Friday, October 26, 2012

కబుర్లు - 91



అవీ, ఇవీ, అన్నీ

ఈ మధ్య దేవీ విగ్రహాలకి అలంకారాలకోసం వాడుతున్న కరెన్సీ నోట్ల విలువ ఒక్కోచోటా కోట్లలోకి చేరింది. అదేదో కరెన్సీ కోడ్ అనేది ఒకటి యెక్కడో మూలుగుతున్నట్టుంది. యెవరూ పట్టించుకోవట్లేదనుకుంటా. 

ఇదివరకోసారి వ్రాసినట్టు, ఆ సొమ్ము యెక్కడనించి వస్తోందో ఆరా తీస్తే బోళ్లు బ్లాక్ మనీ దొరికే ఛాన్సుంది ఐ టీ వాళ్లకి. 

ముందు ప్ర తె మ తేదీలు ప్రకటించేసి, ఇప్పుడు మండలి బుధ్ధ ప్రసాద్ ని అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా నియమించేశారు. పాపం ఈయన లాబీయింగ్ కొంచెం లేటుగా ఫలించినట్టుంది. ముందు ప్ర తె మ ప్రకటన వెలువడకపోతే, ఈ నియామకానికి కూడా అర్జెంటేమిటని అధినేత్రి ప్రక్కన పడేసేది. 

అన్నట్టు వీళ్ల నాన్న వెంకట కృష్ణా రావు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకుల్లో ప్రముఖుడు!

ఈనాడువాడేమో "తెలుగు వెలుగు"అనే మాసపత్రిక పెట్టి మరీ తెలుగు భాషాభివృధ్ధి విషయంలో స్వకుచమర్దనం చేసుకుంటున్నాడు. దానికి మూడు ప్రాంతాల తెలుగు పండితమ్మన్యులూ సహకరిస్తున్నారు. బాగుంది.

ఓ పెద్దాయన ఈనాడువాడు తెలుగుని ఖూనీ చేస్తున్నాడు అనీ, "శీతల బస్సులు" అంటున్నాడు అనీ, "వాతానుకూల" అనొచ్చుకదా అనీ అన్నారు. "వాయు నియంత్రిత బస్సులు" అనొచ్చుకదా--వాతానుకూల అంటే హిందీ మాట అన్నారొకరు. అది మక్కికి మక్కీ అనువాదం అంటాడింకొకడు. శుభ్భరంగా చల్లటి బస్సు అనో, ఫ్రిజ్ ని చద్ది పెట్టి అన్నట్టు, చద్ది బస్సు అనో అనొచ్చుకదా అంటాడొక చల్దివణ్ణాల ప్రియుడు.

ఒకాయన "మెదడు" వాడకపోతే తుప్పు పడుతుంది, వాడినకొద్దీ "రాటుదేలిపోతుంది" అన్నాడు. రాటుదేలడం అంటే మొద్దుబారడం, ఇంకో దెబ్బ తగిలినా తెలియని స్థితికి రావడం అనుకుంటా. "పదునెక్కుతుంది" అనాలనుకుంటా. 

అన్నట్టు, మన పాత జానపద సాహిత్యం వగైరాలని కాపాడుకోవాలంటున్నారందరూ. ఇదివరకు ఆడవాళ్ల పాటలు ప్రతీ సందర్భానికి తగ్గట్టు--సమర్తపాటలూ, సీమంతం పాటలూ, మంగళహారతి పాటలూ--ఇలా చాలా వుండేవి. మన బ్లాగర్లు వండిందే వండరా అన్నట్టు వంటల గురించే కాకుండా, ఇలాంటి పాటలని కూడా సేకరించి ప్రచురిస్తే బాగుంటుంది. టీవీల్లో "స్త్రీల షోలు" వాళ్లుకూడా విజృంభిస్తారు!

థాయ్ లేండులో కాఫీ కి మంచి రుచి వచ్చే మార్గం కనిపెట్టారట. యేనుగుకి అది తినే పదార్థాలలో కాఫీ గింజలు కలిపి పెట్టేస్తే, అది వేసే పేడలో మళ్లీ ఆ గింజలు యథాతథంగా వచ్చేస్తాయట. కానీ వాటిల్లో సహజంగా చేదుని కలిగించె ప్రొటీన్ బాగా తగ్గిపోతుందట. అప్పుడు ఆ గింజలని పొడిచేసి, కాఫీ చేసుకొంటే భలే రుచిగా వుంటుందట! ఆ కాఫీ గింజల ధర కిలో 58 వేల రూపాయలట! మనం కూడా ఓ యేనుగునీ, ఓ పాతిక బస్తాల కాఫీ గింజలనీ కొనేసుకొంటే, కాఫీపొడి అమ్ముకొని కోటీశ్వరులం అయిపోవచ్చేమో!

    

2 comments:

Indian Minerva said...

మీరు కొంచెం regularగా రాస్తూండవలసిందిగా ఒక విజ్ఞాపన.

A K Sastry said...


డియర్ Indian Minerva!

వ్రాయాలనే వుంటుంది. చెప్పానుగా అదో వ్యసనం అని. కానీ కొన్నాళ్లు శరీరం, కొన్నాళ్లు కంప్యూటరూ సహకరించక తరచూ వ్రాయడం లేదు. అయినా ప్రయత్నిస్తూనే వున్నాను చూస్తున్నారుగా.

ధన్యవాదాలు.