Friday, September 16, 2011

కబుర్లు - 71

అవీ, ఇవీ, అన్నీ

నా కబుర్లు - 70 మీద ఓ అన్నోన్ వ్యాఖ్యానించారు--".....రద్దు అనగానే......'సూట్ కేసులు '....." అంటూ. 

నిజానికి ఇప్పుడంత సీన్ లేదండి! రెండేళ్లకి పైగా వ్రాయబడుతున్న టపాల లింకులని కొంతమంది సహృదయులు రైల్వే అధికారులకి పంపించీ, పేపర్లలో వాళ్లని కడిగేసేలా వ్యావాసాలు వచ్చీ, విజిలెన్స్ దాడులూ అవీ జరిగీ, ఇప్పటికి కొంత మంచి జరుగుతోంది. అందుకని, మనం నిర్భయంగా వుండొచ్చు.

ఇంక Indian Minerva, కబుర్లు బాగున్నాయి అంటూ, "విశేషాధికారాలు" గురించి, మిగతా విషయాలగురించీ వ్రాశారు.

మనరాజ్యాంగం, న్యాయసూత్రాలూ ప్రకారం, ఓ ముద్దాయికి "మరణ శిక్షని" ఖాయం అని ఓ న్యాయస్థానం తీర్పు ఇచ్చాక (అది దేశ అత్యున్నత న్యాయస్థానమే అవనక్కరలేదు.), ఆ ఖైదీ రాష్ట్రపతికి క్షమాభిక్షకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రపతి మళ్లీ ఆ దరఖాస్తుని కేంద్ర మంత్రివర్గానికి పంపించి, మీ అభిప్రాయం చెప్పండి అంటారు. 

అక్కడ జరుగుతోంది లండాచోరీ.

మనదేశ ప్రథమ ప్రథాని నెహ్రూ నుంచి, దేవెగౌడ గాడిదాకా, అక్కణ్నించీ మన్మోహన్ దాకా, అందరూ రోజుకి 18 గంటలూ, ఇంకా అత్యవసరమైతే 20 గంటలూ శ్రమపడినా, అంతకు ముందు నానవెయ్యబడిన "రోకళ్లు" యెంతవరకూ నానాయో చూసుకోవడం, ప్రతిరోజూ వచ్చే ఓ పదో యెన్నో రోకళ్లని క్రొత్తగా నానెయ్యడం లాంటి పనులకే ఆ సమయం సరిపోవడంలేదు!

ఇంక కేబినెట్ సమావేశానికి ఆ క్షమాభిక్ష దరఖాస్తు చేరాలంటే, ప్రథానమంత్రి కార్యాలయం నుంచి అది ప్రయాణిస్తూ, హోం శాఖద్వారా, న్యాయ శాఖ ద్వారా, అవసరమైతే విదీశీ వ్యవహారాల శాఖ ద్వారా....ఇలా ప్రయాణించి, చేరాలి.

తీరా అక్కడికి చేరేటప్పటికి, వాళ్లు మళ్లీ దీన్ని ఓ క్రొత్త రోకలిగా నానేస్తారు. అది చర్చకి వచ్చినప్పుడు, ఖైదీ యే అఫ్జల్ గురునో అయితే, మంత్రులకి తమ ఓజాతి సోదరులూ, రాజీవ్ హంతకులు అంటే మరోజాతి సోదరులూ, యే గ్రాహం స్టెయిన్ హంతకులో అంటే, ఇంకోజాతి సోదరులూ, యే తందూరి హత్యాపాతకులో అంటే, వేరేరకం సోదరులూ......ఇలా గుర్తుకు వచ్చి, "రోకలి నాననివ్వండి.....అప్పుడు చూద్దాం!" అనేస్తారు.

ఇలాంటి పెద్దకేసులు కాకుండా, యే ఫేక్షన్ హత్యల కేసో, పరువు హత్యల కేసో అయితే, రోకలి బాగా నానిన తరవాత, "మరణశిక్ష ఖాయం" అని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు.

ఆ దస్త్రం, మళ్లీ వైకుంఠపాళీలో నిచ్చెనలూ, పాములూ దాటుకుంటూ రాష్ట్రపతికి చేరినా, రాష్ట్రపతి కూడా--పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, అనేక ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకొంటూ, విదేశ అతిథులని ఆహ్వానించడం, బహుమతి ప్రదానోత్సవాలూ, కాన్‌ఫరెన్సుల్లో 'పిలుపులు ఇవ్వడం ' లాంటి కార్యక్రమాలతో, రోజుకి 20 గంటలు పనిచేస్తూ, ఈ దస్త్రం దగ్గరికి రావాలా?

ఈ మధ్యలో, యెప్పుడో ఆదస్త్రం  మీద "ఫలానా తేదీలోపల, జైలువారికి అనుకూలమైన సమయంలో మరణశిక్ష అమలుపరచండి" అనే క్రింది అధికారి నోట్ మీద, రాష్ట్రపతి సంతకం అనే అఫీషియల్ రబ్బర్ స్టాంప్ పడుతుంది. రొటీన్ గా ఆ విషయం పత్రికలవాళ్లకి తెలియజెయ్యబడుతుంది.

అప్పుడు మళ్లీ, "ఆ శిక్ష మీద స్టే మంజూరు చెయ్యాలి" అంటూ పిటిషన్లు దాఖలు అవుతాయి--సుప్రీం కోర్టులో. డిఫెన్సు లాయరు యే రాం జేఠ్మలానీయో అయితే, వెంటనే స్టే లభిస్తుంది. ఆ కేసు, మిగిలిన కొన్నివేలకేసులతోపాటు, కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ పోతూ వుంటుంది!

యేతావాతా తేలేదేమిటంటే, కోటికి పడగెత్తిన ధనవంతుడైనా, అమానుషుడైన హంతకుడైనా, సామాన్యమానవుడైనా, వాడికి భూమ్మీద నూకలు పూర్తిగా చెల్లేంతవరకూ, శివుడాజ్ఞ అవదనీ, అప్పటివరకూ వాళ్లని చీమైనా కుట్టలేదనీ, మన రాజ్యాంగమూ, మనమూ అందరూ నిమిత్తమాత్రులమేననీ!

అదండీ సంగతి!  

మిగతా విషయాలమీద మరోసారి.

4 comments:

Anonymous said...

> కాన్‌ఫరెన్సుల్లో 'పిలుపులు ఇవ్వడం '
:-))

కృష్ణశ్రీ said...

పై అన్నోన్!

మరే! కదా?

'కేకలు పెట్టడం' అంటే జనాలు అపార్థం చేసుకొంటారేమో అని, పిలుపులు ఇవ్వడం అని వ్రాశాను.

అంతకన్నా, మన రాజ్యాంగాధినేతలు వెలగబెడుతున్నది యేమిటంటారు?

ధన్యవాదాలు.

Indian Minerva said...

You are too much huzoor!!

Indian Minerva said...

:D