Saturday, January 1, 2011

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ.....

జాతక రత్న మిడతంభొట్లు లాగా, దర్శకరత్న దాసరి కూడా, యెవరూ అడగకపోయినా, కొన్ని జోస్యాలు చెపుతూ వుంటాడు.

మొన్నో సభలో, "నర్మగర్భంగా" యేమన్నాడో చూశారా?

".....ఎన్‌టీఆర్ 'నా రాజకీయ జీవితానికి కారణమైన చిత్రాలు--ఆ రెండూ (బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు)' అని పదే పదే చెప్పేవారు...." అనీ,

"బాలకృష్ణతో ఇప్పటివరకూ యెందుకు సినిమా చెయ్యలేదో??!!....ఇది నా 150వ సినిమాతోనే యెందుకు కుదిరిందో.....నాకు ఇప్పుడు అర్థం అవుతోంది!" అనీ వుద్వేగంగా భూత భవిష్యత్తులని మనముందు ఆవిష్కరించారు.

మీకు గుర్తుందో లేదో--ఓ ఫంక్షన్లో, చిరంజీవిని పొగుడుతూ, ".......అనేక అవతారాల్లో చూశారు....త్వరలో...ఇంకో 'కొత్త అవతారంలో' చూస్తారు....అవును! చూస్తారు" అంటూ అంతే వుద్వేగంగా ప్రసంగించి, ఇవాళ అంతటి మెగా స్టార్నీ, పగటివేషగాళ్లా నిలబడే స్థితికి తెచ్చాడు ఈయనే!

బాలకృష్ణ జాగ్రత్తపడితే మంచిది. బుట్టలో పడ్డాడా.....ఇక అంతే!

అసలు వెర్సటైల్ నటుడూ, 'కథా, మాటలూ..........ప్రేక్షకుడూ' వరకూ అన్నీ అయిన శ్రీ దాసరి తన "కింగ్ మేకర్ సిండ్రోమ్" లోంచి బయటికి యెప్పుడు వస్తాడో మరి! 

"ప్రైవేటు" (అంటే 'ప్రభుత్వ కాని ' అని--అవి వాళ్ల స్వంత ఇళ్లయినాసరే) గృహాల్లో వుండే యెమ్మెల్యేలూ, యెమ్మెల్సీలకి నెలసరి 'వసతి భత్యం ' రూ. 3 వేల నించి రూ.10 వేలకి (యెన్ని రెట్లో!) పెంచారట! 

అదే ప్రభుత్వ, ఇతర వుద్యోగులకి--వెయ్యిరూపాయల అద్దెకి తగ్గని చిన్న పట్టణాల్లో ఓ 250/-; పట్టణాల్లో 3,500/- అద్దెకి తగ్గని చోట్ల ఓ 1500 లో యెంతో, నగరాల్లో పదివేలకుపైగా వుంటే, ఓ 3 వేలో యెంతో 'వసతి భత్యం'--(హెచ్ ఆర్ యే అంటారు దీన్ని) ఇవ్వడానికి నానా యేడుపులూ యేడుస్తారు!

రాష్ ట్రంలో 139 చోట్ల "గ్రామ న్యాయాలయాలు" యేర్పాటు చేస్తారట! 

ఇప్పటికే, పది రాష్ట్రాల్లో ఇవి వున్నాయట. వీటి నిర్వహణ ఖర్చులో 70 శాతాన్ని కేంద్రం భరిస్తుందట. 200 కి పైగా కేసులు నమోదవుతున్న గ్రామాలు 139 వున్నాయట. అందుకని అక్కడ ఇవి యేర్పాటు చేస్తారట. 

కేసులు పేరుకుపోతున్నాయి కాబట్టి 'మాత్రమే' ఇవి పెడతారట. దోషులుగా తేలినవారికి గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్షా, రూ.20 వేల వరకూ జరిమానా విధించడానికి వీరికి అధికారం వుంటుందట. 

బాగుంది కదూ?! 

తాము ఆర్టీఐ చట్టానికి 'అతీతులం' అని రాష్త్రపతి భవన్ ఓ పిటిషన్ వేసిందట. పద్మ పురస్కారాల విషయంలో అబ్దుల్ కలాం, వాజపేయీల మధ్య సాగిన సంభాషణలని వెల్లడించాలని గతంలో సీఐసీ ఆదేశించిందట. అయితే, రాజ్యాంగంలో 74వ నిబంధన ప్రకారం వాటిని వెల్లడించాల్సిన అవసరం లేకుండా తమకు 'రక్షణ' వుందని భవన్ వాదిస్తోందట.

ఆ మధ్య మన సురారె, బాలమురళీ కృష్ణకి 'భారతరత్న' ఇప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించానని ప్రకటించాడంటే, ప్రకటించడూ మరి?

ఒక తాత, తన మనవణ్ని--"ఇంట్లో పార్టీలు వద్దురా" అన్నా వినకుండా, తన ఆరుగురు సహ విద్యార్థులతో ఇంట్లో పార్టీ చేసుకొని, విందారగిస్తూండగా, ఆ తాత మొత్తం గదికి పెట్రోలు పోసి, నిప్పంటించగా, ఇద్దరు దుర్మరణం చెంది, మిగిలినవారు తీవ్రంగా గాయ పడ్డారట (ఒడిస్సా లో). మరి ఆ తాత మానసిక స్థితిని యే సైకో అనలిస్ట్ వివరించగలడు? "గివ్ మీ ఫైవ్ బక్స్" అంటూ, ఇవ్వకపోతే కాల్చి చంపేస్తున్నారట తెల్లవాళ్ల (భారతీయుల) ని నల్లవాళ్లు--అమెరికాలో! వాళ్లమీద సైకో అనాలిసిస్ యేమిటి? శ్రీ శ్రీ యో యెవరో అన్నట్టు, "కాకికేమితెలుసు సైకో అనాలిసిస్?"

ఇదివరకోసారి వ్రాశాను--పులిని చూసి నక్క వాత--అని. తిరుపతి, షిర్డీ--భాయ్, భాయ్--అంటూ, వాళ్లూ ఇంకా అనుసరిస్తున్నారట. అంతకు ముందు చక్కగా అయ్యే దర్శనాల స్థానంలో, మన తిరుపతిలోలా 'తోపుళ్లాటలు ' ప్రెవేశపెట్టిన షిర్డీవారు, నూతన సంవత్సరం సందర్భంగా 'ప్రత్యేక చెల్లింపు దర్శనాలు' మొన్న 30 నించి రేపు రెండు వరకూ రద్దు చేశారట. ఫలితంగా, భక్తులందరూ కూడా 6 నుంచి 8 గంటలు నిరీక్షించాల్సి వస్తోందట!

నిర్భాగ్యులు "ఆశా" వర్కర్లు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న తమ సమస్యలకోసం ఆందోళన చేస్తూంటే, చెల్లెమ్మ సబిత వాళ్లమీద ఆడపోలీసులతో చేయించిన 'దౌర్జన్యం' కన్నులపండుగుగా తిలకించారట ప్రభుత్వంవారు! మీరు తిలకించారా--వీడియోలనీ, ఫోటోలనీ?

పుండుమీద కారం చల్లుతూ చెల్లెమ్మ, "వాలంటీర్లుగా వచ్చినవాళ్లు ఇప్పుడు డిమాండ్లు చెయ్యడమేమిటీ" అని కళ్లెర్రజేశారట! "ఆట్టే మాట్లాడితే, సీయెం దృష్టికి టీసుకెళతా" అని కూడా అందట! 

యెవరి ఖర్మ వారిది! అవునా?

No comments: