Saturday, March 10, 2012

కబుర్లు - 85అవీ, ఇవీ, అన్నీ

ఒబామా మళ్లీ పేలాడు--విన్నారా?

ఇంతకు ముందు ఇండియా లాంటి చోట్ల జనాలు యెక్కువ తినేస్తున్నారు--అందుకే ద్రవ్యోల్బణం, ప్రపంచ వ్యాప్త ఆహార కొరత, ఆర్థిక సంక్షోభాలు వగైరా అంటూ పేలాడు.

ఇప్పుడు, భారత్, చైనా, బ్రెజిల్ దేశాల్లో అందరూ కార్లు కొనేస్తున్నారు కాబట్టే చమురు ధరలు పెరుగుతున్నాయి అని పేలుతున్నాడు! చైనాలో 2010లో కొత్తగా కోటి కార్లు రోడ్లపైకి వచ్చాయి అనీ, అలాగే భారత్, బ్రెజిల్ లలో కూడా ఇంధన అవసరాలు బాగా పెరిగిపోయాయి అనీ అన్నాడు.

అంటే వాడి వుద్దేశ్యం, అమెరికావాళ్లు మాత్రమే తినాలి, వాళ్లే కారుల్లో తిరగాలి, వాళ్లే వున్నత జీవన ప్రమాణాలతో వుండాలి అనా? 

వాళ్ల పెద్ద పెద్ద లిమోసిన్లూ అవీ అంతవేగంగా ప్రయాణించడానికి, వాళ్ల పోలీసులు వుపయోగించే వాహనాలకీ, యెంత "గ్యాసోలిన్" (మన పెట్రోలు కూడా కాదు) తాగేస్తున్నారో వూహించండి! మన లీటర్లు కాక వాళ్లు గేలన్లలో కొలుస్తారు పైగా! ఇంక విమానాలు చెప్పనే అఖ్ఖర్లేదు.

వాళ్లు మనని వెక్కిరిస్తూ బాధపడిపోవడం యేమిటో?

మన వందరూపాయలనోట్ల వెనుకవైపు, సరిగ్గా మధ్య, క్రిందుగా ఆనోటు చెలామణీలోకి విడుదలైన సంవత్సరం ముద్రించి వుంటుంది. 

ఇప్పుడు అలా సంవత్సరం అసలు ముద్రించకుండా వున్న నోట్లు 1996 లో విడుదల అయ్యాయనీ, ఆ నోట్లు ఇక చెల్లవు అనీ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించి, వాటిని బ్యాంకులలో మార్చేసుకోమని అదేశాలు ఇచ్చిందట. 

2005 లోని ఎం జి సిరీస్ నోట్లు కూడా చెల్లవు ట.

ఓ సారి జాగ్రత్తగా చూసుకోండి. యేరోజు వరకూ మార్చుకోవచ్చో స్పష్టం కాలేదు.

రావి కొండలరావు అమెరికా వెళ్లలేకపోవడంతో, ఆయన స్థానంలో అక్కిరాజు రమాపతిరావుగారికి జీవితకాల సాఫల్య పురస్కారం అందిస్తారట. ఆయనకి అభినందనలు.

మన గవర్నరుగారు వుదయం 9 గంటలకే అన్నీ యేర్పాటు చేసుకొని, న్యాయమూర్తి లోకూర్, ఇంకా ఆయన్ని దర్శించుకోడానికి వచ్చిన చాలామంది తో "హోలీ" ఆడేసుకున్నారట. అలాగే ముఖ్యమంత్రి కూడా. బాగుంది. వాటి కోసం, సహజ రంగులూ, పర్యావరణ హితమైనవీ అంటూ ఇంకో గోల. ఇంకెక్కడో కొన్ని వందలమంది చిన్నారులు హానికారక రంగుల కారణంగా ఆసుపత్రుల పాలు!

అంత అవసరమా?

అన్నట్టు, లోకూర్ గారూ, జాస్తి చెలమేశ్వర్ గారూ రోజూ పేపర్లో వస్తున్నారు--అక్కడ మీటింగ్, ఇక్కడ సెమినార్, ఇంకోచోట సన్మానం వగైరాలతో. మరి కోర్టులకి యెప్పుడు వెళుతున్నారో?

ఇంక మన తెలుగు వీరాభిమానులు, తెలుగు భాషకోసం అంటూ మొసలి కన్నీళ్లు ఇంగ్లీషులో కార్చేవాళ్లు, మనమీడియావాళ్లూ--ఇలా, "ఫలనా స్కూల్లో ఫలానా మేష్టారు ఓ విద్యార్థిని 'తెలుగులో మాట్లాడినందుకు' తీవ్రంగా శిక్షించిన వైనం" అంటూ తెగ వాపోతున్నారు!

ఇక్కడ విషయం, తెలుగు మాట్లాడినందుకు కాదు--పాఠశాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలి అనే నిబంధన వుల్లంఘించినందుకు--అని కన్వీనియెంట్ గా మరచిపోతారు.

ఆంగ్లం మాతృభాష కానివాళ్లెవరైనా ఇంగ్లీషు మాట్లాడినా, వ్రాసినా తప్పులు దొర్లుతాయి. కానీ, మనదేశంలో అనేకమంది మహామహులు, వాళ్లకన్నా చక్కగా ఇంగ్లీషులో కథలూ, కావ్యాలూ, నాటకాలూ, కవితలూ వగైరాలు వ్రాసేవారు! (ఇప్పుడూ చిన్నపిల్లలు సైతం వ్రాస్తున్నారు!)

ఇప్పుడు కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ, ఇతర వున్నతోద్యోగులూ, బుర్రోవాదులూ, ఆఖరికి జర్నలిస్టులూ కూడా వ్రాస్తున్న ఇంగ్లీషు చూస్తుంటే, వికారం వస్తూంటుంది!

అలాంటి పరిస్థితుల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నిబంధన విధించి, అమలు చేస్తున్నవాళ్లని తప్పు పట్టగలమా?

ఇంటర్ వరకూ యెలాగో నెట్టుకొచ్చి, (ఇప్పుడు ఎంసెట్ రాంకు బాధ కూడా లేదు), ఇంజనీరింగు కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులనీ, వాళ్లకిపాఠాలు చెప్పే వుపాధ్యాయులనీ, వాళ్లకు తెలియకుండా సూపర్వైజర్లచే నిఘా వేయించి, తెలుగు వినబడితే జరిమానాలూ, జీతాల్లో కోతలూ విధిస్తున్న విషయం యెవరికి తెలియదు? పాపం వాళ్లెవరికి చెప్పుకోవాలి?

మేష్టర్లని శిక్షిస్తే, తెలుగు వృధ్ధిలోకి వస్తుందా?

ఆలోచించండి.

No comments: