Thursday, September 15, 2011

కబుర్లు - 70

అవీ, ఇవీ, అన్నీ

రాజీవ్ హంతకులకి మరణశిక్షని నిలుపుదల చేస్తూ, మద్రాస్ హైకోర్టు స్టే విధించిందట మొన్నెప్పుడో. సుబ్రహ్మణ్యం స్వామి ఆ కేసుని తమిళనాడులో కాకుండా, వేరే రాష్ ట్రంలో విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టుకి వెళతానంటున్నాడు. 

అసలు వీళ్లందరూ మరిచిపోతున్నది--వాళ్లు ఒక్క రాజీవ్ హంతకులే కాదు--గొల్లపూడివారన్నట్టు, మారణహోమం సాగించి, మరో 17 మందినో యెంతమందినో (వాళ్ల పేర్లు కూడా దొరకడం లేదట ఇప్పుడు--ఇదీ ఆయనన్నమాటే!) పొట్టన పెట్టుకొని, కొన్ని పదులమందిని క్షతగాత్రులనీ, వికలాంగులనీ చేసినవాళ్లు అని! (వాళ్ల పేర్లగురించీ, వాళ్ల ప్రస్తుత స్థితిగురించీ తెలుసుకోడానికి యెవరూ ప్రయత్నించినట్టులేదు.)

మా చిన్నప్పుడు హైస్కూల్లో "బాయ్ స్కౌట్స్" "గర్ల్ గైడ్" శిక్షణలుండేవి. (సర్ బేడెన్ పౌల్ అనే ఆయన స్థాపించాడు స్కౌట్స్ ఆర్గనైజేషన్ ని.) ఆ శిక్షణలో భాగంగా, విరామ సమయల్లో "యెల్" అని కొత్త కొత్త రైమ్‌స్ లాంటివి నేర్పించేవారు. (యెల్ అంటే, "కేక"/"పిలుపు" అని అర్థం. అసలు మన తెలుగులో ఓ విచిత్రమైన పదం ఈ కేక. "సాయంత్రం సినిమాకి వెళతాను" అని ఒకడంటే, "నువ్వేళ్లేటప్పుడు కేక పెట్టరా, నేనూ వస్తాను" అంటాడింకోడు!)

ఇంతకీ ఒక యెల్ యెందుకో జ్ఙ్ఞాపకం వచ్చింది. అది:

వర్షమురానీ,
తుఫానురానీ,
ఆటలు ఆడగ,
పాటలు పాడగ,
తయారు మేన్!
హ హ్హ హ్హ హ్హ!

ఇప్పుడదెందుగ్గుర్తొచ్చిందంటారా! వస్తున్నా....అక్కడికే!

వర్షమురానీ,
తుఫానురానీ,
యెండలు మండనీ,
చలిపులి కొరకనీ,
హెలికాప్టరెక్కనునేను,
హ హ్హ హ్హ హ్హ!

అనేశాడు మన కి కు రె. ఇవాళ (15-09-2011) ప గో జి పర్యటనకి బయలుదేరి, ఓ ముష్టి జెట్ ఎయిర్ వేస్ విమానంలో రాజమండ్రి బయలుదేరితే, మధురపూడి విమానాశ్రయంలో మబ్బులు దట్టంగా వుండి, విమానం చాలాసేపు గాలిలో చక్కర్లు కొడుతూ, చివరికి హైదరాబాదు తిరిగివెళ్లిపోమని అదేశాలు అందిన మరుక్షణమే గ్రవుండ్ క్లియరెన్స్ దొరికి, మీడియావాళ్లు చాలాసేపు "వుత్కంఠగా" యెదురు చూసింతరవాత, సురక్షితంగా దిగిందట ఆ విమానం!

రేపణ్నించీ ఆయన "విమానాలు కూడా--జెట్ ఎయిర్లూ, స్పైస్ జెట్లూ, కింగ్ ఫిషర్లూ--యెక్కను" అని ప్రకటిస్తాడేమో!

అది కాదు విశేషం! 

రెండురోజులనించీ, సీ ఆర్ ఆర్ కాలేజీ గ్రవుండులో హెలీపాడ్ వద్ద "ట్రయల్ రన్ లు" చేస్తున్నారట. (రాజమండ్రి నుంచి యేలూరు హెలికాప్టర్లో రావాలి ఆయన!)

అదీ పెద్ద విశేషం కాదు.

"మంత్రి పితాని", సీ ఎంగారూ, పెద్ద నాయకులూ తరచూ యేలూరు వస్తూంటారు కాబట్టి, "శాశ్వత ప్రాతిపదికన" జిల్లాలోని ముఖ్యమైన పట్టణాల్లో హెలీపాడ్లు నిర్మించాలనీ, వాటికి అనువైన స్థలసేకరణ వెంటనే జరిగేలా చూడాలి అనీ, జిల్లా కలెక్టరు కి సూచించారట!!!!!!

బాగుందా??

అన్నట్టు, ఇవాళే మరోచోట ఇంకో ముఖ్యకార్యక్రమం జరగబోతోంది. "తమిళనాడు" లో (అసలు జనాలకి అలవాటైన పేర్లు మార్చేసి, కొత్తపేర్లు పెట్టవలసిన అవసరం యేమైనా వుందా? అనేది వేరే విషయం. ఓ నవాబుగారు ఓ పట్టణానికి "మహబూబ్ నగర్" అని పేరు పెట్టినా, జనాలు అప్పటికీ ఇప్పటికీ దాన్ని "పాలమూరు" గానే వ్యవహరిస్తున్నారు! మనుమసిధ్ధి పాలించిన "విక్రమసిం హపురం" అన్నా, ఆంగ్లేయులు పేరెట్టిన "కో కెనడా" అన్నా యెవరికైనా అర్థం అవుతుందా???) జయలలితా....తన యెన్నికల వాగ్దానాల్లో భాగంగా, అనేక స్థాయుల్లోని పాఠశాలల్లోని విద్యార్థులకి ఓ 68 లక్షల మందికి(!)--నిజంగా నిజం--ల్యాప్ టాప్ లు "వుచితంగా" అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారట! ఈ యేడాది 9 లక్షల 12 వేల "ఎల్ టీ" లు (అంటే ల్యాప్ టాప్ లు--లిబరేషన్ టైగర్స్ కాదండోయ్!) పంపిణీ చేస్తారట. మిగతావి వచ్చే "నాలుగేళ్లలో" అందజేస్తారట. 

మొత్తం ప్రాజెక్ట్ కి రూ.10,200 కోట్లు అవసరం అయితే, తొలివిడతగా రూ.912 కోట్లు కేటాయించారట. ఈ ఎల్ టీ లు ఈసీఐఎల్ అఫ్ తమిళనాడు కి అప్పగించారట.

ఓసారి నేను ఓ టపాలో--అంకోపరి ఒక్కొక్కటీ 35 వేలో యెంతో వుంటుందేమో అంటే, లక్షా ముఫై ఐదువేలు వుంటుంది అన్నాడో నిపుణుడు. మరి ఇప్పుడు 10/15 వేలకే యెలా అందిస్తున్నారో! (అండర్ ఇన్వాయిసింగ్ కాదుకదా?)

జూలై నెలలో భారీ యంత్రపరికరాల విభాగంలో "వ్యతిరేక" వృధ్ధి రేటు నమోదవడంతో, మొత్తం పారిశ్రామిక వృధ్ధి రేటు 3.3 శాతానికే పరిమితమయ్యిందట. కానీ నిపుణులు ఈ గణాంకాలు "నమ్మబుల్" గా లేవు అంటున్నారు!

మన ఆర్టీసీ వారికి బుర్రలో ఓ బల్బు మెరిసిందట ఇన్నాళ్లకి. బస్సులకి రిజర్వేషన్ చేసేటప్పుడు, ఓ బస్సులోని సీట్లు మొత్తం నిండిపోతే, వెయిటింగ్ లిస్ట్ లో కూడా రిజర్వ్ చేస్తారట. ఇంకోబస్సుకి సగం సీట్లు నిండినా, ప్రత్యేక బస్సు వేసి అందులో పంపిస్తారట. యేబస్సుకి రిజర్వ్ చేసుకున్నారో సరిగ్గా అలాంటి బస్సునే పంపిస్తారట. మరి "అలాంటి" బస్సులు సరిపడా తెస్తారా?

అలాగే, రైల్వే వాళ్లకి కూడా ఓ మెరుపు మెరిసి, తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ కి, వుదయం 8 నుంచి 9 వరకూ, యేజంట్ లాగిన్ రద్దుచేశారట! ప్రతీ రైల్వే జోన్ లో 200 నుంచి 500 మంది యేజంట్లు వున్నారట! ఇప్పుడు తత్కాల్ టిక్కెట్లు బాగానే దొరుకుతున్నాయట సామాన్యులకి. సౌత్ సెంట్రల్ రైల్వే లోనైతే యేజంట్ల వ్యవస్థ పూర్తిగా రద్దు చెయ్యాలని నిర్ణయించారట!

హమ్మయ్య!


   

2 comments:

Anonymous said...

> సౌత్ సెంట్రల్ రైల్వే లోనైతే యేజంట్ల వ్యవస్థ పూర్తిగా రద్దు చెయ్యాలని నిర్ణయించారట
రద్దు చేస్తారని మీరు అనుకుంటున్నారా?, ఇప్పుడు రద్దు అనంగానే ఏజంట్లు "సూట్ కేసులు" పట్టుకువస్తారని పై ఆపీసర్ కి ఎవరో "ఉప్పు" అందించారంట.

Indian Minerva said...

బాగున్నాయండి కబుర్లు.

మరి ఆపదిహేడు మంది తరఫునా ప్రభుత్వంవారే ఎలా క్షమాభిక్ష ప్రసాదిస్తారో అర్ధంకాదు. ముందసలు ఈ క్షమాభిక్షక్కూడా ఎల్లాయ్ చెప్పాడు, పుల్లాయ్ అభ్యర్ధించాడు అని కాకుండా నిర్దిష్టామైన మార్గదర్శక్జాలేమైనా వున్నాయా లేక అవికూడా "రాష్ట్రపతి వారి విశేషాధికారలేనా".

ఈ పేర్లు మార్పు మనకు పట్టుకున్న మాయరోగం. జ్ఞాపకాల్లో నిలిచిపోయిన పేరుని మర్చిపోయి ఇంకోపేరుకి అలవాటుపడాల్సిరావడం చాలా బాధాకరం.

ఆర్టీసీ వాళ్ళు స్పెషలుబస్సంటే డబ్బు దండుకొనేమార్గం. ఒకసారి ఇలానే స్పెషలు బస్సులో(అంటే ఆర్డినరీ అని అర్ధంచేసుకోగలరుకదా?) ప్రయాణించి 30శాతమోఎంతో ఎక్కువచెల్లించి కూడా ఒళ్ళునొప్పులు కొనితెచ్చుకున్నాక తరువాత ఆర్టీసి ఎక్కకూడదని నిర్ణయించేసుకున్నాను. ఇప్పటికీ పాటిస్తున్నాను. ఆర్టీసీ జనాల డబ్బులమీద బ్రతుకుతూ జనాల్నే ఇలాదోసుచుకోవడం నాకు నచ్చదు. ఇన్నాళ్ళకి మంచి ఆలోచన కలిగింది వీళ్ళకి చూద్దాం ఆచరణ ఎలా వుంటుందో.

ముందుగా రైల్వేవారు ఆ websiteని కొంచెం మంచి కంపెనీచేత redesign చేయించి సర్వర్లూ, డేటాబేసులూ వగైరా upgrade చేయిస్తే మంచిది. అత్యంత అధ్వాన్నంగా వుంటుందా website performance . కనీసం ప్రాజెటువర్కులుచేసే బీటెక్కుకుర్రాళ్ళుకూడా అంతకంటే బాగానే చెయ్యగలుగుతారు మరి దాన్ని చేసింది ఎవడో ఏంటో.