Tuesday, November 15, 2011

కబుర్లు - 80అవీ, ఇవీ, అన్నీ

హమ్మయ్య! శుభవార్త వెలువడింది! రాష్ట్రాల్లో రేషన్ కార్డులున్నవాళ్లందరికీ ఆథార్ సంఖ్య కేటాయించడం చెల్లదని, ఆథార్ సంఖ్యని "జనాభా లెఖ్ఖల" శాఖ మాత్రమే జారీ చేస్తుందనీ, ఆ ప్రక్రియ ఇంకా మొదలవలేదనీ, మిగిలిన యే "సంఖ్యలూ" చెల్లవు అనీ ప్రకటించేశారు!

మరి ఇన్నాళ్లనుంచీ, ప్రైవేటు యేజన్సీలని నియమించి, మందల్లా జనాలని తోలి, దరఖాస్తులని జారీ చేసి, మిగిలినవాళ్లకి 2013 వరకూ దరఖాస్తులే జారీ చెయ్యడం కుదరదనీ.......ఇలా వేషాలేసిన రాష్ట్రాలకీ, ప్రభుత్వాలకీ.....ఇంకా.....ఆ "కార్డు" లేకపోతే....మీకు 'రేషన్' రాదు; 'గ్యాస్' రాదు; 'పెన్షన్లు' రావు; మీరు ఈ దేశ వోటర్లేకారు.....ఇలా బెదిరించి "దండుకున్న" వారికి యేదీ శిక్ష?

"మూడీస్" అనే "ఇంటర్నేషనల్" (మా జార్గాన్ లో మోసగాళ్లనీ, ఓవరాక్షను చేసేవాళ్లనీ క్రమంగా "తాలూకాగాడు; జిల్లాగాడు; రాష్ట్రగాడు; నేషనల్ గాడు; ఇంటర్నేషనల్ గాడు....ఇలా వ్యవహరించేవాళ్లం!) రేటింగు యేజన్సీ, భారతీయ బ్యాంకుల రేటింగుని "కొంత" దించేసిందట! బ్యాంకులన్నీ బాధపడిపోతున్నాయట! (నిజంగా వాళ్ల పేరుకి తగ్గట్టు వాళ్లు "మూడీసే"....అంటే వాళ్ల మూడ్ కి తగ్గట్టు ప్రవర్తిస్తారు!)

ఇంకో రేటింగ్ యేజన్సీ "స్టాండర్డ్ & పూర్" వాళ్లు, అదే రేటింగుని, ఆ మర్నాడే 'కాస్త' పెంచారని సంతోషిస్తున్నాయట బ్యాంకులు! (వీళ్లకో స్టాండర్డ్ లేదు; వీళ్లు పూరూ కాదు! సత్యం రామలింగరాజు ఆడిటర్లు వీళ్లేనట.)  

మొన్న ప్రణోబ్ ముఖర్జీ, నిన్న రంగరాజన్ కూడా, బ్యాంకులు తమ "మౌలిక రంగ" (రోడ్లు, విద్యుత్తు, విమానయాన వగైరా); వాహన; గృహనిర్మాణ; వ్యక్తిగత ఋఅణ రంగాల్లో "జాగరూకత" వహించాలని చెప్పారు(ట!)

నేను మూడేళ్లనుంచీ చెపుతున్నాను--ఈ రంగాలు "ములుగుతున్నాయి" అని! అయినా, అలా "వెల్లవేసి" వాటిని కాపాడుకొస్తున్న ప్రభుత్వాలు మాత్రమే దీనికి బాధ్యులు అంటాను నేను!

మళ్లీ బ్యాంకులు "వుత్పాదక రంగ" ఋణ వితరణకి మాత్రమే పరిమితమైతే తప్ప, మన బ్యాంకులనీ, మన ఋణ వ్యవస్థనీ కాపాడగలిగేవాడు యెవడూ లేడు. వృధ్ధి రేటంటారా.....నా కాలిక్రింద బలాదూర్!

విజయ్ మల్లయ్య, యెప్పుడూ ఓ నలుగులు అందగత్తెల మధ్య (గాంధీగారు పాపం ఇద్దరు 'బెన్ ' ల భుజాలమీదే చేతులు వేసేవారు....వాళ్లు కూడా అందగత్తెలు అంటే మన కళ్లు పోతాయి!), చేతిలో ఓ షాంపేన్ గ్లాసుతో కనిపిస్తాడు! దేశంలోని "బీర్బల్"లకీ, మందుభాగ్యులకీ తగినంత "సరుకు" అందించిన ప్రజా సేవకుడూ, టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని వేలంలో సొంతంచేసుకొని, మన దేశానికి తీసుకువచ్చిన (అది ఆయన పెర్సనల్ లాకర్లో వుందేమో ఇప్పుడు!) "దేశ భక్తుడు"! అలాంటివాడు, ఈ రోజున నా "బీర్ బ్రాండు" ఎయిర్ లైన్స్ కష్టాల్లో వుంటే.....యెందుకు ఆదుకోరూ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు!

ఇంకో స్పైస్ జెట్ వాడో యెవరో, "ప్రైవేటు" విమాన సంస్థలకి ప్రభుత్వం యెందుకు సాయం చెయ్యాలి? అనడుగుతున్నాడు. 

బ్యాంకులేమో, ఇప్పటికే 8 వేలకోట్లిచ్చాం. ఇంకా కావాలంటే, ఓ 8 వందల కోట్లు (నీ మద్యం ఫ్యాక్టరీలలోంచి) మళ్లించు...అంటున్నారట! చేస్తాడో......దేన్‌దార్దాన్‌దే అంటాడో! 

అసలు వీటన్నింటికీ కారణమైన "ప్రఫుల్ పటేల్" హాయిగా వున్నాడు! (ప్రపంచమందరికీ అన్ని విషయలూ తెలుస్తున్నా, వాళ్లు "అదిగో పులి" అని చెపుతున్నా, గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతూ కాలక్షేపం చేసిన) సీబీఐ వాళ్లేమైనా చెయ్యగలరా వాడిని?  

చూద్దాం!No comments: