Saturday, March 24, 2012

కబుర్లు - 88



అవీ, ఇవీ, అన్నీ

బుధ్ధిలేని పోలీసు డిపార్ట్ మెంట్ లో భాగం చేసేశారనుకుంటా హోం గార్డులని. మొన్న జిల్లాలో మొత్తం వున్న 32 పోస్టులకి, 3500 మంది అభ్యర్థులు, అర్థరాత్రివరకూ క్యూలలో నిలబడి దరఖాస్తు చేసుకున్నారట! వీళ్లకి గురువారం నుంచీ "అర్హత" పరుగులూ, పరీక్షలూ మమూలే! ఇదేమి నియామక ప్రక్రియో? యెవరూ కలగజేసుకోవడం లేదు--పాపం!

రాష్ట్ర హైకోర్టు ప్రథాన న్యాయమూర్తి, సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి (వీళ్లు కోర్టులకి యెప్పుడు వెళుతున్నారో అని ఇదివరకే వ్రాశాను), ఇంకా పరిశ్రమలశాఖ సహాయ మంత్రీ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తరించారట మొన్న 18 వ తేదీన. మామూలుగానే దర్శనం, తీర్థ ప్రసాదాలు యేర్పాటు చేశారట అధికార్లు. ఈ గవర్నరొకడు--అస్తమానూ పట్టుపంచ కట్టుకొని తయారైపోతున్నాడు. అదేరోజు ఓ గంటపాటు ఆయన ఆలయంలో వుండిపోతే, క్యూ లైన్లు అపేసినందుకు "భక్తులు" అందోళన చేసి, నినాదాలు చేశారట! వీళ్లకి వేరేపనులు లేనట్లు యెందుకో షటిలింగ్ హైదరాబాదు నుంచి! (ఈయన్ని చూస్తే శంకర్ దయాళ్ శర్మ గుర్తొస్తున్నాడు--ఖాళీ కల్పించుకొని మరీ పొర్లు దండాలు పెట్టేసేవాడు!)

అప్పటి కలెక్టరుగారు "సంపూర్ణ పారిశుధ్యం" గురించి గ్రామీణ విద్యార్థులు, ప్రజలకు అవగాహన పరిచేందుకు 4 లక్షల నిధులతో, ఓ జడ్పీ పార్కుని "శానిటరీ" పార్కుగా మార్పించేశారట. 30-09-2010 న అప్పటి మంత్రి రఘువీరారెడ్డి దాన్ని "ఘనంగా" ప్రారంభించారట. కానీ, ఇప్పటివరకూ ఒక్క విద్యార్థి కూడా ఆ పార్కుని సందర్శించిన పాపాన పోలేదట. మహిళా సంఘాలు అసలే రాలేదట. ఇంతకీ ఆ పార్కులో యేమి పెట్టారు? మూడడుగుల దిమ్మలపై, రకరకాల లెట్రిన్ బేసిన్లూ, సింకులూ వగైరాలు. నాటిన మొక్కల సంగతి యెవరూ పట్టించుకోకపోగా, చెత్తనంతా గోడల ప్రక్కగా పోసేస్తున్నారట! యెంతబాగుందో చూశారా--"శానిటేషన్?"

యర్రంశెట్టి శాయి లాంటివాళ్లు రైల్వే నేపధ్యంతో వ్రాసిన నవలలవల్ల కొన్ని విషయాలు తెలిశాయి మనకి--జనరల్ మేనేజర్ కోసం ఓ ప్రత్యేక రైలు వుంటుందనీ, అందులో ఆయన ఆఫీసూ, బెడ్ రూమూ, కిచెనూ, సిబ్బంది కోసం--ఇలా ఓ నాలుగైదు కంపార్ట్ మెంట్లు వుంటాయనీ వగైరా. ఇప్పుడు ఆ రేంజి పెరిగిపోయినట్టుంది. మొన్న జనరల్ మేనేజరుగారు "తనిఖీల" కోసం యేకంగా ఓ 17 బోగీల రైలుతో, ఔరంగాబాద్ స్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ ఆక్రమించి, ముఖ్యమైన రైళ్లని యెక్కడో దూరంగా వున్న ప్లాట్ ఫారాలమీద ఆపి, ప్రయాణీకులని నానా హింసా పెట్టారట. దీని విషయంలో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలై, కోర్టు నోటీసులు కూడా ఇచ్చిందట! అసలే బోగీల కొరత వల్ల రైళ్లు నడపడమే ఇబ్బంది, కొత్తరైళ్లు అసలే లేవు, మరి ఆ పటాటోపం తో రైల్వేలకి నష్టాలు వస్తున్నాయంటే రావూ? అయినా "ఇన్స్ పెక్షన్" కి వెళ్లే వాళ్లు హటాత్తుగా వెళ్లి, యేమూలో పొంచి వుండి తనిఖీ చేస్తారంటారు. మరి ఇలాంటి తనిఖీల మర్మమేమిటో?

పటాటోపం విషయానికొస్తే, మన విజయనగరం మహారాజావారు గుర్రప్పందాలకో, గోల్ఫ్ కో లండన్ వెళితే, అక్కడి స్టార్ హోటెళ్లవాళ్లు తలలుపట్టుకు కూర్చునేవారట! వారి మర్యాదల గురించి కాదు--బెల్ బాయ్స్ దగ్గరనుంచీ వజ్రాల రూపంలో బాగానే ముట్టచెప్పేవారట. మరి తలనెప్పి యెందుకంటే, ఆయన వెంట కనీసం ఓ పాతిక యేనుగులని తీసుకెళ్ళేవాడట--వాటికి "ప్రత్యేక పార్కింగ్" సదుపాయం యెక్కడ యేర్పాటుచెయ్యలా అని! (అవి తమ పేడతో అద్దంలాంటి రోడ్లని పాడు చేస్తాయని భయం!)

కొత్తగా బొగ్గు కుంభకోణం--2జీ కన్నా చాలా పెద్దది అంటున్నారు. వాటిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాభపడినందువల్ల, ప్రభుత్వానికేమీ ఢోకా వుండదంటున్నారు. కానీ అన్ని పార్టీలూ దేశంలోనూ, మనరాష్ట్రంలోనూ "మధ్యంతర" యెన్నికలకి సిధ్ధపడితే మంచిదని నా పంచాంగం చెపుతోంది. (నేను ఇదివరకు నించీ వ్రాస్తూనే వున్నాను--ఈ ప్రభుత్వాలు 2014 వరకూ వుంటే గింటే అని.)

2 comments:

Indian Minerva said...

వాళ్ళా శానిటేషన్ పార్కును "ఎలా చేయకూడదు?" అనేదాన్ని చెప్పడానికి ఏర్పాటుచేశారు. అర్ధం చేసుకోరూ.

" రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాభపడినందువల్ల, ప్రభుత్వానికేమీ ఢోకా వుండదంటున్నారు"

వెధవపనులుచేసినా ఇలా తల్లీబిడ్డాన్యాయంగా వ్యవహరించాలి. అప్పుడే ఏ బాధా ఉండవు. న్యాయము జయించుగాక.

A K Sastry said...

డియర్ Indyan Minerva!

అలాంటి అద్భుతమైన, లక్షలు ఖర్చుపెట్టే అవిడియా వేసిన కలెక్టరుని యెలా అర్థం చేసుకోవాలో తెలియకేగా...ఈ సణుగుడు.

సత్యమేవజయతే!

ధన్యవాదాలు.