అవీ, ఇవీ.....
పాపం--మన వయసుమీరిన (ఆ సంగతి ఇప్పుడే తెలుసుకొని) చవటగుండు ముఖ్యమంత్రిని సుతిమెత్తగా తొలగించి, "ముక్కు మంత్రి"ని ఆ స్థానం లో కూచోబెట్టింది అధిష్టానం.
(ఈయన ముక్కే ప్రముఖంగా కనబడుతుండటం తో, కార్టూన్లో అలాగే చిత్రిస్తున్నారు మరి! 26-11-2010 నాటి 'ఇదీ సంగతి ' లోనూ, మొదటిపేజీ టాప్ లోనూ వేసిన శ్రీధర్ చక్కటి కార్టూనులు చూడండి.)
దాని ప్రభావం మన లక్షలకోట్ల యువనేతమీద భారంగా పడి, యేకంగా పార్లమెంటుకీ, పార్టీకీ రాం రాం చెప్పి, తల్లితోకూడా చెప్పించాడు.
అదిగో--ఇప్పుడే మంత్రివర్గం యేర్పడడం, అసమ్మతిగళాలు విచ్చుకోవడం--కాంగీ సంస్కృతి ప్రతిబింబించబడడం--మమూలే!
"బిఫోర్ దేరీజ్ క్రొకోడైల్ ఫెస్టివల్!" అన్న శంకర్ దాదా, అవసరమైతే మంత్రివర్గం లో ప్రవేశిస్తామన్నాడు--నాలుగో యెన్నో పోస్టులు రిజర్వు చేశారని చెప్పుకొంటున్నారు!
ఇక ఇతర విషయాలకొస్తే, ప్రపంచ దేశాలన్నిటి గురించీ అమెరికా చేసిన రహస్య ఆలోచనలని, ఆ ప్రభుత్వం బతిమాలినా వినకుండా, 2 లక్షల 50 వేలకి పైగా రహస్య పత్రాలని బయటపెట్టింది 'వికీలీక్స్ ' మన అఙ్ఞాతలు వాళ్లని ఆదర్శంగా తీసుకొని, ప్రపంచానికి పనికొచ్చే రహస్యాలని బయట పెడితే బాగుంటుంది.
ఈ సందర్భం లో, 'జనసంఘం ' (ఇప్పటి బీజేపీ పూర్వ రూపం) నాయకుడు 'పిలూ మోడీ' అని వుండేవాడు. 1972 ప్రత్యేక ఆంధ్రోద్యమం లో ఆయన మా వూరు వచ్చినప్పుడు ఆయన పరిచయ భాగ్యం లభించింది. చెట్టంత మనిషి, తగ్గ లావుతో, తెల్ల భల్లూకం (ధృవపు యెలుగుబంటి) అనేవాళ్లం సరదాగా. వుధృతంగా వుద్యమంలో పాల్గొంటున్న మా నిరుద్యోగుల సంఘాన్ని "ఆంధ్ర రాష్ట్రం వస్తే, మీ సంఘాలు రద్దయి పోతాయి" అని దీవించాడు.
దేశం లో యెక్కడ యేమి జరిగినా, క్షణాల్లో ఆయనకి సమాచారం చేరేది--వెంటనే ఓ బాంబు పేల్చినట్టు దాన్ని ప్రకటించి, ఇందిరాగాంధీని పరుగులు పెట్టించేవాడు! అలాంటి నెట్ వర్క్ ఆయనది! అలాంటి నాయకుల అవసరం యెంతైనా వుందిప్పుడు.
మిగిలినవన్నీ మరోసారి.
No comments:
Post a Comment