Sunday, April 13, 2014

కబుర్లు - 116


అవీ, ఇవీ, అన్నీ


జైరామ్‌ రమేష్ అంటాడూ......యెన్నికల్లో ప్రజలు ఎం పీ లని మాత్రమే యెన్నుకుంటారు...ప్రథానిని కాదు అని. అవును కదా? ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎం పీ లు మాత్రం యే అభిప్రాయం ప్రకటించకుండా సీల్డు కవర్లో వచ్చిన పేరు గల వ్యక్తిని ప్రథానిగా యెన్నేసుకుంటారు!

రాహువు అయితే, కాంగ్రెస్ ఒక పార్టీనే కాదు....అది పెద్దల ఆలోచనా విధానం....దాన్నెవరూ తుడిచెయ్యలేరు. అంటాడు. అంటే అది వాళ్ల పెద్దల ఆలోచనా విధానం అయితే, దాన్ని యెవరూ తుడిచెయ్యలేరు అన్నది కరెక్టే కదా? (యెంత పెద్ద చీపురుతో అయినా, పార్టీ తుడిచిపెట్టుకు పోయినా ఫర్వాలేదు.)

వీరప్ప "టేపుల" మొయిలీ కూడా కాంగ్రెస్ ని యెవరూ చెరిపెయ్యలేరు అంటున్నాడు. అంత పెద్ద రబ్బరులు యెవరూ వుపయోగించలేరు అని భావమనుకుంటా. 

ఇప్పుడు వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు అంటే, యేదో మూల అది తుడిచిపెట్టుకు పోతుంది అనీ, చెరిగి పోతుంది అనీ భయం కలగడం వల్లే కదా?

మునిసిపల్ యెన్నికల ఫలితాల ప్రకటన వాయిదా పడడంతో, అభ్యర్థులు టెన్‌షన్‌, బీపీ, తలనెప్పీ వగైరాలతో హాస్పిటళ్లలో జేరుతున్నారట. పదిలక్షలవరకూ తెచ్చి, నెలకి లక్షకి ఇరవైవేలు వడ్డీలు యెలా కట్టాల్రా భగవంతుడా అనిట అసలు టెన్‌షన్‌!

ఇంక పందాలు కట్టిన వాళ్లు కూడా, మధ్యవర్తుల దగ్గర డబ్బు బ్లాక్ అయిపోవడంతో, తరువాత పందాలకి పెట్టుబళ్లు యెలాగా అని తలలు పట్టుకుంటున్నారట. 

చండీగఢ్ మున్‌సిపల్ కార్పొరేషన్ లో 319 స్వీపర్ పోస్టులకి 14 వేలమంది దరఖాస్తు చేసుకున్నారట. వాళ్లలో....జీతం 14,000/- వచ్చే ఈ వుద్యోగానికి 210 మంది పట్టభద్రులూ, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లూ, నలుగురు బీ టెక్ లూ, 70 మంది డిప్లొమా వున్నవాళ్లూ, వున్నారట. 

2011 లో బరేలీలో, ఇండో టిబెటన్‌ బోర్డర్ పోలీసులో, ఖాళీ ప్రకటించిన 416 క్షురక, ధోబీ  వుద్యోగాలకోసం రెండు లక్షలమంది పోగు పడ్డారట. ఆ పోస్టుకి జీతం రూ. 5,200/-. రైళ్లలో క్రిక్కిరిసి, టాపుమీదకూడా ప్రయాణాలు చే్సిన అభ్యర్థులు, ఓ పొట్టి బ్రిడ్జ్ క్రింద నుంచి వెళుతూండగా, 18 మంది అక్కడికక్కడే మరణించి, అనేకమంది తీవ్ర గాయాలపాలైన విషయం మరచిపోలేము

వచ్చే ఐదేళ్లలో ఇన్ని కోట్ల వుద్యోగాలు అంటూ ప్రకటించి, అది మరచిపోయి, మళ్లీ ఇప్పుడు అదే ప్రకటిస్తున్న పార్టీని భూస్థాపితం చెయ్యద్దూ?

మొన్న ఏప్రిల్ 9 న, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ బాంబు పేలి, 23 మంది దుర్మరణం, ఓ వందమంది కి పైగా తీవ్రంగా క్షతగాత్రులూ అయ్యారట. ప్రభుత్వం, నిషేధిత తాలిబన్‌ ఉగ్రవాదులతో, శాంతి చర్చలు జరుగుతున్నప్పుడు ఈ పేలుడు జరిగిందట. ఈ విధ్వంసాన్ని పాక్ తెహ్రిక్-ఇ-తాలిబన్‌ అధికార ప్రతినిథి తీవ్రంగా ఖండించారట! మరి తాము అలాంటివి చేసి, అనేకచోట్ల అనేకమందిని పొట్టనపెట్టుకొన్నప్పుడో?

2 comments:

TVS SASTRY said...

నిజాలు విలువైనవి. అన్నీ ఒక్కసారి చెప్పకండి. పొదుపుగా వాడండి!

A K Sastry said...

డియర్ శాస్రిగారూ!

పొదుపుగానే వుందామనుకున్నా, కొన్ని నిజాలు చెప్పేముందే మరిన్ని నిజాలు బయటికి వచ్చేస్తున్నాయి. యేం చేద్దాం!

ధన్యవాదాలు.