Wednesday, December 21, 2011

కబుర్లు - 82

అవీ, ఈవీ, అన్నీ

(చాలా రోజులుగా బయటికి సణగడానికి వీల్లేకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు మొదలు.)


  • లోక్ పాల్ స్థానం లో “జోక్ పాల్” బిల్లు
  • “కోడిపందాలు” జరిపించుకోవచ్చు అని తీర్పిచ్చిన చెన్నై హైకోర్టు.
  • హైవే మీద బైక్ గుద్దేసి, “చిరుతపులి” హతం!
  • ఒకావిడ పొట్టలో పాతికేళ్లు కాపురం చేసి, ఇప్పుడు బయటికి వచ్చి, “వ్రాస్తూనే వున్న” పెన్ను!
  • “తృటిలో తప్పిన” విమాన ప్రమాదం.
  • తితిదే వారి "లడ్డూల" గోల.

    జోక్ పాల్ బిల్లు సిధ్ధం అయ్యిందట—“....అదియునూ, నీవడిగినవి తక్క….” అని ప్రభుత్వం హుంకరిస్తూండగా! 



లోక్ పాల్ నియామకంలోగానీ, కార్యకలాపాల్లోగానీ ప్రభుత్వ జోక్యం, ఆధిపత్యం వుండకూడదు అంటే, ముఖ్యంగా దానికే ప్రాథాన్యం ఇస్తున్నారు. ప్రథాని మీద ఆరోపణలు వస్తే, ఆయన పద్మవ్యూహం మధ్యలో వుండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. 


సిటిజెన్స్ ఛార్టరూ, సీబీఐ, చిన్న వుద్యోగులూ వగైరాలన్నీ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు!
మరో పోరాటం తప్పదు. అన్నా సిధ్ధం అవుతున్నాడు. మనమూ సిధ్ధమేనా? 


చెన్నై హైకోర్టు మదురై బెంచ్ వారు విజ్ఙత ప్రదర్శించారు! జే జహంగీర్ అనే ఆయన “కోడి పందాలు” నిర్వహించుకోడానికి అనుమతి అడిగితే, “అలాగే” అనేశారు.


ఆయన అంతకుముందు కలెక్టరుగారినడిగితే, ఆయన ఇంకా సమాధానం ఇవ్వకపోవడంతో, కోర్టుకి వచ్చారట.
ఆ పందాలు—స్థానిక పోలీసు ఈన్స్ పెక్టర్, పశు వైద్యాధికారి సమక్షంలో జరగాలి అనీ, కోడి పుంజులకి మత్తు పదార్థాలేవీ తినిపించ/తాగించ కూడదు అనీ, దేనికీ యే విధమైన గాయాలు తగల కూడదు అనీ, కాళ్లకి కత్తులూ అవీ కట్టకూడదు అనీ, వేళ్లకి విషాన్ని పూయకూడదు అనీ, పోలీసులకీ, పశువైద్యాధికారికీ ఖర్చులని నిర్వాహకుడే భరించాలి అనీ, ఈ షరతులకి లోబడతామని అఫిడవిట్ దాఖలు చెసి, నిక్షేపంగా ఆ పందాలు నిర్వహించుకోవచ్చు అనీ—తీర్పు ఇచ్చింది న్యాయ స్థానం.
చిలకమర్తి వారి గణపతి రోజుల్లో, పేకాట పాకల్లో “ఖూనీ”లు జరిగాయని, పేకాటనీ, కోడి పందాల్లాంటివాటినీ శాంతి భద్రతల సమస్యగా తలపోసి, వాటిని నిషేధించారు. ఇప్పుడు, సాయంత్రం పూట, ముసలాళ్లు కాలక్షేపం కోసం క్లబ్బుల్లో చిన్న చిన్న పందాలతో పేకాట ఆడుకున్నా, అరెస్టు చేసి కేసులు పెట్టి, క్లబ్బులని మూయించేస్తున్నారు.
స్టాక్ మార్కెట్, ఫార్వార్డ్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్, లాంటివన్నీ జూదాలు కావు!
ఇకనైనా, ప్రభుత్వమూ, పోలీసులూ తమ బీసీ నాటి ఆలోచనలని మార్చుకొంటే బాగుంటుంది కదూ?
నిన్న విశాఖపట్నం శివారు జాతీయ రహదారిపై, ఓ బజాజ్ బైక్, రోడ్డుని దాటుతున్న “చిరుతపులి”ని గుద్దేసి వెళ్లిపోయిందట. పాపం ఆ చిరుత చచ్చిపోయింది! 


మరి ఆ చిరుతని గుద్దేసి వెళ్లిపోయిన ఆ “ధైర్యస్తుడు” యెవరో, వాడి మానసిక స్థితి ఆ సమయంలో యెలా వుందో (బహుశా తాగేసి వుంటాడు—అంటున్నారు కొందరు!) యెవరైనా పరిశోధిస్తే బాగుండును!
ఓ పాతికేళ్ల క్రితం, అద్దం ముందు నిలబడి, ఓ పెన్నుతో తన గొంతులోని “టాన్సిల్స్” యెలా వున్నాయో చూసుకొంటూ, క్రిందపడిపోయి, అదాటున ఆ పెన్ను మింగేసిందట ఒకావిడ! అప్పటినుంచీ యేమీ ఇబ్బంది లేదుగానీ, ఈ మధ్య కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళితే, ఆ పెన్నుని గుర్తించి, శస్త్ర చికిత్స చేసి, బయటికి తీశారట!
ఆవిడకిప్పుడు 76 యేళ్లట! విశేషం యేమిటంటే, “నాపెన్నూ ఇప్పటిక్కూడా శుభ్రంగా రాస్తోంది, నేనూ శుభ్రంగా వున్నాను!” అందటావిడ.
ఈవిడని యేమి “జయురాలు” అనాలి?
చెన్నైలో మొన్న సోమవారం 19న, హైదరాబాదునుంచి రాత్రి 8.40 కి వస్తున “స్పైస్ జెట్” విమానం దిగబోతూంటే, ఓ “కింగ్ ఫిషర్” విమానం, తన విశ్రాంత స్థలం నుంచి—సరదాగా—రన్ వే పైకి ప్రయాణం మొదలెట్టిందట! చెమటలు పట్టిన ఏ టీ సీ అధికారులు, స్పైస్ ని “అట్టే….అట్టే….” అంటూ, కాసేపు ఆకాశం లోనే చక్కర్లు కొట్టమని, కింగ్ ని తోక ముడిపించి, యెట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారట. 


ఏటీసీలో ఓ మంచి వుద్యోగి వున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా…….!
ఇప్పటికైనా, వేలంవెర్రిగా విమాన సర్వీసులని పెంచేస్తూ, భద్రత గురించి పట్టించుకోని ప్రభుత్వాలకి కళ్లు తెరుచుకుంటాయా?
తితిదే వారు కంప్యూటర్ల ద్వారా, ఇన్నేళ్లనుంచీ--సేవలమూలంగా, లడ్డూ ప్రసాదాలు యెన్ని యెలా దుర్వినియోగమయ్యాయో నిర్ధారించుకున్నారట! ఫలితంగా, రోజూ కళ్యాణోత్సవం లడ్డూల విక్రయం 1500 నుంచి 620 కీ, వడల సంఖ్య 1400 నుంచి 550 కి పడిపోయాయట! 


మిగిలిన ప్రసాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వేరే యెవరైనా చెప్పాలా?
మరి మిగిలిన సౌకర్యాల, దర్శన విధానాల సంస్కరణ యెప్పుడో…..ఆయనకే తెలియాలి!

No comments: