Wednesday, May 16, 2012

కబుర్లు - 90అవీ, ఇవీ, అన్నీ

విజయవాడలో కనకదుర్గమ్మ కొండమీద నీళ్ల టాంకులో శవం--నాలుగురోజులకిపైగా కుళ్లి, కొండమీద సరఫరా అవుతున్న నీళ్లన్నీ కంపుకొడుతున్నాయని భక్తులు వాపోతున్నా యెవరూ పట్టించుకోక, ఆఖరికి సరఫరా ఆగిపోతే, చచ్చినట్టు టాంకు తెరిస్తే-- బయటపడిందట

ఆ టాంకు కడిగి యెన్ని సంవత్సరాలయిందో, దాని మెయింటెనెన్స్ యెంతబాగుందో వగైరా ప్రశ్నలు అడగాలా? బాధ్యులెవరో తేల్చండి అని డిమాండు చెయ్యాలా? యెవరు చేస్తారు?

యేమో!

ఇన్నాళ్లకి యెవరి మెదడులోనో ట్యూబులైటు వెలిగింది. డిపోల్లోంచి మద్యం విడుదల చేసే సమయంలో సరైన చిరునామా లేని యజమానుల దుకాణాలకి సరఫరా రద్దు చేస్తున్నారట! ఈ దెబ్బతోనయినా మద్యనాయకుల బలుపు తగ్గుతుందేమో చూద్దాం.

మన చదువులూ, పాఠ్య పుస్తకాలూ యేమీ అభివృధ్ధి చెందలేదు అని విలపించేవాళ్లకో షాక్ లాగ, ఆ పుస్తకాల్లో కొన్ని "కార్టూన్"లు ప్రచురించబడ్డాయట! మరి అదేమి చదువో? అందులో అంబేడ్కర్ లాంటివాళ్లని కించపరిచారని గొడవచేస్తే, క'పిల్సి'బల్ క్షమాపణ చెప్పి, ఇంక అలా జరక్కుండా చూస్తాం అన్నాడట! (వీళ్లమీద పత్రికల్లో కార్టూన్లు వస్తెనే విరుచుకు పడతారు--మరి పిల్లలకి వాటితో యేం పాఠాలు చెప్పదలుచుకున్నారో, బాధ్యులని తొలగించాం అంటే సరిపోతుందా?)

ఏప్రిల్ నెలాఖరుకి మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరిందట. కూరగాయల ధరలు 61% పెరిగాయట! సందట్లో సడేమియా అంటూ "హనుమజ్జయంతి" వచ్చింది. ఈ సోకాల్డ్ భత్తులూ, పూజారులూ చేసే అలంకరణలకీ, ప్రసాదాలకీ పెట్టిన ఖర్చు చూస్తే, ఈపాటికి యే 72 శాతానికో పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు.

ఓ ప్రక్క వృధ్ధిరేటు అంటూ కీలకరేట్లు తగ్గించి, ద్రవ్యోల్బణానికి దారిచూపింది ఆర్ బీ ఐ. వృధ్ధి రేటు పెరగడం అంటే--గృహ, వాహన, విద్యా ఋణ రేట్లు తగ్గడమేనా? మరి పారిశ్రామిక వృధ్ధి రేటు 'నెగెటివ్' కి మారిందే? యేమో మరి!

అన్నట్టు, మన ఎన్ డీ తివారీగారిని "మర్యాదగా రక్తం ఇస్తారా? బలవంతంగా తీసుకోమంటారా?" అని అడగవలసొచ్చిందట కోర్టువారు! ఆయనకి కోర్టులమీదా, పార్టీవారికి వారిమీదా యెంత గౌరవమో కదా?

ఏప్రిల్ ఒకటినుంచి పెరిగిన జీతాల ప్రకారం ముఖ్యమంత్రికి రూ.2.44 లక్షలు, ఉప ముఖ్యమంత్రికీ, మిగతా మంత్రులకూ రూ.2.42 లక్షలూ జీతాలు వస్తాయట "నెలకి". అలాగే స్పీకర్, డెప్యుటీ స్పీకర్, మండలి చైర్మన్, విప్ వగైరాలకి కూడా బాగా పెరిగాయట

2000 సంవత్సరం నుంచీ పాపం రూ.41,500/- "నెలకి" తో సరిపెట్టుకొంటున్నాడట ముఖ్యమంత్రి. మరి పన్నెండేళ్ల తరవాత అది కనీసం 6 రెట్లైనా పెరగొద్దూ? 

మరి సామాన్య వుద్యోగుల జీతాలు 6 రెట్లూ పెరిగాయా? యెవరైనా అడిగితే, నా దిష్టిబొమ్మ దహనం చేసి, నన్నే జీతాలు పెంచమని అడుగుతారా? అంటూ విరుచుకు పడతారు!

పులినిచూసి నక్క వాతలు పెట్టుకుందట. పార్లమెంటులో ఆంటొనీ కళ్లనీళ్లు పెట్టుకొంటే, నిలువెత్తు నిజాయితీ కన్నీరుపెట్టుకొంది అని మీడియావాళ్లు చేసిన ప్రచారం చూసి (పాపం వాళ్లకి జార్జ్ ఫెర్నాండెజ్ గుర్తు రాలేదు ఆ సమయం లో), "నా గుండెల్లో పిడిబాకు దించండి--అంతేగానీ నా నిజాయితీని శంకించొద్దో" అని మొసలి కన్నీళ్లు పెట్టాడట మన పిచ్చి'దంబరం'! ఇదేదో బాగుంది కదూ? ఇక నుంచీ మంత్రులందరూ గ్లిసరిన్ బాటిళ్లు పట్టుకెళతారేమో పార్లమెంటుకి!

నాకు తెలిసీ, గత యాభై యేళ్లుగా, పాతసీసాలో కొత్త సారాలా, "అగ్రికల్చర్ క్రెడిట్ కార్డులు"; "కిసాన్ కార్డులు" ఇలా యెన్ని పేర్లు మార్చినా బ్యాంకులు ఇస్తున్నవి మాత్రం అప్పటి "క్రాప్ లోన్" అనబడే పంట ఋణాలే. ఖరీఫ్ కి ఇంత, రబీ కి ఇంత అంటూ ఒక్కో పంటకీ యెకరానికి అయ్యే ఖర్చు అంచనావేసి, అంతే ఇస్తారు.

ఇప్పుడు ఇంకో వెర్రితల వేసి, ఐదు సంవత్సరాలకి సరిపోయేలా ఒకేసారి ఋణపరిమితిని "మంజూరు" చేసేసి, ప్రతీ యేడూ ఓ 10% పెంచుకుంటూ పోతారట! రైతులందరికీ "ఏ టీ ఎం" కార్డులిచ్చి, వాళ్లకి కావలసినప్పుడు నగదు తీసుకొనేలా సౌకర్యం కల్పిస్తారట. దానికి తగ్గ "సాఫ్ట్ వేర్" తయారవ్వాలట! తలకి రోకలి చుట్టమన్నట్టులేదూ?

No comments: