Wednesday, December 22, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ.....

(ఈ మధ్య నా వుద్యోగానికి రాజీనామా సమర్పించాక, బ్యాంకుకీ నాకూ మధ్య వ్యవహారాలు తీర్మానం అయి, నా పింఛను తో సహా అన్నీ చక్కబడడం ఇప్పటికి పూర్తయింది. ఇంకా చిన్నచిన్నవి కాలక్రమం లో పూర్తవుతాయి. ఈ సమయం లో నేను క్రమానుగతంగా నా "....కబుర్లు" వ్రాయలేకపోయాను. 

వాడెవడో "అసలు జీవితం రిటైర్ అయ్యాకే/60 యేళ్ల తరవాతే మొదలవుతుంది" అన్నట్టు, ఇన్నాళ్లూ స్కూటరుమీద వెళ్లి, వెన్ను వంగేలా, మెడనరాలు పట్టేసేలా ఓ కుర్చీలో కూర్చొని, మళ్లీ రాత్రికి స్కూటరుమీదే ఇంటికి వచ్చి, తిన్నాననిపించుకొని, ప్రక్కమీద వాలుతూ, షెడ్డులో వున్నకారుని యే వారానికొక్కసారో, లేకపోతే వరసగా రెండురోజులు సెలవలు వచ్చేలా చేసుకొని, దూరప్రయాణాలు చేసేటప్పుడో బయటికి తీస్తూ గడిపిన నాకు, ఇప్పుడు కావలసినంత స్వేచ్చ! లేడికి లేచిందే పరుగు అన్నట్టు, యెప్పుడు యేసమయంలో యెక్కడికి వెళ్ళాలన్నా, స్కూటర్ మీద జాలీగానో, వర్షమూ గట్రా వస్తే కారులోనో, ఒంటరిగానో, జంటగానో అక్కడవాలిపోయి, మళ్లీ తిరిగి రావడం.....ఓహ్! భలే బాగుంది. ఇంకా సౌకర్యం కోసం నా పాతకారు ఇచ్చేసి, సరికొత్తది.....ఇంకా విశాలంగా, అనేక 'ఇంప్రూవ్ మెంట్ల'తోటీ....కొనుక్కోవడం, దానికి అవసరమైన హంగులు అమర్చుకోవడం, తదుపరి జీవితం కోసం ప్రణాళికలు వేసుకోవడం....ఇలాంటివాటితో "చా....లా" బిజీగా గడుస్తోంది. ఇదిగో.....ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తున్నాను.)

ఇవాళ్టి తాజా వార్త.....ఢిల్లీలో పేలిన....వుల్లిపాయ బాంబు!....అదీ, ప్రథానిగారి కుర్చీ క్రింద! దెబ్బతో ఆయన, "తన" ప్రభుత్వాన్ని, 'వుల్లిపాయల ధర తగ్గించండొరే! కనీసం ఇంక పెరగకుండా చూడండి ' అని ఆర్డరేశారట!

మరో "మూడు"వారాల్లో--అవే "తగ్గుతాయి" అని శరద్ పవారూ, "ఈ పెరుగుదల దురదృష్టకరం....ప్రభుత్వ శాఖలతో చర్చిస్తా.....నియంత్రించే విషయం 'పైవాడి ' చేతుల్లోనే వుంది.....మన ప్రయత్నం మనం చేద్దాం....!" అని ప్రణబ్ ముఖర్జీ, అన్నారట.

1977 లో వుల్లిపాయలు కిలో ఒక రూపాయి నించి అమాంతం 2 రూపాయలకి పెరిగిపోతే, ఇందిరాగాంధీని మట్టి కరిపించాడు "ఆమ్ అద్మీ!" ఇప్పటికి మళ్లీ, వుల్లి ధర రెట్టింపయింది కాబట్టి, తమ '....ల క్రిందకి ' నీళ్లు రాకుండా చూసుకోవాలని కాంగీలకి ఙ్ఞానోదయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది!

వోటర్లూ....రాబోయే......ల్లో యేం చేస్తారు? ఇప్పుడే తేల్చుకోండి మరి....ఇంకెంతో సమయం లేదు!

No comments: