Saturday, November 5, 2011

కబుర్లు - 79

అవీ, ఇవీ, అన్నీ

మొన్న మన్మోహనుడు గవర్నర్ల సదస్సును వుద్దేశించి ప్రసంగించారట.

గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగబధ్ధంగా యేర్పడింది. వాళ్లకి ఈయన సందేశాలివ్వడం యెమిటో?

అదేమీ తప్పు కాదేమోగానీ, ఆయన వువాచలు రాజకీయ వాసన కొడుతున్నాయి మరి! అవినీతి నిర్మూలనకి ఇదే సమయం అనీ, అందుకోసం రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకొంటే ఫలితాలు మరింత బాగుంటాయి అనీ, గవర్నర్లు "కేంద్రానికి కళ్లమాదిరిగా" వుండాలనీ, అభివృధ్ధి కార్యక్రమాలని పర్యవేక్షించాలనీ 'సూచించార' ట. దేశానికి "రెండో హరిత విప్లవం" అవసరమన్నారట! పండిన పంటకీ, కుళ్లిపోతున్న ధాన్యాలకీ దిక్కులేదుగానీ.......! ఆ విప్లవం కూడా గవర్నర్లే తేవాలని ఆయన వుద్దేశ్యమేమో మరి! బాగుంది.

మొన్నెప్పుడో, 'ఇండియన్ మినర్వా' వ్యాఖ్యకి సమాధానమిస్తూ, రైల్వే వెబ్ సైట్ గురించి నేను వ్రాసిన విషయమ్మీద, (http://osaamaa.blogspot.com/2011/09/74.html) ఈనాడువారు దృష్టి సారించి, అక్టోబర్ 29న వార్త వ్రాశారు!

అన్నట్టు, ఈనాడులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షల ప్రకటనల్లో, "వివాహ 5వ" అనే ప్రచురించడం మొదలెట్టారు. కానీ, మధ్య మధ్య మళ్లీ "16వ వివాహ" అని కూడా అప్పుడప్పుడూ వస్తున్నాయి.

ఇంక, "ఒడుదొడుకులు" ని "ఒడిదుడుకులు" అని సవరించారు. (అని సంతోషించినంతసేపు పట్టలేదు.....మళ్లీ నాల్రోజుల్లోనే, ఒడుదొడుకులు....అంటూ పెద్ద హెడ్డింగు!).

ఇంకా, మా ఎంబెరుమన్నార్ కోవెలని, "ఎంబెర్ మానార్" అనడం మానేశారు. "ఎంబెర్ మన్నార్" అంటున్నారు. సంతోషం.

కానీ, "ఎంబెరు మన్నార్" అన్నది సరైన పదం. అదికూడా మారిస్తే, ఇంకా సంతోషం.

అలాగే, "నిర్ధారణ" ని "నిర్ధరణ" అని వ్రాస్తున్నారు. అది అర్థం లేని మాట. సవరిస్తే సంతోషం!

తెలుగుని తెలుగులాగే బ్రతికించండి!


మొన్న అక్టోబరు 29నే, ఈనాడులో, సంపాదకీయం ప్రక్కన ముఖ్య వ్యాసంగా, "ఇందిరాగోపాల్" ఓ వ్యాసంవ్రాశారు--"నియంతా...నీవెంత" అంటూ.

ముందు అమెరికాని సపోర్టు చేస్తున్నట్టు అనిపించినా, తరవాత చక్కని హెచ్చరికల్తో ముగిసింది ఆ వ్యాసం.

చదవకపోతే చదవండి.

 

No comments: