Saturday, June 18, 2011

కబుర్లు - 58

అవీ, ఇవీ, అన్నీ


ప్రపంచ ప్రఖ్యాత భారతీయ ఇంగ్లీషు రచయితా, కవీ "ప్రీతీష్ నందీ" మొన్న ఓ ఆర్టికల్ వ్రాస్తూ, ప్రపంచ ప్రఖ్యాత కార్టూనిస్ట్, "పీనట్స్" ఫేం "ఛార్లీ షూల్జ్" యొక్క "కామన్ ప్లేస్" కాన్సెప్ట్ గురించి వివరిస్తూ, "ఇది క్విజ్ కాదు" అంటూ ముందు కొన్ని ప్రశ్నలూ, తరవాత కొన్ని ప్రశ్నలూ సంధించాడు. మొదటివి, నిజంగా క్విజ్ మాస్టర్ల ఫేవరిట్, క్విజ్ లో పాల్గొనేవాళ్ల "ప్రైజ్ క్వేశ్చన్సే". ఉదా:- ప్రపంచంలోని 5గురు గొప్ప ధనవంతుల పేర్లూ; గత ఐదు సంవత్సరాల్లో, యేడాదికి ముగ్గురు చొప్పున యెన్నికైన "మిస్ ఇండియా"ల్లో, ఓ ఐదుగురి పేర్లూ; ఓ ఐదుగురు భారత రత్నాలూ; ఐదుగురు గొప్ప "బ్యాట్స్ మెన్" పేర్లూ; ఓ ఐదుగురు "నోబెల్ విజేతల" పేర్లూ--ఇలాంటి చక్కని ప్రశ్నలు! (ఇలాంటి వాళ్లందరినీ మెజారిటీ ప్రజలు వాళ్ల జీవితకాలం లోనే మరచిపోతూంటారు. వాళ్లు కొంతకాలం మాత్రమే "మెరిసి" తరువాత "ఫేడ్" అయిపోతారు.) ఇంక, రెండో విభాగం ప్రశ్నల్లో, మనలో యెవరికి వారికి మాత్రమే సమాధానాలు తెలిసేవి. ఉదా:- మీ చదువుకి దోహదం చేసిన కొంతమంది వుపాధ్యాయుల పేర్లు; మిమ్మల్ని కష్ట కాలం లో ఆదుకొన్న కొంతమంది స్నేహితుల పేర్లు; మిరు ప్రేమించిన/మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తుల పేర్లు (వాళ్లిప్పుడెక్కడున్నారో సైతం మీకు తెలియక పోయినా); మిమ్మల్ని అభినందించిన, ప్రత్యేకంగా గుర్తించినవాళ్ల పేర్లు; మీరు సంతోషంగా గడపగల ఓ ఐదుగురి స్నేహితుల పేర్లు--ఇవీ! వీటిలో అన్నింటికీ చాలా మంది ఓ ఐదుగురి పేర్లైనా చెపుతారు. యెంత, సమయానికి గుర్తుకు రాని నాలాంటి వాళ్లయినా, కనీసం ఇద్దరి ముగ్గురి పేర్లు చెప్పగలం! యేతా వాతా తేలేదేమిటంటే, మొదటి విభాగంలోని ప్రశ్నలకి సమాధానంగా వచ్చే వాళ్లని, వాళ్ల జీవితాలనీ, మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొంటాం. స్పూర్తి పొందుతాం. కానీ, వాళ్లకి మన జీవితాంతం కృతఙ్ఞులుగా వుండేంత సీను వుండదు! అయితే, రెండో విభాగం వాళ్లని అస్తమానూ తలచుకుంటాం, వారికి కృతఙ్ఞులుగా వుంటాం, వుండాలి! అదీ "కామన్ ప్లేస్" మహాత్మ్యం! బాగుంది కదూ?"యజుర్వేద మందిరం"--సత్యసాయి నివాస, వ్యక్తిగత కార్యాలయ సముదాయం. ఆయనని ఆసుపత్రికి తరలించగానే, ఆ గదికి తాళం వేశారట (సత్యజిత్ యేమో!). మొన్న గురువారం ఆ తాళం తెరిచి, 36 గంటలసేపు మదింపు చేశాక, అందులో 11.50 కోట్లకి పైగా నగదూ, 98 కేజీల బంగారం, 307 కేజీల వెండీ లెఖ్ఖతేలాయట. ఇంకా కొన్ని పత్రాలూ వగైరా కూడా వున్నాయట. ఆ మందిర వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం, ఆ మందిరానికి వచ్చిన నగదు, మిషన్లతో లెక్కించి, ప్రతి గంట గంటకీ ఓ బ్యాంకులో జమ చేసేవారట! అలా మొత్తం ఖజానాని ఎస్బీఐ, ప్రశాంతినిలయం శాఖలో జమ చేశారట. బాగుంది. మరి యెంతటి ధనవంతుడైనా, రేపు యెంత నగదు అవసరం అనుకుంటే అంతకు మించి, అదీ తప్పదంటేనే, ఓ లక్షో, రెండు లక్షలో ఇంట్లో వుంచుకుంటాడు. అలాంటిది, అన్ని కోట్ల నగదుని ఆయన తన గదిలో యెందుకు వుంచుకున్నట్టు? అంత బంగారం, వెండీ యెందుకు వుంచుకున్నట్టు? ఆయన ఆసుపత్రిలో వున్నప్పుడు ఆ మందిరంలోంచి కొన్ని విలువైన వస్తువులనీ వగైరా బయటికి తరలించేశారని వార్తలు వచ్చాయి. ఆలా పోయినవి పోగా మిగిలినవే ఇంత మొత్తంలో వున్నాయా? అలాంట్ "హోర్డర్", అది ట్రస్ట్ అయినా సరే, మీద ప్రభుత్వం యేమి చర్యలు తీసుకోవాలి?ఈ సందర్భంగా రాందేవ్ డిమాండ్లలో వొకటైన "వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లని రద్దు చెయ్యాలి" అనే దాని రిలవెన్స్ అందరికీ బోధపడుతుంది అనుకుంటా--ముఖ్యంగా అంతంత నగదు నిల్వ చేసుకొనేవాళ్ల మీద ఆ ప్రభావం తీవ్రంగా వుంటుంది--మన స్థూల దృష్టికి. కానీ.....ఇదివరకోసారి అగ్రరాజ్యాల వొత్తిడికి లోబడి, అప్పటికి చలామణిలోవున్న అతి పెద్ద కరెన్సీ నోటు (రూ.1,000/-) లని "అన్నింటినీ" రద్దు చేశారు ఇందిరా గాంధీ టైములో! కాని, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడిన ప్రభావం దాదాపు మృగ్యం అనే చెప్పాలి. కారణం--ఆ రద్దు ఫలానా రోజునించీ అమల్లోకి వస్తుందని ప్రకటించి, హోర్డర్లు కానివారికి అసౌకర్యం కలుగకుండా--వారిదగ్గరవున్న నోట్లని ఓ ధృవపత్రం సాయంతో బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించడమే! దాంతో అనేక నోట్లు వలలోనుంచి తప్పించుకున్నాయి! అలా తప్పించుకోగా మిగిలిన నోట్లతో మా వూళ్లో మార్వాడీల్లాంటివారు సిగరెట్లూ, చుట్టలూ వెలిగించుకొంటూ, పేపర్లకి కూడా యెక్కారు! బ్యాంకులవాళ్లు మాత్రం--యెవరు చెల్లించారు, వాళ్ల చిరునామా యేమిటి, వాళ్లకి ఆ నోట్లు యెక్కడనుంచి వచ్చాయి, ఆ నోట్ల నెంబర్లూ, వగైరా అనేక వివరాలతో రికార్డులు నిర్వహించలేక చచ్చారు! తరవాతైనా ఆ వివరాలని వుపయోగించుకున్నారా అంటే, అదీ లేదు! అందుకే అదో ప్రహసనం. అందుకే ప్రభుత్వం వాటిని రద్దు చెయ్యడానికి తటపటాయిస్తోంది--కాదు--ససేమిరా అంటున్నారు!ఇలా వ్యవస్థలోని నగదుని డీ మానెటైజ్ చేసి, నల్లధనాన్ని ప్రభావశీలంగా రద్దు చెయ్యాలంటే ఒక చక్కని మార్గం వుంది. అదేమిటంటే--రిజర్వ్ బ్యాంక్, 0 నుంచి 9 లోపల ర్యాన్‌డమ్‌గా ఒక అంకెని యెన్నుకొని, (వుదాహరణకి 5) ఆ అంకె నోటుమీదుండే నెంబరు చివరలో వుంటే యే డినామినేషన్ నోటైనా, ఫలానా రోజు (4, 5 రోజుల సమయం ఇవ్వచ్చు) నుంచీ చెల్లవు అని ప్రకటించాలి. సామాన్యులకి ఇబ్బంది కలుగకుండా, తమ దగ్గరవున్న ఆ నెంబరు నోట్లని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొనే సౌకర్యం కలిగించాలి. మరే ప్రశ్నలూ, వివరాల నమోదూ అఖ్ఖర్లేదు. యేరోజు నుంచీ అవి చెల్లవన్నారో, ఆ రోజుకి బ్యాంకుల్లో జమ అయిన మొత్తం నోట్ల విలువకి సమానంగా కొత్త సిరీస్ లో, కొత్తనోట్లు ముద్రించవచ్చు. వాటిని సమయానుకూలంగా విడుదల చెయ్యవచ్చు. ఇక్కడ వుద్దేశ్యం యేమిటంటే, ఆ ప్రకటించిన తేదీకల్లా దేశంలోని మొత్తం కరెన్సీ లో 10% రద్దయిపోతుంది! అలా నెలకి ఓ అంకె చొప్పున యెన్నుకొని, వాటిని రద్దుచేసుకొంటూ పోతే, పది నెలల్లో మొత్తం కరెన్సీ అంతా బ్యాంకులకి చేరి, కొత్త కరెన్సీ చలామణిలోకి వస్తుంది! దానికయ్యే ఖర్చు ఇంక యే స్కీముక్రింద చేసే ఖర్చుకన్నా చాలా తక్కువగానే వుంటుంది! ప్రయోజనం యేమిటంటే, సాయి ట్రస్ట్ లాంటివాళ్లు గడువు తేదీలోగా చాలా తక్కువనోట్లు మాత్రమే మార్చుకోగలరు! ఇంకా కొంతమంది అయితే, మీలాంటి, నాలాంటి వాళ్ల దగ్గర ఆ నోట్లు కొంత డిస్కవుంట్ తో మార్చుకోగలరు! అంతేగానీ, పెద్దమొత్తాల్లో ప్రభుత్వాన్ని దగా చెయ్యలేరు! బంగారం, వెండీ, రియల్ ఎస్టేట్ వగైరాల మాటేమిటి అని అడగొచ్చు మీరు.....కానీ, వచ్చేనెల ఒకటో తారీఖునుంచీ, నెలాఖరువరకూ చివర 5 అంకెగల యేనోటూ చెల్లదు అనేటప్పటికి, దాని ప్రభావం వాటన్నింటిమీదా కూడా వుంటుంది. చాలా మంది ఆ బాధపడలేక, బ్యాంకు చెక్కులనీ, ఇతరమార్గాలనీ అనుసరిస్తారు....నగదు చెల్లింపులకి బదులుగా! పైగా, మళ్లీ ఆ తరువాత నెల యే నెంబరు నోట్లు రద్దు చెయ్యబడతాయో తెలీదాయె! దెబ్బతో నగదు చలామణీ రంగం పూర్తిగా ప్రభుత్వ/ఆర్బీఐ అధీనంలోకి వచ్చేస్తుంది. 75% పైగా నల్లధనం రద్దు అయిపోతుంది! దమ్ముంటే, ఈ పధ్ధతి అనుసరించమనండి ముందు. ఆ తరువాత విదేశాల్లో నల్లధనం గురించి ఆలోచిద్దాము. (యెలాగూ ఆ ప్రయత్నాలు కొనసా.......గుతూనే వుంటాయి కదా!)మన ఆర్బీఐ వారు మరోసారి రెపో/రివర్స్ రెపో రేట్లని ఓ పావలా శాతం పెంచారు--ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి! అయినా ద్రవ్యోల్బణం ఇంకో ఆర్నెల్లపాటు రెండంకెలలోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా రంగరాజన్ లాంటివాళ్లు సైతం, పెట్రో వుత్పత్తులమీద ప్రభుత్వ అజమాయిషీ పూర్తిగా తొలగించాలంటున్నారు! ఆ మాటెలా వున్నా, నేడో రేపో డీజెల్, వంటగ్యాస్, కిరోసిన్ల రేట్లూ, మరోసారి పెట్రోలు రేట్లూ తప్పక పెంచబడతాయి! మరి ద్రవ్యోల్బణం యెలా నియంత్రింపబడుతుంది? తాటాకు చప్పుళ్లకి కుందేళ్లు బెదరవు! కాబట్టే, ఒకేసారి రెండో మూడో శాతం రెపో/రివర్స్ రెపో రేట్లే కాకుండా, బ్యాంకుల ఎస్ ఎల్ ఆర్, సీ ఆర్ ఆర్ లని కూడా పెంచేసి, వ్యవస్థకి ఓ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది! వృధ్ధి రేటుమాటంటారా? ప్రతీనెలా దాన్ని గణించుకొంటూ తృప్తి పడఖ్ఖర్లేదు! ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో మళ్లీ ఆ రేట్లని పెంచినంతమేరా తగ్గిస్తే, వృధ్ధి రేటు నిలబడడానికి యేమీ లోటు వుండదు. ఒకవేళ కొంచెం తగ్గినా అది ఆరోగ్య సూచకమేగానీ, అనవసర "వాపు" ని చూపించి, బలుపనుకోమనే దౌర్భాగ్యం తప్పుతుంది! ఇంక పెట్రో ధరలకి విరుగుడు "ఆయిల్ పూల్" మాత్రమే!

వింటారా?

No comments: