Sunday, May 13, 2012

కబుర్లు - 89



అవీ, ఇవీ, అన్నీ

అద్భుతమైన తెల్ల కుందేలుని తన టోపీలోంచి తీశారు "భన్వర్ లాల్" (మన యెన్నికల ప్రథానాధికారి).

వోటుకోసం డబ్బులు "తీసుకున్న"వాళ్లపై కూడా కేసులు పెడతారట.

ప్రతీ వూరులోనూ, వార్డుకి ఓ నలుగురైదుగురిని ఇలా కేసులు పెట్టి బుక్ చేసేస్తే, నియోజకవర్గానికి కొన్ని వేలమంది అవుతారు. 

సేంపుల్ చూసినవాళ్లు ఇంక అభ్యర్థులు ఇంటింటికీ ప్రచారానికి వచ్చినా, వాళ్ల మొహాలమీదే తలుపులు వేసెయ్యరూ మన వోటర్లు? 

నిజంగా అమలు మొదలెట్టండి మరి!

మన తెలుగుని కాపాడండి అని చెవినిల్లుకట్టుకొని పోరుతున్నారు. జరిగేవిమాత్రం మామూలుగానే జరుగుతున్నాయి. యేమైనా అంటే, అదేదో (ఇంగ్లీష్ మీడియం) స్కూల్లో తెలుగులో మాట్లాడినందుకు వుపాధ్యాయుడు దండించేశాడు అంటూ గోల!

మన తెలుగు కి ముప్పు యెక్కడనుంచి? ఇతర భారతీయ భాషలనుంచి కాదు కదా? ఒక్క ఇంగ్లీషు నుంచే కదా? 

మరి, కొంతమంది బయలుదేరారు--"యేదీ, అసలైన తెలుగు మాట్లాడి చూపించండి! ఇతర భాషాపదాలుగానీ, సంస్కృత పదాలు--తత్సమాలూ, తద్భవాలూ లేకుండా!" అని వాదిస్తున్నారు. 

కేంద్రప్రభుత్వం 'సాక్షర భారత్' కార్యక్రమం క్రింద 2011లో ఓ 10 లక్షలమందికి అక్షరాలు నేర్పించి, ప్రాథమిక గణితం కూడా నేర్పించి, తరవాత పరీక్ష పెట్టి, 'ఉత్తీర్ణతా' ధృవపత్రాలు ఇచ్చారట.

ఆ పత్రాలు మాత్రం, అవి పొందినవాళ్లకి యేమాత్రమూరాని ఇంగ్లీషు/హిందీ భాషల్లో వున్నాయట!

మరి యెవరు వుధ్ధరిస్తారో తెలుగుని!

మామూలుగానే ఏపీ పీ ఎస్ సీ వారు మొన్న నిర్వహించిన పరీక్షల్లో కొన్ని "తప్పుడు ప్రశ్నలు" దొర్లడంతో, వాటిని తొలగించి, ఆ ప్రశ్నలకి కేటాయించిన మార్కులు వుచితంగా కలిపేస్తామన్నారట.

యెన్ని సార్లయినా ఈ పరీక్ష పేపర్లు "సెట్" చేసేవాళ్లకి బుధ్ధి రాదెందుకో? తమ పాండిత్య ప్రదర్శనలెందుకు మానరో? 

మద్యం కేసుల్లో ఏసీబీ అధికారులు ఎక్సైజ్ సిబ్బందిని వేధించి బలవంతంగా సమాచారం సేకరిస్తున్నారని, కొండొకచో చేయికూడా చేసుకొంటున్నారు అనీ, ఇలాంటివి నిరోధించాలనీ వాళ్ల 'ఐకాస' వారు కోరారట. 

వీళ్ల ముఖ్య వాదనలు--మద్యం దుకాణాలకి నిర్వహించే పాటల్లో 'తెల్ల రేషన్ కార్డుదారులు' పాల్గొనకూడదు అని నిషేధం యేమీ లేదుట! (అందుకని వాళ్లు యెన్ని కోట్లు ఇచ్చినా తీసేసుకోవచ్చన్నమాట!). వాళ్లు అక్రమాలకి పాల్పడి వుంటే, ప్రభుత్వానికి రూ.7 వేల కోట్లు ఆదాయం వచ్చేది కాదుట. (పాల్పడకుండా వుంటే 15 వేల కోట్లు వచ్చేదేమో!). ఎఫ్ ఐ ఆర్ ప్రకారం 700 మంది జైళ్లకి వెళ్లవలసి వస్తుందట. వేధింపులు ఆపకుండా వుంటే, అందరూ సెలవుపై వెళతారట! (పంపించేస్తే పోలా?)

మొన్న ఓ హెలికాప్టర్ 25 అడుగుల యెత్తునుంచి హఠాత్తుగా కూలిపోయి, జార్ఖండ్ ముఖ్యమంత్రీ, మరి కొందరూ గాయ పడ్డారు. పాపం రాజశేఖర రెడ్డి లా కాకుండా, విమానాశ్రయం లోనే కూలింది కాబట్టి సరిపోయింది. పాపం వాళ్లు అదృష్టవంతులు. మరి మన విమాన భద్రత వారు యేమైనా చేస్తున్నారో లేదో!


No comments: