం; పంచాయతీ సర్వోన్నతాధికారి ఇచ్చిన పత్రం; ఇన్‌కం టేక్స్ యెసెస్మెంట్ ఆర్డరు; వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్; రిజిస్టర్ అయిన క్రయ/లీజు/అద్దె యెగ్రిమెంట్; పోస్టలు వారిచ్చిన నివాస ధృవీకరణ పత్రం; రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చిన కుల/డోమిసైల్ సర్టిఫికెట్ (ఫోటో తో వున్నది). (ఇవికూడా యెన్నో నేను లెఖ్ఖపెట్టలేదు!).

ఇవికాకుండా--పుట్టిన తేదీ ధృవీకరణకోసం--జనన ధృవీకరణ పత్రం; ఎస్ ఎస్ ఎల్ సీ సర్టిఫికెట్; పాస్ పోర్ట్; గ్రూప్ 'ఏ' గెజిటేడ్ అధికారి తన లెటర్ హెడ్ మీద ఇచ్చిన జనన తేదీ ధృవీకరణ పత్రం.

(హమ్మయ్య! జాబితాలు పూర్తయ్యాయి. కానీ, నాకు రెండు....కాదు....మూడు సందేహాలు--ఈజాబితాల్లో వున్న కార్డుల్లో యే వొక్కదానిలో అయినా మన చిరునామా వుంటుందా? ఒకవేళ వున్నా అది ఖచ్చితంగా సరిగ్గా వుంటుందా? మనం ఆ చిరునామాలో యెన్నాళ్లు వుంటామో గ్యారంటీ వుదా?--ఇదీ మొదటి సందేహం. రెండోది, యెవరైనా వీటిలో యేదో ఒక ధృవపత్రం వొకటి రెండు రోజుల్లో--అదీ పైసా ఖర్చు చెయ్యకుండా (ఫోటోలకి తప్ప) సాధించగలరా? ఇంక మూడోది--అవన్నీ వున్నవాడికి, లేదా యేదో ఒక గుర్తింపు పత్రం, నివాస ధృవీకరణ పత్రం వున్నవాడికి "ఆథార్" అవసరం యేమిటీ?

ఈ సందేహాలకి తెలిసీ యెవరైనా సమాధానం చెప్పలేదో, వాళ్ల తల వెయ్యి వ్రక్కలు కాకమానదు--అనడానికి నేను భేతాళుణ్ని కాదు. అర్థరాజ్యం, కూతుర్నిచ్చి పెళ్లీ అనడానికి మా పెసిగాణ్నీ కాదు! ఒక్కటి మాత్రం చెప్పగలను--నా చేతిలో వుంటే ఇలాంటి ప్రణాళికలూ, నిర్ణయాలూ చేసే బుర్రోవాదులని, బిషప్ హేటో లెవెల్లో.......%$*^(@!.!

అదీ సంగతి!

ఇంకా చాలా వున్నాయి సణగడానికి కానీ వోపీలేదు......మరోసారి!

Tuesday, July 5, 2011

కబుర్లు - 63

అవీ, ఇవీ, అన్నీ

అయ్యింది--ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ, ఇంకొంతమందీ కలిసి ఓ వందమంది తమ పదవులకి రాజీనామాలు ఇచ్చేశారు. రాజ్యాంగ సంక్షోభమేదీ రాలేదుగానీ, పదవుల సం"క్షామం" మొదలయ్యింది. మన యెమ్మెల్యేలే ఓ 300 మంది వున్నారనుకుంటా. వారిలో మూడో వంతుమంది కూడా రాజీనామా చెయ్యకపోతే, ఇంకేమి సంక్షోభం? దానిక్కూడా స్పీకర్లు అందుబాటులో లేని సమయం యెంచుకున్నారు! వాళ్లు వచ్చేలోపల, ఓ రెండురోజులు తెలంగాణా బందూ, తరవాత వుత్తరాదినుంచి దక్షిణాదికి రైళ్ల రాకపోకల బందూ, తరవాత 'హైదరాబాదు మినహా' ఇతరచోట్ల 'వంటావార్పూ'--ఇలా కార్యక్రమం ప్రకటించేశాడు. 
 
అసలు ఇలాంటివాటికి అవకాశం యెందుకు ఇవ్వాలి? రాజీనామా ఇచ్చిన మరుక్షణమే అవి అమోదంపొందినట్టు భావించి, వారికి వుండే సకల సౌకర్యాలూ రద్దు చెయ్యాలి. ఇంకా, ఒక్క ఆరోగ్య కారణాల మినహా, మరెందుకు రాజీనామా చేసినా, తరువాత ఆ స్థానానికి యెన్నికలకయ్యే ఖర్చు రాజీనామా చేసినవాడిదగ్గరనుంచే వసూలు చెయ్యాలి. అప్పుడుగానీ వీళ్ల నాటకాలకి తెరపడదు.

రాజీనామా ఇచ్చినవాళ్లు అడుగుతున్నది యేమైనా టన్నులకొద్దీ బంగారమా? మణిమాణిక్యాల్లాంటి భాగ్యమా? యేదో.......తెలంగాణా ఇస్తే ఇవ్వండి, లేకపోతే మా రాజీనామాలు ఆమోదించండి......అనడుగుతున్నారంతేగా? ఆమాత్రానికి సదరు స్పీకర్లూ, ప్రభుత్వాలూ, అధిష్టానం "ఆమోదించాం పొండి" అనేస్తే, గొడవొదిలిపోను కదా? అఖిలపక్షాలూ, యేకాభిప్రాయాలూ ఇవన్నీ యెందుకు? ఈలోపల బందులూ అవీ అంటూ ఓ పదో పాతికో మంది అమాయకులు బలయ్యేవరకూ చోద్యం చూడ్డానికా? యేడిసిన్నట్టే లేదూ వ్యవహారం?

కల్మాడీ గారి టీపార్టీ పుణ్యమాని, ఇంకో ముగ్గురో యెందరో తిహార్ జైలు అధికారులని కూడా సస్పెండు చేశారట. వాళ్లని బదిలీ చెయ్యడానికి "అండమాన్" వగైరాచోట్ల ఖాళీలు లేవేమో! కానివ్వండి. ఇప్పటికైనా సెల్లులకి తాళాలూ గట్రా వేస్తున్నారా? రాత్రిళ్లు చికెనూ, మందూ పార్టీలు కూడా చేసుకొంటున్నారా? మరోసారి ఇంకో జడ్జి గారెవరైనా యే అర్థరాత్రో అకస్మాత్తు తణిఖీ నిర్వహిస్తేగానీ బయటపడవేమో?!

ఈ మధ్య రైళ్లగురించి సణగడంలేదు--మమతాదీ ముఖ్యమంత్రి అయిపోయి, రైల్వేల గురించి పట్టించుకొనేవాడూ, వెలగబెడుతున్నాం అనే నాథుడూ లేకుండా పోయాడు. ఏ సీ కంపార్టుమెంట్లలో అనేక బొద్దింకలూ, పురుగులూ స్వైరవిహారం చెయ్యడం స్వానుభవమైనా, ఆ చిన్న విషయం బహిరంగంగా యేమి సణుగుతాములే అని వూరుకున్నాను. ఇప్పుడు మళ్లీ నిన్న (04-07-2011), చెన్నై నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న "దురంతో"లో, బొద్దింకలూ, పురుగులతో వంటిమీద దద్దుర్లు వచ్చినా సహించి, యెలుకలతోకూడా సహవాసం చెయ్యడానికి అలవాటుపడ్డా, విజయవాడ వచ్చేసరికి "పాచికంపు" కొడుతున్న భోజనం పెట్టడంతో సహనం నశించి రెచ్చిపోయిన ప్రయాణీకులు రైలుని ఓ రెండున్నరగంటలపాటు నిలిపేసి, ఆందోళన చేశారట. "దురంతో" చార్జీలతో, మామూలు కోచ్ లు వెయ్యడమేమిటి? అని నిలదీసినవాళ్లకి అధికారులు "అది తమచేతుల్లో లేదు" అని నచ్చచెప్పారట. బోగీలని వీలైనంతవరకూ శుభ్రపరిచేలా చేసి, పంపించారట! 
 
అసలు, తెలివి వెర్రితలలు వేసి ఇలాంటి రైళ్లని ప్రవేశపట్టారని అందరూ అన్నా, తన పంతం నెగ్గించుకొంది మమతాదీ! వాళ్లకి మనం రోడ్లమీద వెళుతున్నప్పుడు చూసే "వేగముకన్న క్షేమము మిన్న"; "ఆలస్యంగా బయలుదేరి 'స్వర్గానికి ' పోయేకంటే, త్వరగా బయలుదేరి గమ్యం చేరడం మంచిది" లాంటి నినాదాలు యెక్కడైనా కనిపించాయో లేదో? వచ్చిన రైలుని కనీసం శుభ్రపరిచే ఆస్కారం కూడా లేకుండా, వెంటనే తిరుగు ప్రయాణం ప్రారంభించి, స్టేషన్లలో ఒకనిముషం మాత్రమే ఆగుతూ, పరుగులు పెడుతూ, ప్రయాణీకులు క్రిందకి దిగడానికి లేకుండా, యెక్కువరేట్లతో నాసిరకం తిళ్లు పెడుతూ, అనువుగాని సమయాల్లో, 'మెయింటెనెన్సు ' పేరుతో అరగంటా, నలభై ఐదు నిమిషాలు ఆపేస్తూ, యేమాత్రం అనువుగాని సమయాల్లో గమ్యం చేరుస్తున్న "దురంతో"; "సూపర్ ఫాస్ట్" లాంటి రైళ్లవల్ల యెవరికి యేమి వొరుగుతోంది? చక్కగా అనువైన సమయంలో బయలుదేరి, టిఫిన్లూ, భోజనాల సమయంలో వచ్చే స్టేషన్లలో వాటికి యేర్పాట్లు చేసి, కొంచెం యెక్కువసేపు ఆపి, గమ్యస్థానం కూడా అనువైన సమయాల్లో చేరిస్తే అందరికీ అనుకూలంగా వుంటుంది. ప్రతీ స్టేషను ముందూ "ఔటర్"లో కాసేపు ఆగడం యే రైలుకీ తప్పడం లేదు. ఆ సమయాలని (మనభాషలో) రెగ్యులేట్ చేస్తే యెంతబాగుంటుంది? (రైల్వే భాషలో రెగ్యులేట్ అంటే అక్కడితో ఆ రైలుని ఆపెయ్యడం!). 
 
పైగా చాలామంది ఇళ్లనుంచి తెచ్చుకొన్న ఆహార పదార్థాలు తినేసి, చెత్త బోగీల్లో పారెయ్యడం, చాక్లెట్ రేపర్లూ, వేరుశెనగ తొక్కలూ, కమలా పళ్ల తొక్కలూ, త్రాగేసిన నీళ్ల/బటర్ మిల్క్  కవర్లూ, ఖాళీ ప్లాస్టిక్ సీసాలూ (ముఖ్యంగా ఏసీ బోగీల్లో) సీట్లక్రిందకి తోసెయ్యకపోవడంవల్ల మూడొంతులు పారిశుధ్య సమస్య తీరుతుంది కదా? ప్రతీ రైల్వే డివిజన్ హెడ్ క్వార్టర్లోనూ ఓ బోధి వృక్షం మొలిచి, పెరిగి, పెద్దదైతేనేగానీ, వాటి క్రింద రైల్వేవాళ్లకి ఙ్ఞానోదయం అవదేమో! మనమేం చెయ్యగలం.....ప్రార్థించడం తప్ప!

నల్లధనం విషయంలో సుప్రీం కోర్టు చివరాఖరికి విసుగు చెంది, ఓ వున్నతస్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించేసిందట. ఇంక ఇతర దర్యాప్తు సంస్థలన్నీ ఆ సంస్థ క్రిందే పనిచెయ్యాలని ఆదేశించిందట. ముఖ్యంగా "అధికారులనుంచి నోటీసులు అందుకున్నవారి పేర్లు బహిర్గతం చెయ్యవలసిందే" అందట. హమ్మయ్య. ఓ ములుగర్రపోటు తగిలిందన్నమాట ప్రభుత్వ వృషభానికి. ఇప్పుడేమి జరుగుతుందో వెండితెరపై చూద్దాం!

Sunday, July 3, 2011

కబుర్లు - 62

అవీ, ఇవీ, అన్నీ

మొన్న సాయి యజుర్ మందిరంలోని ఖజనాని లెఖ్ఖించాక కూడా, ఆ గది తాళాలు సత్యజిత్ దగ్గరే వున్నాయట. (పేపర్లో రత్నాకర్ అని వ్రాశారా? యేమో గుర్తు లేదు. యెవరైతేనేం?). మళ్లీ నిన్న ఇంకో గదితెరిచి చూస్తే, అందులో సుమారు ఓ కేజీ బంగారం, ఓ రెండువందల కేజీల వెండీ, వజ్రాల వుంగరాలూ, వెండీ ఇతరపాత్రలూ దగ్గరదగ్గర ఓ 80 లక్షల విలువైన వస్తువులు 'దొరికాయట'. ఇంకా ఆ మందిరంలో యెన్ని గదులున్నాయో!

ఇంక, ఆయన దేవుడా కాదా అనే విషయంలో కాదనేవాళ్లూ; అయినా కాకపోయినా అనేవాళ్లూ; అవును అనేవాళ్లూ యెప్పుడూ వున్నారు. ఇప్పుడు కొత్తగా, అబ్దుల్ కలాం, రతన్ టాటా, వాజపేయీ లాంటి కొంతమంది (దాదాపు ఓ యాభై మంది) ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ, వాళ్లందరూ ఆయన్ని సందర్శించి, ఆశీస్సులకోసం పడిగాపులు పడేవారు కాబట్టి, నిజంగా ఆయన దేవుడు కాకపోతాడా? ఆయనకి యేవో మహిమలు వుండకపోతాయా? అనేవాళ్లు కొంతమంది తయారయ్యారు. వాళ్లకి ఇదివరకే సమాధానం చెప్పినవాళ్లు వున్నారు, ఇప్పుడు మళ్లీ, "వాళ్లందరూ తమ తమ వేరు వేరు 'అవసరాలకోసం '; వేరు వేరు 'యెజెండాలకోసం '--ఇలా వెళ్లేవారు తప్పితే, ఆయన మహిమల వల్లకాదు అనీ చెపుతున్నారు.

మొన్నీమధ్య ఓ బ్లాగులోనో వ్యాఖ్యలోనో ఒకాయన ఓ కొత్త విషయం చెప్పాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి అప్పుడెప్పుడో సాయి గురించి యేదో వ్రాశాడు అనీ, అందుకే ఆయన "నోరు పడిపోయింది" అనీ! ఇదెక్కడి దారుణమైన విషయమో! నాకు తెలిసీ, ఆయనకి గొంతు కేన్సరో యేదో వచ్చి, మాట్లాడలేకపోయేవారనీ, చాలా శ్రమతీసుకుని మాట్లాడినా, స్పష్టంగాలేక బొంగురుగా వుండడంతో వినేవాళ్లకి అర్థం చేసుకోవడం కష్టం అయ్యేది అనీ, అలా మాట్లాడడానికి ఆయన నొప్పితో బాధపడేవారనీ, అందుకే కాయితాన్నీ కలాన్నీ ఆశ్రయించేవారనీ, అయితే మాట పూర్తిగా పోవడం జరగలేదు అనీ విన్నాను. మరి సిన్మాల్లో సాయి వేషం వేసిన వాళ్లకీ, మాటలు వ్రాసినవాళ్లకీ, ఆ పాత్రని యెదిరించినవాళ్లకీ, సినిమా తీసినవాళ్లకీ యేమైనా అయిందోలేదో మరి!

మొన్నొక జడ్జి గారు తిహార్ జైలుకి అకస్మాత్తుగా తనిఖీకి వెళ్లేటప్పటికి, అక్కడ జైలరుగారు వారి కార్యాలయంలో సురేష్ కల్మాడీ తో బిస్కెట్లు తింటూ, టీ త్రాగుతూ, పిచ్చాపాటీ మాట్లాడుతున్నారట--సాధ్యమైనంత వినయంగా! ఇంక మిగిలిన 2జి స్కాం ముద్దాయిలు సెల్ తాళాలు తీసి వుండగా, యధేచ్చగా విహరిస్తున్నారట! ఈ విషయంలో జడ్జిగారు సుప్రీంకోర్టుకి నివేదిక యేమిచ్చారో ఇంకా తెలీదుగానీ, ఆ జైలరుగారిని వెంటనే "అండమాన్" కి బదిలీ చేశారట! అబ్బే......అదేమీ కాదు, ఆయనకి కొన్ని నెలల క్రితమే అక్కడికి బదిలీ అయ్యింది, యెలాగూ నిన్ననే వెళ్లాల్సి వుంది, అందుకని వెళ్లిపోయారంతే--అన్నారట కొన్ని జైలువర్గాలు. వుద్యోగుల విషయంలోనైనా, అధికారులవిషయంలోనైనా, "బదిలీ శిక్ష కాదు" అనే సూత్రం వల్లెవేస్తూ వుంటాయి మేనేజ్ మెంట్లు. మరి ఇదేమిటో?

చాలా కాలానికి, యెంపికచేసిన పత్రికా యెడిటర్లముందు అయినా నోరు విప్పాడు ప్రథాని అని కాంగీవాళ్లూ, ప్రభుత్వం వాళ్లూ సంతోషిస్తూంటే, బాంబు పేలినట్టు బంగ్లా ప్రభుత్వంవారు మన రాయబారిని పిలిచి, "దీని సంగతేమిటి?" అని నిలదీశారట! ఆయన నీళ్లు నములుతూ, వచ్చెయ్యవలసివచ్చిందిట! ఇంతకీ, మన ప్రథాని, బంగ్లాదేశీయుల్లో నాలుగోవంతుమంది అదేదో ముస్లిం సంస్థలో సభ్యులో, సానుభూతిపరులో అనీ, వాళ్లు భారత్ కి బధ్ధ వ్యతిరేకులు అనీ, వాళ్లు పాకిస్థాన్ ఐ ఎస్ ఐ వాళ్లేమి చెపితే అది చేస్తారు అనీ వ్యాఖ్యానించారట! (యే సందర్భంలోనో ఆ యెడిటర్లెవరూ మనకి చెప్పనేలేదు!). తీరా బాంబు పేలినంతపని అయ్యాక, బంగ్లా పౌరలంటే మాకు యెంతో గౌరవం, ప్రజాస్వామ్యబధ్ధంగా యెన్నికైనా బంగ్లా ప్రభుత్వం బలంగా వుండాలనే మేము కోరుకుంటాం, వాళ్ల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మా అభిమతం కాదు--ఇలా అంటూ, సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ, పొర్లుదండాలు పెట్టవలసి వస్తోందట! అందుకు బాధ్యుడైన అధికారిగురించి "విచారిస్తున్నారు" అనుకొంటా!

కేరళలోని పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగలోని ఆరు రహస్య అరల్లో, ఇప్పటికి సి; డి; ఎఫ్ అరల్ని తెరిస్తేనే, దాదాపు 50,000 కోట్ల విలువైన (కేవలం బంగారం, రాళ్లూ వగైరాల విలువ మాత్రమే--పురాతనత్వం విలువ కాకుండా) సంపద వెలుగుచూసింది అనీ, దాంతో, 40,000 కోట్ల ఆభరణాలు గల బాలాజీ ని అధిగమించిందనీ అన్నారు. ఇప్పుడు 'ఏ' అరని తెరిస్తే, వెలుగు చూసిన సంపదతో మొత్తం 75,000 కోట్లకు చేరిందట. బి అరని 1872 వ సంవత్సరం నుంచీ యెప్పుడూ తెరవలేదట. అది కాకుండా, ఇ అరని కూడా ఇంకా తెరవాలట. మొత్తం అయ్యేటప్పటికి ఇంకెన్ని రోజులు పడుతుందో, మొత్తం సంపద లెఖ్ఖ యెన్ని కోట్లకు చేరుతుందో?

ఆర్థికమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు కూడా, చిల్లర వ్యాపారాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని యెంత తొందరగా ఆహ్వానిస్తే అంత త్వరగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది, కానీ ఓ నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమే అంటున్నాడు. (మనం యేమి చేసినా ద్రవ్యోల్బణం తగ్గదు, దాని పెరుగుదల రేటు మాత్రమే తగ్గుతుంది--అని ప్రాథమిక సూత్రాన్ని కూడా మధ్యలో గుర్తుచేశాడు!). స్వపన్ దాస్ గుప్తా అయితే, ఆ ప్రతిపాదనకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారి చిత్రం ప్రచురించిన తన వ్యాసంలో, భారతీయులు 'ప్రపంచం మనని యెవరికోసం బ్రతికిస్తుంది?' అంటూ మారకుండా వుండిపోతే, మరో పాకిస్తాన్ అయిపోవడం ఖాయం అన్నాడు.

అసలు ఈ బెంగాలీ బాబులంతా వొకేలా ఆలోచిస్తారేమో? అరవబాబులు వీళ్లకి సరిగ్గా వ్యతిరేకం. దేశం గురించి పట్టించుకోకుండా, వాళ్లపని వాళ్లు చూసుకొంటారు! మధ్య వచ్చిందల్లా, మనలాంటివాళ్లకే చచ్చే చావు!