అవీ, ఇవీ, అన్నీ
"వేమన్న", పాపం తన జీవితమంతా "పరుసవేది" అన్వేషణలోనే గడిపి, తీరా అది పట్టుబడ్డాక విరాగి అయిపోయాడట!
టైము బాగుంటే, మట్టి పట్టినా బంగారం అయిపోతుందంటారు. అలాగే, యేల్నాటి శని సమయంలో బంగారం పట్టుకున్నా, మట్టి అయిపోతుందనీ అంటారు!
"ఇనుము" రాళ్లనీ, ఇనప "మట్టినీ" బంగారంగా మార్చే పరుసవేది విద్యని వంటబట్టించుకున్న గాలి జనార్దన రెడ్డి మాత్రం, "భక్తి" దాకానే వెళ్లాడు. భక్తికి పరాకాష్ట అయిన "వైరాగ్యం" చేరుకోకుండానే, కృష్ణ జన్మస్థానంలో వైరాగ్య బోధ జరిపించాలని ప్లాను వేశారు సీబీఐ వాళ్లు. (యెవరు ఆ యేర్పాటు చెయ్యమన్నారో ఇంకా తేలాల్సి వుంది).
పేపర్లూ, టీవీలూ హోరెత్తి పోతున్నాయి--"గని గజనీ స్వర్ణ విలాసం" వగైరాలతో!
బాగుందండీ--ఆయనకి విద్య తెలిసింది, వుపయోగించుకున్నాడు. భక్తి పెరిగింది--ఇంట్లో పూజా సామాగ్రీ, దేవుళ్ల విగ్రహాలూ అన్నీ బంగారంతో చేయించుకున్నాడు. తిరుమలేశునికి ఓ కిరీటం కూడా చేయించాడు.
ఇప్పుడు, ఆ కిరీటం పెడితే, స్వామికి "శిరోభారం" వస్తుందేమో అని అనుమానం రావడంతో, దాన్ని ప్రక్కన పెట్టారట. దాన్నేం చెయ్యాలో ఇంకా నిర్ణయించలేదట! నిత్యాభిషేకాలతో ఆయనకి "పడిశం" పట్టడం లేదుకదా? మరి శిరోభారం యెందుకు వస్తుందో వాళ్లే చెప్పాలి!
(ఆమధ్య పంచారామాల్లోని శివలింగాలు అభిషేకాలతో "అరిగి" పోయాయని టీవీలు కోళ్లయి కూశాయి. ఫలితం హళ్లికి హళ్లి, సున్నకి సున్న! తిరుమలేశుడు "అరిగి"పోతున్నాడని నేనంటే, మూలవిరాట్టుకి అభిషేకాలు చెయ్యం అన్నారు. అమలవుతోందో లేదో మరి! ముసలాన్ని యెంత అరగదీసినా, ఓ బాణం పుల్లంతైనా మిగలదా--ఫరవాలేదులెండి--అనేవాళ్లూ వున్నారు.)
స్వామికి ఆభరణాలు చేయించదలుచుకున్నవాళ్లు, ముందు తితిదేవారిని సంప్రదించి, వారి అనుమతితో "కొలతలు తీసుకొని", ఆభరణాలు చేయించి మరీ సమర్పిస్తారు. ఈ తతంగం నడిచినప్పుడూ, తిరుమాడ వీధుల్లో కిరీటాన్ని, దేవుడి కన్నా ముందో ప్రత్యేక వాహనమ్మీద వూరేగించినప్పుడు, ఆయన బిల్లులు ఇవ్వలేదు అని యెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన 45 కోట్లన్నాడు, మదింపుచేసింది 22 కోట్లు మాత్రమే అంటున్నారు!
కొంచెం తేడా అనిపిస్తే, ప్రతీవాడూ "నన్ను ముట్టుకోకు నామాల కాకీ" అనేవాడే!
మరణశిక్షల్ని రద్దు చేయాలంటున్నారు "సమయానుకూల" వాదులు. నిజానికి, మరణ శిక్ష పడి, అది యెప్పుడు అమలు చేస్తారో తెలియకపోవడం, దినదిన గండంగా బ్రతకడం అనేది, రౌరవాది నరకాలని మించిన శిక్ష! అలాంటిది, యేళ్లతరబడీ క్షమాభిక్ష విఙ్ఞప్తులని, యేవిషయం తేల్చకుండా, జాగు చేసిన, మన సర్వోత్తమ రాజ్యాంగాధినేతలకి యేమిటి శిక్ష? (బహుశా అంబేద్కర్ కి ఈ విషయంలో యెలాంటి కనీస అనుమానం కూడా రాలేదు. వచ్చివుంటే, ఆ శిక్షకి తగ్గ యేర్పాటు చేసి వుండేవాడు రాజ్యాంగంలోనే!)
