అవీ, ఇవీ, అన్నీ
మన దేశ అత్యున్నత న్యాయ స్థానం, బోధన ఫీజుల చెల్లింపుల వ్యవహారం లో వెసులుబాటు బాగానే ఇచ్చిందిట. బోధనఫీజుల పథకం వర్తించే విద్యార్థులు ఫీజులు చెల్లించనక్కరలేదని విద్యార్థులకీ వూరట కలిగించిందట. ప్రభుత్వం ఈ ఫీజులని మూడు విడతల్లో కళాశాలలకి చెల్లించవచ్చట. బాగానే వుంది.
గొడవేమిటంటే--బీ సీ సంక్షేమ శాఖలో తగిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులూ లేవట. ఒక్కో క్షేత్ర స్థాయి అధికారీ 300 నించి 1000 కళాశాలల దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారట. అందిన 15 రోజుల్లో దరఖాస్తుని పరిష్కరించాలని నిబంధనట.
మరోవైపు, జిల్లా, మండల స్థాయిలో కంప్యూటర్లూ, ఇంటర్నెట్ లేకపోవడం తో, కాలేజీలు దరఖాస్తులన్నీ స్కాన్ చేయించి, ఆన్ లైన్ లో పంపించాల్సి వస్తోందట. ప్రభుత్వ కళాశాలలైతే యెప్పుడూ కంప్యూటర్ మొహమైనా చూడలేదట!
అదండీ సంగతి. వచ్చే ఒలింపిక్స్ లో "కంప్యూటర్ బాల్ గేము" (కంప్యూటర్లని సరఫరా చెయ్యడం, మూల పారెయ్యడం, మళ్లీ సరఫరా చెయ్యడం ఇలా) అని ఒకటి పెడితే, మనదేశానికి బంగారమేం ఖర్మ, యేకం గా ప్లాటినం పతకమే వచ్చేస్తుంది.
అన్నట్టు, ఈ మధ్య మా జిల్లాలో ఓ వూళ్లో ఓ రాజుగారు, "గో మూత్రం" తో నడిచే గడియారాన్ని కనిపెట్టి, ప్రదర్శించారు. చాలా బాగుంది. కానీ, ఈ గడియారాల్ని టేబులుమీదో, గోడమీదో తగిలించుకోడం చాలా కష్టం. పైగా ఈ రోజుల్లో ఆభరణం గా కూడా చాలామంది గడియారాలని ధరించడం లేదు.
ఇంకొంచెం పరిశోధన చేసి, ఓ యాభైవేల లీటర్లో యెంతో మూత్రం తో వాళ్ల ఇంటికీ, వీధికీ కరెంటు వుత్పత్తి చెయ్యగలిగితే చాలా బాగుంటుంది. పరిశోధనలకి కావాలంటే, ప్రభుత్వ సహాయాన్ని అర్థించవచ్చు.
మన తెలుగు బ్లాగర్లు తమ బ్లాగుల ద్వారా "అందరికీ" వినాయకచవితి, రంజాన్ శుభాకాంక్షలు అందించే స్థాయికి యెదిగారు కానీ, మొన్న మన స్వాతంత్ర్య దినోత్సవాల్లో, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన--రోశయ్యగారు తిలకించిన, వేడుకల్లో, పిల్లల చేత "శుక్లాంబరధరం", "శాంతాకారం, గగన సదృశం", "మహా గణపితిం మనసా స్మరామి" అంటూ నృత్యాలు చేయించారు! (జాతీయ పండుగలకీ, ఇతర మతాలవారికీ సంబంధం లేదు అని సందేశమా?)
మన రా నా లు గానీ, బ్లాగర్లు గానీ పట్టించుకోలేదు! నేనైతే, ఆ నిర్వాహకుల్ని శంకరగిరి మాన్యాలు పట్టించేవాణ్ని.
ఓ స్కూల్లో, మన అబ్దుల్ కలాం లాంటి పెద్దాయన, విద్యార్థులందర్నీ మీరు పెద్దయ్యాక యేమి అవదలుచుకున్నారో చెప్పమంటే, ఒక్కొక్కళ్లూ--నేను ఇంజనీర్ని కావాలనుకుంటున్నాను, అవగలను; నేను డాక్టరుని కావాలనుకుంటున్నాను, అవగలను; నేను దేశానికి అధ్యక్షుణ్ని కావాలనుకుంటున్నాను, అవగలను--ఇలా చెపుతున్నారట.
ఓ అమ్మయి నేను పెళ్లిచేసుకొని, ఓ నలుగురు పిల్లలకి తల్లయి, మంచి గృహిణి అవగలను అందట.
తరవాత అబ్బాయి, నా ప్రక్క అమ్మాయికి నా సాధ్యమైనంత సహాయం చేస్తాను, చెయ్యగలను--అన్నాడట.
ఇలా వుంటాయి కాబోయే యువతరం వూహలు!
No comments:
Post a Comment