అవీ, ఇవీ, అన్నీ
ఈజిప్టు మహా నిరసన ఫలించి, ముబారక్ పదవి వదిలి పారిపోయాడట. శుభం! ఓ రెండుసార్లో యేమో కాల్పులు జరిగినా, అధికారులదే తప్పు అని తేల్చి, వాళ్లని పదవులనించి తొలగించారట.
దీన్ని చూసి, మన వాళ్లూ, పోలీసులూ పాఠాలు నేర్చుకుంటే యెంత బాగుండును?
రాస్తా రోకోలూ, రైల్ రోకోలూ, ముట్టడులూ, దూసుకుపోవడాలూ, వినూత్న నిరసనల పేరుతో చొక్కాలు విప్పెయ్యడాలూ, గుళ్లు గీయించుకోడాలూ, వెర్రి మొర్రి దీక్షలూ, తమని తాము ఓ గదిలో బంధించుకొని, యెవరూ లోపలకి రాకుండా 'నిరశనలూ'--చుట్టుపక్కల వాళ్ల వాళ్లందరూ వుద్రిక్తులైపోవడం, పోలీసులు వాళ్లందరినీ బాదేసి, తలుపులు బద్దలుగొట్టి నిరశనకారుల్ని హాస్పటళ్లలో చేర్చడం.......ఇలాంటివాటికి మీడియా పూర్తి కవరేజీ......ఇలాంటివాటివల్ల యేమి సాధిస్తున్నారు? యెవరిని వారు ప్రశ్నించుకోవాలి.
మొన్నామధ్య, విజయవాడలో గుంటూరుకు చెందిన "హవాలా" వ్యాపారులనీ, వాళ్ల అనుచరులనీ, పట్టుకొని, అరకోటికి పైగా స్వాధీనం చేసుకొన్నారట.
ఇప్పుడు హవాలా అనేది సర్వ సాధారణమైపోయింది. ఇదివరకు చాలా కొద్దిమంది మాత్రమే వినియోగించుకొనేవారు కానీ, దానిలోని సౌలభ్యం చూసి వాడుకొనేవాళ్ల సంఖ్య పెరిగింది.
హవాలా అంటే, పూర్వం బ్యాంకులు లేని కాలంలో, చిలకమర్తివారి గణపతి నవలలో, వాడి తండ్రో, తాతో "పునహా" నించి పెళ్లికోసం మన వైపు తిరిగి వస్తూ, "నారాయణ కర్ను" గారి పేర "దర్శన హుండీ" వ్రాయించుకొని వచ్చినట్టు!
మనం ఇవాళ ఫ్లయిట్లో బెంగుళూరో, ఢిల్లీనో వెళ్ళాలి. అక్కడ ఓ అరకోటి యెవరికో చెల్లించాల్సిన అవసరం వుంది. మన డీల్ సెటిలయ్యేప్పటికి, బ్యాంకులు మూశేసారు. మన ఫ్లయిట్ సాయంత్రమే! మరెలా?
యేముందీ--సింపుల్ గా హవాలా వాడి షాపుకెళ్లి, అరకోటికి సరిపడా చెక్కులు ఇచ్చేసి, వాడి కమీషన్ (లక్షకి రెండు వందలో యెంతోనట) కట్టేసి, వాడిచ్చిన "కోడ్"--మాటో, సంఖ్యో నోట్ చేసుకొని, ఫ్లైట్ యెక్కెయ్యడమే! మనం ఫ్లైట్ దిగాక, అక్కడి హవాలా యేజంటుకి ఓ ఫోను కొట్టి, కోడ్ చెప్పేస్తే, మనం లాడ్జికి వెళ్ళేటప్పటికి అక్కడ అరకోటీ ప్రత్యక్షం! యెంత సుళువో చూశారా?
ఇప్పుడు బ్యాంకులన్నీ "ఆన్లైన్" అయ్యాక, డ్రాఫ్టులు కూడా తగ్గిపోయాయి.
మరి--హవాలాని అరికట్టడం యెలా?
ఇప్పటికే, బ్యాంకులన్నీ "కే వై సీ" (నో యువర్ కస్టమర్) "పీ ఎం ఎల్" (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్) "సీ టీ ఆర్" (కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం....ఇంకేదో) లాంటి చట్టాల క్రింద తమ శాఖల్లో జరిగే పెద్ద లావాదేవీలన్నీ కాలపరిమితి ప్రకారం పై అధికారులకి పంపిస్తున్నాయి. యెటొచ్చీ, వాటిని సమర్థంగా వినియోగించుకొనే యంత్రాంగమే లేదు! అందుకే ఇన్ని కుంభకోణాలూ, స్కాములూ, స్విస్ బ్యాంకు ఖాతాలూ!
స్కోర్లు : నిన్న (15-02-2016) ఒక్క రోజునే, మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలలో "మరణించిన" వారి సంఖ్య--28! (గాయపడ్డవాళ్ల లెఖ్ఖ సరిగ్గా తెలీదు). జిల్లాలవారీగా--మెదక్-7; రంగారెడ్డి-2; నిజమాబాద్-2; ఖమ్మం-1; కర్నూలు-3; హైదరాబాద్-3; ఆదిలాబాద్-3; కరీమ్నగర్-1; అనంతపురం-4; విశాఖ-2! (ఇంకా రేపు బయటికి వచ్చేవున్నాయేమో!)
మన రోడ్ల గురించీ, వాహనాల గురించీ యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటారా?.....అలాగే మరి!
No comments:
Post a Comment