"అమాయకుల్ని చంపడానికి యేమతమూ అంగీకరించదు. ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు ప్రేలుడు--ఆటవిక చర్య" అన్నాట్ట--యెవరోకాదు పార్లమెంటు మీద దాడిలో కొంతమందిని విచక్షణారహితంగా కాల్చేసి, వురిశిక్షపడి, "నన్ను వురితియ్యండ్రా మొర్రో! లేకపోతే, అద్వానీ ని ప్రథాని చెయ్యండ్రా! ఆయనైతే నన్ను క్షణాల్లో వురి తీయించేస్తాడు!" అని మొరపెట్టుకొన్న "అఫ్జల్ గురు"!
ఇప్పటికి వాడి మతబోధలు వాడి తలకెక్కాయనుకుందామా? లేక....!
"వురుమురిమి, మంగలం మీద పడిందట!"
పాపం రోశయ్య, తాను ముఖ్యమంత్రిగా వుండగా, "అన్ని విషయాలూ అధిష్టానం (అమ్మ) చూసుకొంటుంది. నేను నిమిత్తమాత్రుణ్ని" అంటూ, ఖర్మకాలి, ఓ నిర్ణయం తీసుకొన్నాడట తనంత తానే!
ఇప్పుడదే మెడకు చుట్టుకొనేలా వుంది. ఓ లాయరెవరో "యేసీబీ వారు రోశయ్యకి క్లీన్ చిట్ యెలా ఇచ్చారు?" అంటూ యేసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు కేసు వేస్తే, క్లీన్ చిట్ కి సంబంధించిన ఆధార పత్రాలని సమర్పించమన్నారట. యెటుపోయి యెటు వస్తుందో! ఈ వయసులో గవర్నర్ గారిని అంత క్షోభ పెట్టడం అవసరమా జగన్నాథులూ? (అవునులే, నాన్న ప్రసాదాన్ని గ్రద్దలా తన్నుకుపోయాడుగా మరి!)
ఆధారమంటే మళ్లీ గుర్తొచ్చింది--బెంగుళూరులో "ఆథార్" గురించి ఇదివరకో టపా వ్రాశానుగా....ఈమధ్య "ఫణిబాబుగారు"--తమ ఆథార్ వివరాల సమర్పణ త్వరలోనే ముగిసిందని ఓ టపా వ్రాస్తే, ఆహా! అని సంతోషించాను. (బాబుగారూ! మీ అనుమతిలేకుండా, మీ పేరు వాడుకోవడం కోసమే ఇక్కడ మీ ప్రస్తావన తెచ్చానని భావించక, క్షమించండి!).
నిన్న (10-09-2011), విజయవాడ ప్రథాన తపాలా కార్యాలయంలో, ఈరోజు "ఆథార్ దరఖాస్తులని సాయంత్రం 5.30 కి" జారీ చేస్తామని "పక్షం" రోజులకి ముందే ప్రకటిస్తే, అప్పటికి ఓ 1500 మంది అక్కడికి చేరారట! వున్న వొకేవొక్క కవుంటరు తెరవగానే--తోపులాట, తొక్కిసలాట, ప్రథాన ద్వారం అద్దాలూ, పూలకుండీలూ ధ్వంసం, ముగ్గురికి అద్దమ్ముక్కల గాయాలు, ఓ వృధ్ధుడు సొమ్మసిలడం, వూపిరాడక అనేకమంది చిన్నారులూ, మహిళల ఆర్తనాదాలూ, ఇవన్నీ మూడు గంటలపాటు కొనసా....గడం, పోలీసులెవరూ లేకపోవడం, వెరశి--200 మందికి కూడా దరఖాస్తులు అందించలేకపోవడం........ఇదండీ జరిగినది!
ఆ ప్రకటన జారీ చేసినవాడెవడో, వాడికి--నేనిదివరకు "అజ్మల్ కసబ్"కి విధించమన్న శిక్ష --విధిస్తే, మీకేమయినా అభ్యంతరమా?!
ఆలోచించండి మరి!
No comments:
Post a Comment